Share News

RK KOTHAPALUKU: మోదీ వేటకు విలవిల!

ABN , Publish Date - Mar 24 , 2024 | 02:15 AM

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను లిక్కర్‌ వ్యవహారంలో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తలపెట్టిన రాజసూయ యాగం ముగిసినట్టేనా? ఈ ప్రశ్నకు ఇప్పుడే ...

RK KOTHAPALUKU: మోదీ వేటకు విలవిల!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను లిక్కర్‌ వ్యవహారంలో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తలపెట్టిన రాజసూయ యాగం ముగిసినట్టేనా? ఈ ప్రశ్నకు ఇప్పుడే సమాధానం లభించదు. ఎందుకంటే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు కాషాయ ఏలుబడిలోకి రావాలన్న మోదీ సంకల్పం ఇంకా నెరవేరలేదు కనుక రాజసూయ యాగం సాగుతూనే ఉండవచ్చు. యూపీఏ హయాంలో అన్నా హజారేతో కలసి అవినీతి వ్యతిరేక ఉద్యమం నడిపిన కేజ్రీవాల్‌... ఇప్పుడు అవే అవినీతి ఆరోపణలపై అరెస్టవడం మోదీ మహిమే అని చెప్పవచ్చు. ఎవరు చేసుకున్న కర్మకు వారే బాధ్యులు అవడం అంటే ఇదే. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో చేరక ముందు ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ అధికారిగా పనిచేసిన కేజ్రీవాల్‌పై సర్వీస్‌లో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు లేవు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత కూడా ఆయనపై అవినీతి ఆరోపణలు లేవు. ఆమ్‌ ఆద్మీ పార్టీని ఇతర రాష్ర్టాలకు విస్తరించాలనుకున్న తర్వాతే ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. ‘ఢిల్లీ ఏం సరిపోతుంది. దేశాన్నే ఏలేద్దాం’ అని అనుకున్న కేజ్రీవాల్‌ తన పార్టీని పలు రాష్ర్టాలకు విస్తరించారు. మద్యం కేసులో స్వీకరించిన ముడుపుల మొత్తాన్ని పంజాబ్‌, గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని ఈడీ ఆరోపిస్తోంది.

పోరు వారిది.. ఫలం మోదీది!

