Share News

Weekend Comment By RK: మోదీకి ఎదురేదీ!?

ABN , Publish Date - Feb 11 , 2024 | 01:07 AM

‘పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న ఎన్డీయేలో మీరు మళ్లీ భాగస్వామి కావాలని కోరుతున్నాం’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలుగుదేశం పార్టీ అధినేత...

Weekend Comment By RK: మోదీకి ఎదురేదీ!?

‘పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న ఎన్డీయేలో మీరు మళ్లీ భాగస్వామి కావాలని కోరుతున్నాం’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వద్ద ప్రతిపాదించారు. అమిత్‌ షా ఆహ్వానం మేరకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. ఈ పరిణామంపై ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి పరోక్షంగా మద్దతు ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రస్తుత దుస్థితికి భారతీయ జనతా పార్టీ కారణమన్న అభిప్రాయంతో ఉన్న రాష్ట్ర ప్రజలు ఆ పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ కారణంగా చంద్రబాబు–అమిత్‌ షా సమావేశంపై మిశ్రమ స్పందన ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ముఖ్యంగా ముస్లింల సంఖ్య అధికంగా ఉన్న రాయలసీమకు చెందిన వారు బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ బీజేపీతో చేతులు కలపడం తెలుగుదేశం పార్టీకి అనివార్యంగా మారింది. తెలుగుదేశం పార్టీ అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ చంద్రబాబును అమిత్‌ షా ఢిల్లీకి ఆహ్వానించడంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఉలిక్కిపడి ఆ వెంటనే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసి వచ్చారు. రాష్ట్రంలో బీజేపీ ఓటు షేర్‌ రెండు నుంచి మూడు శాతం మాత్రమే ఉంది. అయినా అధికార, ప్రతిపక్షాలు ఆ పార్టీ కరుణాకటాక్షాల కోసం వెంపర్లాడటం వింతగా ఉన్నప్పటికీ అందుకు కారణం లేకపోలేదు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగిస్తున్న రాష్ర్టాలలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. తమిళనాడులో ఒకప్పుడు ఎమ్జీఆర్‌, కరుణానిధి బలమైన నాయకులుగా ఉండేవారు. అప్పుడు కేంద్రంలో ఇందిరాగాంధీ అత్యంత శక్తిమంతమైన ప్రధానిగా ఉండేవారు. తమిళనాడులో కాంగ్రెస్‌ పార్టీకి చోటులేకపోయినా కరుణానిధితో పాటు ఎమ్జీఆర్‌ కూడా ఏదో ఒక దశలో కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడిపోయారు. కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వాలు, ముఖ్యంగా కూటముల ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు రాష్ర్టాలు పూర్తి స్థాయి స్వేచ్ఛను అనుభవించాయి. ఇందిరాగాంధీ తర్వాత మళ్లీ ఇంత కాలానికి కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బలమైన ప్రభుత్వం అధికారం చలాయిస్తోంది. దీంతో ఆయా రాష్ర్టాలలో బలమైన నాయకులు అనుకున్న వారు సైతం మోదీ అధికారానికి తలొంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేంద్రంతో రాజీపడని తమిళనాడులోని స్టాలిన్‌ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పడుతున్నదో చూస్తున్నాం. ఆ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు జైలుకే పరిమితమయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పరిస్థితి కూడా చూస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఏడాదిగా జైలుకే పరిమితమయ్యారు. మరో మంత్రి కూడా తీహార్‌ జైల్లోనే ఉన్నారు.

కేజ్రీవాల్‌ను కూడా ఇవాళో రేపో అరెస్టు చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, అధికారం కోల్పోతే ప్రాంతీయ పార్టీల మనుగడ కూడా ప్రశ్నార్థకం అవుతోంది. అవధులు లేని అధికారం చలాయించడానికి అలవాటుపడిన ప్రాంతీయ పార్టీల నాయకులు ప్రతిపక్షంలో ఉండలేకపోతున్నారు. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిస్థితే తీసుకుందాం. తొమ్మిదిన్నరేళ్లుగా ఆయన మకుటం లేని మహారాజులా వెలుగొందారు. నియంత తరహా పాలన సాగించారు. అప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సంపాదనకు అలవాటుపడ్డారు. రెండు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కేసీఆర్‌ అధికారం కోల్పోయారు. దీంతో భారత రాష్ట్ర సమితి మనుగడే ప్రశ్నార్థకం అయింది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ‘సారు–కారు–పదహారు’ అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లి తొమ్మిది స్థానాలను గెలుచుకున్న బీఆర్‌ఎస్‌ మరో రెండు నెలల తర్వాత జరగబోయే ఎన్నికల్లో రెండు మూడు సీట్లైనా గెలుచుకోగలదా అన్న సందేహం కలుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ పార్టీ భవిష్యత్తుపై బీఆర్‌ఎస్‌ నాయకులకు బెంగపట్టుకుంది. ఎంతలో ఎంత తేడా?

