Share News

Weekend Comment by RK : కారు, కమలం కలిస్తే..!

ABN , Publish Date - Feb 18 , 2024 | 01:43 AM

‘‘శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దూకుడును భరించలేకుండా ఉన్నాం. ఒక మెట్టుదిగైనా భారతీయ జనతా పార్టీతో లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్‌ పార్టీని దెబ్బకొట్టకపోతే....

Weekend Comment by RK : కారు, కమలం కలిస్తే..!

‘‘శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దూకుడును భరించలేకుండా ఉన్నాం. ఒక మెట్టుదిగైనా భారతీయ జనతా పార్టీతో లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్‌ పార్టీని దెబ్బకొట్టకపోతే రేవంత్‌ రెడ్డికి అడ్డుకట్ట వేయలేం’’... ఇది భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్ద పెట్టుకుంటున్న మొర!

‘‘సార్వత్రక ఎన్నికల్లో మీరు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారా? ఇంత నమ్మకమైన మిత్రుడిని నేను ఉండగా తెలుగుదేశం పార్టీ అవసరమేముంది? తెలుగుదేశం పార్టీతో పొత్తు ఆలోచన చేయవద్దు ప్లీజ్‌!’’... ఇది ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి చేసిన విజ్ఞప్తి!

తెలంగాణలో ప్రతిపక్షం, ఆంధ్రప్రదేశ్‌లో అధికారపక్షం బీజేపీ కరుణా కటాక్షాల కోసం ఈ విధంగా వెంపర్లాడడం ఒకింత వింతగా ఉంది. రెండు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో ఎనిమిది సీట్లలో మాత్రమే నెగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ బలం నామమాత్రమే. అయినా తెలంగాణలో 39 సీట్లు గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్‌, ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ కూడా బీజేపీ అండకోసం అల్లాడిపోవడం వర్తమాన రాజకీయాలను ఆశ్చర్యపరిచే పరిణామం.

వామ్మో... రేవంత్‌!

శనివారంతో ముగిసిన శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పదునైన మాటలు, వ్యాఖ్యలతో నిన్నటి వరకూ అధికారం చెలాయించిన బీఆర్‌ఎస్‌పై దుమ్మెత్తిపోశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌ వ్యంగ్యాస్ర్తాలతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి దాడిని ఎదుర్కోవడానికి హరీశ్‌ రావు, కేటీఆర్‌ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయినా అధికార పార్టీ కావడంతో కాంగ్రెస్‌దే పైచేయిగా కనిపిస్తున్నది. ఈ పరిస్థితిని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భరించలేకపోతున్నారు. గత పదేళ్లుగా అధికారం చెలాయించడానికి అలవాటుపడిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఇమడలేకపోతున్నారు. అదే సమయంలో, రెండు మాసాల తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికల్లో గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు గెలుచుకోలేని పక్షంలో తమ భవిష్యత్తు ఏమిటి? అన్న బెంగ కూడా వారిని పట్టి పీడిస్తున్నది. దీంతో బీజేపీతో చేతులు కలిపైనా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కట్టడి చేయాలని వారు కేసీఆర్‌ వద్ద మొరపెట్టుకుంటున్నారు. దీంతో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనను ప్రారంభంలో తిరస్కరించిన కేసీఆర్‌ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. అయితే... బీఆర్‌ఎస్‌తో చేతులు కలపడానికి బీజేపీ సిద్ధపడుతుందా, లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నగా ఉంది. తాజా సమాచారం ప్రకారం పొత్తుకోసం బీఆర్‌ఎస్‌ నుంచి వస్తున్న ప్రతిపాదనను కేంద్రమంత్రి అమిత్‌ షా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వద్ద తోసిపుచ్చినట్టు తెలిసింది. అయితే, ‘పొత్తులు ఉండబోవని ఇప్పుడే స్పష్టం చేయవద్దు–ఆలోచిస్తున్నాం’ అని మాత్రమే చెబుదామని అమిత్‌ షా సూచించినట్టు తెలిసింది.