ఢిల్లీ కేంద్రంగా 2011లో అన్నా హజారేతో కలసి చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం ఫలితంగా 2014లో యూపీఏ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. అప్పటి వరకు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి అవినీతి వ్యతిరేక ఉద్యమ ఫలితాలను తనకు అనుకూలంగా మలచుకొని ప్రధానమంత్రి అయ్యారు. అప్పట్లో తాము ఒక రాజకీయ పెను భూతానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన విషయం కేజ్రీవాల్‌కు గానీ, కాంగ్రెస్‌ పార్టీతో విభేదించిన ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులకు గానీ తెలియదు. 2014 తర్వాత కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడటంతో ప్రాంతీయ పార్టీల నాయకుల్లో రాజకీయ దురాశ పెరిగిపోయింది. అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు మమతా బెనర్జీ, నితీశ్‌ కుమార్‌, శరద్‌ పవార్‌, కేసీఆర్‌ వంటి వారు ప్రధానమంత్రి పదవిపై కన్నేశారు. తాము సారథ్యం వహిస్తున్న ప్రాంతీయ పార్టీలను పొరుగు రాష్ర్టాలకు విస్తరించారు. ఫలితంగా ఎన్డీయే వ్యతిరేక ఓటు చీలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా బలపడుతూ వచ్చారు. ప్రాంతీయ పార్టీలు ఈ దేశానికే అరిష్టం అని చెబుతూ వస్తున్న ప్రధాని మోదీ ముందుగా ప్రాంతీయ పార్టీల అధినేతల బలహీనతలపై దృష్టి కేంద్రీకరించారు. ఐటీ, సీబీఐ, ఈడీ వంటి సంస్థలకు చెందిన అధికారులను కిరాయి సైనికులుగా మార్చుకొని ప్రాంతీయ పార్టీల పైకి ఉసిగొల్పారు. ఫలితంగా అనేక మంది నాయకులు కేసుల్లో ఇరుక్కున్నారు. ప్రధాని మోదీని ఎదిరించడం అసాధ్యమని గుర్తించిన నాయకులు తమ సొంత రాష్ర్టాలకే పరిమితమై సామంత రాజులుగా మారిపోయి అధికారంలో కొనసాగగలుగుతున్నారు. ‘మాయాబజార్‌’ సినిమాలో ఘటోత్కచుడి సైన్యం ‘కోర్‌ కోర్‌ శరణు కోర్‌’ అని ప్రత్యర్థులను వేటాడినట్టుగా ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఇదే ఆశిస్తున్నారు. శరణు కోరిన వారు మాత్రమే రాజకీయాల్లో మనగలుగుతున్నారు. ప్రాంతీయ పార్టీల స్వయంకృతాపరాధమే ఇది. అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీకే పరిమితమై ఉన్నట్టయితే గోవా, పంజాబ్‌ ఎన్నికల సందర్భంగా మద్యం వ్యవహారంలో ముడుపులు తీసుకోవలసిన అవసరం ఉండేది కాదు కదా? ఢిల్లీని ఏలుకోమని ప్రజలు ఆశీర్వదిస్తే దేశాన్ని ఏలుతానని బయలుదేరి ఇప్పుడు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కొనితెచ్చుకున్నారు. ఆమ్‌ ఆద్మీ పోటీ చేయడం వల్ల అనేక రాష్ర్టాలలో ప్రతిపక్ష ఓట్లు చీలి బీజేపీ లాభపడింది. ప్రతిపక్షాల అనైక్యత, రాజకీయ దురాశ వల్ల రాజకీయంగా పెనుభూతంగా మారిన ప్రధాని మోదీని ఇప్పుడు అందరూ ఏకమైనా కదిలించలేని పరిస్థితి. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్నటి వరకు ఎగిరెగిరి పడ్డారు. ప్రధానమంత్రి అయిపోదామని కలలుగన్నారు. స్వరాష్ట్రంలో ఎదురు ఉండకూడదని వామపక్ష కూటమిని దెబ్బతీశారు. అయితే, అప్పుడు ఆమెకు తెలియదు– తన చర్య వల్ల ఏర్పడిన శూన్యాన్ని ప్రధాని మోదీ తన పార్టీకి అనుకూలంగా మార్చుకుంటారని! తత్వం బోధపడే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు కనీసం సొంత రాష్ట్రంలో అయినా అధికారంలో కొనసాగాలంటే నరేంద్ర మోదీ అనే రాజకీయ పెనుభూతానికి తల వొంచక తప్పదని గుర్తించారు. ఈ కారణంగానే ఇండియా కూటమి గురించి ఆమె ఇప్పుడు పెద్దగా మాట్లాడటం లేదు. అంతకు ముందు ఆమె ఢిల్లీలో తరచూ హడావిడి చేయడాన్ని చూశాం. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కూడా ప్రధానమంత్రి కావాలని కలలు కన్నవారే. అయితే, ఆయనకు ముందుగానే జ్ఞానోదయమై ఇండియా కూటమి నుంచి తప్పుకొని బీజేపీతో కలసి మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా....

తెలుగు రాష్ర్టాల విషయానికి వస్తే, 2019కి ముందు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలిపి... ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేసి, ఆ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు. ఫలితంగా రాష్ట్రం ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేతుల్లోకి వెళ్లి విలవిల్లాడుతోంది. తత్వం బోధపడిన చంద్రబాబు మరోమారు ప్రధాని మోదీని ఆశ్రయించారు. మోదీని ధిక్కరిస్తే ఏం జరుగుతుందో గ్రహించడం వల్లనే చంద్రబాబు తనను తాను తగ్గించుకొని ఎన్డీయేతో జట్టు కట్టారు. కేంద్రం శక్తి ఏమిటో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తెలుసుకున్న జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రధాని మోదీ పట్ల వినయ విధేయతలు ప్రదర్శిస్తూనే ఉన్నారు. బెయిలు కోసం అప్పుడు అధికారంలో ఉన్న సోనియా గాంధీ వద్దకు కుటుంబ సభ్యులను పంపి కాళ్ల బేరానికి దిగిన చరిత్ర జగన్‌ది. దాని ఫలితమే అవినీతి కేసులలో జగన్‌పై విచారణ కూడా జరగని పరిస్థితి. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాశ్‌ రెడ్డిని అరెస్టు చేయలేని పరిస్థితిలో సీబీఐ ఉందంటే, పైవాడి ఆశీస్సులు లేకుండా సాధ్యమా? నరేంద్ర మోదీ ఎంతటి ప్రమాదకర రాజకీయ నాయకుడో గుర్తించగలిగినవారు ఆయన పట్ల విధేయత ప్రదర్శిస్తూ రాజకీయం చేసుకోగలుగుతున్నారు. ధిక్కరించిన వారు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రధాని వద్ద చంద్రబాబు సాగిలపడ్డారని నిందించి ప్రయోజనం ఏమిటి? ధిక్కరిస్తే ఏం జరుగుతుందో తెలుసు కనుకే చంద్రబాబు రాజీపడిపోయారు. జగన్‌రెడ్డిపై నమోదైన కేసులతో పోల్చితే అరవింద్‌ కేజ్రీవాల్‌పై పెట్టిన కేసు ఏ పాటిది? లిక్కర్‌ వ్యవహారంలో చేతులు మారిన మొత్తం వంద కోట్లని ఈడీ అధికారులే చెబుతున్నారు. వేల కోట్ల అవినీతితో పోల్చితే వంద కోట్లు ఏ మూలకు? అవినీతికి పాల్పడాలనుకున్నా అనుభవం కూడా కావాలి. ఆ అనుభవం లేనందువల్ల కాబోలు కేజ్రీవాల్‌ దొరికిపోయారు.