ఎందుకీ నిస్సహాయత...

వివిధ రాష్ర్టాలలోని ప్రాంతీయ పార్టీల నాయకులతో పాటు ఇతర నాయకులు కూడా మోదీ ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడలేకపోవడానికి మరో ప్రధాన కారణం ఉంది. దేశ జనాభాలో యువత శాతం అధికంగా ఉన్నప్పటికీ నాయకులు మాత్రం వృద్ధాప్యంలోకి చేరిపోయారు. ప్రస్తుత రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్న నాయకులందరూ ఏడు పదులు దాటిన వారే కావడం గమనార్హం. ప్రధాని మోదీ వయస్సు కూడా ఏడు పదులు దాటినప్పటికీ వృద్ధులందరిలోకీ యువకుడిగా ఆయనే చలామణి అవుతున్నారు. ఏడు పదులు దాటిన తాము ప్రధాని మోదీతో తలపడి సాధించేది ఏమిటి? అధికారం దక్కించుకోలేకపోతే తమ రాజకీయ జీవితం ముగిసినట్టే కదా? అని ఆయా నేతలు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో కురువృద్ధుడు శరద్‌ పవార్‌ పరిస్థితి ఏమిటో చూస్తున్నాం. ఆయన మోదీతో చేతులు కలపడానికి నిరాకరించడం వల్ల సొంత పార్టీని కూడా కోల్పోవలసి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌, బిహార్‌ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నితీశ్‌ కుమార్‌ కూడా ఏడు పదులకు కాస్త అటూ ఇటూ ఉన్నారు. దీంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మోదీ ప్రభుత్వంతో రాజీ పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్‌ యాదవ్‌, బిహార్‌లో తేజస్వి యాదవ్‌ యువకులే అయినప్పటికీ సీరియస్‌ పొలిటీషియన్స్‌గా వారికి గుర్తింపు రాలేదు. దక్షిణాదికి వస్తే కేరళ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక ముఖ్యమంత్రులు పినరయి విజయన్‌, స్టాలిన్‌, నవీన్‌ పట్నాయక్‌, సిద్ధరామయ్య 70 ఏళ్లు దాటిన వాళ్లే. తెలుగునాట చంద్రబాబు, కేసీఆర్‌ కూడా ఏడు పదులకు చేరినవారే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పిన్న వయసు వారే అయినప్పటికీ వారి పాత్ర పరిమితమే. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నందున ఆ పార్టీ అధినాయకత్వానికి మాత్రమే విధేయులుగా ఉండాలి. జగన్‌ ప్రాంతీయ పార్టీ అధినేత అయినప్పటికీ ఆయనపై ఉన్న కేసుల కారణంగా కేంద్ర ప్రభుత్వం ముందు తలవొంచాల్సిన పరిస్థితి. జాతీయ రాజకీయాలలో నరేంద్ర మోదీతో తలపడే నాయకుడు ఒక్కరు కూడా కనబడటం లేదు. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీకి వయసు రీత్యా ఎడ్వాంటేజ్‌ ఉన్నప్పటికీ... ప్రధాని మోదీని ఎదుర్కొనే విషయమై ఆయన దీటుగా ఎదగలేకపోతున్నారు. భారతీయ జనతా పార్టీలో కూడా మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎవరూ ఎదగలేదు. బీజేపీ మాతృ సంస్థగా భావించే ఆరెస్సెస్‌ కూడా మోదీ ఆధిపత్యాన్ని ఆమోదించక తప్పని పరిస్థితి. ‘అబ్‌ కీ బార్‌ మోదీ సర్కార్‌’ అని ప్రధాని మోదీ ప్రకటించినా అదేమిటి, బీజేపీ సర్కార్‌ అని చెప్పడం లేదు అని ప్రశ్నించలేని పరిస్థితిలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీని నరేంద్ర మోదీ అఖిల భారత స్థాయి ప్రాంతీయ పార్టీగా మార్చుకుని తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతున్నారు. స్థూలంగా భారత రాజకీయ ముఖచిత్రం ఇది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని ధిక్కరించగలరా?


గత వైభవం...

ఒకప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీయే ప్రభుత్వంలో ఆయనే కీలకం. అప్పట్లో గుజరాత్‌లో చెలరేగిన అల్లర్లకు బాధ్యత వహించి అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతో రాజీనామా చేయించాలన్న డిమాండ్‌ వచ్చింది. మోదీ రాజీనామా చేయాలని చంద్రబాబు కూడా స్వరం కలిపారు. ఆ సమయంలో ఎల్‌కే అడ్వాణీ మోదీకి అండగా నిలబడ్డారు. అయితే చంద్రబాబు మాటకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రధాని వాజపేయి మాత్రం... చంద్రబాబును కలసి ఆయనకు నచ్చచెప్పవలసిందిగా మోదీని ఆదేశించారు. ప్రధాని వాజపేయి ఆదేశాలతో చంద్రబాబును కలవడానికి ఢిల్లీలోని ఏపీ భవన్‌కు వెళ్లిన మోదీకి అపాయింట్‌మెంట్‌ కూడా దొరకలేదు. ఇదంతా గతం! ఇప్పుడు మోదీ దేశంలోనే అత్యంత బలమైన నాయకుడు! చంద్రబాబు బలహీనపడ్డారు. వయసు రీత్యా కూడా ఆయన జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయలేని పరిస్థితి. ఏప్రిల్‌లో జరగనున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడం చంద్రబాబుకు ముఖ్యం. ఇప్పుడు అధికారంలోకి రాకపోతే చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసినట్టే. ఈ కోణం నుంచి చూస్తే బీజేపీతో పొత్తును చంద్రబాబు కాదనుకోలేని పరిస్థితి ఎందుకొచ్చిందో తెలుస్తుంది.

ఎవరికి ఎవరు అవసరం...

నిజానికి ఈ ఎన్నికల్లో బీజేపీ అవసరం తెలుగుదేశం పార్టీకి గానీ, ఆ పార్టీ అవసరం బీజేపీకి గానీ లేదు. భారతీయ జనతా పార్టీ లేకపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అయినా పొత్తు అనివార్యం ఎందుకవుతోందంటే... ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఎన్నికల కమిషన్‌ సహకారం అవసరం. ప్రజల మద్దతు ఉన్నప్పటికీ ఎన్నికలు సజావుగా జరగని పక్షంలో పరిస్థితి ఏమిటి? అన్న ఆందోళన తెలుగుదేశం పార్టీని పట్టి పీడిస్తోంది. ఈ కారణంగానే తెలుగుదేశంతో కలవడంపై జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను రెచ్చగొడుతున్నప్పటికీ, చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్‌ షా కాళ్లు మొక్కారని దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ రెచ్చిపోకుండా వారు సంయమనం పాటిస్తున్నారు. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం పరిస్థితి ఏమిటి? తమ పరిస్థితి ఏమిటి? అన్న విషయంలో ఆ ఇరువురు నాయకులకు స్పష్టత ఉంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరే విషయమై ఎక్కువగా భయపడుతున్నది జగన్‌రెడ్డి మాత్రమే. తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరితే ముస్లింలను, క్రైస్తవులను రెచ్చగొట్టవచ్చు. తనకు భయంగా ఉందని చెప్పకుండా మీకు భయంగా ఉంటే వచ్చి నా చుట్టూ పడుకోండన్న తరహాలో జగన్‌ ఆ వర్గాలను రెచ్చగొట్టవచ్చు. జగన్‌రెడ్డి ట్రాప్‌లో చిక్కుకొని ప్రధాని మోదీని నేరుగా ఢీకొనే ప్రయత్నం చేసి ఆత్మహత్య చేసుకోవడమా? ప్రస్తుతానికి మోదీ ప్రమాదాన్ని తప్పించుకొని అధికారాన్ని అందుకోవడమా? అన్నది తెలుగుదేశం పార్టీ తేల్చుకోవాలి. ప్రజాబలం లేని వారి మాటలకు రెచ్చిపోవడమా? లేక విజ్ఞతతో ఆలోచించి గండం గట్టెక్కడమా? అన్నది తెలుగుదేశం పార్టీ ముందున్న ప్రశ్న. భారతీయ జనతా పార్టీ కోణం నుంచి చూస్తే వారికి కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు అనివార్యం కాదు. అయితే ప్రస్తుత పొత్తు ప్రతిపాదనకు కారణం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 25 ఎంపీ సీట్లలో ఎవరు ఎన్ని సీట్లు గెలుచుకున్నప్పటికీ ఎన్నికల తర్వాత తమకే మద్దతు ఇస్తారని బీజేపీ పెద్దలకు తెలియక కాదు. బీజేపీతో బహిరంగంగా పొత్తు లేకపోయినా జగన్‌రెడ్డి ఆ పార్టీతో ఎలా అంటకాగుతున్నారో చూస్తున్నాం. ఒకప్పటి తమిళనాడు పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ది. రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ప్రాపకం కోసం పాకులాడాల్సిన పరిస్థితి. అయినా ఉన్నట్టుండి ఎన్డీయేలో చేరవలసిందిగా తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఆహ్వానం పలికారంటే, ఈ ఎన్నికల్లో గరిష్ఠ సంఖ్యలో ఎంపీ సీట్లు గెలిచి రికార్డు సృష్టించాలన్న లక్ష్యాన్ని ప్రధాని మోదీ పెట్టుకున్నారట! ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 403 స్థానాలను గెలుచుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు అన్ని సీట్లు లభించలేదు. ఇందిర హత్యానంతరం మాత్రమే సానుభూతి వెల్లువెత్తి... యాభై శాతానికి పైగా ఓట్లతో 403 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 403 కంటే ఒక్క సీటైనా అధికంగా సాధించాలన్న పట్టుదలతో ప్రధాని మోదీ ఉన్నారని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారాయని ధ్రువీకరించుకున్న మీదటే ప్రధాని మోదీ ఆ పార్టీని ఎన్డీయేలో చేర్చుకోవడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ‘మిమ్మల్ని ఎన్డీయేలో చేరాలని కోరవలసిందిగా ప్రధాని మోదీ ఆదేశించారు’ అని హోం మంత్రి అమిత్‌ షా చంద్రబాబుతో సమావేశం సందర్భంగా తెలిపారు. జగన్‌రెడ్డి నేరుగా ఎన్డీయేలో చేరబోరు కనుక ఆయన బలాన్ని లెక్కలోకి తీసుకోవడానికి లేదు. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ ఎన్డీయే భాగస్వామి అయ్యేదీ లేనిదీ మరో వారం రోజుల్లో తేలిపోతుంది. అప్పటి వరకు పొత్తుకు అనుకూల, వ్యతిరేక వర్గాలు ఎవరి ఆట వారు ఆడతారు. చంద్రబాబు గెలవబోతున్నారు కనుక భారతీయ జనతా పార్టీ నుంచి పొత్తుకు ఆహ్వానం అందింది. కేంద్రంలో మళ్లీ బీజేపీనే గెలవబోతోంది కనుక పిలిచిందే తడవుగా చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఇది వాస్తవం!


ఇదీ మూడ్‌...

మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరిట ‘ఇండియా టుడే’ గ్రూపు తాజాగా నిర్వహించిన సర్వేలో కూడా బీజేపీ, టీడీపీల గెలుపు ఖాయమని తేలింది. ఈ సర్వే ఫలితాలు వెల్లడైన తర్వాత జగన్‌రెడ్డి శిబిరం ఉలికిపాటుకు గురైంది. దీంతో అలవాటు ప్రకారం ఆ సర్వే విశ్వసనీయతను ప్రశ్నిస్తూ తమ రోత పత్రికలో కథనాలు వండి వార్చారు. 2019కి ముందు, ఆ తర్వాత కూడా ‘ఇండియా టుడే’ గ్రూపు క్రమం తప్పకుండా సర్వేలు నిర్వహిస్తోంది. 2018లో అధికార తెలుగుదేశం పార్టీకంటే వైసీపీ ఆరు శాతం ఓట్ల ఆధిక్యంలో ఉందని తేల్చి చెప్పింది. 2022లో తెలుగుదేశం పార్టీకి 7 ఎంపీ సీట్లు, 2023లో 10 సీట్లు, 2023 ఆగస్టులో 15 సీట్లు, 2024 జనవరిలో 17 సీట్లు వస్తాయని ఈ సంస్థ అంచనా వేసింది. దీంతో కలవరపాటుకు గురైన జగన్‌ అండ్‌ కో తమ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికై ‘రిపబ్లిక్‌ సర్వే’ అంటూ ఒక బోగస్‌ సర్వేను ప్రచారంలోకి తెచ్చింది. నిజానికి తెలుగునాట నెలకొన్న పరిస్థితుల వల్ల సర్వేలలో ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ కారణంగానే ఎన్నికల షెడ్యూల్‌కు ముందు చేయించుకున్న సర్వేలను నమ్ముకొని తెలంగాణలో కేసీఆర్‌ బోర్లా పడ్డారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉండబోతున్నాయి. ఈ ఉపద్రవం నుంచి బయటపడటానికి జగన్‌రెడ్డిని నిజాయితీపరుడిగా చిత్రిస్తూ రూపొందించిన ‘యాత్ర 2’ చిత్రాన్ని విడుదల చేసి ప్రేక్షకులను ఆకర్షించడానికి నానా అగచాట్లు పడుతున్నారు. త్వరలో వర్మ తీసిన ‘వ్యూహం’ సినిమాను కూడా విడుదల చేస్తారు. అప్పటికీ అనుమానం తీరకపోతే వర్మ తీస్తున్న మరో చిత్రం ‘శపథం’ కూడా విడుదల చేయవచ్చు. మొత్తమ్మీద పడిపోతున్న తన గ్రాఫ్‌ను పెంచుకునేందుకు జగన్‌రెడ్డి కూడా సినిమాలనే నమ్ముకోవడం వింతగా ఉంది. ఒకప్పుడు ‘నా వెంట్రుక పీకే వాళ్లు లేరు’ అన్న జగన్‌, ఆ తర్వాత క్రమంలో ‘మిమ్మల్నే నమ్ముకున్నాను, మీరే గెలిపించాలి’ అని ప్రజలను అర్థించే వరకూ ఒక్కో మెట్టూ దిగుతూ వచ్చారు. ఇప్పుడు సినిమాలను కూడా నమ్ముకొనే దుస్థితి. అయినా సినిమాలకు, సినిమా హీరోలకు ప్రభావితమై జనం ఓట్లు వేసే రోజులు పోయాయి. తెలుగు రాష్ర్టాలలోనే కాదు– తమిళనాడులో కూడా ఇది రుజువైంది.

ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన సోదరి షర్మిల రూపంలో కూడా ముప్పు ఎదురవుతోంది. షర్మిల సూటిగా సుత్తి లేకుండా జగన్‌ను ఎండగడుతున్నారు. ‘సిద్ధం’ అంటూ జగన్‌ ప్రచారం చేసుకుంటుండటంతో ‘ప్రజలు నిన్ను ఇంటికి పంపడానికి సిద్ధం’గా ఉన్నారంటూ ఆమె నేరుగా తేల్చి చెబుతున్నారు. క్రైస్తవ ఓటు బ్యాంకును కాంగ్రెస్‌ పార్టీ వైపు ఆకర్షించడంలో షర్మిల కొంత మేరకు సఫలమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె సభలకు జనం కూడా క్రమంగా పెరుగుతున్నారు. ప్రతిపక్షాల కంటే వైసీపీ ఎమ్మెల్యేలే తమ వాచాలత్వంతో జగన్‌కు ఎక్కువ నష్టం చేస్తున్నారు. రాజధాని ఎందుకు? రాజధాని ఏమైనా కూడు పెడుతుందా? అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యపై విమర్శలు వస్తున్నాయి. రాజధాని కూడు పెట్టకపోవడం నిజమైతే మూడు రాజధానుల పాట ఎందుకు పాడుతున్నారు? అన్న ప్రశ్న వస్తోంది. అధికార మదం తలకెక్కడంతో ఏమి మాట్లాడుతున్నారో తెలియకుండా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో తమ ఆప్తుడు కేసీఆర్‌కు ఎదురైన చేదు అనుభవం చూశాక కూడా వైసీపీ నాయకుల వైఖరి మారడం లేదంటే వినాశకాలే విపరీత బుద్ధి అని సర్ది చెప్పుకోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌లో గెలవడానికి, ఓడటానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడ్డాక మరింత స్పష్టంగా తెలుస్తుంది. అప్పటిదాకా ఎవరి లెక్కలు వారు వేసుకోవచ్చు. గాలిలో మేడలు కట్టుకోవచ్చు!

ఆర్కే

Updated Date - Feb 11 , 2024 | 06:53 AM