Share News

kothapaluku: 15 మంది జంప్‌.. !.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు సీఎం రేవంత్ ఓకే!!

ABN , Publish Date - Mar 10 , 2024 | 05:40 AM

లోక్‌సభ ఎన్నికలు తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలకూ విషమ పరీక్షగా ఉండబోతున్నాయి. దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగాలంటే...

kothapaluku: 15 మంది జంప్‌.. !.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు సీఎం రేవంత్ ఓకే!!

లోక్‌సభ ఎన్నికలు తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలకూ విషమ పరీక్షగా ఉండబోతున్నాయి. దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగాలంటే ఆ పార్టీకి యాభై శాతానికి పైగా లోక్‌సభ సీట్లు లభించాలి. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని కొట్టేయాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ, తన ఆకాంక్ష నెరవేరాలంటే కనీసం ఐదారు స్థానాలు గెలుచుకోవాలి. మూడు నెలల క్రితం అధికారాన్ని కోల్పోయిన భారత రాష్ట్ర సమితిది మరీ విచిత్రమైన పరిస్థితి. లోక్‌సభ ఎన్నికల్లో కనీసం రెండు మూడు స్థానాలైనా గెలుచుకొని సగం పైగా స్థానాలలో ద్వితీయ స్థానంలో నిలబడని పక్షంలో ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. స్థూలంగా మూడు పార్టీల పరిస్థితి ఇది. ప్రస్తుత అంచనాల ప్రకారం భారత రాష్ట్ర సమితి ఒకటి రెండు స్థానాలైనా గెలవగలదా? అన్న ప్రశ్న రాజకీయ పరిశీలకుల నుంచి వినిపిస్తోంది. దక్షిణ తెలంగాణలోని కొన్ని స్థానాలలో ఆ పార్టీ ద్వితీయ స్థానానికే పరిమితం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రధాన పోటీ కాంగ్రెస్‌–బీజేపీ మధ్యనే కేంద్రీకృతం అయిందన్న అభిప్రాయం బలంగా వ్యాపించడం వల్ల బీఆర్‌ఎస్‌ శ్రేణుల మనోస్థైర్యం సన్నగిల్లుతోంది. ఈ దుస్థితి నుంచి బయటపడడం కోసం కేసీఆర్‌ ఏం చేస్తారో చూడాలి. అయితే మరికొద్ది రోజుల్లో చోటుచేసుకోబోయే పరిణామాలు బీఆర్‌ఎస్‌కు మనుగడ ఉంటుందా? ఉండదా? అన్నది స్పష్టంచేస్తాయి. సిట్టింగ్‌ ఎంపీలు కొందరితో పాటు మాజీ ఎంపీలు సైతం పార్టీని వదిలి బీజేపీలో చేరుతున్నారు. ఎన్నికల వరకు ఎమ్మెల్యేలు అందరూ ఐక్యంగా పార్టీకి అండగా ఉంటారా? ఉండరా? అన్న సందేహాలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ముఖ్యులతో టచ్‌లోకి వెళ్లారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొనే విషయంలో ఇంతకాలం విముఖంగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, తాజాగా మనసు మార్చుకున్నట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే పార్టీ బలాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తించారు. 2014లో కేసీఆర్‌కు కూడా 63 మంది ఎమ్మెల్యేలే ఉండేవారు.

దీంతో ప్రభుత్వ సుస్థిరత కోసం తెలుగుదేశం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఆయన టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ బలం కూడా 64 మందే. ఈ కారణంగా నాడు కేసీఆర్‌ చూపిన బాటలో ఇప్పుడు తాము కూడా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే తప్పేమిటి అని కాంగ్రెస్‌ ముఖ్యులు ప్రశ్నిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం జంట నగరాలు, రంగారెడ్డి జిల్లాల నుంచి గెలిచిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలలో అత్యధికులు కాంగ్రెస్‌ పార్టీతో టచ్‌లోకి వెళ్లారు. చేరికలకు తలుపులు తెరిస్తే గ్రేటర్‌ హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలకపోవచ్చునని అంటున్నారు. ప్రస్తుతానికి ఇద్దరు మినహా మిగతా వారంతా కాంగ్రెస్‌లో చేరడానికి సుముఖత వ్యక్తంచేస్తున్నారు. తమాషా ఏమిటంటే, గ్రేటర్‌లో గెలిచిన శాసనసభ్యులు అందరూ గతంలో తెలుగుదేశం, కాంగ్రెస్‌ తరఫున గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరినవారే. ప్రస్తుత సమాచారం ప్రకారం పదిహేను మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.

