Share News

మన రాజ్యాంగంలో భారతీయత...!

ABN , Publish Date - Dec 20 , 2024 | 01:30 AM

భారత రాజ్యాంగంలోని భారతీయత ఏమిటి? భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలలో మన సంవిధానంపై జరిగిన చర్చ ఆ ఆసక్తికరమైన...

మన రాజ్యాంగంలో భారతీయత...!

భారత రాజ్యాంగంలోని భారతీయత ఏమిటి? భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలలో మన సంవిధానంపై జరిగిన చర్చ ఆ ఆసక్తికరమైన ప్రశ్నను పూర్తిగా ఉపేక్షించింది. పాలక పక్షానికే కాకుండా ప్రతిపక్షానికీ అది ఒక ఇబ్బందికరమైన ప్రశ్నే. లోక్‌సభ ఎన్నికలలో సొంత మెజారిటీని సాధించుకోలేకపోయిన నేపథ్యంలో ప్రస్తుత దశలో ఆ ప్రశ్నను లేవనెత్తడం అంత వివేకవంతమైన పనికాదని పాలక పక్షం తప్పక భావించి ఉంటుంది. ఈ కారణంగా భారతీయ జనతా పార్టీ తన భావజాల పరమైన ఉత్సాహాన్ని నియంత్రించుకుని రాజ్యాంగాన్ని ప్రశ్నించే పనిని పార్లమెంటు వెలుపల తన మేధో మద్దతుదారులు, సహ ప్రయాణీకులకు వదిలివేసింది; పార్లమెంటులో ప్రధానమంత్రి భారత రాజ్యాంగ పరిరక్షణకు తన నిబద్ధతను నొక్కి చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తిని పాటించడంలో తమ ప్రభుత్వం అద్వితీయంగా వ్యవహరిస్తోందని ఆయన వివరించిన తీరు ఒక నిరర్థక హాస్య సన్నివేశంగా పరిగణించాలి. ప్రతిపక్షాలకు ఆ ప్రశ్న సైద్ధాంతికంగా ఒక జటిల సమస్యగా, సాంస్కృతికంగా చమత్కారపూరితమైనదిగా అనిపించి ఉండవచ్చు. కనుకనే అవి ఆ ప్రశ్నను నిర్లక్ష్యం చేశాయి. రాహుల్‌ గాంధీ తన ప్రసంగంలో సావర్కార్‌ గురించి ప్రస్తావించినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు ఉద్యుక్తుడు అయినట్టు కనిపించాడు కానీ ఆయన దానిపై మనసు పెట్టలేదు. అలా ప్రస్తావించి ఇలా వదిలివేశారు. ఆ చర్చ యథావిధిగా రాజకీయ వాదోపవాదాలుగా, పరస్పరం బురదజల్లుకోవడంగా దిగజారింది.


పాలక ప్రతిపక్షాలు పట్టించుకోనంత మాత్రాన ఆ ప్రశ్న ప్రాధాన్యం కోల్పోతుందా? రాజ్యాంగం పట్ల భారతీయ జనతా పార్టీ కొత్త శ్రద్ధాసక్తులు, ప్రేమానురాగాలను చూసి మనం మోసపోకూడదు సుమా! మన రాజ్యాంగబద్ధ గణతంత్ర రాజ్యంపై కనిపించీ కనిపించకుండా జరుగుతున్న ఒక దాడి మధ్యలో మనం ఉన్నాం. మరి ఈ దాడికి రాజ్యాంగం న్యాయబద్ధతను ప్రశ్నించడం ఒక అనివార్యత. ఆ సంవిధాన భారతీయతను ప్రశ్నించడమనేది రాజ్యాంగంపై దాడి చేస్తున్న వారి బలమైన ప్రధాన భావజాల అస్త్రం. సందేహం లేదు, అదొక ఆలోచనాత్మకమైన ప్రశ్న. నిబద్ధతతో దానిని తర్కించవలసి ఉంది. మన రాజ్యాంగాన్ని చాలవరకు మన వలసపాలకుల భాషలో ఆలోచించి రాయడం జరిగింది. ఆధునిక పాశ్చాత్య రాజ్యాంగవాద ఆలోచనాస్రవంతి నుంచి గ్రహించిన అంశాలతో భారత రాజ్యాంగ రచనా నిర్మాణం జరిగింది. ఆ రాజ్యాంగం ‘భారతీయ సంప్రదాయానికి ‘విరుద్ధమైనది’., ‘విదేశీయమైనది’ అని రాజ్యాంగ సభలోనే పలువురు సభ్యులు ఆక్షేపించారు. దాని ‘భారతీయత’ గురించి పలు ప్రశ్నలు అప్పుడే లేవనెత్తడం జరిగిందనే విషయాన్ని మనం మరువ కూడదు.