ఎన్నికల తర్వాత ఏమవుతుంది?

లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకొనే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలని, కుదిరితే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోసి, తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని బీజేపీకి చెందిన కొందరు ఆలోచన చేస్తున్నారు. ఆ పార్టీ కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణపై దృష్టి పెట్టింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో బీజేపీకి లభించే సీట్లు, ఎన్డీయే బలం ఏ మేరకు పెరగనున్నదన్న దానిపై స్పష్టత వచ్చాక బీజేపీ పెద్దలు తెలంగాణలో తమ వ్యూహాన్ని అమలుచేసే అవకాశం ఉంది. తమకు ఉత్తరాదిన తిరుగులేని పరిస్థితి ఉన్నప్పటికీ దక్షిణాదిన పరిస్థితులు అనుకూలంగా లేకపోవడాన్ని బీజేపీ అగ్ర నాయకత్వం జీర్ణించుకోలేకపోతున్నది. దీనికితోడు కర్ణాటకలో అధికారం కోల్పోవలసి రావడం, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి రావడంతో దక్షిణాదిపై ఫోకస్‌ పెంచారు. కేరళ, తమిళనాడులో ఇప్పటికిప్పుడు చేయగలిగింది ఏమీ లేకపోయినప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బలం పెంచుకోవడానికి పావులు కదుపుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ సహజంగానే కొంత బలహీనపడుతుంది. అదే సమయంలో, ఈ ఎన్నికల్లో మోదీ ప్రభావం కూడా ఉంటుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్‌–బీజేపీ మధ్యనే ఉంటుందన్న అభిప్రాయం ఉంది. అదే జరిగితే లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ మనుగడ కష్టతరంగా ఉంటుంది. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కలవరం చెందుతున్నారు. అదే సమయంలో... తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అస్తిత్వం పోవాలని బీజేపీ కోరుకుంటోంది. అప్పుడు రాష్ట్ర రాజకీయాలు కాంగ్రెస్‌–బీజేపీ మధ్య కేంద్రీకృతం అవుతాయి. కేసీఆర్‌కు కూడా ఈ విషయం తెలుసు. తన పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని ఆయన గ్రహించారు. అందుకే బీజేపీతో పొత్తు గురించి మాట్లాడే వారిని గట్టిగా నిరోధించలేకపోతున్నారు. కాకపోతే పొత్తులకు సంబంధించిన చాయిస్‌ తన చేతుల్లో లేదని ఆయనకు తెలుసు. ఆ కారణంగానే గుంభనంగా ఉంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి పనితీరుకు మంచి మార్కులే లభిస్తున్నప్పటికీ ఆయన ప్రభుత్వ స్థిరత్వంపై ఎవరి సందేహాలు వారికి ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుందన్న దానిపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌–బీజేపీ–మజ్లిస్‌కు కలిపి 54 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆరుగురు కాంగ్రెస్‌ సభ్యులు పక్కచూపులు చూసినా ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లేనందున ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. ఇంకోవైపు... కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని, అదను చూసి దెబ్బకొడతామని బీఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల వరకు ఇటువంటి ఊహాగానాలే సాగుతాయి. ఆ తర్వాత ఆయా పార్టీల గెలుపు ఓటములను బట్టి తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు జరుగుతాయో స్పష్టమవుతుంది. ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు చెప్పుకోవాలి. బీఆర్‌ఎస్‌తో పొత్తు వద్దని ప్రస్తుతం భావిస్తున్న బీజేపీ కేంద్ర నాయకత్వం చివరి క్షణంలో మనసు మార్చుకుంటే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కష్టాలు మొదలవుతాయి. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుచుకున్న మున్సిపాలిటీలలో ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా వాటిని హస్తగతం చేసుకోవడంపై కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం దృష్టి సారించింది. అదే సమయంలో, శాసనసభ ఎన్నికల్లో తాము ప్రభావం చూపలేకపోయిన హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలపై కూడా దృష్టి కేంద్రీకరించింది. బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నాయకులను ఆకర్షించడం ద్వారా పార్టీని పటిష్ఠం చేసుకోవడంపై కాంగ్రెస్‌ దృష్టి పెట్టింది. ఈ కారణంగా కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. అయితే జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలను హస్తగతం చేసుకోవడం వల్ల పార్టీ బలం నిజంగా పెరుగుతుందా? అంటే అనుమానమే. ఎందుకంటే శాసనసభ ఎన్నికలు జరిగే నాటికి రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు బీఆర్‌ఎస్‌ చేతిలోనే ఉన్నాయి. అయినా ఆ పార్టీ ఓడిపోయింది. స్థానిక సంస్థలు ఎవరి చేతిలో ఉన్నా సార్వత్రక ఎన్నికల్లో వాటి ప్రభావం ఉండదని అనేక సందర్భాలలో రుజువైంది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కూడా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదు. ఉదాహరణకు తాండూరుకు చెందిన మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి శాసనసభ ఎన్నికల సమయంలో మంత్రిగా ఉన్నారు. అయినా తాండూరులోనే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాలలో కూడా బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. ఇప్పుడు ఆయనతోపాటు ఆయన భార్య, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సునీతా రెడ్డి కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. చేవెళ్ల లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకోవడానికి వీరి చేరిక ఉపయోగపడుతుందో లేదో చూడాలి.