లోక్‌సభ ఎన్నికలలోపే ఈ చేరికలు జరిగిపోతే భారత రాష్ట్ర సమితికి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఫిరాయింపులకు గతంలో తెర లేపింది కేసీఆరే కనుక ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అదే పనిచేసినా వారిని ప్రశ్నించే నైతికత ఆయనకు ఉండదు. ఈ పరిస్థితిని అనుకూలంగా మలచుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. 2014లో అత్తెసరు మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చినందున ఫిరాయింపులను ప్రోత్సహించినా కేసీఆర్‌ను ప్రజలు సమర్థించారు. 2018లో 88 స్థానాలను గెలుచుకున్నప్పటికీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని ప్రజలు ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో పార్టీలో చేరడానికి ముందుకొచ్చే శాసనసభ్యులకు తలుపులు తెరవాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు తాము ఆ పనిచేయకపోతే ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరిపోతారని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. దీంతో చేరికలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు చెబుతున్నారు. తన పార్టీ నుంచి వలసలను నిరోధించడానికి కేసీఆర్‌ ఏం చేస్తారో చూడాలి.

లోక్‌సభ ఎన్నికల్లో కనీసం పది స్థానాలను హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రేవంత్‌ రెడ్డి వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే, ఆ పార్టీ శాసనసభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను మాత్రమే గెలుచుకున్నప్పటికీ ప్రస్తుతం మంచి ఊపు మీదే ఉంది. దక్షిణ తెలంగాణలో పార్టీ బలహీనంగా ఉన్న విషయాన్ని గమనించిన కమలనాథులు ఆ దిశగా ఫోకస్‌ పెట్టారు. ప్రజల్లో అంతో ఇంతో పట్టు ఉన్న నాయకులను గుర్తించి ఎంపీ అభ్యర్థులుగా బరిలో దించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఖమ్మం నుంచి జలగం వెంకట్రావ్‌, మహబూబాబాద్‌ నుంచి సీతారాం నాయక్‌ను పార్టీలో చేర్చుకున్నారు. గత ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడం కోసం పావులు కదుపుతోంది. ఐదు, అంతకు మించి సీట్లు గెలుచుకోగలిగితే రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరిస్తుంది. ప్రధాని మోదీ ఇప్పటికే తెలంగాణలో రెండు రోజులు ప్రచారం చేశారు. తెలంగాణలో బలపడితే ఆ తర్వాత ఇతర దక్షిణాది రాష్ర్టాలకు విస్తరించవచ్చునన్నది కమలనాథుల మనోగతం. కర్ణాటకలో ఈసారి బీజేపీ మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకుంటుందన్న అభిప్రాయం బలంగా ఉంది. తెలంగాణలో కూడా మరింత దూకుడు ప్రదర్శిస్తే మెజారిటీ సీట్లు గెలుచుకోవచ్చునని లెక్కలు వేసుకుంటున్నారు.

ప్రధాని మోదీ గ్లామర్‌ అదనపు బలం కనుక లక్ష్య సాధన అసాధ్యం కాదని బీజేపీ నాయకులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడమే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమర్థతకు గీటురాయి కానుంది. బీజేపీ మాత్రం సేఫ్‌ జోన్‌లో ఉంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటు దాదాపు ఖాయంగా కనిపిస్తున్నందున ఆ పార్టీ నాయకులు సమరోత్సాహంతో ఉన్నారు. అసలు సిసలు విషమ పరీక్షను కేసీఆర్‌ ఎదుర్కోబోతున్నారు. ఉద్యమ సమయంలోనూ, ఆ తర్వాతా అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లలో అపర చాణక్యుడిగా, రాజకీయ గండరగండడుగా పేరొందిన కేసీఆర్‌ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీని నిలబెట్టుకోగలరా? లేదా? అన్న పరీక్షను ఎదుర్కోబోతున్నారు. గతంలో పదేళ్లపాటు, ఇప్పుడు ఐదేళ్లుగా జగన్‌రెడ్డి దాష్టీకాన్ని ఎదుర్కొంటూ పార్టీని నిలబెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బాటలో కేసీఆర్‌ పయనించి నిలబడగలరా? లేదా? అన్నది త్వరలోనే తేలిపోతుంది. రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ఈసడించుకున్న కేసీఆర్‌, ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీని ప్రేరణగా తీసుకొని ప్రతిపక్షంలో రాణిద్దామని చెప్పడం కాలమహిమే!