ఆధునికతావాద, విశ్వజనీన దృక్కోణం ఈ ప్రశ్నకు సబబైన సమాధానం కాబోదనే వాస్తవాన్ని కూడా అంగీకరిద్దాం. ‘ఆధునిక భారత రాజ్యాంగం విధిగా భారతీయమైనదిగా ఎందుకు ఉండాలి?’ అని ప్రశ్నించవచ్చు. అయితే ఇది ఆ ప్రశ్నకు మాటకు మాటమాత్రమే అవుతుంది. ఇటువంటి అనుచిత ప్రతినిందతో ప్రయోజనముండదు. ప్రతి రాజ్యాంగమూ తన సొంత సందర్భంలో సాంస్కృతిక వాస్తవికత అనే పరీక్షలో నిలబడాలి. ఈ ఆధునికతా ప్రతిస్పందన కూడా ప్రతికూలంగా పరిణమించవచ్చనే వాస్తవాన్ని విస్మరించకూడదు. ఆధునిక రాజ్యాంగ నిర్మాతలు గతం నుంచి పూర్తిగా వేరుపడడానికి తీవ్ర ఆసక్తి చూపారు. ఈ కారణంగానే అది భారతీయత నుంచి వేరుపడిందని, మన నాగరికతా విలువలకు పరాయిదిగా ఉన్నదనే భావన చాలా మందిలో ఏర్పడేందుకు దారితీసింది.


అసలు భారతీయత అంటే ఏమి కాదో మొదట చూద్దాం. భారత రాజ్యాంగం భారతదేశ గతం నుంచి ప్రభవించిందికాదు. రాజ్యాంగ నిర్మాతలు దానిని అలా ఉద్దేశించలేదు. ‘విదేశీ’మైనది ఏదీ అంటకూడదు, సోకకూడదు అని కూడా వారు భావించలేదు దానితో ప్రభవించింది కానేకాదు. ఒక లిఖిత రాజ్యంగం అవసరమైన ఆధునిక రాజ్య వ్యవస్థ సందర్భాన్ని వారు విస్మరించలేదు. ఈ రీత్యా భారత రాజ్యాంగం అనేది ఒక విరోధాభాస. అనూ చానంగా వస్తున్న మన జీవనస్రవంతికి సంబంధించిన ఏదో ఒక లక్షణం ఉన్నంత మాత్రాన అది భారతీయమైనదని చెప్పడానికి వీలులేదు. రాజ్యాంగ లిఖిత ప్రతిపై భారతీయ ఇతిహాసాలు, పురాణ గాథలను చిత్రించిన బొమ్మలు దాన్ని భారతీయమైనది చేయలేదు. భారత శిక్షా స్మృతికి భారతీయ న్యాయసంహితగా పునః నామకరణం దాన్ని భారతీయమైనది చేయలేదు.

భారత రాజ్యాంగంలో భారతీయతకు అన్వేషణ రెండు రూపాలను తీసుకుంటుది. ఒకటి మరో దానికంటే మరింత ఎక్కువగా మౌలికమైనది. అభ్యుదయ ఆకాంక్షాభరిత అవతారంలో ప్రామాణికతకు ఒక కొత్త నవీనత అవసరం.


భారతీయ తరహా రాజ్యాంగం అంటే పాశ్చాత్య దేశాల నుంచి స్వీకరించిన రాజనీతి చింతనను పూర్తిగా వదిలివేయవలసి ఉంటుంది. మన నాగరికతా వారసత్వం ప్రాతిపదికన రాజ్యాంగ సంస్థలను పూర్తిగా సరికొత్త రీతుల్లో నిర్మించుకోవలసి ఉంటుంది. గాంధీ తన ‘హింద్ స్వరాజ్‌’లో కోరింది ఇదే. కనుకనే శ్రీమన్‌ నారాయణ్ లాంటి గాంధేయవాదులు భారత రాజ్యాంగం భారతీయ మేధాశక్తికి న్యాయం చేయలేదని వాపోవడానికి కారణమయింది. గత శతాబ్దిలో అమలులోకివచ్చిన ఏ కొత్త రాజ్యాంగమూ (ఇరాన్, బొలీవియాని మినహాయిస్తే) ఈ ప్రామాణికత పరీక్షకు నిలబడలేవు. ప్రత్యామ్నాయ రాజ్యాంగం కోసం అన్వేషణ సహేతుకమైన ఆకాంక్షే కావచ్చుగానీ, అటువంటి రాజ్యాంగానికి సుసంబంధమైన ముసాయిదా అనేది ఏదీ ఎవరి వద్దా లేదు. ఈ దృష్ట్యా సంవిధానపరమైన భారతీయత అనేది ఇంకా రూపుదిద్దుకుంటున్న గుణమే.

మరింత సాధ్యమైన వివరణ రచనాపరమైన మౌలికత. స్వీకరించి అంశాల పునర్‌ రూపకల్పనలో నవ్యదనం. భారత రాజ్యాంగ భారతీయతను ఈ దృష్ట్యా వివిధ గీటురాళ్లతో పరీక్షించవచ్చు: పాశ్చాత్య రాజ్యాంగ నిర్మాణ సంప్రదాయం నుంచి గ్రహించిన అనేక అంశాలను భారతీయ సందర్భానికి అనుగుణంగా ఎలా పునర్‌ సర్దుబాటు చేసి మార్చివేశారు? ఈ కొత్త ఏర్పాటు భారత నాగరికతా ప్రస్థాన ప్రశస్తతను ప్రతిబింబిస్తున్నదా? రాజ్యాంగానికి ప్రాతిపదికగా ఉన్న తాత్త్వికత మన మేధో సంప్రదాయాలతో ఏకీభవించేదిగా ఉన్నదా? ఈ రాజ్యాంగం పనిచేస్తున్న తీరు ఈ భావనలను ధ్రువీకరిస్తున్నదా?


ఈ సమంజసమైన, ఉపయుక్తమైన ప్రశ్నలను అడిగినప్పుడు భారత రాజ్యాంగంలోని భారతీయతను మనం చూడగలుగుతాము. మూడు సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలోనే రాజ్యాంగాన్ని రాసి ఉండవచ్చు. అయితే ఒక శతాబ్దికి పైగా సాగుతున్న ఆలోచనల ద్వారా అది రూపుదిద్దుకున్నది. సారాంశంలో రాజ్యాంగం ‘ఆధునిక భారతీయ రాజకీయ చింతన’ నుంచి రూపుదిద్దుకున్న మౌలిక శాసనం. ఆ సమున్నత ఆలోచనా స్రవంతి ఏ ఒక్క వాదం లేదా దృక్పథానికి పరిమితమైనది కానందున, భారత్‌ గురించిన విభిన్న పోటీదాయక దార్శనికతల మధ్య సమతుల్యతను మన రాజ్యాంగం ప్రతిబింబించింది. మన మేధో సంప్రదాయాల విభిన్న, బహుళ రీతుల పట్ల ప్రగాఢ అవగాహనతో అది పరిపుష్టమయింది. వలస పాలన అందించిన ఆధునికత ప్రభావంతో మన రాజ్యాంగం ఒక నవ్య సొంత భారతీయ ఆధునికతను రూపొందించేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించింది. రాజ్యాంగ నిర్మాణాన్ని ప్రభావితం చేసిన సత్‌ సంకల్పమది. గత 75 సంవత్సరాలుగా న్యాయశాస్త్ర మీమాంస, న్యాయవివాదాల పరిష్కార అనుభవాలు భారత ప్రజలు– రాజ్యాంగం గురించి వినని వారితో సహా – ఈ భారతీయ రాజ్యాంగ నైతికతా స్పృహను కలిగి ఉన్నారని, దానికి నిబద్ధులయి ఉన్నారని చూపుతున్నాయి.


