Share News

Weekend Comment By RK : మోదీ ‘మూడు’తో మూడేదెవరికి?

ABN , Publish Date - Jan 21 , 2024 | 01:20 AM

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరగడం సహజమే కదా! అందులో ప్రత్యేకత ఏముంది! అని సందేహం కలగవచ్చు. జరగబోయే ఎన్నికలు దేశంలోని ప్రాంతీయ పార్టీల మనుగడకు ముప్పు తేవచ్చు అన్నదే ఇక్కడ ప్రధానాంశం...

Weekend Comment By RK : మోదీ ‘మూడు’తో మూడేదెవరికి?

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరగడం సహజమే కదా! అందులో ప్రత్యేకత ఏముంది! అని సందేహం కలగవచ్చు. జరగబోయే ఎన్నికలు దేశంలోని ప్రాంతీయ పార్టీల మనుగడకు ముప్పు తేవచ్చు అన్నదే ఇక్కడ ప్రధానాంశం. ప్రాంతీయ పార్టీల పొడ అంటే ప్రధాని మోదీకి గిట్టని విషయం తెలిసిందే. మోదీ పాలనలో ప్రాంతీయ పార్టీలను ముప్పుతిప్పలు పెట్టడం చూస్తున్నాం. తాజా అంచనాల ప్రకారం నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే తమ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ప్రాంతీయ పార్టీల అధినేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ర్టాల విషయానికి వద్దాం! తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా పురుడుపోసుకొని జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై ప్రతిపక్షంలో కూర్చుంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీలు రెండూ బలంగా ఉన్నాయి. వైసీపీ ప్రస్తుతం అధికారంలో ఉండగా, రానున్న ఎన్నికల తర్వాత అధికారంలోకి రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ లెక్కలు వేసుకుంటోంది.