కేసీఆర్‌, పవార్‌... మరికొందరు

ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విషయానికి వద్దాం! తెలంగాణను ఉద్ధరించమని ప్రజలు ఆయనకు రెండో పర్యాయం కూడా అధికారం కట్టబెడితే జాతీయ రాజకీయాలు అంటూ గాల్లో మేడలు కట్టారు. మహారాష్ట్రలో జెండా పాతాలనుకుంటే సొంత రాష్ట్రంలోనే ప్రజలు ఆయన గులాబీ జెండాను పీకేశారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్‌ కేసులో కుమార్తె కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసి తీసుకెళ్లినా నోరు కూడా విప్పలేని పరిస్థితిలో కేసీఆర్‌ ఉన్నారు. ఒకప్పుడు మోదీపై కత్తులు దూసిన కేసీఆర్‌ ఇప్పుడు సొంత పార్టీని కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మహారాష్ట్రలో ప్రధానమంత్రి మోదీతో విభేదించిన శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రే అధికారంతోపాటు సొంత పార్టీని కూడా కోల్పోయారు. ఏక్‌నాథ్‌ షిండేను ప్రోత్సహించిన బీజేపీ పెద్దలు శివసేనను చీల్చి ఉద్దవ్‌ ఠాక్రేను బలహీనుడ్ని చేశారు. మరో వృద్ద నేత శరద్‌ పవార్‌ పరిస్థితి కూడా ఇదే. ఆయన ప్రారంభించిన ఎన్సీపీ కూడా చీలిపోయింది. పార్టీ గుర్తును కూడా శరద్‌ పవార్‌ కోల్పోయారు. గడచిన దశాబ్దకాలంగా దేశంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే, భారతీయ జనతా పార్టీతో తీవ్రంగా విభేదించినవారే కాదు– అతిగా అంటకాగినవారు కూడా బతికి బట్ట కట్టలేని పరిస్థితి. ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ వంటి వారు జాతీయ రాజకీయాల జోలికి పోకుండా ఉన్నందునే కడుపులో నీళ్లు కదలకుండా అధికారంలో కొనసాగగలుగుతున్నారు. మమతా బెనర్జీ వంటి వారు రాజీ పడిపోవడం వల్లనే కేసుల బెడద లేకుండా మనగలుగుతున్నారు. ఇండియా కూటమిలో మిగిలిన బలమైన నాయకుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఒక్కరే. ఆ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్లే ఆయన కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. ఫలితంగా తమిళనాడు మంత్రులపై కేసులు నమోదవుతున్నాయి. ఈ ఎన్నికల తర్వాత కూడా స్టాలిన్‌ ఇదే విధంగా ప్రధాని మోదీని వ్యతిరేకించి నిలబడతారని చెప్పలేం. ఒకప్పుడు తమిళనాట ఎంజీ రామచంద్రన్‌, కరుణానిధి కేంద్ర ప్రభుత్వాలను ధిక్కరించి అధికారం కోల్పోయారు. అప్పుడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ శక్తిని తట్టుకోలేక చివరకు రాజీ పడిపోయారు. అప్పటి నుంచి ద్రవిడ పార్టీలు కేంద్రంతో సఖ్యతగా మెలుగుతున్నాయి.