వంచనాశిల్పం జగన్‌!

ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలకు వద్దాం. చంద్రబాబు పాలన అంటేనే గ్రాఫిక్స్‌ మాయాజాలం అని ఐదేళ్ల క్రితం ప్రజలకు నూరిపోశారు. రాజధాని అమరావతి నిర్మాణం ఎలా ఉండబోతున్నదో వివరించడానికే అప్పట్లో చంద్రబాబు గ్రాఫిక్స్‌లో చూపించారు. అయినా వైసీపీ ప్రచారాన్ని నమ్మిన ప్రజలు జగన్మోహన్‌ రెడ్డికి అధికారం కట్టబెట్టారు. ఈ ఐదేళ్ల జగన్‌రెడ్డి పాలనలో భవిష్యత్‌ ప్రణాళికలు అటుంచి, సినిమా సెట్టింగులతో జనాన్ని మాయ చేయడాన్ని ఇప్పుడు కళ్లారా చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితం కుప్పం పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్‌.. కృష్ణా జలాలను కుప్పంకు తరలిస్తున్నానని గొప్పలు చెప్పుకొన్నారు. ఆర్భాటంగా గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్టు బిల్డప్‌ ఇచ్చారు. కార్యక్రమం ముగిసిన వెంటనే అధికారులు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన గేట్లు తొలగించి ఎత్తుకుపోవడాన్ని చూశాం. ఈ సన్నివేశం సినిమా షూటింగ్‌ పూర్తికాగానే సెట్టింగ్స్‌ తొలగించినట్టు అనిపించింది.

ఈ సెట్టింగ్‌ బాగోతాన్ని మరవకముందే విశాఖపట్నంలో అలల వంతెన ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. కార్యక్రమం పూర్తయిందో లేదో ఆ అలల వంతెన ముక్కలు ముక్కలుగా విడిపోయి సముద్రంలో తేలియాడటాన్ని చూశాం. తాజాగా అదే విశాఖపట్నంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు అంటూ హడావిడి చేశారు. ఇంకేముందీ విశాఖ దశ తిరుగుతుందని అమాయకులు నమ్మారు. తీరా చూస్తే నాటి సదస్సులో పాల్గొన్నవారిలో అత్యధికులు గ్రామ సచివాలయ సిబ్బంది కావడం విస్మయానికి గురిచేసింది.

సచివాలయ సిబ్బందికి కోట్లు తగిలించి సదస్సులో కూర్చోబెట్టారు. కొంతకాలం క్రితం రాష్ట్రంలోని భూములన్నింటినీ సర్వే చేయించి సర్వే రాళ్లు పాతించబోతున్నట్టు ప్రకటించారు. సదరు సరిహద్దు రాళ్లపై జగన్మోహన్‌ రెడ్డి బొమ్మ ఉండాలని అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. పొలాల్లో పక్షుల నుంచి పంటలను కాపాడుకోవడం కోసం దిష్టిబొమ్మలను నిలబెట్టినట్టుగా సరిహద్దు రాళ్లపై జగన్‌ బొమ్మలు ఏంటి? అని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. సీన్‌ కట్‌ చేస్తే అధికారుల మాటలు నమ్మి తాము తయారు చేసిన సరిహద్దు రాళ్లలో ఒక్కటి కూడా ప్రభుత్వం కొనలేదని, ఫలితంగా తాము భారీగా నష్టపోయామని గ్రానైట్‌ వ్యాపారులు ఇప్పుడు ఘొల్లుమంటున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే ఈ ఐదేళ్లలో జగన్‌ ఏర్పాటు చేయించిన సినిమా సెట్లకు, ఫేక్‌ ప్రచారాలకు అంతే లేదు. అయినా మాకు జగనే కావాలని ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుకోవాలని జగన్‌ అండ్‌ కో భావిస్తున్నారు.

చంద్రబాబు పాలన అంతా గ్రాఫిక్స్‌ మాయాజాలం అని విమర్శించిన వారు ఇప్పుడు ఏమంటారో? అర్ధ సత్యాలు, అసత్యాలు ప్రచారం చేయడం రాజకీయ నాయకులకు పరిపాటే. అయితే జగన్‌ తరహాలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలలో సినిమా సెట్టింగులు వేయించడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. అందుకే కాబోలు, జగన్‌ను ఫేక్‌ ముఖ్యమంత్రి అని, జగన్‌ పాలనను ఫేక్‌ పాలన అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అసత్యాలు ప్రచారం చేసే వారిలో ఎక్కడో ఒకచోట వెరపు కనిపిస్తుంది. కానీ వేల మంది సమక్షంలో అమాయకంగా ముఖం పెట్టి అలవోకగా అసత్యాలు చెబుతున్న జగన్‌ వంటి వారిని ఇప్పుడే చూస్తున్నాం. రాష్ట్రంలో దిశ చట్టం అమలులో లేకపోయినా సదరు చట్టం ఉన్నట్టుగా ఐదేళ్లుగా ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని కేంద్రం తిరస్కరించినా దిశ పోలీస్‌ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా హడావిడి చేశారు. సర్వత్రా ‘మోసం గురూ’ అన్నట్టుగా ఐదేళ్ల పాలన సాగింది.

సంక్షేమ పథకాల అమలులో లంచాలకు తావు లేకుండా చేశామని జగన్‌ చెప్పుకొంటారు. సంక్షేమం పేరిట ప్రజలకు మజ్జిగ పోస్తూ మీగడ మాత్రమే తినడానికి అలవాటు పడిన జగన్‌ వంటి వారు ఇలాంటి పథకాల అమలులో కక్కుర్తి ఎందుకు పడతారు? తమ ఆకలి తీర్చడానికి ఇసుక, మద్యం వంటివి ఉండనే ఉంటాయి కదా! అందుకే సంక్షేమ పథకాలను పైసా లంచం లేకుండా అందిస్తున్నామని ఆయన చెప్పుకొంటారు. సంక్షేమం మాటున పాలకులు చేసే దోపిడీ గురించి తెలుసుకొనే అవసరం గానీ, తీరిక గానీ ప్రజలకు ఉండదు అని జగన్‌కు బాగా తెలుసు. వచ్చే వారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. ఇక చూడండి.. అప్పటి నుంచి పోలింగ్‌ జరిగే వరకు జగన్మోహన్‌ రెడ్డి తన ముఖంలో నవరసాలనూ పండిస్తారు. తల్లీ లేదు.. చెల్లీ లేదు.. చెప్పుకొందామంటే బాబాయి కూడా లేడు అని ప్రజల ముందుకు వెళ్లి బిక్క ముఖం పెట్టవచ్చు. వైసీపీతో సంబంధం లేకుండా పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తల్లి విజయమ్మను తానే తొలగించిన విషయం మాత్రం అంగీకరించరు.

తండ్రి రాజశేఖర రెడ్డి కోరుకున్నట్టుగా ఆస్తిలో సమాన వాటాను చెల్లి షర్మిలకు పంచి ఇవ్వడానికి నిరాకరించి తరిమేసిన విషయాన్ని మాత్రం చెప్పరు. బాబాయిని సొంత ఇంట్లోనే కిరాతకంగా నరికి చంపించిన వారికి అండగా ఉంటూ పక్కన పెట్టుకున్న విషయాన్ని మాత్రం చెప్పరు గాక చెప్పరు. పైగా వివేకానంద రెడ్డిని ఆయన ఏకైక కుమార్తె డాక్టర్‌ సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర రెడ్డి చంపించారని తన రోత మీడియాలో పుంఖానుపుంఖాలుగా రోత రాతలు రాయిస్తున్నారు. ఇంతకు మించిన నటన, వంచన ఉంటుందా? జగన్మోహన్‌ రెడ్డి అనే వ్యక్తిని సంపూర్ణంగా ఆవిష్కరించాలంటే కనీసం పది మందైనా పీహెచ్డీలు చేయాల్సిందే. అయినా మేక వన్నె పులులు, పయోముఖ విషకుంభాలు ఎవరో ప్రజలు తెలుసుకోలేరా?