భారత రాజ్యాంగ భారతీయతా గుణం మీకు కనిపించదు. సుపరిచితాలు అయిన వివిధ లక్ష్యాలు, రీతి రివాజులను ఒక కొత్త విశిష్ట మౌలిక శాసనపత్రాన్ని రూపొందించేందుకు కలిపివేయబడ్డాయి. ప్రామాణిక సమాఖ్య రాజ్యానికి బదులుగా ‘యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’గా రూపకల్పన చేయడం ఆధునిక యుగ పూర్వపు రాజ్య వ్యవస్థ బహుళ అంతస్థులకు అనుగుణంగా ఉంది. యూరోపియన్‌ శైలిలో ‘జాతి–రాజ్యం’గా కాకుండా ‘రాజ్య–జాతి’ (స్టేట్‌–నేషన్‌)గా జరిగిన నిర్మాణం సాంస్కృతిక, సామాజిక వైవిధ్యాన్ని సంపూర్ణంగా గౌరవించిన మన ప్రాచీన సంప్రదాయాన్ని ప్రతిబింబించింది. భారత రాజ్యాంగ లౌకికవాద లక్షణాలు అమెరికన్‌ లేదా ఫ్రెంచ్‌ తరహా లౌకికవాదానికి ప్రతిరూపాలు కావు; ‘సూత్రబద్ధ దూరం’ను పాటించే భారతీయ తరహా లౌకికవాదం మైత్రీ సంప్రదాయం నుంచి స్ఫూర్తి పొందింది. సర్వ ధర్మ సంభవ అనే భావం ఆదర్శానికి అది సన్నిహితంగా ఉన్నది. భారత రాజ్యాంగ ‘సామ్యవాద’ లక్షణాలు కరుణ లేదా క్రియాశీల దయ అనే సూత్రానికి కొనసాగింపు. అవును, కుల వ్యవస్థ, అస్పృశ్యత దురాచారాల తిరస్కృతి సుదీర్ఘ సామాజిక, మత సంస్కరణల సంప్రదాయాల ప్రాతిపదికన జరిగింది.


భారత్‌లో పరంపర అనేది గతాన్ని పరిరక్షించుకోవడం గురించి కాదు, అది మన వర్తమానాన్ని పునర్‌ చైతన్యపరచుకుని, పునశ్శక్తిమంతం చేసుకోవడం గురించి. ముందటి తరాల నుంచి గ్రహించిన వివేకంలోని మంచిని స్వీకరించి, దానికి కొత్త గుణాత్మక రూపమివ్వడం; చెడు లేదా కాలం చెల్లిన దాన్ని త్యజించడం ఆధారంగా జరిగడమే పరంపర పరమార్థం. ఇదే మన రాజ్యాంగం చేసింది. భారత రాజ్యాంగ భారతీయత బ్రెడ్‌ పకోడా లాంటిదని చెప్పవచ్చు. విదేశీ తెల్ల రొట్టెను ప్రామాణికమైన భారతీయ ఆహారంగా మార్చివేసింది. లేదూ, గ్రహించిన సాంకేతికతను భారతీయ స్ఫూర్తి, విలువలను ప్రతిబింబించే ఒక కళారూపాన్ని నిర్మించేందుకు ఉపయోగించే భారతీయ సినిమా లాంటిది. బ్రెడ్‌ పకోడా లేదా భారతీయ సినిమాలా భారత రాజ్యంగమూ మన దేశీయ ప్రతిభకు ఒక నిదర్శనం– అది చాలా అధునికమైనది, విలక్షణంగా భారతీయమైనది.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

Updated Date - Dec 20 , 2024 | 01:30 AM