కర్ణాటకలో కూడా అధికారాన్ని కాంగ్రెస్‌ పార్టీకి అప్పగించాల్సి రావడంతో ప్రధాని మోదీ ఇప్పుడు దక్షిణాదిపై దృష్టి కేంద్రీకరించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తే కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోయడానికి భారతీయ జనతా పార్టీ పెద్దలు స్కెచ్‌ రూపొందించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అక్కడ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై అనేక కేసులున్నాయి. వాటిల్లో ఏదో ఒక కేసులో ఆయనకు శిక్ష పడేలా చేయగలిగితే ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చునని కమలనాథులు తలపోస్తున్నారట. ఇక, తెలుగునాట ఏం చేయబోతున్నారు? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టడం ద్వారా ఆ చోటును ఆక్రమించుకోవాలని బీజేపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి పరోక్ష సహాయ సహకారాలు అందించినా ఫలితం లేకుండా పోయింది. తన చేతికి మట్టి అంటకుండా ఇతరుల భుజంపై తుపాకీ పెట్టి ప్రత్యర్థులను పడగొట్టడంలో ప్రధాని మోదీ దిట్ట. కొంతకాలం క్రితం భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఎన్వీ రమణను లొంగదీసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్‌ను ప్రోత్సహించి ఆయనపై ఫిర్యాదు చేయించారు. ఫలితంగా జగన్‌ సేఫ్‌గా ఉండిపోయారు. ఆయనపై దాఖలైన కేసుల విషయంలో న్యాయవ్యవస్థ అచేతనంగా ఉండిపోయింది. తర్వాత దశలో చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టడం, ఆయన జైలుకు వెళ్లాల్సి రావడం తెలిసిందే. అయినా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరకుండా నిలబడింది. రాష్ర్టాన్ని కోలుకోలేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దెబ్బ తీస్తున్నారని తెలిసి కూడా ప్రధాని మోదీ ఆయనకు సహకరించడంలో ఆంతర్యం లేకపోలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల తనను కలిసినప్పుడు జగన్‌ పాలనను ప్రధాని మోదీ తీవ్రంగా ఆక్షేపించారు. జగన్‌రెడ్డి కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అని ప్రధాని వ్యాఖ్యానించారు కూడా! అయినా జగన్‌కు పరోక్ష సహకారం అందిస్తున్నారంటే అందుకు కారణం లేకపోలేదు. జగన్‌ బలహీనపడితే తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుందే తప్ప తమకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదన్నది కమలనాథుల అభిప్రాయంగా ఉంది. ఈ కారణంగానే రాష్ట్రం నాశనం అవుతున్నా జగన్‌కు కేంద్ర సహకారం అందుతోంది. అయినా రాష్ట్రంలో బీజేపీకి చోటు లభించని పరిస్థితే ఉండటంతో ప్రధాని మోదీ ఇప్పుడు తన దృష్టి తెలంగాణపై కేంద్రీకరించారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ అధికారం కోల్పోతే కాంగ్రెస్‌ పార్టీ పుంజుకొనే అవకాశం ఉంది. ఈ విషయం బీజేపీ పెద్దలకు కూడా తెలుసు. ఈ నేపథ్యంలో ముందుగా తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని కబళించే ఎత్తుగడలకు తెర తీయబోతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి బీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టే వ్యూహానికి పదునుపెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి తనను కలసినప్పుడు ప్రధాని మోదీ తన మనసులోని మాటలను బయటపెట్టారు కూడా! ‘మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాజకీయంగా ఫినిష్‌ చేయండి. మీకు నా సహకారం ఉంటుంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినా మాకు బాధ లేదు. కేసీఆర్‌ కుటుంబం మాత్రం ఉండకూడదు. మీరు చేయగలిగిందంతా చేయండి’ అని ప్రధాని మోదీ వారిరువురితో అన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మాటలను బట్టి నరేంద్ర మోదీ వ్యూహం ఎలా ఉండబోతున్నదో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని, ముఖ్యంగా కేసీఆర్‌ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బకొట్టడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వాడుకోబోతున్నారన్న మాట! బీఆర్‌ఎస్‌ రాజకీయంగా దెబ్బతింటే లాభపడేది బీజేపీయే కదా! అంటే, తెలంగాణలో రాజకీయాలు కాంగ్రెస్‌–బీజేపీ మధ్యనే సాగాలని, బీఆర్‌ఎస్‌ ఉనికిలో ఉండకూడదని ప్రధాని మోదీ భావిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.

బీఆర్‌ఎస్‌కు ఎన్నికల పరీక్ష...

నేను గతంలోనే చెప్పినట్టుగా రానున్న లోక్‌సభ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు విషమ పరీక్ష కాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను గెలుచుకోలేని పక్షంలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకూడదని కేసీఆర్‌ ఇదివరకే నిర్ణయించుకున్నారు. నిజామాబాద్‌ నుంచి పోటీ చేయాలని కోరుకోవద్దని కుమార్తె కవితను ఆయన ఇదివరకే ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని స్వయంగా ప్రకటించాలని కూడా ఆయన కుమార్తెను ఆదేశించారట! పరిస్థితులు అనుకూలిస్తే మల్కాజ్‌గిరి నుంచి కుమారుడు కేటీఆర్‌ను పోటీకి దింపాలని కేసీఆర్‌ తలపోస్తున్నారు. ఈ ఆలోచనలు సాగుతున్నప్పుడే ఈడీ విచారణకు రావాలని కవితకు నోటీసులు అందాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్‌ విచారణ మొదలైంది. ఈ ప్రాజెక్టుపై కాగ్‌ నివేదిక కూడా సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని నిర్ధారణ అయితే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతుందో తెలియదు. సాక్ష్యాధారాలు లభించాక ప్రధాని మోదీ ఏం చేయబోతున్నారో కూడా తెలియాల్సి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్‌ను సమస్యలన్నీ చుట్టుముడుతున్నాయి. రాజకీయ టక్కుటమార గజకర్ణ గోకర్ణుడిగా పేరొందిన కేసీఆర్‌ ఇప్పుడు నిస్సహాయుడిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి. ఇంటా బయటా ఆయనకు మద్దతు కొరవడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానకుండా వ్యవహరించడంతో ఇప్పుడు ఆయనకు మద్దతుగా నిలబడే పార్టీ కూడా ఏదీ కనపడటం లేదు. దేశంలోని ఇతర రాజకీయ పార్టీలకు కేసీఆర్‌పై సదభిప్రాయం లేదు. పార్టీలన్నీ తమను తాము రక్షించుకొనే పనిలో తీరిక లేకుండా ఉన్నాయి. ఈ క్రమంలో పార్టీని కాపాడుకోవడం కేసీఆర్‌కు తలకు మించిన భారం కాబోతున్నది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్‌లో చోటు చేసుకోబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలలో ఎంత మంది ఉంటారు? ఎంతమంది పోతారు? కాంగ్రెస్‌–బీజేపీల నుంచి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉండబోతున్నాయి? అనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడం లేదు. తమ పార్టీ నుంచి వలసలను ప్రోత్సహించేలోపే కాంగ్రెస్‌ పార్టీ నుంచి కొంతమందిని గుంజుకుంటే ఎలా ఉంటుందని కేటీఆర్‌ భావిస్తున్నప్పటికీ... కేసీఆర్‌ మాత్రం అటువంటి పని మనం చేయవద్దని వారిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టామన్న అపఖ్యాతి మనకెందుకు? అని ఆయన అన్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడల్లా తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎదురైన సమస్యలు, సవాళ్లన్నీ ఇప్పుడు కేసీఆర్‌కు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతోపాటు జగన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి చంద్రబాబు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. అయితే... ఆయనకు భూదేవిని మించిన ఓర్పు ఉంటుంది. ఆ కారణంగానే ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా పార్టీని బతికించుకోగలుగుతున్నారు. కేసీఆర్‌ ఏం చేస్తారో చూడాలి!


పొలిటికల్‌ గేమ్‌ ప్లాన్‌...

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినందున కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలపడం ద్వారా ప్రస్తుతానికి గండం నుంచి బయటపడాలని కేటీఆర్‌ ప్రభృతులు తలపోస్తున్నప్పటికీ... ప్రధాని మోదీ గేమ్‌ ప్లాన్‌ మరోలా ఉంది. బీఆర్‌ఎస్‌తో ఏ రూపంలో చేతులు కలిపినా ఆ పార్టీ మళ్లీ చిగురిస్తుందని, అదే జరిగితే తెలంగాణలో బీజేపీ బలపడటం కష్టమని ప్రధాని అభిప్రాయపడుతున్నారట! అందుకే బీఆర్‌ఎస్‌ను, ప్రత్యేకించి కేసీఆర్‌ కుటుంబాన్ని దెబ్బకొట్టాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఆలోచన ఏమిటన్నది కీలకం కాబోతున్నది. బీఆర్‌ఎస్‌ను దెబ్బతీయడం వల్ల లాభమా? నష్టమా? ఆ పార్టీ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తే ఎదురయ్యే సవాళ్లు ఏమిటన్న దానిపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి పెట్టింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితే తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్న చందంగా బతకాల్సి రావొచ్చు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఆకర్షించి బలం పెంచుకుంటే బీజేపీ నాయకులు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కుదురుగా ఉండనివ్వరు. కర్ణాటకలో మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సిద్ధరామయ్య ప్రభుత్వాన్నే కూల్చుతామని బీజేపీ నాయకులు ఇప్పటికే చెబుతున్నందున... తెలంగాణలో మాత్రం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని సజావుగా సాగనిస్తారా? అన్న ప్రశ్న ఉత్పన్నం కాకమానదు. ప్రస్తుతానికి తెలంగాణలో బీజేపీ బలం అంతంత మాత్రమే అయినప్పటికీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి, ప్రతిపక్షంలోకి వెళ్లిన బీఆర్‌ఎస్‌కూ కంటి మీద కునుకు లేకుండా చేయబోతున్నారు. భవిష్యత్‌ రాజకీయ పరిణామాలను ఇప్పటికిప్పుడు ఊహించడం కష్టమేగానీ మోదీ హయాంలో వివిధ రాష్ర్టాలలో చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి ఏమైనా జరగవచ్చు అని నమ్మాల్సిన పరిస్థితి. ఒకప్పుడు ఇందిరాగాంధీ హయాంలో, ఇప్పుడు మోదీ హయాంలో ప్రతిపక్షాలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కుదుపులకు గురయ్యాయి, అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల గండం నుంచి గట్టెక్కడానికి కేసీఆర్‌ ఏం చేయబోతున్నారో చూడాలి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురైదుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎంపీలు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. కేసీఆర్‌ కూడా ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. తుంటికి గాయమై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తనను పరామర్శించడానికి వచ్చిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను తమ పార్టీ తరఫున మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయవలసిందిగా కేసీఆర్‌ ప్రతిపాదించారు. తాజాగా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను బీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఎన్వీ రమణ తమ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, ఈ ప్రతిపాదనను రమణ సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు లభించడం కష్టం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కేసీఆర్‌ వద్ద ఇప్పుడు డబ్బు కూడా లేదు. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులకు నిధులు ఎలా అని ఆయన మథనపడుతున్నారు. బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేసిన తర్వాత జాతీయ రాజకీయాలపై ఆశలు పెంచుకొని ఉన్న డబ్బంతా మహారాష్ట్ర తదితర రాష్ర్టాలకు చెందిన చోటా మోటా నాయకులకు ధారపోశారు. ఒకరకంగా చెప్పాలంటే అపాత్ర దానం చేశారు. ఇప్పుడు ఆయనే నిధుల కొరతను ఎదుర్కొంటున్నారు. ఇప్పటిదాకా జాతీయ రాజకీయాలలో సైతం ప్రముఖంగా కనిపించిన చంద్రబాబు, కే.చంద్రశేఖర రావులది ఇప్పుడు భిన్నమైన పరిస్థితి. బీజేపీతో చేతులు కలపడానికి సిద్ధపడుతున్నప్పటికీ ఆ పార్టీ పెద్దలు ససేమిరా అనడంతో కేసీఆర్‌ బలహీనుడిగా మారిపోయారు.

చంద్రబాబు ఇలా, జగన్‌ అలా...

చంద్రబాబుది కూడా విచిత్రమైన పరిస్థితి. ప్రజల్లో ఆయనకు బలం ఉన్నప్పటికీ బీజేపీని కాదనుకోలేని పరిస్థితి. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆహ్వానం అందినదే తడవుగా ఆయన బయలుదేరి వెళుతున్నారు. వెళ్లకపోతే బీజేపీ పెద్దలకు కోపం వస్తుందేమోనని ఆయన ఆందోళన చెందుతూ ఉండవచ్చు. జగన్మోహన్‌ రెడ్డికి ఇటువంటి బాదరబందీ ఏమీ లేదు. అయితే.. ఆయన బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించకుండా, ఏం చేసినా వారి అనుమతితోనే చేసుకుంటూ పోతున్నారు. మూడు రాజధానుల విషయం కూడా బీజేపీ పెద్దలకు చెప్పే చేశారట! అయినా దానికి అతీ గతీ లేదు. ఢిల్లీ పెద్దల సూచన మేరకు ఎన్వీ రమణపై ఫిర్యాదు చేసినా ఆయన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాకుండా ఆపలేకపోయారు. చివరకు సొంత సోదరి తన కుమారుడి వివాహ పత్రిక అందజేయడానికి వస్తానన్నా బీజేపీ పెద్దలకు కోపం వస్తుందని తప్పించుకోజూశారు. మొత్తమ్మీద బీజేపీ పెద్దలను పల్లెత్తు మాట అనలేని పరిస్థితి జగన్మోహన్‌ రెడ్డిది. తెలుగు రాష్ర్టాలకు చెందిన అధికార, ప్రతిపక్ష నేతలు ఇంత బలహీనులు కావడం నిజంగా విషాదం. ఒకప్పుడు ఇందిరాగాంధీ వంటి నాయకురాలినే ఎదిరించి తొడగొట్టి నిలబడిన ఎన్టీఆర్‌ను చూశాం. ఇప్పుడు అలాంటి నేతలు తెలుగునాటే కాదు ఇతర రాష్ర్టాలలో కూడా కనిపించడం లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూడా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఆయన ప్రభుత్వంలోని అనేక మంది మంత్రులు ఈడీ కేసులలో చిక్కుకున్నారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటారో తెలియదు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తల ఎగరేస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ ఇదివరకటితో పోల్చితే ఇప్పుడు ఆమె కూడా మెత్తబడిపోయారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ మూడో పర్యాయం అధికారంలోకి వస్తే భారత రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ప్రాంతీయ పార్టీల పెద్దలు బతికి బట్టకట్టాలంటే ఢిల్లీ ఆధిపత్యానికి తలవొంచక తప్పని పరిస్థితులు రావొచ్చు. ప్రధాని మోదీని ఎదిరించి నిలబడే శక్తి ఏ ప్రాంతీయ నాయకుడికి కూడా ఉండదు. అందుకే ప్రస్తుత పరిస్థితులలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మోడల్‌ను ఆచరించడమే ఉత్తమం అనే అభిప్రాయానికి పలువురు నాయకులు వచ్చేస్తున్నారు. జాతీయ రాజకీయాల ఊసెత్తకుండా రాష్ర్టానికే పరిమితమవుతూ కేంద్రంతో సఖ్యతగా ఉండటమే నవీన్‌ మోడల్‌. ఇప్పుడు ప్రధాని మోదీకి శ్రీరాముడు కూడా తోడయ్యాడు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనుండటంతో ఉత్తర భారతదేశం ‘జై శ్రీరామ్‌’ నినాదాలతో మార్మోగుతున్నది. విగ్రహ ప్రతిష్ఠ జరగకపోయినా, ప్రత్యేక పూజలు జరగకపోయినా అయోధ్య అక్షింతలంటూ దేశమంతా ప్రజలందరికీ పంచుతున్నారు. మోదీ ఆచరిస్తున్న ఈ రాజకీయ తంత్రం ముందు ఎవరు మాత్రం నిలబడగలరు? అందుకే కాబోలు 2024 ఎన్నికలను కూడా వదిలేసి 2029 ఎన్నికల్లోనే అదృష్టాన్ని పరీక్షించుకోవాలని రాహుల్‌ గాంధీ నిర్ణయించుకున్నారు. అప్పటికి ప్రధాని మోదీ 80 ఏళ్లకు చేరతారు. మహాభారతంలో అస్త్ర సన్యాసం చేస్తేతప్ప భీష్ముడిని నిలువరించలేమని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఆధునిక భారతంలో రాజకీయ రణ క్షేత్రంలో నరేంద్ర మోదీ మోహరించి ఉన్నంతవరకూ ఆయనను ఎవరూ ఢీకొని నిలబడలేరా? అంటే ప్రస్తుతానికి లేరు అనే చెప్పవచ్చు. రానున్న ఎన్నికల్లో మనకు వినపడబోయే నినాదం ఒకటే. జై శ్రీరాం–జై మోదీ. అంతే! ఈ పరిస్థితులలో కేసీఆర్‌ అయినా, చంద్రబాబు అయినా, జగన్మోహన్‌ రెడ్డి అయినా, రేవంత్‌ రెడ్డి అయినా తలవంచాల్సిందే!

ఆర్కే

Updated Date - Jan 21 , 2024 | 06:34 AM