కేసీఆర్‌కు కష్టకాలం

మద్యం కేసులో కవిత అరెస్టయిన తర్వాత కేంద్ర పెద్దలతో సంధి కుదుర్చుకోవడానికి కేసీఆర్‌ అండ్‌ కో ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్ర పెద్దలు సందు ఇవ్వలేదు. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ గాలి వీస్తోందని ప్రధాని మోదీ నమ్ముతున్నారు. ఈ కారణంగానే భారత రాష్ట్ర సమితి నుంచి వస్తున్న పొత్తు ప్రతిపాదనలను కూడా తిరస్కరిస్తున్నారు. ప్రాంతీయ పార్టీల సంహారం అనే రాజసూయ యాగం నుంచి ప్రస్తుతానికి తప్పించుకున్న పార్టీల పరిస్థితి తాజాగా జరగనున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రధాని మోదీ అనే రాజకీయ పెనుభూతం నుంచి ఎవరికైనా తాత్కాలిక రక్షణ మాత్రమే లభిస్తుంది. పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయన్న నమ్మకం కుదిరాక మిగిలిన పార్టీలను కూడా మింగేస్తారు. యావత్‌ భారతావని కాషాయ దళం ఏలుబడిలోకి వచ్చేవరకు ప్రధానమంత్రి విశ్రమించక పోవచ్చు. సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం ఏ స్థితిలో ఉందో చూస్తున్నాం. ఆ పార్టీ ఖాతాలో ఉన్న నిధులను ఆదాయం పన్ను శాఖ స్తంభింపజేసింది. నిబంధనల ప్రకారం పదేళ్ల క్రితం వ్యవహారాల్లో తదుపరి చర్యలు తీసుకోవడానికి ఐటీ శాఖకు అధికారం ఉండదు. అయినప్పటికీ పదిహేను సంవత్సరాల క్రితం కేసును తిరగదోడి కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలను స్తంభింపజేశారు. ఈ వివరాల్లోకి వెళ్లడానికి తీరిక లేని న్యాయస్థానాలు కూడా కాంగ్రెస్‌ పార్టీకి ఉపశమనం ఇవ్వడం లేదు. 2024 తర్వాత దేశంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తెలిసిపోతోంది. స్వతంత్రంగా పనిచేసే వ్యవస్థల కోసం వెతుక్కోవాల్సిందే! ప్రధానమంత్రి మోదీ ప్రస్తుతానికి మహా శక్తిమంతుడు కావొచ్చు. కానీ ఆయనకంటే ప్రకృతి మరింత శక్తిమంతమైనది. సమతుల్యం కోసం ప్రకృతి కల్పించుకుంటుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తిరుగులేని శక్తిగా కనిపించవచ్చు. అయితే ఆ పార్టీ పునాదులు బలహీనపడుతున్నాయి. అది కూడా ప్రధాని మోదీ చర్యల వల్లే. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీని కను సైగలతో శాసించిన ఇందిరాగాంధీ... రాష్ర్టాలలో బలమైన నాయకులను అణచివేశారు. తోలు బొమ్మలను తెరపైకి తీసుకొచ్చి ముఖ్యమంత్రులను చేశారు. ఆమెను ఎదిరించగల నాయకుడే కనిపించలేదు. రాజీవ్‌గాంధీ కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. యూపీఏ హయాంలో కూడా ఇలాగే జరిగింది. ఫలితంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బలమైన నాయకులు పార్టీని వదిలిపెట్టి సొంత పార్టీలు పెట్టుకున్నారు. మమతా బెనర్జీ, పీఏ సంగ్మా, శరద్‌ పవార్‌ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. బలమైన నాయకులను దూరం చేసుకోవడం వల్లనే కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుత దుస్థితి దాపురించింది. నాటి ఇందిరా గాంధీ బాటలోనే ప్రస్తుత ప్రధాని మోదీ కూడా నడుస్తున్నారు. బలమైన నాయకులను పక్కన పెట్టి అసమర్థులను, బలహీనులను ముఖ్యమంత్రులను చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ఇదే జరిగింది. ప్రతిపక్షాలే వణికిపోతున్న మోదీ అనే పెనుభూతాన్ని బీజేపీ నాయకులు మాత్రం ఎలా ఎదిరించగలరు? ఇందిరాగాంధీ లేకపోతే కాంగ్రెస్‌ లేదు అనే భావన ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అదే విధంగా నరేంద్ర మోదీ లేకపోతే భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వ్యక్తి ఆరాధన పెరిగిన ఏ పార్టీలోనైనా ఇదే పరిస్థితి ఉంటుంది. ‘అబ్‌ కీ బార్‌ మోదీ సర్కార్‌’ అని నినదిస్తున్నారేగానీ బీజేపీ సర్కార్‌ అని అనడంలేదు. మోదీ రూపంలో ప్రస్తుతం బీజేపీకి లభిస్తున్న బలమే దీర్ఘకాలంలో ఆ పార్టీకి బలహీనత అవుతుంది. రాష్ర్టాలలో బలహీనమైన నాయకులను అందలం ఎక్కించడం వల్ల కాంగ్రెస్‌కు పట్టిన దుర్గతే భవిష్యత్తులో బీజేపీకి కూడా పట్టవచ్చు.