అవును.. మోదీ పెద్దన్నే!

ఐదేళ్ల క్రితం జగన్‌కు అండగా నిలబడిన తల్లి ఇప్పుడు సైలెంటయ్యారు. తనకు ద్రోహం చేసిన అన్నకు వ్యతిరేకంగా రాజకీయ రణ క్షేత్రంలో షర్మిల మోహరించారు. తండ్రి హంతకులను కాపాడుతున్న అన్న జగన్‌కు వ్యతిరేకంగా డాక్టర్‌ సునీత సైతం తన వంతు ప్రచారం చేస్తున్నారు. తనలాంటి వారికి న్యాయం జరగాలంటే జగన్‌ను ఓడించాల్సిందే అని ఆమె పిలుపు కూడా ఇచ్చారు. మరోవైపు జగన్‌రెడ్డి రాజకీయ ప్రత్యర్థుల మధ్య పొత్తు పొడుస్తోంది. మిగతా విషయాలను లెక్క చేయకపోయినా, తెలుగుదేశం–జనసేనతో చేతులు కలపడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు రావడం మాత్రం జగన్‌ను కలవరానికి గురిచేస్తోంది. గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, ప్రచార మాధ్యమాల ద్వారా చేస్తున్న ప్రచారాన్ని బట్టి మూడు పార్టీల కలయిక జగన్‌ అండ్‌ కోకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్టు ఉంది. నిజానికి ఓట్లపరంగా బీజేపీతో కలవడం వల్ల తెలుగుదేశం–జనసేన కూటమికి కలిగే ప్రయోజనం పెద్దగా ఉండదు. అయినా వైసీపీ ఎందుకు కలవరపడుతోంది అంటే అందుకు కారణం ఉంది. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలీయమైన శక్తిగా ఆవిర్భవించింది. ప్రధాని మోదీని ఢీకొనే సత్తా ఉన్న నాయకుడు కనిపించడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడిపోవడంతో ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ప్రధాని మోదీ రాజకీయాన్ని ఎదిరించి నిలబడలేకపోతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఏ ఉద్దేశంతో ప్రధానమంత్రిని ‘పెద్దన్న’ అని సంబోధించారో గానీ జాతీయ రాజకీయాలలో ఇప్పుడు మోదీ నిజంగానే ‘పెద్దన్న’ పాత్ర పోషిస్తున్నారు. రాష్ర్టాలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా మోదీ అధికారం ముందు నిలబడలేక పోతున్నాయి. తెలంగాణలో నిన్నటి వరకూ అధికారంలో ఉండి బలమైన శక్తిగా కనబడిన భారత రాష్ట్ర సమితి ఇప్పుడు తన మనుగడ కోసం బీజేపీతో పొత్తు కోసం అర్రులు చాస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో పాటు కాంగ్రెస్‌ ఉనికి నామమాత్రం. అక్కడ ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి. అయినా అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం–జనసేన కూటమి కూడా బీజేపీ కటాక్షం కోసం వెంపర్లాడుతున్నాయి. దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితులను ఆసరా చేసుకొని లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకోవాలని మోదీ–షా ద్వయం సంకల్పం పెట్టుకుంది. ఈ క్రమంలో తనతో పొత్తు పెట్టుకోవడానికి ఉత్సుకత ప్రదర్శిస్తున్న ప్రాంతీయ పార్టీల మెడలు వంచి అధిక సంఖ్యలో సీట్లు పొందాలని బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను దారిలోకి తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం–జనసేన కూటమి కూడా అదే దారిలో ఉంది. కమలనాథులను సంతృప్తి పరచడం కోసం ఆరేడు లోక్‌సభ సీట్లు ఇవ్వడానికి కూడా చంద్రబాబు సిద్ధపడుతున్నారు. పొత్తులకు సంబంధించి ప్రాథమికంగా అవగాహన కుదిరినప్పటికీ తుది దశ చర్చల కోసం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీలోనే మకాం వేయాల్సిన పరిస్థితి. నిజానికి తెలుగుదేశం– జనసేన అవసరం బీజేపీకే ఉంది. అయినా బీజేపీ పిలుపు కోసం బాబు–పవన్‌ ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఇతర రాష్ర్టాలలో సీట్ల సర్దుబాటు చర్చలతో అమిత్‌ షా బిజీగా ఉండవచ్చు గానీ, ఢిల్లీలో ఖాళీగా కూర్చోవాల్సి రావడం బాబు–పవన్‌కు ఒకరకంగా అవమానమే. అయినా కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యానికి తల వొంచక తప్పని నిస్సహాయత ఆ రెండు పార్టీలది. తెలుగుదేశం–జనసేనతో బీజేపీ చేతులు కలిపితే ఎన్నికల్లో తాను అనుకున్న విధంగా అక్రమాలకు పాల్పడలేనని గ్రహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి పరుగెత్తారు. ప్రధాని మోదీని కలసి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవద్దని ప్రాధేయపడ్డారు.

