జగన్ మార్కు ‘నిజాలు’..!
ABN , Publish Date - Oct 29 , 2024 | 12:33 AM
ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నోట అన్నీ ‘నిజాలే’ వస్తున్నాయి. ఇన్నేసి నిజాలు పలుకుతున్నా, వైసీపీ నాయకుల వలసలు ఆగటం లేదు. వారి చెవిక్కెక్కటంలేదు. ఎవ్వరూ వినిపించుకోవటం లేదు. సినీ రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నట్లు...
ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నోట అన్నీ ‘నిజాలే’ వస్తున్నాయి. ఇన్నేసి నిజాలు పలుకుతున్నా, వైసీపీ నాయకుల వలసలు ఆగటం లేదు. వారి చెవిక్కెక్కటంలేదు. ఎవ్వరూ వినిపించుకోవటం లేదు. సినీ రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నట్లు చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు రెండు చేతులూ జేబుల్లో పెట్టుకొని అలా నడుచుకుంటూ జనసేన పార్టీలోకో, తెలుగుదేశం పార్టీలోకో, బీజేపీ పార్టీలోకో వెళ్లిపోతున్నారు. వెనక్కి తిరిగి చూడటం లేదు. జగన్‌ను నమ్ముకొని దశాబ్దాలుగా సేవలు చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య, మోదుగుల వెంకటరమణ, బీదా మస్తాన్‌రావు, ఆర్. కృష్ణయ్య లాంటి నాయకులు కూడా పార్టీ వీడారు. ఇంతకూ ఆయన చెప్తున్న నిజం ఏమిటి? అవి నిజంగా నిజాలేనా? అబద్ధాలకు ముసుగులా? అంటే రెండవదే అని ఎవరికైనా అర్థం అవుతోంది.
ఉన్నట్టుండి ‘‘నేను మళ్ళీ అబద్ధం చెప్పినట్లయితే అధికారంలోకి వచ్చేవాడ్ని’’ అన్నారు. అంటే 2019లో తాను చెప్పినవన్నీ అబద్ధాలే అనీ, 2024లో మరోమారు చెప్పలేక పోయా అని అంగీకరించారు. నిజానికి 2019 ఎన్నికల్లో అబద్ధాలే చెప్పారు. అమరావతి ఉంటుంది అన్నారు. లేకుండా చేశారు. ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఊసే మరిచారు. దశల వారీ మద్య నిషేధం అన్నారు. రేట్లు పెంచి ప్రభుత్వమే మద్యం అమ్మేలా చేశారు. పోలవరం పూర్తి చేస్తామన్నారు. బస్తా సిమెంట్ వేయలేకపోయారు. అమ్మ ఒడి ఇద్దరు బిడ్డలకు అన్నారు. ఒక్కరికే ఇచ్చారు. రైతు భరోసా రూ.12వేలు అన్నారు. రూ.7,500 ఇచ్చారు. జాబ్ కాలెండర్ అన్నారు. లేకుండా చేశారు. బాబాయ్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ దర్యాప్తు అన్నారు. తరువాత అక్కర్లేదు అన్నారు. పరిశ్రమలు తెస్తామన్నారు. ‘పాకుడు రాళ్ళు’ శుభ్రం చేస్తామన్నారు. ఇలా ఎన్నో నమ్మ పలికారు. నమ్మించి మోసం చేశారు. ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ళూ జపించిన తారక మంత్రం ‘వైనాట్ 175’. ముఫ్పై ఏళ్ళు అధికారంలో ఉంటాం అన్నదే ఆయన పొలిటికల్ స్లోగన్. ఈ వాపు ఎంత వరకు వెళ్ళిందంటే, తన తల మీద చెయ్యి పెట్టుకొని వెంట్రుకలను పీకి చూపించే దాకా వెళ్ళింది. చొక్కాలు మడతెయ్యండి అని చెప్పేదాకా పోయింది. ఇలా ‘‘నిజా’’లను పదే పదే చెప్పటం వల్ల 151 ఎమ్మెల్యే సీట్లలో 11 సీట్లు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు మళ్ళీ మేం అధికారంలోకి వస్తాం అంటున్నారు. అందరినీ గుంటూరు జైల్లో పెడతాం అని వార్నింగ్ ఇస్తున్నారు. కాలర్ ఎత్తుకొని తిరుగమంటున్నారు. ఐదేళ్ళు జగన్ నోట వెంట రాని పదం గుడ్ (మంచి). ఇప్పుడు ఏకంగా గుడ్‌బుక్ అంటున్నారు.
రెడ్‌బుక్‌ను చూసి అంటున్నారో, రెడ్‌బుక్‌కు భయపడి అంటున్నారో తెలీదు. రాష్ట్రంలో కాలకేయులతో పోటీపడి పరిపాలన చేశారు. గోడలు దూకారు. అరెస్టులు చేశారు. కేసులు పెట్టారు. జైళ్ళకు పంపారు. ఎంపీని కాళ్ళపై కొట్టారు. ప్రత్యర్థి పార్టీ కార్యాలయాన్ని పగులగొట్టారు. చంద్రబాబు ఇంటికే దండయాత్రకు వెళ్ళారు. ఆయన్ను అరెస్టు చేశారు. దండయాత్రకు వెళ్ళిన వారికి పదవులిచ్చారు. డాక్టర్ సుధాకర్‌ను చనిపోయేలా చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపేసి డోర్ డెలివరీ చేశారు. అబ్దుల్ సలాం కుటుంబాన్ని రైలు పట్టాలపై పడుకునేలా చేశారు. ఇలా రాసుకుంటూ పోతే ఆంజనేయుడి కరవాలం అంత అవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, రాజధాని అమరావతి గ్రామాల్లో 1631 రోజుల పాటు 144 సెక్షన్, 30 సెక్షన్‌లు అమలు జరిగాయి అంటే ఏ రాజ్యాంగం అమలు జరిగినట్టు? ఇన్ని పాపాలు చేసి, ఇన్నిన్ని నేరాలు చేసి మళ్ళీ అబద్ధాలను వండి వారిస్తే ప్రజలు నమ్ముతారా? ప్రజాస్వామ్యంలో ఓటమి కూడా ‘గెలుపు’ లాంటిదే. మారేందుకు, మళ్ళీ గెలిచేందుకు మార్పు చెందమని అర్థం. నేను మారను, నేను ఇంతే. అంతా నా ఇష్టం అంటే, ప్రజలు కూడా మారరు. వాళ్ళూ అంతే. అంతా వాళ్ళిష్టమే.
పోతుల బాలకోటయ్య
అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు