Share News

RK Kotha paluku : జగన్‌.. మహా పాతకం!

ABN , Publish Date - Sep 22 , 2024 | 01:11 AM

తిరుమల లడ్డూను కాపీ కొట్టాలని ప్రైవేటు వ్యక్తులే కాదు.. అనేక దేవాలయాలు కూడా ప్రయత్నించాయి. ఈ విషయంలో ఇంతవరకూ ఎవరూ సక్సెస్‌ కాలేదు. లడ్డూ ప్రసాదాన్ని ఎవరూ కాపీ చేయలేకపోవడం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి మహత్యం అని...

RK Kotha paluku : జగన్‌.. మహా పాతకం!

తిరుమల లడ్డూను కాపీ కొట్టాలని ప్రైవేటు వ్యక్తులే కాదు.. అనేక దేవాలయాలు కూడా ప్రయత్నించాయి. ఈ విషయంలో ఇంతవరకూ ఎవరూ సక్సెస్‌ కాలేదు. లడ్డూ ప్రసాదాన్ని ఎవరూ కాపీ చేయలేకపోవడం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి మహత్యం అని శ్రీవారి భక్తులు విశ్వసిస్తారు. శతాబ్దాలుగా తన ప్రాశస్త్యం నిలుపుకొంటూ వచ్చిన లడ్డూను గత జగన్‌రెడ్డి ప్రభుత్వం కాపీ కొట్టలేకపోయినా నాణ్యతను మాత్రం దెబ్బతీయగలిగింది. ఇటీవలి కాలంలో లడ్డూ నాణ్యత దారుణంగా పడిపోయింది. ఐదేళ్ల క్రితం తిరుమల నుంచి లడ్డూ తీసుకువచ్చి ఎవరికైనా ఇస్తే ఆ పరిసరాలు ఘుమఘుమలాడేవి. ఈ మధ్య కాలంలో ఆ ఘుమఘుమలు మాయమయ్యాయి. లడ్డూ కూడా ఎండిపోయినట్టుగా ఉంటోంది. ఇలా జరగడానికి తిరుమల తిరుపతి దేవస్థానం గత పాలకవర్గం నిర్వాకమే కారణం. నాసిరకం నెయ్యితో పాటు జీడిపప్పు, కిస్మిస్‌లు కూడా నాణ్యమైనవి వాడకపోవడంతో లడ్డూ తన రుచిని కోల్పోయింది. ఇప్పుడు లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని తేలింది. ఈ మహా పాతకానికి ఎవరు కారణం? జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలులోకి తెచ్చిన దిక్కుమాలిన రివర్స్‌ టెండరింగ్‌ విధానమే ఇందుకు కారణం. తిరుమల తిరుపతి దేవస్థానం గత పాలక మండలి ఈ రివర్స్‌ టెండరింగ్‌ విధానం అమలు వల్ల రేటు తగ్గించిన నెయ్యి సరఫరాదారులు కల్తీ నెయ్యి సరఫరా చేశారు. నాణ్యమైన ఆవు నెయ్యిని పేరొందిన కంపెనీలు బహిరంగ మార్కెట్‌లో కిలో 800 రూపాయల వరకు విక్రయిస్తుండగా టీటీడీ పాలక మండలి మాత్రం రూ.400 కంటే తక్కువకు నెయ్యి టెండర్లను ఖరారు చేసింది. ఈ తప్పుడు నిర్ణయం కారణంగానే కల్తీ నెయ్యి సరఫరా అయింది. మహా ప్రసాదాన్ని కలుషితం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. ఆ దేవదేవుడికి అపచారం చేశారు. చీప్‌ అండ్‌ బెస్ట్‌ అన్న వాదన అర్థరహితం. నాణ్యమైన వస్తువు ఏదీ తక్కువ ధరకు లభించదు. ఈ చిన్న లాజిక్‌ను మిస్సయిన టీటీడీ గత పాలక మండలి రివర్స్‌ టెండరింగ్‌ విధానం అమలు చేసి భక్తుల మనోభావాలతో ఆడుకుంది. కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థ తొలుత కిలో నెయ్యికి 610 రూపాయలు కోట్‌ చేసింది. తర్వాత రివర్స్‌ టెండరింగ్‌లో పాల్గొని ఆ ధరను అమాంతం కిలోకు 424 రూపాయలకు తగ్గించింది.


బుద్ధీ జ్ఞానం ఉండి ఉంటే అధికారులకు, పాలక మండలికి అప్పుడే అనుమానం రావాల్సింది. కానీ పట్టించుకోలేదు. భక్తుల సొమ్ముతోనే ప్రసాదాలకు అవసరమైన ముడి సరుకులను కొనుగోలు చేస్తారు. ఇందులో నాణ్యత విషయంలో రాజీపడి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటో గత పాలక మండలే చెప్పాలి. కొండ మీదకు వచ్చే నెయ్యి ట్యాంకర్లను నాణ్యత విషయంలో తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెప్పిన మాటల్లో కూడా వాస్తవం లేదు. నెయ్యి కల్తీ జరిగిందా? లేదా? అని నిర్ధారించే ల్యాబ్‌లు తిరుపతిలో లేవు. అలాంటప్పుడు ప్రతి ట్యాంకర్‌ను ఎలా పరీక్షించారో జగన్‌రెడ్డి చెప్పాలి. వాస్తవానికి జగన్‌రెడ్డి కుటుంబానికి ఆ దేవదేవుడిపై నమ్మకం, విశ్వాసాలు లేవు. క్రైస్తవ మతాన్ని ఆచరించే వైఎస్‌ కుటుంబంలోని మహిళలు తిరుమల కొండకు వెళ్లి దేవదేవుడిని దర్శించుకోవడానికి కూడా ఇష్టపడరు. అయితే వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు వస్తుంటారు. దీంతో తిరుమలను సొంత అవసరాలకు వాడుకోవడం కోసం జగన్‌ అండ్‌ కో బ్రహ్మాండమైన స్కెచ్‌ రూపొందించారు. జగన్‌ అధికారంలోకి రాగానే ధర్మారెడ్డిని టీటీడీ జేఈఓగా నియమించారు. తర్వాత ఆయననే ఈవోగా ప్రమోట్‌ చేశారు. అప్పటి నుంచి కొండపైన ధర్మారెడ్డి మాటే శాసనమైంది. జగన్‌రెడ్డి సొంత పనులు చక్కబెట్టడానికి తిరుమలను వేదికగా మార్చుకున్నారు.

దైవ దర్శనానికి వచ్చే ప్రముఖులకు వీఐపీ ఆతిథ్యం ఇచ్చి మంచి చేసుకొనేవారు. ఇటు జగన్‌రెడ్డికీ, అటు ఆ ప్రముఖులకూ అనుసంధానకర్తగా ధర్మారెడ్డి వ్యవహరించేవారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర ఏజెన్సీల అధికారులు కొండకు వచ్చినప్పుడు ధర్మారెడ్డి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. మధ్యలో ఢిల్లీ వెళ్లి ఆయా ప్రముఖులను కలుసుకొని తీర్థప్రసాదాలు అందజేసి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఇచ్చి రమ్మన్నారని చెప్పేవారు. ఈ విధంగా చేయడం ద్వారా జగన్‌రెడ్డి పట్ల ఆయా ప్రముఖులకు సాఫ్ట్‌ కార్నర్‌ ఏర్పడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ మహా దేవుడిపై విశ్వాసంతో, భక్తితో వ్యయప్రయాసలకు ఓర్చి కొండపైకి చేరుకొనే భక్తులకు సౌకర్యాల కల్పనను గాలికొదిలేసి జగన్‌రెడ్డికి ఉపయోగపడతారనుకున్న ప్రముఖుల సేవలో తరించేవారు. నాటి పాలక మండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి.. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కోసం ఆ దేవదేవుడిని ముడిసరుకుగా వాడుకున్నారు. జగన్‌ అధికారంలో ఉన్నంతకాలం ఢిల్లీలో వివిధ సంస్థల్లో పలుకుబడి కలిగిన ముగ్గురు నలుగురిని పాలక మండలి సభ్యులుగా నియమిస్తూ వచ్చారు. వీరంతా కలసి జగన్‌రెడ్డి వ్యవహారాలను చక్కబెట్టేవారు. 2019–2024 మధ్య కాలంలో కొండపైన జరిగింది ఇదే!


అవినీతి మకిలి!

