Kotha Paluku: కత్తి మీద సామే!
ABN , Publish Date - Jun 23 , 2024 | 06:00 AM
ఇల్లు అలకగానే పండగ వచ్చినట్లు కాదని అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రజాస్వామ్యంలో పాలకులు
ఇల్లు అలకగానే పండగ వచ్చినట్లు కాదని అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రజాస్వామ్యంలో పాలకులు ఎలా ఉండకూడదో మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అండ్ కో రుజువు చేసినందున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారు బాధ్యతతో మెలగాలి. జగన్‌కు వ్యతిరేకంగా ప్రజలు కసిగా తీర్పు ఇచ్చినందున ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రుల వ్యవహార శైలిని ప్రజలు నిశితంగా గమనిస్తుంటారు. అధికారం బాధ్యత మాత్రమే అని తెలుసుకుంటే మంచిది. తమకు 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయో గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి అధికారంలో ఉన్నప్పుడు ఉన్మాదంగా వ్యవహరించిన జగన్ అండ్ కో సిద్ధపడడం లేదు. కనుక వారి విషయం ప్రజలే తేల్చుకుంటారు. శాసనసభలో దారుణంగా అవమానంపాలైన చంద్రబాబు.. శాసనసభను బహిష్కరించి ముఖ్యమంత్రిగానే మళ్లీ సభలో అడుగుపెడతానన్న తన శపథాన్ని నెరవేర్చుకున్నారు. నాటి ఆయన ధర్మాగ్రహాన్ని ప్రజలు అర్థం చేసుకుని దీవించారు. 1989 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నన్నపనేని రాజకుమారి తనను మాటలతో కించపరిచారన్న కారణంగా ఎన్టీరామారావు కూడా అప్పట్లో శాసనసభను బహిష్కరించారు. ఆ తర్వాత 1994లో భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్.. ముఖ్యమంత్రిగానే సభలో అడుగిడారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు. ఇప్పడు మళ్లీ ఇంతకాలానికి జగన్‌రెడ్డికి కూడా ప్రతిపక్ష నాయకుడి హోదా లభించలేదు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విర్రవీగకుండా శాసనసభ్యుల ప్రమాణస్వీకారం సందర్భంగా జగన్మోహన్‌రెడ్డికి సముచిత గౌరవం కల్పించారు. కానీ జగన్ రోత మీడియా మాత్రం ఆయనను అవమానించారంటూ వార్తలు వండి వార్చి తన బుద్ధి పోనిచ్చుకోలేదు. తనకు తగిన గౌరవం ఇచ్చినా జగన్ మాత్రం హుందాగా వ్యవహరించలేకపోయారు. శాసనసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన వెంటనే సభలో కూర్చోకుండా వెళ్లిపోయారు. ఎన్నికల్లో తన ఓటమిని ఊహించని జగన్మోహన్‌రెడ్డి, ఇప్పటికీ ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని ఆయన తన మనుషులకు చెప్పుకొంటూ మానసిక ఆనందం పొందుతున్నారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. 2024 ఎన్నికల్లో 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన కూటమిని ఓడించడం రాజకీయంగా అసాధ్యం కాదు గానీ తన ఈ ఘోర పరాభవానికి కారణం ఏమిటో ఆయన తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడమే ఆశ్చర్యంగా ఉంది.
జగన్ విపరీత మనస్తత్వం!
