Share News

జగబంధపు బండ

ABN , Publish Date - Oct 07 , 2024 | 04:43 AM

మూడమేసిన మొగులు గుబురు చింతనీడనార్పింది మేసండం మబ్బుల ఏడుపు వాకిలిని పాకిరి బండచేసింది...

జగబంధపు బండ

మూడమేసిన మొగులు

గుబురు చింతనీడనార్పింది

మేసండం మబ్బుల ఏడుపు

వాకిలిని పాకిరి బండచేసింది

ఉప్ప కడలి ఆబగ తాగి

మత్తెక్కిన తెప్పలు

మతి సుతిలేని తాళంతో

లేమి వాకిళ్ళలో

పూనకంతో ఊగుతున్నయి

ముండ్ల కుసుమ సుంకు

చిత్తగాలికి ఏ మురిపమో కాని

కమిలిన తనువుల కొప్పెరలొ

జొరబడి కోలాటమేస్తున్నది


రాలుతున్న పసుపు కుంకుమలు

కురిసే తుంపరకు అట్టగట్టి

జగబంధపు బండలపై

రంగు వెలసిన పరదాలై

దిగులును పెంచుతున్నాయి

చెదల మునుము కోతకు

సూరుల మొదల్లు రాలి మెదలవుతున్నయి

ఆవిరితో సెమటలు కక్కే కుంపటులు

సిలుమెక్కి కునికి పాట్లు పడుతున్నవి

ఇగం వచ్చిన కుదురు అరుగు

సుట్ట మీది కూరాడులో

మక్కిన వాసనొంపుతున్నది

పాకమేదైన వాకరే

నిలిపే నిట్టాడు నేలను

కూలవేసె తొలికారు దురాశ కొరివికి

తావినొదిరి చెదిరిన మంద

రెక్కలుడిగిన ఉసిల్ల కుప్పలయినయి


పీడగొంతు గుడ్లగూబ

పడావు పడ్డ గోడలకు

తన ముక్కుకంటిన

మరకలనద్ది పోతున్నది

కల్లమైన లూటిడిసిన కంచె

పశువుల తొక్కులాటలొ

ఆశలు పాలిపోయిన

అలం పోసలైనయి

సెగలింకి ఆరిన కొలుముల

పొలమారిన మొఖాల గాంచి

మోరలెత్తిన ఊర కుక్కల

ఎడతెగని ఏడుపూ ఏ కీడుకు

సంకేతమో అంతుపట్టకున్నది

ఆకలి రుచినే మరిసి

బూకటికి మరిగిన దండు

తాటి బెల్లానికి తలకిందులుగ

వేలాడే గబ్బిలాల గుంపయింది

దయా నీతి గుణాల రేఖలుగ

దిద్దుకున్న ఆదిరూపాలు

తమ నొసటి దీపాలను

తామే ఆర్పుకుంటున్నయి

బాటల కూడలి భుజాలపై

మోటు రాళ్ళ మొలుపు

చావిడి గోడలకు సాలీడు పూత

దర్వాజ రెప్పలకు జిల్లేడు జిగురు

విసిరే పొలి రాళ్ళ వీరంగానికి

గూడు చెదిరిన పక్షి వలపోత

కొమ్మలను కలిపి ఉంచే ఆశల తీగలు

బూజు చీడకు లేతలోనె కోతబడుతున్నవి

ఆకులనదుముకొని పసిమిని పంచె నీరెండ

ఏ సొరగాలి కలయిక మరిగిందొ

నీడల మింగి వేడిని పెంచుతున్నది


గాయపడిన మూపురాలపై

ముసురుటీగల వీరంగం.

తోకలతో అదిలింప చూసిన

అంటిన పరిశం కాయ కోతలే తప్ప

పైన వాలినవి తొలుగకున్నవి

పాసి తీగలు చుట్టుకున్న చేటు తోవ

మనిషిని జికి పిట్టని చేసి తిప్పుతున్నది

సెంగల్లో అంటూ ఎగిసిన కసురు గాలి

విసిరిన రేణువులతొ సెవులు

మూతలు పడుతున్నవి

ఏడుపు వేడుక బంతిలా వినపడుతున్నది

గోరటి వెంకన్న

Updated Date - Oct 07 , 2024 | 04:43 AM