Share News

నా విజిటింగ్‌ కార్డుగా మారిపోయింది

ABN , Publish Date - Oct 28 , 2024 | 06:05 AM

మా అన్నయ్య వాడ్రేవు సుందర్రావు ప్రోద్బలంతో నా మొదటి పుస్తకం ‘నిర్వికల్ప సంగీతం’ 1986లో వెలువరిం చాను. ఆ పుస్తకం వేసుకోడానికి సాంస్కృతిక శాఖ 1800 రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించింది గాని తొమ్మిది వందలే ఇచ్చింది...

నా విజిటింగ్‌ కార్డుగా మారిపోయింది

నా మొదటి పుస్తకం

మా అన్నయ్య వాడ్రేవు సుందర్రావు ప్రోద్బలంతో నా మొదటి పుస్తకం ‘నిర్వికల్ప సంగీతం’ 1986లో వెలువరిం చాను. ఆ పుస్తకం వేసుకోడానికి సాంస్కృతిక శాఖ 1800 రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించింది గాని తొమ్మిది వందలే ఇచ్చింది. మిగిలిన సొమ్ము నా మిత్రుడు సోమయాజులు పెట్టుకున్నాడు. ముఖ పత్రం మా మిత్రుడు చట్టి హను మంతరావు డిజైన్ చేసాడు. రాజమండ్రి మ్యూజియంలో ఉన్న ఒక మదర్ గాడెస్ శిల్పాన్ని ముఖచిత్రంగా వాడుకున్నాం. సమాచారం సుబ్రహ్మణ్యం తన మిత్రుడు ప్రతాప్‌కి చెందిన ప్రింటోఫైన్ ప్రెస్సులో ఆ పుస్తకం వేయించాడు. రాజమండ్రి సాహితీ వేదిక ఆధ్వర్యంలో గౌతమీ గ్రంథాలయంలో ఆ పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కరణ సమావేశం ఖర్చు వంద రూపాయలు మిత్రుడు గోపీచంద్ పెట్టుకున్నాడు.


మా బామ్మగారు వాడ్రేవు లక్ష్మీదేవమ్మ నాకు నా పసితనాన పోతన భాగవతంలో ఎన్నో పద్యాలు కంఠస్థం చేయించారు. సాహిత్యానికి ఆమె నా తొలిగురువు. కాబట్టి ఆ పుస్తకం ఆవిష్కరించమని ఆమెని అభ్యర్థించేను. మల్లంపల్లి శరభయ్య గారూ, ఆర్.ఎస్. సుదర్శనం గారూ, మిత్రులు మహేశ్, గోపీచంద్‌లతో పాటు మా అక్క కూడా ఆ రోజు ఆ పుస్తకం మీద మాట్లాడేరు. 500 కాపీలు వేయించాం. ఒక్కొక్క కాపీ పది రూపాయలు వెల పెట్టానుగానీ ఆ కాపీలన్నీ దాదాపుగా మిత్రులకీ, సాహిత్యాభి మానులకీ పంచిపెట్టేసాను. ఆ పుస్తకం వెలువడ గానే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఆంధ్రజ్యోతి దినపత్రిక సాహిత్యా నుబంధంలో దాదాపు సగం పేజీ రివ్యూ రాసారు. ఆ రివ్యూ చదివి సిరిసిల్ల నుంచి జూకంటి జగన్నాథం


పది రూపాయలు మనియార్డరు పంపించాడు. ఆయనే ఆ కవిత్వానికి మొదటి, చివరి కొనుగోలుదారు. మరొక గొప్ప ఆశ్చర్యం ఆంధ్రప్రభలో దాశరథి కృష్ణమాచార్య దాన్ని సమీక్షించటం. సాహిత్యలోకంలో నా పేరు అప్పటిదాకా ఎవరికీ తెలియదు. అందుకని దాశరథి నేను ఎక్కడో విదేశాల్లో ఉంటున్నానేమో అనుకున్నారట. మా అక్కయ్యకి ఉత్తరం రాస్తూ నేను ఏ దేశంలో ఉంటానో చెప్తే తాను అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను కలుసుకుంటానని రాసారు! అజంతాకి ఒక కాపీ పంపిస్తే ‘అద్భుతం, మరో మాట లేదు’ అని రాసాడు. శేషేంద్ర రాజమండ్రి వచ్చినప్పుడు ‘ఈ కవిని వసంతశాఖ మీద కోకిలగా ప్రతిష్ఠిస్తున్నాను’ అని ఆశీర్వదిం చాడు. ఇస్మాయిల్, చండీదాస్, మో, త్రిపుర వంటి కవులు ఎందరో ఆ పుస్తకాన్ని మనసారా స్వాగతించారు. నూతలపాటి గంగాధరం స్మారక పురస్కారం అందుకో డానికి తిరుపతి వెళ్ళినప్పుడు మధురాంతకం రాజారాం గారు మనసారా స్వాగతించడం మరొక జ్ఞాపకం. ఆ తర్వాత రోజుల్లో ఆ పుస్తకం నాకు విజిటింగ్ కార్డుగా మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు.

వాడ్రేవు చినవీరభద్రుడు

Updated Date - Oct 28 , 2024 | 06:05 AM