తన ప్రయత్నాలు ఫలించే అవకాశం సన్నగిల్లడంతో జగన్‌రెడ్డి చివరి ప్రయత్నంగా తనకు అనుకూలమైన ఒక మీడియా సంస్థతో సర్వే నివేదికను ప్రసారం చేయించారు. అయినా మూడు పార్టీల మధ్య పొత్తు పొడుస్తున్నది. ఇందుకు కారణం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై కమలనాథులకు తత్వం బోధపడింది. ఆరెస్సెస్‌ కూడా తన ఫీడ్‌ బ్యాక్‌ అందించింది. రాష్ట్రంలో హైందవ సంస్కృతిని జగన్మోహన్‌ రెడ్డి ధ్వంసం చేస్తున్నారని ఆరెస్సెస్‌ గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ కూడా పొత్తుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉంటున్న జగన్‌రెడ్డిని వదులుకోవడానికి ఇష్టం లేకపోయినా పొత్తు పెట్టుకోక తప్పని స్థితికి బీజేపీ పెద్దలు వచ్చారని చెబుతున్నారు. ఈ పొత్తుల వ్యవహారంపై తెలుగుదేశం–జనసేన పార్టీలను విమర్శిస్తున్న వైసీపీ నాయకులు బీజేపీని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. కమలనాథులతో వైరం పెట్టుకునే సాహసం జగన్‌ చెయ్యలేరు. రాష్ట్రంలో అధికారం కోల్పోయినా తనను కేసుల బారి నుంచి ఆదుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే కనుక బీజేపీ జోలికి పోకుండా జగన్‌ అండ్‌ కో జాగ్రత్త పడుతున్నారు. జగన్‌ అండ్‌ కో భయాల విషయం అలా ఉంచితే బీజేపీతో పొత్తు మొదటికే మోసం రాకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం తెలుగుదేశం–జనసేనపై ఉంది. ఏ పరిస్థితుల్లో, ఏ కారణాలతో పొత్తు పెట్టుకోవలసి వస్తున్నదో ఆ రెండు పార్టీలూ ప్రజలకు వివరించాలి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ర్టాన్ని పైకి లేపి అభివృద్ధి పథంలో నడిపించడానికి బీజేపీతో పొత్తు ఎలా ఉపకరిస్తుందో ప్రజలకు నచ్చచెప్పగలగాలి. అప్పుడే పొత్తుల వల్ల ఉపయోగం ఉంటుంది. వ్రతం చెడినా ఫలితం దక్కాలి కదా!

ఆర్కే

AP News; మచిలీపట్నంలో పేర్ని కిట్టు అనుచరుల వీరంగం

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 10 , 2024 | 07:00 AM