రాజకీయాలలో ఆత్మవిమర్శ చేసుకుని ముందుకుసాగినవాడే కింద పడినా పైకి లేవగలడు. జగన్మోహన్‌రెడ్డిది విపరీత మనస్తత్వం అని గతంలో అనేక పర్యాయాలు చెప్పుకొన్నాం. ఆయనలో సాధారణ లక్షణాలు ఉండివుంటే తన నివాసం కోసం రుషికొండపై 550 కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి మాయామహల్ నిర్మించుకొని ఉండేవారు కాదు. ఆ భవనాన్ని సొంత డబ్బుతో నిర్మించుకొని ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. జనం సొమ్ముతో విలాసంగా బతకడానికి మనం రాచరిక వ్యవస్థలో లేం కదా? తాడేపల్లి ప్యాలెస్ వద్ద నాలుగు వైపులా కాంపౌండ్ వాల్‌పై 30 అడుగుల ఎత్తులో గ్రిల్ నిర్మించుకోవడాన్ని ఎవరైనా ఎలా జీర్ణించుకోగలరు? ఒక ముఖ్యమంత్రి రక్షణకు 30 అడుగుల ఎత్తులో గ్రిల్ నిర్మించుకోవడం విపరీత మనస్తత్వానికి నిదర్శనం కాదా? ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు ఎందుకొస్తాయో తెలియదు! జగన్ మానసిక పరిస్థితిపై మానసిక వైద్యులు పరిశోధనలు చేయవలసిన అవసరం ఉంది. తాను నివసించినా నివసించకపోయినా ఊరికో ప్యాలెస్ నిర్మించుకోవడం జగన్‌రెడ్డి నైజం. పూర్వం రాజులు మాత్రమే ఇలా వేసవి, శీతాకాల విడిది కోసం ప్యాలెస్‌లు నిర్మించుకున్నారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచిందన్నట్టుగా రుషికొండపై ముచ్చటపడి కట్టించుకున్న ప్యాలెస్‌లోకి అడుగుపెట్టకుండానే జగన్ అధికారం కోల్పోయారు. హైదరాబాద్, బెంగళూరుల్లో సొంత డబ్బుతో ప్యాలెస్‌లు నిర్మించుకున్నందున అప్పుడు ప్రజలు పట్టించుకోలేదు. ప్రజల సొమ్ముతో రుషికొండపై ప్యాలెస్ నిర్మించినందునే ఆయన బాధ్యత తీసుకోవాలి. తాడేపల్లిలో 30 అడుగుల ఎత్తులో గ్రిల్‌ను నిర్మించుకున్నారంటే ఆయన ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారని భావించాల్సి ఉంటుందని అంటున్నారు. కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించి అంతెత్తున గ్రిల్ నిర్మించడానికి అధికారులు ఏ నిబంధన కింద అనుమతించారో తెలియదు. మిలటరీ పాలకులు కూడా ఇలాంటి శత్రు దుర్భేద్యాలను నిర్మించుకోరు. కొంత మందిలో విపరీత పోకడలు ఉంటాయి. బంగారంపై మోజుతో కొంత మంది పది నుంచి పదిహేను కిలోల బంగారు నగలను ఒంటిపై వేసుకొని తిరగడం చూశాం. అది ప్రైవేటు వ్యవహారం కనుక మనం వారి గురించి కాసేపు మాట్లాడుకొని మరచిపోతాం. జగన్మోహన్‌రెడ్డికి బంగారంపై మోజు లేదు. తనతో పాటు తన భార్య కూడా ఆడంబరంగా కనపడకూడదని కోరుకునేవారు. అయితే రాచరిక నియంతృత్వ పోకడలను మాత్రం అణచుకోలేకపోయారు. ఫలితంగా ప్రజల తిరస్కారానికి గురయ్యారు.
వ్యవస్థ సర్వభ్రష్టత్వం!
రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత అప్పట్లో పరిస్థితులు ఎలా ఉండేవో అధికారులు నోరు విప్పి చెప్పడం మొదలుపెట్టారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అయివుండి కూడా ఇంతగా ఎందుకు దిగజారిపోయారని ప్రశ్నించగా, ‘‘జగన్ పాలనలో ఒక రకమైన భయానక వాతావరణం ఉండింది. మనసులో మాట చెప్పుకోవడానికి కూడా సాహసించలేకపోయాం. భయం గుప్పిట్లో బతికాం. అందుకే మనసు చంపుకొని