గతంలో కొండ మీద అవినీతి ఎక్కువగా ఉండేది కాదు. దేవస్థానం సిబ్బంది కూడా స్వామివారిపై భక్తి, భయంతో ఉండేవారు. గత ఐదేళ్లుగా రాజకీయ జోక్యం పెరిగిపోవడంతో శ్రీవారి సన్నిధిలో అవినీతి వేళ్లూనుకుంది. కమీషన్ల సంస్కృతి ప్రవేశించింది. పాలక మండలి సభ్యులు డమ్మీలుగా మారిపోయారు. అంతా వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి కనుసన్నల్లోనే జరిగింది. ఈ నేపథ్యంలోనే కల్తీ నెయ్యి బాగోతం చోటుచేసుకుంది. నాణ్యమైన నెయ్యి కావాలంటే తక్కువ ధరకు ఇవ్వలేమని క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలు స్పష్టం చేసినప్పుడు ఎవడో వచ్చి తక్కువకు సరఫరా చేస్తామంటే ఒప్పుకోవడంలోనే గోల్‌మాల్‌ జరిగింది. కనీస పాపభీతి కూడా లేకుండా దేవుడిపైన నమ్మకంతో భక్తులు సమకూర్చిన సొమ్ముకే కన్నం వేశారు. కమీషన్ల పర్వానికి తెరలేపారు. పవర్‌ బ్రోకర్లు పుట్టుకొచ్చారు. ప్రముఖులకు దేవుడిపై ఉన్న భక్తిని ఆసరాగా చేసుకొని వ్యక్తిగత పలుకుబడి పెంచుకున్నారు. మొత్తంగా తిరుమలను కలుషితం చేశారు. ఈ క్రమంలో పాలక మండలిలో సభ్యులుగా నియమితులవడానికి పోటీ పెరిగిపోయింది. శ్రీవెంకటేశ్వరుడిపై భక్తితో కాకుండా ఆ దేవదేవుడిని సొంత అవసరాలకు వాడుకోవడానికి ఎంతైనా ఇచ్చి పాలక మండలి సభ్యులుగా నియమితులు కావడానికి కొందరు ప్రయత్నించారు. బోర్డు సభ్యుడిగా నియమిస్తామంటే 20 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధం అనేవారు ఎందరో! గతంలో స్వామి వారిపై భక్తితో సేవ చేయడానికి బోర్డు సభ్యులుగా నియమితులు కావాలని కోరుకునేవారు. క్రమంగా టీటీడీ చైర్మన్‌ పదవి కూడా రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది.


గత ఐదేళ్లలో పరిస్థితి మరింత వికటించింది. స్వామివారి సేవను విస్మరించి అప్పటి ముఖ్యమంత్రి సేవలో కింది నుంచి పై వరకూ తరించిపోయారు. తిరుమలకు ఉన్న విశిష్టతను మంటగలిపారు. టీటీడీలో పనిచేస్తున్న సిబ్బందిలో భయం, భక్తి సన్నగిల్లింది. అవినీతి స్వైర విహారం చేసింది. దేవుడి సన్నిధిలో అవినీతికి పాల్పడటం మహాపాతకం అన్న పాపభీతి కూడా లేకుండా పోయింది. తన సమక్షంలో జరుగుతున్న అరాచకాలను చూస్తూ కూడా ఆ దేవదేవుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. తిరుమల కొండ సర్వ పాపాలకూ వేదికగా మారిపోయినా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎవరినీ శిక్షించకపోవడం ఏమిటి? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఆ దేవదేవుడిని భక్తి, నమ్మకంతో కాకుండా స్వార్థం కోసం వాడుకున్నారు. ఇంత కాలానికి పాపం పండింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కల్తీ నెయ్యితో ప్రసాదాలు చేయించే స్థాయికి దిగజారారు. ఈ దశలో నేను ఉన్నాను– అన్నీ చూస్తున్నాను అన్నట్టుగా ఆ దేవదేవుడే మేల్కొన్నాడు. ఆవు నెయ్యి కల్తీ జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చెవిన పడేట్టు చేశాడు. కల్తీ వ్యవహారం బయటపడగానే దేశ విదేశాలకు చెందిన భక్తులు మండిపడ్డారు. ఆవు నెయ్యిలో పంది కొవ్వు నుంచి తీసిన నూనె కలిపారని నిర్ధారణ కావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఉలిక్కిపడింది. ఇంతకాలంగా తాము జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యితో తయారుచేయించిన లడ్డూలను తిన్నామా! అని భక్తులు తీవ్ర మానసిక ఆవేదన చెందారు. ఈ మహాపాతకానికి పాల్పడిన వారిని కఠినాతికఠినంగా శిక్షించాల్సిందే.


మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం కూడా సీబీఐ విచారణకు వెంటనే అనుమతివ్వాలి. మార్కెట్‌ ధరలో సగం ధరకే నెయ్యి సరఫరా చేయడానికి ముందుకు వచ్చిన సంస్థలను అనుమానించకుండా వారికే టెండర్లను కట్టబెట్టిన వారందరినీ శిక్షించాలి. దేవుడిపై భక్తితో తాము సమర్పించే కానుకలను ఆదా చేయాల్సిందిగా భక్తులు ఎవరైనా కోరారా? తిరుమల లడ్డూ విశిష్టతను, పవిత్రతను కాపాడలేకపోయిన ప్రతి ఒక్కరినీ దోషులుగా నిర్ధారించాలి. మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయాలి. దేవాలయాల్లో కొనుగోళ్లకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాల రూపకల్పనకు ఒక కమిటీని నియమించాలి. ధర ఎక్కువైనా ప్రముఖ బ్రాండ్‌ కంపెనీల వస్తువులే మనం కొనుగోలు చేస్తాం కదా? అలాంటిది ఆ దేవదేవుడి లడ్డూ ప్రసాదం తయారీ విషయంలో రాజీపడాల్సిన అవసరం ఏమిటి? ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు? వారికి కలిగిన ప్రయోజనం ఏమిటో కూడా నిగ్గు తేల్చాలి. కల్తీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీని బ్లాక్‌ లిస్ట్‌ చేస్తున్నామని ప్రస్తుత ఈవో శ్యామలరావు చెప్పారు. బ్లాక్‌ లిస్ట్‌ చేయడం ఏమిటి? భక్తుల మనోభావాలతో ఆడుకున్న ఆ కంపెనీ యజమానిని కఠినంగా శిక్షించాలి కదా? కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన వివరణ, చేస్తున్న వాదన పేలవంగా ఉంది. సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తుండటంతో కల్తీ నెయ్యి వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చారని ఆయన వాదిస్తున్నారు. రాజకీయాలకు దేవుడిని వాడటం ఏమిటి? అని బోలెడు ఆశ్చర్యపోయారు. 2019కి ముందు పింక్‌ డైమండ్‌ పేరిట చేసిన రాజకీయాన్ని జగన్‌రెడ్డి మరచిపోతే ఎలా? శ్రీవారికి భక్తులు ఎప్పటి నుంచో సమర్పించిన కానుకల్లోని విలువైన వాటిని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తస్కరించుకుపోయారని, వాటిని కరకట్టపై ఉన్న ఆయన నివాసంలో దాచిపెట్టారని ఎంపీ విజయసాయిరెడ్డి అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేయలేదా? రమణదీక్షితులు వంటి వారు వంత పాడలేదా? ఇప్పుడు తత్వం బోధపడిన అదే రమణదీక్షితులు గత ఐదేళ్లుగా కొండపై జరిగిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని అంటున్నారు.


ఏ దేవుడు ఎంత పవర్‌ఫుల్‌?