చట్టబద్ధంగా ‘కమీషన్లు’

తల ఎగరేస్తున్న ప్రతిపక్ష నాయకులు నరేంద్ర మోదీ అధికార బలానికి సమిధలు కావడానికి కారణం రాజకీయాలలో డబ్బు ప్రభావం పెరిగిపోవడమే. కంపెనీలు, వ్యక్తులకు మేళ్లు చేసి ప్రతిఫలం పొందడంలో ఏ రాజకీయ పార్టీ కూడా మినహాయింపు కాదు. రాజకీయ పార్టీలకు అందుతున్న ముడుపులు ఒక్కో దశలో ఒక్కో రూపంలో ఉంటున్నాయి. అధికారంలో ఉన్న వారితో సఖ్యతగా ఉండటం కోసం ఒకప్పుడు విరాళాలు ఇచ్చేవారు. ఆ తర్వాత కాలంలో ప్రభుత్వం నుంచి మేళ్లు పొందేందుకు పర్సెంటేజ్‌లు ఇవ్వడం మొదలైంది. కాంట్రాక్టులు దక్కాలంటే 8 నుంచి 15 శాతం వరకు కమీషన్‌ తీసుకోవడం ఇప్పుడు సర్వసాధారణం అయింది. ఎలక్టోరల్‌ బాండ్స్‌ అని ఇప్పుడు కొత్తగా వచ్చాయి. సుప్రీంకోర్టు పుణ్యమా అని ఏయే పార్టీకి ఏయే కంపెనీలు బాండ్లు కొని ఇచ్చాయో తెలిసిపోయింది. ఈ బాండ్ల వ్యవహారమంతా చట్టబద్ధంగా సాగించిన కమీషన్ల బాగోతమే. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన కంపెనీలే బాండ్లు కొని సమర్పించుకున్నాయి. విచిత్రం ఏమిటంటే అదానీ గ్రూప్‌ మాత్రం బాండ్లు కొన్నట్టు ఎక్కడా వివరాలు లేవు. నిజంగా ఇది ఎనిమిదో వింతే. గత పదేళ్లలో అదానీ ఎంతలా విస్తరించారో మనం చూశాం. ఎయిర్‌ పోర్టులు, పోర్టులు అదానీ గుత్తాధిపత్యంలోకి వచ్చాయి. ఇతర సంస్థలు నెలకొల్పిన పోర్టులు, ఎయిర్‌ పోర్టులు చేతులు మారడానికి ముందు ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఐటీ, సీబీఐ, ఈడీ వంటి సంస్థలు ఎటువంటి పాత్ర పోషించాయో చూశాం. అయినా ఎలక్టోరల్‌ బాండ్లు కొనే అవసరం అదానీకి ఏర్పడకపోవడం ఆశ్చర్యంగా ఉంది. మిగతా కంపెనీలకు భిన్నంగా అదానీ గ్రూపు ఎలా తప్పించుకున్నదో మిస్టరీయే. తెర వెనుక ఏం జరిగిందో తెలియాల్సి ఉంది. ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారాన్ని తరచి చూస్తే వీటి వెనుక క్విడ్‌ ప్రో కో ఉన్నట్టు అర్థమవుతుంది. ప్రభుత్వాల నుంచి మేళ్లు పొందిన కంపెనీలు అన్నీ దాదాపుగా బాండ్లు కొన్నాయి. ప్రతిపక్షాల నోళ్లు మూయించేందుకు వాటికి కూడా కొన్ని బాండ్లు కొనిచ్చాయి. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఈ బాండ్లు ప్రవేశపెట్టారు. ఎన్నికల కమిషన్‌కు అందిన వివరాల ప్రకారం మొత్తం బాండ్ల విలువలో 50 శాతం వరకు భారతీయ జనతా పార్టీ ఖాతాలోనే జమయ్యాయి. అటు కేంద్రంలో, ఇటు అనేక రాష్ర్టాలలో అధికారంలో ఉన్నందువల్లే ఎలక్టోరల్‌ బాండ్లలో బీజేపీకి సింహభాగం దక్కాయి. పార్టీల మీద అభిమానంతో మాత్రమే ఆయా కంపెనీలు ఈ బాండ్లు కొని సమర్పించుకున్నాయని చెప్పడం బూతు అవుతుంది. ఈ బాండ్ల బాగోతాన్ని లోతుగా విశ్లేషిస్తే అసలు బాగోతం బయటపడుతుంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఒక సందర్భంలో వ్యాఖ్యానిస్తూ, ఈ బాండ్ల వివరాలు బయటకొస్తే ప్రతిపక్షాల బండారం కూడా బయటపడుతుంది అన్నారు. ‘మీలో పాపం చేయని వారు ఎవరో చెప్పండి?’ అని ఏదో సినిమాలో పాటలో ప్రశ్నించినట్టుగా మన దేశంలో రాజకీయ పార్టీలన్నీ ప్రైవేట్‌ కంపెనీలు ఇచ్చే ముడుపులపై ఆధారపడి బతుకుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మాత్రం అవినీతికి మినహాయింపు అని చెప్పుకోవడం అతిశయోక్తి అవుతుంది. ఆ పార్టీ కూడా ప్రైవేటు సంస్థలకు మేళ్లు చేసి ఉండాలి. లేదా సదరు కంపెనీలు అంతకు ముందు చేసిన పాపాలకు శిక్ష పడకూడదనుకుంటే బాండ్లు కొనైనా ఇచ్చి ఉండాలి. దర్యాప్తు ఏజెన్సీలను చూపెట్టి బాండ్లు వసూలు చేసుకోవడం కూడా అవినీతికి మరో రూపమే. తళతళ మెరిసే నరేంద్ర మోదీ దుస్తుల్ని చూపించి, అవినీతి మరక లేని ప్రధాని అని గొప్పలు చెప్పుకొంటే సరిపోదు. పార్టీయే ప్రధాని – ప్రధానే పార్టీ అయిన చోట ఆ మరకల నుంచి మోదీకి మినహాయింపు ఉండబోదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మాత్రమే తప్పు చేశారని చెప్పడం ఆత్మవంచనే అవుతుంది. బాండ్ల వివరాలు బయటకు వచ్చాక అందరూ అందరే అని స్పష్టం అవుతోంది. అయితే కేంద్రానికి కొరకరాని కొయ్యగా మారిన వారే కేసుల్లో ఇరుక్కుంటున్నారు. లిక్కర్‌ వ్యాపారుల నుంచి ముడుపులు తీసుకోని ముఖ్యమంత్రులు ఉన్నారని చెప్పగలరా? ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక, మద్యం వ్యాపారాల్లో ఏం జరుగుతోందో కేంద్రానికి తెలియదా? కాకపోతే జగన్‌రెడ్డి తమకు విధేయుడిగా ఉన్నారు కనుక ఏజెన్సీల దాడుల నుంచి మినహాయింపు లభిస్తోంది. కేజ్రీవాల్‌ కూడా ఇండియా కూటమిలో చేరకుండా ఎన్డీయేతో జట్టు కట్టి ఉంటే ఇప్పుడు జైలుకు వెళ్లాల్సి వచ్చేది కాదు. ఈ పరిస్థితులలో ఈ దేశ రాజకీయాల్లో మనగలగాలంటే ప్రధాని మోదీ ఆధిపత్యానికి తలొగ్గి పరిమిత స్థాయిలో రాజకీయం చేసుకోవాలి. అలా కాకుండా అన్ని రాష్ర్టాలకూ విస్తరించాలనుకుంటే కేజ్రీవాల్‌కు పట్టిన గతే పడుతుంది. ధిక్కరించిన వారిని మోదీ అనే పెనుభూతం వదలదు. తస్మాత్‌ జాగ్రత్త!

ఆర్కే

Updated Date - Mar 24 , 2024 | 06:48 AM