పనిచేశాం’’ అని కొంత మంది అధికారులు చెబుతున్నారు. మొత్తమ్మీద జగన్మోహన్‌రెడ్డితో పాటు ఆయన కోటరీలో ఉన్న వారి విపరీత మనస్తత్వాల వల్ల అధికార యంత్రాంగం కుళ్లిపోయింది. తెలంగాణలో కూడా అధికార వ్యవస్థ భ్రష్టుపట్టి పోయింది. ప్రగతిభవన్ పేరిట ప్యాలెస్‌ను పోలిన భవనాన్ని నిర్మింపజేసి అందులో నుంచి కాలు బయటపెట్టకుండా కనుసైగలతో రాష్ర్టాన్ని పాలించిన కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఇది జరిగిన తర్వాత కూడా జగన్ అండ్ కో జాగ్రత్తపడలేదు. అధికారులు కూడా తమ ధోరణి మార్చుకోలేదు. బటన్లు నొక్కుతున్నందున జగన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారని నమ్మి అడ్డగోలు పనులు చేశారు. ఈ నేపథ్యంలో కుళ్లిపోయిన అధికార యంత్రాంగంతోనే పని చేయించుకోవల్సి రావడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కత్తి మీద సాము వంటిదే. ఏ అధికారి ఎంతగా చెడిపోయిందీ తెలుసుకోవడానికి స్కానర్లు లేవు కదా! అందుకే అధికారుల ఎంపికలో కొన్ని తప్పులు జరిగాయి. అయితే చంద్రబాబుకు ఆప్షన్లు తక్కువ. గతంలో సమర్థులుగా పేరు తెచ్చుకున్న అధికారులు కూడా ఈ ఐదేళ్లలో చెడిపోయారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, చేసిన ఎంపికలపై తెలుగు తమ్ముళ్లు నిరసన వ్యక్తంచేస్తున్నారు. జగన్మోహన్‌రెడ్డి సృష్టించిన సంప్రదాయం ఆమోదయోగ్యం కాకపోయినా చంద్రబాబు కూడా అలాగే వ్యవహరించాలని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. జగన్ తరహాలోనే పాలించే పక్షంలో ప్రభుత్వం మారడం ఎందుకు? జగన్‌ను జనం కసిగా ఎందుకు ఓడించారో తెలుసుకోవడానికి కూడా తెలుగు తమ్ముళ్లు అంగీకరించడం లేదు. రాజకీయాల్లో ఈ ఐదేళ్లూ ప్రత్యేక అధ్యాయం అని చెప్పవచ్చు. గ్రామ స్థాయి కార్యకర్త నుంచి చంద్రబాబు వరకు అందరూ ప్రభుత్వ వేధింపులకు గురయ్యారు. అయితే కొంత మంది నాయకుల వలె తలవొంచి రాజీ పడకుండా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రతి కార్యకర్తా తాజా విజయంలో తమ వాటా ఉందని భావిస్తున్నారు. తమకు ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకుంటూ పగ తీర్చుకోవాలని రగిలిపోతున్నారు. దీనికితోడు గుడివాడలో ఇంతవరకు ఓటమి తెలియని కొడాలి నాని వంటి వారు ఇప్పుడు ఘోర పరాజయం పాలయ్యాక కూడా గుణపాఠం నేర్చుకోకుండా నోటికి పని చెబుతున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు చంద్రబాబును టార్గెట్‌గా చేసుకొని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. లోకేశ్ చెబుతూ వచ్చిన రెడ్‌బుక్‌ను మడచి పెట్టుకొమ్మని పరుషంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్‌రెడ్డి వలె కక్షపూరిత పాలన చేయాలనుకోవడం సమర్థనీయం కాదు. అదే జరిగితే రాష్ట్రం మొత్తం ఫ్యాక్షన్ జోన్‌గా మారిపోతుంది. అదే సమయంలో మితిమీరిన ఉదారత్వం కూడా ప్రదర్శించకూడదు. తప్పు చేసిన అధికారులను, నాయకులను చట్టప్రకారం శిక్షించడానికి చర్యలు తీసుకోవలసిందే. కంటికి కన్నూ పంటికి పన్నూ ప్రజాస్వామ్యంలో చెల్లదు.
..అలా చేస్తే తేడా ఏముంది?
వివేకానంద రెడ్డిని హత్య చేయించిన వారిని ముఖ్యమంత్రిగా జగన్ రక్షించారని ప్రజలు నమ్మారు. అందుకే ఆయన సొంత జిల్లా కడపలో కూడా మూడే స్థానాలు వచ్చాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు కూడా చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా ఆరేడు వేల స్వల్ప మెజారిటీతో గెలిచారు. కూటమి నేతలు అభ్యర్థుల ఎంపికతో పాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే జగన్మోహన్‌రెడ్డికి పదకొండు అసెంబ్లీ సీట్లు, నాలుగు లోక్‌సభ సీట్లు కూడా వచ్చివుండేవి కావు. అసెంబ్లీలో ఐదారు సీట్లే వచ్చి వుండేవి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోవడం శ్రేయస్కరం కాదు. అయితే జగన్ అండ్ కో పోకడల కారణంగానే ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారు. ఇంత జరిగినా జగన్ అండ్ కో వైఖరిలో కించిత్ మార్పు కూడా రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్‌రెడ్డి వాడుతున్న ఫర్నిచర్ విలువ ఎంతో చెబితే డబ్బులు ముఖాన పడేస్తామని కొడాలి నాని వంటి వారు నోరు పారేసుకోవడం ఏమిటి? ఇవ్వడానికి మీరెవరు? తీసుకోవడానికి చంద్రబాబు ఎవరు? అది ప్రభుత్వ ఆస్తి. గతంలో ఓడిపోయిన మంత్రులు తమ ఇళ్లలోని ఫర్నిచర్‌ను ప్రభుత్వానికి అప్పగించేవారు. ప్రభుత్వ వాహనాలను ఇంట్లో పిల్లలు స్కూలుకు వెళ్లడానికి లేదా సొంత అవసరాలకు వాడుకోవడాన్ని నైతికంగా నేరంగా ఒకప్పుడు పరిగణించేవారు. ఇప్పుడు ఇంత సున్నితంగా ఆలోచించేవారు ఎక్కడ? కొడాలి నాని వంటి వారు గతంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావును ఇదే ఫర్నిచర్ పేరిట వేధించినప్పుడు నోరు ఎందుకు విప్పలేదు? అప్పుడు ఆయన కూడా ఫర్నిచర్ విలువ చెల్లిస్తానని చెప్పినా కూడా వినకుండా వేధించారు. విలువ కట్టడం ఎందుకు? వాడుకున్న ఫర్నిచర్‌ను స్వాధీనం చేయవచ్చు కదా? ప్రస్తుతానికి చంద్రబాబు హుందాగానే వ్యవహరిస్తున్నారు. నాడు నిండు సభలో నన్ను అవమానించారు కనుక ఇప్పుడు నేను నిన్ను అవమానిస్తానని చంద్రబాబు భావిస్తే ఆయనకు, జగన్మోహన్‌రెడ్డికీ తేడా ఏముంటుంది? శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్ సభా కార్యక్రమాల్లో పాల్గొనకుండా పులివెందుల వెళ్లిపోయారు. సభకు హాజరయ్యే విషయంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. గత శాసనసభలో స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ప్రతిపక్షంపై తరచుగా నోరు పారేసుకున్నారు. ఇప్పుడు స్పీకర్‌గా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడికి కూడా నోటి దురుసు ఎక్కువే. సభాపతిగా ఆయన ఎలా వ్యవహరిస్తారో చూడాలి. సభను ఆయన అదుపు చేస్తారో? ఆయనను సభ అదుపు చేస్తుందో? చూడాలి. జగన్ అండ్ కో పోకడలతో పాటు వారి నోళ్లకు అదుపు లేకపోవడం వల్లనే ఈ ఘోర పరాజయం వారికి ఎదురైంది. మేం శాశ్వతంగా అధికారంలో ఉంటాం– చంద్రబాబు పనైపోయిందని భావించి విర్రవీగారు. ఇప్పుడు అవమాన భారాన్ని తట్టుకోలేకపోతున్నారు. జగన్మోహన్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో కూడా 40 శాతం వరకు ఓట్లు వచ్చాయని, ఆ విషయం మరచిపోకూడదనీ కొంత మంది అపర మేధావులు చెబుతున్నారు. నిజమే, గత ఎన్నికల్లో కూడా 23 సీట్లు మాత్రమే వచ్చిన చంద్రబాబుకు కూడా 40 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడున్న సమాజంలో కళ్లెదురుగా హత్యలు చేసిన, చేయించిన వారికి కూడా కుల, మత ప్రాతిపదికన ఎన్నో కొన్ని ఓట్లు వేసేవారు ఉన్నారు. అలాగని జగన్‌రెడ్డిని తీసిపారేయడం కూడా సరికాదు. చంద్రబాబు ప్రభుత్వం మునుముందు ఎలా వ్యవహరించబోతున్నది అన్నదాన్ని బట్టి జగన్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఆధారంగానే ఇటీవలి కాలంలో ప్రజలు తీర్పు ఇస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు జగన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఇచ్చింది మాత్రమే. తెలుగుదేశం–జనసేన–బీజేపీ మధ్య పొత్తు కుదిరినందున మెజారిటీలు పెరిగాయి. గత ఐదేళ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు తగు విధంగా అడుగులు వేస్తారని ఆశిద్దాం. ఈ ఐదేళ్లలో ఆయనకు అనేక మంది అనేక రూపాలలో సహాయ సహకారాలు అందించారు. వారంతా తమకు తగిన గుర్తింపు, గౌరవం దక్కాలని కోరుకుంటారు. అందులో తప్పు లేదుగానీ ప్రభుత్వాన్ని నడిపించడంలో సారథికి స్వేచ్ఛ ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరినందున కూటమిలోని భాగస్వామ్య పక్షాలు కూడా తమ మాటకు విలువ ఉండాలని, పదవుల పంపకంతో పాటు అధికారంలో వాటా ఉండాలని కోరుకుంటారు. చంద్రబాబుకు ఇదొక విషమ పరీక్ష. అయితే అనేక డక్కామొక్కీలు తిన్న అనుభవం ఉన్నందున, జనసేనాని పవన్ మనసు నొప్పించకుండా చాకచక్యంగా వ్యవహరిస్తారని భావించవచ్చు. తెలుగు తమ్ముళ్లు కూడా తమ నాయకుడు చంద్రబాబును జగన్‌తో పోల్చుకోకూడదు. జగన్ మనస్తత్వం బాబుకు కూడా అలవడి ఉంటే ఇంతకాలంగా ఆయన రాజకీయాల్లో కొనసాగి ఉండేవారు కారు. ప్రస్తుత దేశ రాజకీయాల్లో నాలుగున్నర దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్న నాయకుడు మరొకరు లేరు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చివేయించిన ప్రజావేదికను అలాగే ఉంచాలి. అప్పుడే విధ్వంసకర పాలనను ప్రజలు ఆమోదించరని భావితరాల నాయకులకు హెచ్చరికగా ఉంటుంది. సోషల్ ఇంజనీరింగ్ పేరిట ఎన్నికల్లో కులాలవారీగా సీట్లు కేటాయించినా ఫలితం ఉండదు. గుడ్ గవర్నెన్స్‌కు మాత్రమే ప్రజల మద్దతు ఉంటుంది.
ఈ ప్రభుత్వం మాది– ఈ ప్రభుత్వంలో మేమంతా హాయిగా జీవిస్తున్నాం. ఏ ఒక్క వర్గానికీ అన్యాయం జరగలేదు.. ప్రతి వర్గానికీ మేలు చేస్తున్నారన్న భావన ప్రజల్లో ఏర్పడాలి. అప్పుడే ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఫీల్ గుడ్ భావన ఏర్పడుతుంది. సంక్షేమం పేరిట ప్రజలకు ఇంత పడేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే కుదరదని జగన్ విషయంలో రుజువైంది. ప్రభుత్వ యంత్రాంగంలో లోపించిన జవాబుదారీతనాన్ని తిరిగి తీసుకురావాలి. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలులో ఉందన్న భావన ప్రజలలో కల్పించాలి. రాజధాని అమరావతిని రెండు మూడేళ్లలో కట్టేస్తామని గొప్పలు చెప్పుకోవడం తగదు. చేయాలనుకున్నది చేసి చూపించండి. వాటి ఫలితాలు ప్రజలకు అందితే ఆటోమేటిక్‌గా ప్రజల మద్దతు లభిస్తుంది. రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం మోపే పథకాల వల్ల ప్రయోజనం ఉండదు. ప్రభుత్వంపై ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. ఈ దిశగానే చంద్రబాబు పాలన సాగుతుందని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా అందుకు సహకరిస్తారని ఆశిద్దాం. తెలివైన వాళ్లు మూర్ఖుల తప్పిదాలను గమనించి నేర్చుకుంటారు. అందుకే వారి నిర్ణయాలు ఇతరులకు కూడా ఆమోదయోగ్యంగా ఉంటాయి!
RK (వేమూరి రాధాకృష్ణ)