చిహ్నం మార్పుతో చికాకులే...!
ABN , Publish Date - Jun 02 , 2024 | 01:45 AM
ఓట్ల లెక్కింపునకు సమయం సమీస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ప్రధాన రాజకీయ పార్టీల తరఫున పోస్టులు పెడుతూ వీడియోలు చేస్తూ వదులుతున్న వారి హడావుడి కూడా...
ఓట్ల లెక్కింపునకు సమయం సమీస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ప్రధాన రాజకీయ పార్టీల తరఫున పోస్టులు పెడుతూ వీడియోలు చేస్తూ వదులుతున్న వారి హడావుడి కూడా పెరిగిపోతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఎగ్జాక్ట్ పోల్స్ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అంచనాలు, అభిప్రాయాల విషయం ఎలా ఉన్నా కౌంటింగ్ రోజున, ఆ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయన్నది కీలకంగా మారింది. రాష్ట్రంలో రాజకీయ వైషమ్యాలు ప్రజల మెదళ్లలోకి చొరబడ్డాయి. దీనికితోడు గత ఐదేళ్లుగా ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుదారుల మధ్య దాడులు, ప్రతిదాడులు జరగడంతోపాటు ప్రభుత్వపరంగా కక్షసాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరడంతో ఎన్నికల ఫలితాలను బట్టి గొడవలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పైనే కాదు.. రాష్ట్ర పోలీసులపై కూడా ఉంది. లోక్‌సభకు కూడా ఎన్నికలు జరిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం శాసనసభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న ఉత్సుకతతో ఉన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అధికారంలో ఉన్న వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉండబోతున్నది? కూటమి అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటి? అంటే ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి జగన్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా సమాజం విడిపోయింది. పోలింగ్‌కు, కౌంటింగ్‌కు మధ్య 20 రోజుల వ్యవధి ఉండటం వల్ల ఆయా పార్టీల మద్దతుదారులు, ప్రజల మెదళ్లను విషతుల్యం చేశారు. విశ్లేషణలు, వ్యాఖ్యల పేరిట ప్రజలను విడదీసి రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగాయి. దీని ఫలితం ఓట్ల లెక్కింపు తర్వాత కనిపించే ప్రమాదం ఉంది. నాలుగో తేదీ తర్వాత కూటమికి మద్దతుగా నిలబడిన వారికి దబిడి దిబిడే అని వైసీపీ అనుకూలురు హెచ్చరికలు చేయగా.. ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే ఈ ఐదేళ్లు తమపై సాగిన వేధింపులకు ప్రతీకారం తీర్చుకోవాలని కూటమి మద్దతుదారులు భావిస్తున్నారు. దీన్నిబట్టి ఫలితాలు ఎలా ఉన్నా శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రస్తుతం ప్రజల్లో నెలకొన్న వైషమ్యాల స్థానంలో కక్షలు, కార్పణ్యాలు ప్రవేశిస్తాయి. రాష్ట్రం మొత్తం ఫ్యాక్షన్ జోన్‌గా మారిపోయే ప్రమాదం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌కు మంచిదికాదు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నవారు తమకు మంచి జరగుతుందన్న ఉద్దేశ్యంతో వారికి అండగా ఉన్నారు. అలాంటప్పుడు ఎవరు గెలిచినా మంచే జరగాలి కానీ గొడవలు జరగడం వాంఛనీయం కాదు. రాజకీయ పార్టీల మద్దతుదారుల్లో ఆవేశకావేశాలు ఉన్నందున వారిని అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతతో మెలిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్‌పై ఉంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఎన్నికల కమిషన్‌గానీ, పోలీసులుగానీ ఆషామాషీగా తీసుకోకూడదు.
మారిన పరిస్థితులు...
చట్టం తన పని తాను చేయాలి. కానీ, రాష్ట్రంలో ఆ పరిస్థితులు లేకుండా చేశారు. తాము ప్రజలకు జవాబుదారీ అన్న స్పృహ పోలీసుల్లో లేకుండా పోయింది. ఉన్నతాధికారులు పాలకుల పాదాల వద్ద మోకరిల్లుతున్నారు. ఈ కారణంగా ఎన్నికల కమిషన్ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఐదేళ్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికార పార్టీకి ఎన్నికల కమిషన్ తాజాగా తీసుకున్న నిర్ణయాలు రుచించడం లేదు. ఈ కారణంగానే ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా పనిచేస్తున్న అధికారులను జగన్‌రెడ్డి రోత మీడియా టార్గెట్ చేసుకుంది. నిన్నటి వరకు విధి నిర్వహణలో పక్షపాతంగా వ్యవహరించిన అధికారులను తప్పుబట్టినప్పుడు ఇదే రోత మీడియా గుండెలు బాదుకుంది. అధికారులను నిందించడం తగదని సుద్దులు చెప్పే దుస్సాహసానికి పాల్పడ్డారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించడమే మహా పాపం అంటున్నారు. నిన్నటి వరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ప్రతిపక్షాల తరఫున ఎవరు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రికి కళ్లు, చెవులుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. ఫిర్యాదుల్లో వాస్తవం ఉందా? లేదా? అన్నది తర్వాత తేలుతుంది. ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేసుకునే పరిస్థితులు ఇప్పటివరకూ లేకుండా పోయాయి. రూల్ ఆఫ్ లా అమలులో ఉండటానికి, ఉండకపోవడానికి తేడా ఇదే! కౌంటింగ్ సందర్భంగా గొడవలకు దిగడానికి కూడా వెనుకాడని వాళ్లు మాత్రమే తమకు ఏజెంట్లుగా ఉండాలని సజ్జల చెప్పడాన్ని బట్టి ఆ రోజు పరిస్థితి ఎలా ఉండబోతున్నదో అధికార యంత్రాంగం అంచనా వేసుకోవచ్చు. కయ్యానికి కాలు దువ్వడానికి సిద్ధంగా ఉండాలని సజ్జల వంటి వారు స్వయంగా పిలుపు ఇవ్వడం వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది.
ఐదేళ్లుగా అణచివేతకు గురైన తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు.. నాయకులు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఫలితాలు వస్తే కౌంటింగ్ కేంద్రం లోపల, బయట గొడవలు జరగవచ్చు. కూటమికి అనుకూలంగా ఫలితాలు వస్తే ధర్మాగ్రహం పేరిట కూటమి మద్దతుదారులు ప్రతీకారదాడులకు దిగవచ్చు. ముఖ్యమంత్రి జగన్‌కు మద్దతుదారులుగా ఉంటున్న వారిలో కొందరు ఉన్మాదులుగా మారారు. ‘‘ఎవరైనా జగన్‌రెడ్డి కక్ష్యలోకి వచ్చి నాలుగైదు అడుగుల దూరంలో నిలబడి కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తే జగనన్న కోసం వాడు చచ్చిపోతాడట. జగన్ ఇజ్ నాట్ ఎ మ్యాన్. బట్ ఈజ్ యాన్ ఎమోషన్. ఆయనను చూస్తే పిచ్చి పట్టేస్తుంది. అతనొక ఎమోషన్, అతనొక శక్తి’’ అని అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లండన్‌లో చేసిన వ్యాఖ్యలు గమనార్హం. అదనపు అడ్వొకేట్ జనరల్ స్థాయిలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఇలాంటి మాటలు వచ్చాయంటే జగన్‌రెడ్డి మద్దతుదారుల మనస్తత్వం అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వస్తే ఈ బాపతుగాళ్లు ఎలా వ్యవహరిస్తారో ఊహించుకోవచ్చు. తస్మాత్ జాగ్రత్త!
ప్రజాస్వామ్యంలో ధనస్వామ్యం...
ఈ విషయం అలా ఉంచితే, రాష్ట్రంలో ఎన్నికలు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోతున్నాయి. ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థులు చెప్పినదాన్ని బట్టి ఈ ఎన్నికల్లో సగటున ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో అభ్యర్థి 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో 100 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేశారు. శాసనసభ్యుడిగా ఎన్నిక కావడానికి 50 నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సాధించేది ఏమిటి? అంత ఖర్చు చేసి గెలిచిన అభ్యర్థుల నుంచి ప్రజాసేవను ఆశించడం అత్యాశే అవుతుంది. ప్రజలు కూడా పూర్తిగా మారిపోయారు. గతంలో బడుగు బలహీనవర్గాలకు చెందిన వారికే డబ్బు పంచేవారు. ఈ ఎన్నికల్లో అగ్రవర్ణాలవారితోపాటు భూస్వాములు, ధనికులు కూడా అడిగి మరీ డబ్బు తీసుకున్నారట! ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉన్నవారు ఎన్నికల్లో డబ్బు తీసుకోవడాన్ని నామోషీగా భావించేవారు.
ఇప్పుడు వారు కూడా అది తమ హక్కుగా భావిస్తున్నారట! ఒక నియోజకవర్గంలో రెండున్నర లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో సగం మందికి మాత్రమే గతంలో డబ్బు పంచేవారు. ఈ ఎన్నికల్లో మాత్రం మెజారిటీ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లందరికీ డబ్బులు పంచారు. కొన్ని నియోజకవర్గాల్లో పంపకాలకే 60 కోట్ల రూపాయలకుపైగా ఖర్చయ్యిందని అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. పెద్ద పెద్ద భవనాల్లో నివసిస్తున్నవారు కూడా పక్క వారికి ఎక్కువ ఇచ్చి తమకు తక్కువ ఇచ్చారేంటి? అని నిలదీస్తున్నారట. ఈ లెక్కన వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో అభ్యర్థి 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. అంటే రెండు ప్రధాన పక్షాలు బరిలో ఉంటే... 175 నియోజకవర్గాల్లో మొత్తం 30 వేల కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రాజకీయ పార్టీలకు కూడా శిరోభారం అవుతుంది. ప్రస్తుతం రాజకీయ పార్టీలు పులిమీద స్వారీ చేస్తున్నాయి.
ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టే స్థితిలో ఎన్నికల కమిషన్ లేదు. పోలీసులతోపాటు పోలింగ్ సిబ్బందికి కూడా ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులు లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలకు సేవ చేయాలన్న చిత్తశుద్ధిగలవారు ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యమా? శాసనసభ్యులు దోపిడీకి తెరలేపారని నిందించే హక్కు ప్రజలకు ఉంటుందా? ఓటు వేయడానికి చేయిచాస్తున్న వారికి ప్రశ్నించే హక్కుగానీ, నిలదీసే అర్హతగానీ ఉంటుందా? వేలకోట్లు ఖర్చుచేసి అధికారంలోకి వచ్చే పార్టీలు నిప్పులా ఉండాలని ఆశించడం తప్పుకాదా? ఏ రాజకీయ పార్టీ అధినేత కూడా తమ సొంత ఆస్తులు కరిగించి ఖర్చు చేయరుగదా? వ్యాపారులు, పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు సేకరిస్తారు. అందుకు బదులుగా అధికారంలోకి వచ్చాక వారికి మేళ్లు చేయాలి. ఇదొక విష వలయం! ఓటర్లకు వేలల్లో దక్కుతుండగా విరాళాలు ముట్టజెప్పేవారితోపాటు కొంతమంది నాయకుల చేతుల్లోకి సంపద పోతుంది.
వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలకు ఇదొక పెట్టుబడి. ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి అధికారంలోకి వచ్చాక లాభాల పంట పండించుకుంటారు. ప్రజలకు ఎన్నికలప్పుడు ఎంతో కొంత డబ్బు ముడుతోంది. తిలా పాపం తలా పిడికెడు! ఈ వ్యవస్థను మార్చుకోవాల్సిన అవసరం ఉందా? లేదా? అన్నది సమాజమే ఆలోచించుకోవాలి. ఎన్నికల ఖర్చు వేల కోట్ల నుంచి లక్షల కోట్లకు చేరడానికి ఎంతోకాలం పట్టకపోవచ్చు. మనదేశంలో ఎన్నికల ఖర్చు అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల ఖర్చును ఇప్పటికే అధిగమించింది. డబ్బు పంచనిదే ఓటు వేయడానికి వచ్చేది లేదు అనేస్థాయికి ప్రజలు వచ్చేశారు. వారిని ఆ స్థాయికి దిగజార్చారు. పోలింగ్‌ను సజావుగా జరిపించేందుకు పోలీసులు, పోలింగ్ అధికారులకు కూడా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి తెచ్చుకున్నది కూడా రాజకీయపార్టీలే! ఈ విష వలయం నుంచి దేశం బయటపడని పక్షంలో అభివృద్ధి అనేది నినాదాలకే పరిమితం అవుతుంది. సంపన్నులు మరింత సంపన్నులు అవుతారు. వారు చెల్లించే పన్నులతో ప్రజలకు తాయిలాలు పంచుతూ రాజకీయ నాయకులు అపర దానకర్ణులుగా బిల్డప్ ఇచ్చుకుంటారు. మన ప్రజాస్వామ్యం మేడిపండులా మారిపోవడం విషాదం. పెరుగుట విరుగుట కొరకే అని అంటారు. ఈ విషాదం నుంచి దేశం ఏదో ఒక రోజు బయటపడుతుందని, బయట పడాలని కోరుకుందాం!
పదేళ్ల ‘తెలంగాణ’
ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు వద్దాం. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇవాళ్టి నుంచి తెలంగాణ సొంతం. రాష్ట్రం విడిపోయి అప్పుడే పదేళ్లు అయ్యింది. ఈ పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ను సొంతం చేసుకోగా.. ప్రకటించుకున్న రాజధానిని కూడా కాదనుకొని ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మర్చిపోయారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటోంది. విడిపోయి లాభపడిన రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి తొమ్మిదిన్నర ఏళ్లు అధికారంలో కొనసాగిన కేసీఆర్ ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఆరు నెలల రేవంత్‌రెడ్డి పాలనపై పెదవి విరవడానికి పెద్దగా ఏమీలేదు. అయితే, రైతాంగ సమస్యలపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
సాగునీటి కొరతతోపాటు విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షాభావం, ఆర్థిక సమస్యలు ఈ పరిస్థితికి కారణం కావొచ్చుగానీ.. ప్రజలు ప్రభుత్వాన్నే తప్పుబడతారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పోల్చితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తున్నారు. మంత్రులకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు. అదే సమయంలో కొన్ని అవాంఛనీయమైన అంశాలు తాజాగా తెరమీదకు రావడం ఆశ్చర్యంగా ఉంది. ఇందులో రాష్ట్రగీతంలో మార్పులు చేయాలనుకోవడం మొదటిది. అందెశ్రీ రచించిన గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పన చేయడాన్ని భారత రాష్ట్ర సమితి తప్పుబడుతోంది. ఇందులో హేతుబద్ధత లేదు. కళలకు కులం, మతం, ప్రాంతం అంటూ ఎల్లలు ఉండవు. సంగీతానికి అసలు ఏ హద్దులూ ఉండవు. అయినా రాష్ట్ర గీతానికి స్వరకల్పన చేయడానికి తెలంగాణకు చెందిన సంగీత దర్శకులే లభించలేదా? ఆంధ్రకు చెందిన కీరవాణి అవసరం ఏమిటి? అని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌లాంటి నాయకులు నిలదీయడం ఎబ్బెట్టుగా ఉంది. నిజానికి కీరవాణి ఆంధ్రవాడు కూడా అని చెప్పలేం. హైదరాబాద్‌లో స్థిరపడటానికి ముందు ఆయన చెన్నైలో ఉండేవారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఆంధ్రవారినే ఎంచుకున్నారు.
కాళేశ్వరం నిర్మించిన ప్రధాన సంస్థ ఆంధ్రా వాళ్లది కాదా? యాదాద్రికి రూపకల్పన చేసిన ఆనంద్‌సాయి ఆంధ్రావాడు కాదా? చినజీయర్ స్వామి ఎవరు? రాజశ్యామల యాగం జరిపించిన స్వరూపానంద ఎవరు? కల్వకుంట్ల కవిత రూపొందించిన బతుకమ్మ పాటకు తమిళుడైన ఏఆర్ రెహ్మాన్ స్వరకల్పన చేయలేదా? అంటూ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌ను ఉద్దేశించి నెటిజన్స్ ఆడుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన భారత రాష్ట్ర సమితి మళ్లీ పూర్వ వైభవం సాధించేందుకు తెలంగాణవాదాన్ని ఎత్తుకోబోతున్నదని దీన్నిబట్టి అర్థం అవుతోంది. రాష్ట్రం ఏర్పడి దశాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న వేళ తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేయాలనుకుంటున్నప్పటికీ ఫలితం ఉంటుందా? తెలంగాణవాదం ఇప్పుడు కేసీఆర్ గడీలో బందీగా లేదు. ఉమ్మడి రాష్ట్ర స్మృతులు మెదళ్ల నుంచి నిష్క్రమించాయి. అయినా కీరవాణిని అడ్డుబెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని కేసీఆర్ అండ్ కో వృథా ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా రకుల్ ప్రీత్‌సింగ్‌ను ఆనాడు ఏ ప్రాతిపదికన నియమించారో వారు చెప్పగలరా? సెంటిమెంట్‌ను రగిలించాలనుకుని అవతలి వారివైపు వేలెత్తిచూపే ప్రయత్నం చేస్తే కేసీఆర్‌వైపు నాలుగువేళ్లు కనిపిస్తాయి. కేంద్రంలో భారతీయ జనతాపార్టీ తీసుకువచ్చిన ఎన్‌ఆర్‌సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్)ని తాము వ్యతిరేకిస్తున్నట్లుగా కేసీఆర్ అప్పట్లో చెప్పారు. ఇప్పుడు రాజకీయంగా మనుగడ సాగించడం కోసం టీఆర్‌సీని తీసుకురావాలని కోరుతారా? ఇప్పుడు తెలంగాణలో నివసిస్తున్న వాళ్లందరూ తెలంగాణ వాళ్లే! ప్రవీణ్‌కుమార్ లేదా మరొకరు వేలెత్తిచూపినంత మాత్రాన తెలంగాణ సెంటిమెంట్ పండదు. దొరల దురహంకారం తగదనే గత ఎన్నికల్లో కేసీఆర్‌ను ప్రజలు ఓడించారు. తలెత్తుకొని గర్వించే తెలంగాణ కావాలన్నదే ప్రజల వాంఛ.
అవసరం లేని ‘మార్పులు’
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరో అవాంఛనీయమైన అంశాన్ని చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వ చిహ్నంలో మార్పులు చేయాలని రేవంత్‌రెడ్డి ఎందుకు భావిస్తున్నారో తెలియదు. కొద్దిమంది మినహా ప్రజలెవరూ ఈ మార్పు కోరుకోవడం లేదు. గత ఎన్నికల్లో ఈ అంశం చర్చకు కూడా రాలేదు. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించడం వేరు – తిరగదోడటం వేరు. ప్రభుత్వ చిహ్నం వంటివి మార్చాలనుకోవడం వల్ల ప్రజలకు ప్రయోజనం కలగకపోగా ప్రభుత్వాలకు చికాకులు ఎదురవుతాయి. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తే భవిష్యత్‌లో వచ్చే ప్రభుత్వం మరికొన్ని మార్పులు చేయవచ్చు. ఈ ధోరణివల్ల తెలంగాణ చిహ్నం ఎలా ఉంటుందో కూడా ప్రజలు గుర్తుపెట్టుకోలేని పరిస్థితి వస్తుంది. తెలంగాణ ప్రభుత్వ చిహ్నాన్ని మార్చేందుకు ప్రభుత్వ మార్పిడి జరగలేదు. ఈ చిహ్నాన్ని మార్చినంత మాత్రాన తెలంగాణ చరిత్ర నుంచి కేసీఆర్ పేరును తుడిచివేయలేరు. తెలంగాణ చరిత్రలో ఆయన స్థానం ఆయనకే ఉంటుంది. ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశించేది వేరుగా ఉన్నప్పుడు ఇలాంటి అల్ప విషయాలకు ప్రాధాన్యం ఇస్తే రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి చర్యలను ప్రజలు హర్షించరు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం ప్రజా వేదికను కూల్చడాన్ని, రాజధాని లేకుండా చేయడాన్ని ప్రజలు హర్షించలేదు.
చిహ్నాలు మార్చడం వంటి చర్యల వల్ల గత ఎన్నికల్లో చతికిలబడిన భారత రాష్ట్ర సమితికి జవసత్వాలు కల్పించినవారు అవుతారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం కోసం కేసీఆర్ సహజంగానే ఎదురుచూస్తారు. కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన చిహ్నంలో ఉన్న చార్మినార్‌ను మార్చాలనుకోవడం ఎందుకో తెలియదు. నిన్న మొన్నటివరకు హైదరాబాద్ చిహ్నంగా చార్మినార్‌నే చెప్పుకొన్నాం. రాష్ర్టానికి వచ్చిన అతిథులకు చార్మినార్ రూపంలో ఉన్న జ్ఞాపికలను ఇచ్చేవాళ్లం. ఈ నేపథ్యంలో అనవసర, అవాంఛనీయ అంశాలను కెలుక్కుని తనపై ప్రత్యర్థి రాజకీయ దాడి చేసేందుకు అస్త్రాలు సమకూర్చడమా? లేదా? అన్నది రేవంత్‌రెడ్డి తేల్చుకోవాలి. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై స్వల్ప అసంతృప్తి నెలకొంటోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ విషయం గ్రహించి ప్రజల్లో అసంతృప్తి తలెత్తకుండా మొగ్గలోనే అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో ప్రజాభిమానం ప్రజాగ్రహంగా మారడానికి ఎంతో సమయం పట్టదు. కేసీఆర్‌కు ఎదురైన అనుభవం సజీవ సాక్ష్యంగా ఉండనే ఉంది!
ఆర్కే