ప్రభుత్వ బడులకు ‘సమీకృత’ గ్రహణం!
ABN , Publish Date - Nov 07 , 2024 | 03:10 AM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 28 సమీకృత గురుకులాల ఏర్పాటు పథకాన్ని ప్రభుత్వం అందరికీ సమాన విద్య బాధ్యతల నుంచి వైదొలగడం గానే చూడాలి. ఇంచుమించు గత పదేళ్లుగా...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 28 సమీకృత గురుకులాల ఏర్పాటు పథకాన్ని ప్రభుత్వం అందరికీ సమాన విద్య బాధ్యతల నుంచి వైదొలగడం గానే చూడాలి. ఇంచుమించు గత పదేళ్లుగా కేసీఆర్ అనుసరించిన సామాజిక గురుకులాలకు ఈ పథకం ఇంచుమించు నకలు మాత్రమే. గత పదేళ్ళుగా గురుకులాల పేరుతో కేసీఆర్ చేసిన విద్యా రంగ విధ్వంసానికి ఇది కొనసాగింపు మాత్రమే!
కేసీఆర్ కేజీ టూ పీజీ విద్యను పక్కనపెట్టి కుల ప్రాతిపదికన గురుకులాల ఏర్పాటు చేయడం మూలంగా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వందలమందితో కళకళలాడిన ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోయాయి. ఒకపక్క గురుకులాల్లో తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని నియమించి సరైన విద్యా సామర్థ్యాలు అందించడంలో విఫలం కాగా, మరోపక్క ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సంఖ్యలో విద్యార్థులు లేక అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తరగతి గదుల్లో కాలక్షేపం చేసే పరిస్థితి కలిగింది. అప్పుడు ఈ పరిస్థితిని విమర్శించిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పేదల బడులలో సౌకర్యాలు కల్పించి, విద్యార్థుల సంఖ్య పెంచడానికి చర్యలు తీసుకోవాల్సిందిపోయి, ఈ సమీకృత గురుకులాల ఆలోచన చేయడంలో అంతర్యం ఏమిటో మరి!
స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ పేరుతో ఏవో వేళ్ళ మీద లెక్కపెట్టే పాఠశాలల్ని ప్రారంభించి అంతర్జాతీయ ప్రమాణాల పేరుతో, ‘గుర్రం మూతి ముందు గడ్డి కట్టి అది గుర్రానికి అందకుండా దాని చేత దౌడు చేయించి రౌతు గమ్యం చేరిన విధంగా’ ఆధునిక ప్రభుత్వాలు ప్రజలతో ఆటాడుకుంటున్నాయి. రాశి రీత్యా పెద్ద సంఖ్యలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల దివాలాకే ఇలాంటి ప్రయత్నాలు తోడ్పడతాయి తప్ప మరెలాంటి కొత్త ఫలితాలూ ఇవ్వవని గత పదేళ్ళ గురుకులాల అనుభవం తేల్చి చెప్పింది. ఎన్నో ఏళ్ళుగా ప్రజలు, విద్యాభిమానులు పోరాడితే అప్పటి యూపీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘విద్యా హక్కు చట్టం–-2009’ తెచ్చింది. దానికి తూట్లు పొడిచేందుకే పాలక పక్షాలు ఇలాంటివి చేస్తున్నాయి.
స్వల్ప సంఖ్యలో ఏర్పాటు చేస్తున్న స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సీల మూలంగా గ్రామీణ పేదలు, మురికి వాడల ప్రజలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారికి ఎందరికి న్యాయం జరుగుతుందీ అనేది ప్రశ్నార్థకమే!? మెరిట్ ప్రాతిపదికన ఏ కొద్దిమందికో అంతర్జాతీయ ప్రమాణాల భ్రమలో విద్యను అందిస్తామని చెప్పి మెజారిటీ వర్గాలకు అన్యాయం చేయడమే చివరకు జరుగుతుంది. ఇదే పాలక వర్గాల విద్యా వ్యూహం. ఏవో కొన్ని సమీకృత గురుకులాలు ఏర్పాటు చేస్తే– మరి రాష్ట్రంలో ఉన్న 41,337 పాఠశాలలు, 2900 జూనియర్ కళాశాలలు, 1000 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల పరిస్థితి ఏమిటి? లక్షలాది సంఖ్యలో ఉన్న ప్రభుత్వ విద్యార్థులను గాలికొదిలి తెలివైన వారిని కొందరిని ఎంపిక చేసి మరింత మెరుగైనవారిగా మారుద్దామన్నదేనా మీ ఆలోచన? రాశి రీత్యా పెద్దసంఖ్యలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, విద్యా ప్రమాణాలు, విద్యార్థుల సంఖ్య పెంచకుండా చేసే నూతన గురుకులాల ప్రతిపాదన ప్రచారం కోసం చేసే ఆర్భాటం తప్ప దానివల్ల సమాజానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు గాక ఉండదు! ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచకుండా వాటికవే అంతరించిపోయే పరిస్థితిని పాలకులు ఎందుకు తెస్తున్నారు? ఇప్పటికే మనం విద్యా ప్రమాణాలలో 21 రాష్ట్రాల తర్వాత స్థానంలో ఉన్నాం! ఈ పరిస్థితిలో మనం ఇస్తున్న భవిష్యత్తు విద్యా సంకేతాలు ఏమిటి?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మారుస్తామని ప్రకటనలు ఇచ్చారు. ఆ మేరకు నిబద్ధత కలిగిన ఆకునూరి మురళి లాంటి మాజీ ఐఏఎస్ అధికారిని చైర్మన్‌గా, తెలంగాణా రాష్ట్రంలో విద్యారంగంలో ఎంతో అనుభవం ఉన్న మేధావులను కమిటీ సభ్యులుగా విద్యా సలహా మండలిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది. మరి ఆ కమిటీ సిపార్స్ లేకుండా ఫక్తు కేసీఆర్ మోడల్‌నే మరలా అనుసరిస్తూ సమీకృత గురుకులాలకు శంకుస్థాపనలు ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను బలోపేతం చేయడానికి టీచర్ పోస్టులను భర్తీ చేశామని చెబుతున్న ప్రభుత్వం మరి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను ఎలా పెంచగలుగుతుంది?
ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఏ గ్రామంలో చూసినా ఎకరం నుండి పది ఎకరాల వరకు భూమి ఉంది. వసతులున్న ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ మినీ గురుకులాలుగా మార్చగలిగితే ఎంతో బాగుంటుంది. ఎలాగూ మధ్యాహ్న భోజనం, ఉదయం అల్పాహారం ఇస్తున్నారు. అలాగే సాయంత్రం పూట భోజనం అదనంగా ప్రకటించి వార్డెన్ కమ్ ట్యూటర్‌ను నియమిస్తే ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ బాగుపడుతుంది. పైగా పిల్లలు తల్లిదండ్రులుకు అందుబాటులో ఉంటారు. అంతేగాక ఇప్పటివరకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన గురుకులాలను ఒకే ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ గొడుగు క్రిందకు తేగలిగితే ఇంకా బాగుంటుంది. ప్రభుత్వ విద్యను గాడిలో పెట్టడం సాధ్యమే! ప్రజలందరికీ నాణ్యమైన ప్రభుత్వ ఉచిత విద్య అందని కల కానే కాదు! ఆ దిశగా పాలకులు ఆలోచిస్తారా అన్నదే అసలైన ప్రశ్న.
యన్. తిర్మల్