మనుషుల్లో స్వార్థం పరాకాష్ఠకు చేరుకుంది. స్వార్థం కోసం దేవుళ్లను సృష్టించడం, ఆ దేవుళ్లను వాడుకోవడం అనాదిగా వస్తున్నదే. దేవుళ్లను మార్కెటింగ్‌ చేయడం కూడా మనుషుల స్వార్థ ఫలితమే. ఫలానా గుడిలోని దేవుడు చాలా పవర్‌ఫుల్‌ అని ప్రచారం చేయడం చూస్తున్నాం. దేవుడు ఫలానా చోటే ఎందుకు పవర్‌ఫుల్‌గా ఉంటాడు? దేవుడు సర్వాంతర్యామి అని కదా చెబుతారు? కొన్ని దేవాలయాలు వెలవెలబోతుంటాయి. మరికొన్ని దేవాలయాలు కళకళలాడుతుంటాయి. ఇదంతా మార్కెటింగ్‌ మహత్యమే. చిలుకూరు బాలాజీ దేవాలయాన్నే తీసుకుందాం. అక్కడకు వెళ్లే వారికి అమెరికా వీసాలు లభిస్తాయని ప్రచారం చేశారు. ఇంకేముందీ.. అమెరికాలో చదువుకోవాలనుకునేవారు, అక్కడ ఉద్యోగాలు చేయాలనుకొనేవారు చిలుకూరుకు క్యూ కట్టారు. వీసా దరఖాస్తులు ప్రాసెస్‌ చేయడం చిలుకూరు బాలాజీ టెంపుల్‌ పని కాదు కదా. మనుషుల బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి వాడే ట్రిక్కులు ఇవన్నీ. దేవుడిని నిజంగానే నమ్మేవారు కొందరైతే వారి నమ్మకంతో వ్యాపారం చేయాలనుకొనేవారు ఎందరో! మనలో చాలా మందికి దేవుడిపై నిజంగా నమ్మకం ఉండదు. భయం కారణంగా ఎందుకైనా మంచిదని ఓ దండం పెట్టుకుంటారు. దేవుడి సన్నిధిలో తీర్థ ప్రసాదాలను పెట్టి ఆ తర్వాత వాటిని మనం ఆరగిస్తాం. దేవుడు నిజంగానే తనకు భక్తులు సమర్పించిన తీర్థ ప్రసాదాలను ఆరగిస్తే మనం ఇంత ఉదారంగా వాటిని సమర్పించుకుంటామా? దేవుళ్లు వాటిని తినబోరన్న నమ్మకంతోనే విగ్రహాల ముందు పెడతాం. దేవుడి పేరు చెప్పి మనమే అవన్నీ ఆరగిస్తాం. మనిషి స్వార్థానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి?


శిక్ష పడాల్సిందే!

హిందువుల ఓట్లు దూరం కాకూడదన్న కారణంగానే శ్రీవెంకటేశ్వర స్వామిపై నమ్మకం లేకపోయినా జగన్మోహన్‌రెడ్డి కానీ, ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కానీ తిరుమల వెళ్లేవారు. రాజశేఖర రెడ్డి భార్య శ్రీమతి విజయలక్ష్మి గానీ, జగన్‌రెడ్డి భార్య భారతి గానీ ఎన్నడూ తిరుమల వెళ్లలేదే! దేవాలయాలను సందర్శించకూడదని బైబిల్‌లో ఎక్కడా చెప్పలేదే! మతం ఏదైనా దేవుడు దేవుడే అని నమ్మాలి కదా? హిందువులలో సహజంగానే సహనం ఎక్కువ. అందుకే ఆ దేవదేవుడి ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో చేశారని తెలిసినా మౌనంగా బాధపడ్డారు కానీ, అందుకు కారణమైన వారిని తరిమికొట్టే ప్రయత్నం చేయలేదు. అంతెందుకు, వినాయక నిమజ్జనం సందర్భంగా మద్యం తాగి నృత్యాలు చేస్తున్నా చూసి ఊరుకుంటున్నాం కదా! ఇలా మరే మతంలోనైనా జరగడాన్ని చూశామా? దేవుడైనా, దెయ్యమైనా మనుషులకు ఉపయోగపడేవరకే. మనుషులకు ఉపయోగపడకపోతే దేవుళ్లను కూడా పూజించరు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన విషయమై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఆవేదన ఎంత ఉందో రాజకీయం కూడా అంతే ఉంది. ఈ దెబ్బతో హిందువులు జగన్‌రెడ్డికి దూరమవుతారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు భావిస్తున్నారు. ఈ కారణంగా ఈ వివాదం ఇప్పటిలో సమసిపోదు. హిందువుల మనోభావాలను గమనించిన కేంద్ర మంత్రులు ఈ సంఘటనపై సహజంగానే స్పందించారు. ప్రస్తుతానికి హిందువుల దృష్టిలో జగన్‌రెడ్డి దోషి. రివర్స్‌ టెండరింగ్‌ విధానమంటూ పోలవరం ప్రాజెక్టుకు ఏ గతి పట్టించారో చూశాం. ఇప్పుడు అదే రివర్స్‌ టెండరింగ్‌ విధానంతో తిరుమల మహా ప్రసాదాన్ని కూడా కలుషితం చేశారు. ఇందుకు తగిన మూల్యాన్ని జగన్‌రెడ్డి చెల్లించుకోక తప్పదు. చంద్రబాబు వంద రోజుల పాలన వైఫల్యాల పుట్ట అని జగన్‌ అండ్‌ కో ప్రచారం చేస్తున్నారు గానీ, ఈ లడ్డూ వ్యవహారం వెలుగులోకి రావడంతో రాజకీయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పైచేయి సాధించారు.


ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగడానికి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. 175 మందికి గానూ 164 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారు. అంత భారీ మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వానికి వంద రోజుల పాలన అంటూ మార్కులు వేయాలని అనుకోవడం ఏమిటి? జగన్‌ చెబుతున్నట్టు ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉంటే తగిన సమయం కోసం వేచి ఉంటారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్‌రెడ్డిని ఎవరైనా ప్రశ్నించారా? నిలదీశారా? లేదే! ఎన్నికల వరకు ఆగి తమ తీర్పు ప్రకటించారు. వరదల్లో చిక్కుకున్న విజయవాడ ప్రజలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తన వయసును కూడా లెక్కచేయకుండా అహర్నిశలు కృషి చేయడాన్ని అందరూ ప్రశంసిస్తుండగా జగన్‌ అండ్‌ కోకు మాత్రం అక్కడ కూడా ప్రభుత్వ వైఫల్యమే కనిపిస్తోంది. ప్రభుత్వాల పనితీరుపై ఒక అంచనాకు రావడానికి కనీసం ఏడాది నుంచి రెండేళ్ల సమయాన్ని ప్రజలు తీసుకుంటారు. చంద్రబాబు ప్రభుత్వం జగన్‌రెడ్డికి నచ్చకపోయినా ఐదేళ్ల పాటు వేచి ఉండాల్సిందే కదా! జగన్‌రెడ్డి అరాచక పాలనను ప్రజలు ఐదేళ్లపాటు భరించారు కదా! తిరుమలలో అపచారం జరిగిందని ఆధారాలతో సహా వెల్లడైంది. ఉద్దేశపూర్వకంగా కల్తీ నెయ్యి కొనుగోలు చేసి ఉండకపోవచ్చు గానీ జరిగిన దానికి బాధ్యత తీసుకోవాలి. మార్కెట్‌ ధరతో పోల్చితే సగం ధరకే నెయ్యి సరఫరా చేస్తామన్న వారిని ఎలా నమ్మారు? ఇప్పుడు ఈ చర్యను సమర్థించుకుంటున్న జగన్‌రెడ్డి కానీ, వైవీ సుబ్బారెడ్డి కానీ తమ ఇంటి అవసరాలకు అంత తక్కువ ధరకు లభించే నెయ్యిని కొనుగోలు చేస్తారా? దేవుడనేవాడు ఉంటే తిరుమల కొండపై తప్పు చేసిన వారికి ఏదో ఒక రూపంలో శిక్ష పడుతుంది. లేని పక్షంలో దేవుడిపై భక్తి సంగతి అటుంచి కనీసం భయం కూడా లేకుండా పోతుంది. అదే జరిగితే మనుషులు మరింత విశృంఖలంగా వ్యవహరిస్తారు. భగవంతుడికి, భక్తుడికి మధ్య అనుసంధానంగా ఉండేది నమ్మకం. తనపై భక్తులకు ఉండే నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భగవంతుడిదే. తన పేరిట భక్తులకు అందజేసే లడ్డూ ప్రసాదాలను కల్తీ నెయ్యితో చేయించిన వారందరినీ ఏదో ఒక రూపంలో శిక్షించడానికి ఆ దేవదేవుడే పూనుకోవాలి. లేని పక్షంలో కొండ మీద కొలువైన శ్రీవెంకటేశ్వరుడిని కూడా అమ్మకానికి పెడతారు. చూద్దాం.. ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో? చివరకు ముగింపు ఎలా ఉండబోతున్నదో? దోషులకు ఏదో విధంగా శిక్ష పడితే గానీ భక్తులకు నమ్మకం పెరగదు.. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడు ఇవన్నీ వినకుండా, చూడకుండా ఉంటాడా!

ఆర్కే


rk.jpg

యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం

QR Code scanచేయండి

Updated Date - Sep 22 , 2024 | 06:15 AM