ఇరువురికీ అగ్నిపరీక్షే...

లోక్‌సభ ఎన్నికలు భారత రాష్ట్ర సమితికి మాత్రమే కాదు– ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కూడా పరీక్షగా నిలవబోతున్నాయి. సేఫ్‌ జోన్‌లో ఉన్నది భారతీయ జనతా పార్టీ మాత్రమే. గతంలో నాలుగు స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ ఇప్పుడు ఎనిమిది స్థానాలను గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉంది. నాలుగుకంటే ఎన్ని ఎక్కువ వచ్చినా ఆ పార్టీకి బోనస్‌గానే పరిగణించాలి. బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా కనిపిస్తున్నప్పటికీ ఎన్నికల అనంతరం కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడితే ఎదురయ్యే సవాళ్లు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో కొనసాగడం బీఆర్‌ఎస్‌కు మాత్రమే కాదు – బీజేపీకి కూడా ఇష్టం ఉండదు. ఈ కారణంగా గుర్రం ఎగరావచ్చు అన్నట్టు బీఆర్‌ఎస్‌–బీజేపీలు ఎన్నికల నాటికి చేతులు కలిపినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. పొత్తు ప్రతిపాదనలను బీజేపీ కేంద్ర నాయకత్వం తిరస్కరిస్తున్నప్పటికీ బీఆర్‌ఎస్‌ మాత్రం తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. బీఆర్‌ఎస్‌–బీజేపీ మధ్య లోపాయికారీ అవగాహన ఉందని శాసనసభ ఎన్నికలకు ముందే ప్రజలు బలంగా నమ్మారు. బీఆర్‌ఎస్‌ ఓటమికి అది కూడా ఒక కారణం. ఈ కారణంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొత్తగా వచ్చే నష్టం ఉండబోదని బీఆర్‌ఎస్‌ నాయకులు అభిప్రాయపడుతున్నారు. వారు ఆలోచిస్తున్నట్టు బీజేపీతో నిజంగా పొత్తు కుదిరితే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఇబ్బందే. లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభావం కనీసం ఐదు శాతం ఉంటుంది. దీనికి బీఆర్‌ఎస్‌ బలం కూడా తోడైతే కాంగ్రెస్‌ పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపకుండా ఉండదు. రాజకీయాలలో 2+2 నాలుగు కాకపోవచ్చునుగానీ ఆ రెండు పార్టీలూ కలిస్తే మాత్రం వారి బలాన్ని తేలికగా తీసిపారేయలేము. ఓటమి తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేసీఆర్‌ నిర్వహించిన తొలి బహిరంగ సభ సక్సెస్‌ అయిందనే చెప్పాలి. కేసీఆర్‌ను తెలంగాణ బాపుగా చిత్రీకరించడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ కదిలించి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలను బీఆర్‌ఎస్‌ చేస్తోంది. రాజకీయ పార్టీలకుగానీ, వాటి అధినేతలకు గానీ ఎన్నికల్లో ఓడిపోవడాన్ని మించిన శిక్ష ఉండదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత గత ప్రభుత్వాల వైఫల్యాల గురించి ఎంతగా చెప్పినా ప్రజల చెవికెక్కదు. అధికారంలో ఉన్న వారి పనితీరునే ప్రజలు గమనిస్తారు. అధికారంలో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని అనేక విధాలుగా వేధించారు. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇప్పుడు రేవంత్‌ రెడ్డి భావిస్తే ఉపయోగం ఉండదు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి ఎగబాకడానికి కేసీఆర్‌ అదేపనిగా వేధించడం కూడా ఒక కారణం. గత పాలకుల పాపాలను ప్రజలు ఇట్టే మరచిపోతారు. ఎమర్జెన్సీ అకృత్యాలను రెండేళ్లలోనే మరచిపోయిన ప్రజలు ఇందిరాగాంధీకే మళ్లీ పట్టం కట్టారు. 1989లో ఎన్టీఆర్‌ను ఓడించిన తెలుగు ప్రజలు 1994లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా తీర్పు ఇచ్చారు. తుంటి ఎముక విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను పరామర్శించినప్పుడు రేవంత్‌ రెడ్డిని పలువురు అభినందించారు. కక్షలు, కార్పణ్యాలు అధికారంలో ఉన్న వారికి మేలు చేయవని ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభకు రాకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ సమయంలో రేవంత్‌ రెడ్డి అండ్‌ కో దెప్పిపొడిచినంత మాత్రాన అదనంగా ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. అధికారం తలకెక్కడం వల్లే కేసీఆర్‌కు ప్రస్తుత దుస్థితి. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుందా? ఉండదా? అని ముఖ్యమంత్రి రేవంత్‌ ఆలోచించుకోవాలి. పడ్డవాడు చెడ్డవాడు కాదు. అందుకే రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతానికి లోక్‌సభ ఎన్నికల గండం దాటడంపైనే రేవంత్‌ రెడ్డి దృష్టి కేంద్రీకరించడం మంచిది. బీఆర్‌ఎస్‌–బీజేపీ ఏ కారణంవల్లనైనా చేతులు కలిపితే ఎదురయ్యే పరిస్థితులను అధిగమించడంపై ఆయన దృష్టి పెట్టాలి.


జగన్‌ మొర ఆలకించారా...

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రధాని మోదీకి పెట్టుకుంటున్న మొర విషయానికి వద్దాం! ప్రధానమంత్రి అనుమతితో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఢిల్లీకి ఆహ్వానించి పొత్తు విషయం కదిపారు. దీంతో కలవరపాటుకు గురైన జగన్‌ ఆ వెంటనే ఢిల్లీకి పరిగెత్తి ప్రధాని మోదీని కలిశారు. నమ్మకమైన మిత్రుడిని నేనుండగా ఆ తెలుగుదేశం అవసరం ఎందుకు? ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవద్దు ప్లీజ్‌ అని ప్రధానిని వేడుకున్నారు. ఈ విజ్ఞప్తికి ప్రధాని స్పందన ఏమిటో తెలియనప్పటికీ జగన్‌రెడ్డి మాత్రం ప్రధానితో సమావేశం తర్వాత తెలుగుదేశంతో పొత్తు ఉండదు, భయపడవద్దు అని తనకు అత్యంత సన్నిహితులైన వారి వద్ద చెప్పుకొన్నారు. దీంతో సదరు సన్నిహితులు ఊపిరి పీల్చుకున్నారు. ‘తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోబోం అని ప్రధాని మా వాడికి హామీ ఇచ్చారట’ అని కనిపించిన వారందరికీ వారు చెబుతున్నారు. ప్రధాని ఏమి చెప్పారో, జగన్‌కు ఏమి అర్థమైందో తెలియదుగానీ ఆ తర్వాత కూడా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఒక సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీయేలోకి పాత మిత్రులు వస్తున్నారని, అందులో తెలుగుదేశం పార్టీ కూడా ఉంటుందని చెప్పారు. అయినా తెలుగుదేశం–బీజేపీ మధ్య పొత్తు ఉండబోదని జగన్‌ శిబిరం భరోసాగా ఉంది. నిజానికి బీజేపీ కలవడం వల్ల ఓట్లపరంగా తెలుగుదేశం పార్టీకి పెద్దగా ఒనగూరే ప్రయోజనం ఉండదు. అయినా పొత్తు ప్రతిపాదనలపై జగన్‌ అండ్‌ కో ఉలికిపాటుకు గురవుతోందంటే అందుకు కారణం లేకపోలేదు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సమయంలో చేసినటువంటి అరాచకాలకు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా తెరలేపి మళ్లీ అధికారంలోకి రావొచ్చునని జగన్మోహన్‌ రెడ్డి లెక్కలు వేసుకుంటున్నారు. తన ఆటలు సాగాలంటే ఎన్నికల కమిషన్‌ సహకారం అవసరం. తెలుగుదేశం–బీజేపీ మధ్య పొత్తు కుదిరితే ఎన్నికల కమిషన్‌ నుంచి జగన్‌కు సహకారం లభించదు. అప్పుడు వచ్చే ఎన్నికల్లో తన ఆటలు సాగవని ముఖ్యమంత్రి జగన్‌ భయపడుతున్నారు. ఈ కారణంగానే ఢిల్లీకి పరుగులు తీసి ప్రధాని మోదీని కలిసి పొత్తు పెట్టుకోవద్దని వేడుకున్నారు. రాజ్యసభలో బీజేపీకి ఇప్పటికీ మెజారిటీ లేదు. అందుకే కీలక సందర్భాలలో వైసీపీ సహకారం తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌ అధికారం కోల్పోయినా రాజ్యసభలో వైసీపీ సహకారం బీజేపీకి అవసరం. ఈ కారణంగా తెలుగుదేశంతో పొత్తు ఉంటుందని ముఖం మీదే చెప్పకుండా దేఖేంగే అని ప్రధాని మోదీ చెప్పి ఉండవచ్చు. అమిత్‌ షా వ్యాఖ్యల తర్వాత ముఖ్యమంత్రి జగన్‌లో భయం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆ రెండు పార్టీల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే బాధ్యతను బీజేపీలోని తన రహస్య మిత్రులకు అప్పగించినట్టు ఉన్నారు. ఫలితంగానే బీజేపీకి చెందిన విష్ణువర్ధన్‌ రెడ్డి శుక్రవారంనాడు మాట్లాడుతూ... పొత్తు కోసం తెలుగుదేశం పార్టీనే వెంటపడుతోందని, బీజేపీ నాయకుడే ముఖ్యమంత్రి అయ్యే పక్షంలోనే పొత్తు ఉంటుందని వాచాలత్వం ప్రదర్శించారు. ఆ వ్యాఖ్యలను పార్టీ అధికార ప్రతినిధి ఖండించడం కూడా జరిగింది.

వికటిస్తున్న జగన్‌ ప్రయోగాలు...

రాష్ట్రంలో పెద్దగా బలంలేని బీజేపీ గురించి జగన్మోహన్‌ రెడ్డి భయపడటానికి కారణం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజల నాడి పసిగట్టిన పార్టీకి చెందిన పలువురు ముఖ్యులు తెలుగుదేశం వైపు చూస్తున్నారు. జగన్మోహన్‌ రెడ్డి నుంచి టికెట్‌ హామీ పొందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తానంటే జంప్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నెల్లూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేయడానికి జగన్‌ వద్ద అంగీకరించిన వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి ఆ తర్వాత మనసు మార్చుకొని తెలుగుదేశం నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయన సతీసమేతంగా వెళ్లి చంద్రబాబును కలుసుకున్నారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు లోక్‌సభ అభ్యర్థుల కోసం వైసీపీ తంటాలు పడుతోంది. ముప్పై ఏళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకున్న జగన్మోహన్‌ రెడ్డి, పార్టీ తరపున పోటీ చేసే వారికోసం ఐదేళ్లకే కాగడా పెట్టి వెతుక్కొనే పరిస్థితి రావడం, పార్టీ టికెట్‌ పొందిన వారు సైతం పారిపోయే పరిస్థితి రావడం స్వయంకృతాపరాధమే. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో కొందరికి టికెట్‌ నిరాకరించడం, మరి కొందరిని వేరే నియోజకవర్గాలకు బదిలీ చేయడం వంటి చర్యలన్నీ వికటిస్తున్నాయి. ఎన్నికలు సమీపించే కొద్దీ ప్రజాభిప్రాయం స్పష్టమవుతున్నందున వైసీపీ తరఫున పోటీ చేయడానికి పలువురు భయపడుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌ బుజ్జగింపులు పనిచేయడం లేదు. అయినా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిలో ఇంకా ఎక్కడో ధీమా ఉంటోంది. ఎన్నికల్లో యధేచ్ఛగా అక్రమాలు చేయవచ్చునన్న ధీమాతోనే ఆయన భరోసాగా ఉండివుండవచ్చు. ‘మా ఓటర్లు వేరు’ అని సజ్జల వంటి వారు చేసిన ప్రకటనలు ఈ కోణంలోనే చూడాలి. ఇప్పటికే పలు నియోజకవర్గాలలో కనీసం ఐదారు వేల వరకు దొంగ ఓట్లు ఉన్నాయని చెబుతున్నారు. రాష్ట్రంలో మూడు నాలుగు దశల్లో ఎన్నికలు జరిపించగలిగితే దొంగ ఓటర్లను వాడుకోవచ్చునని జగన్‌ శిబిరం భావిస్తోంది. తెలుగుదేశం–బీజేపీ మధ్య పొత్తు కుదిరితే వారు ఆశిస్తున్నట్టు జరగదు. ఈ కారణంగానే పొత్తు అన్న మాట వినపడగానే వైసీపీ నాయకులు ఉలిక్కిపడుతున్నారు. ఏది ఏమైనా పొత్తుల వ్యవహారం మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఆ తర్వాత జగన్‌ శిబిరంలో వణుకు మొదలవుతుంది. ప్రస్తుతం జగన్‌ కోసం అన్ని నిబంధనలను అతిక్రమించి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న ఐపీఎస్‌ అధికారులు కూడా పొత్తు కుదిరితే భయపడతారు. ఈ పరిస్థితి ఏర్పడుతుందని జగన్‌రెడ్డికి తెలుసు. ఎంతటి పాలెగాడైనా పోలీసుల సహకారం లేకపోతే పిల్లికంటే అధ్వానంగా వ్యవహరిస్తారు. జగన్‌ ఇందుకు అతీతుడుకారు. తెలుగుదేశం–బీజేపీ మధ్య పొత్తు చెడగొట్టడానికి జగన్‌ చివరి వరకు ప్రయత్నిస్తారు. ఆయన ప్రయత్నం ఫలిస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాలి. ఏది ఏమైనా ఒకప్పుడు ‘ఎంత మంది కలిసినా నా వెంట్రుక కూడా పీకలేరు’ అని ఘీంకరించిన జగన్‌ ఆ తర్వాత ‘మిమ్మల్నే నమ్ముకున్నాను’ అని వాలంటీర్లను వేడుకునే దాకా దిగజారారు. ఇప్పుడు మరింత దిగజారి కుట్రలు, కుయుక్తులకు పాల్పడైనా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. అహం తలకెక్కిన ఏ నాయకుడికైనా పతనం కాచుకొని ఉంటుంది. జగన్మోహన్‌ రెడ్డి కూడా ఇందుకు మినహాయింపు కాదు!

ఆర్కే

Updated Date - Feb 18 , 2024 | 04:28 AM