ఏడాది పాలన ఎటు?
ABN , Publish Date - Dec 01 , 2024 | 01:40 AM
తెలంగాణలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత తొమ్మిదిన్నరేళ్లు ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో రేవంత్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషించారని చెప్పవచ్చు...
తెలంగాణలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత తొమ్మిదిన్నరేళ్లు ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో రేవంత్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషించారని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న తన లక్ష్యాన్ని కూడా ఆయన నెరవేర్చుకున్నారు. అనూహ్యంగా ప్రతిపక్షానికి పరిమితమైన భారత రాష్ట్ర సమితి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. గతంలో మంత్రి పదవి చేపట్టిన అనుభవం కూడా లేని రేవంత్‌రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనను ఇప్పుడు సమీక్షించుకుందాం! పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పట్టుబట్టి మరీ రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న భట్టి విక్రమార్క, ఉత్తమకుమార్ రెడ్డి వంటివారు సర్దుకుపోవాల్సిన పరిస్థితి. రేవంత్‌రెడ్డి కూడా పార్టీలో తనపై అసంతృప్తి ఏర్పడకుండా సీనియర్లకు సముచిత ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీ పరంగా రేవంత్‌రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వపరంగా ప్రజల్లో అసంతృప్తి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం కొంత విఫలమయ్యారని మాత్రం చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ప్రజల్లో అంచనాలు అమాంతం పెరిగాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇచ్చింది. అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేసీఆర్ ఉన్నప్పుడే క్షీణించింది. దీంతో పాత పథకాలతో పాటు కొత్త పథకాల అమలుకు నిధుల కొరత ఏర్పడింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించడాన్ని ప్రజలు హర్షిస్తారుగానీ ప్రభుత్వాధినేతగా ఆచితూచి వ్యవహరించాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించడం వల్ల రేవంత్‌రెడ్డి కొన్ని సమస్యలను కొని తెచ్చుకున్నారు. రైతులకు రుణ మాఫీ అమలు విషయంలో ముఖ్యమంత్రి తొందరపడ్డారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు పన్నిన ఉచ్చులో రేవంత్ చిక్కుకున్నారు. పాత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగిస్తూ కొత్త పథకాల అమలుకు పూనుకుంటే ప్రజలు హర్షిస్తారుగానీ, అమలులో ఉన్న పథకాలను నిలిపివేసి కొత్తగా ఎన్ని పథకాలు అమలు చేసినా ప్రజలు సంతృప్తి చెందరన్న మౌలిక సూత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విస్మరించారు. అందుబాటులో ఉన్న నిధులన్నింటినీ రైతు రుణ మాఫీకి మళ్లించడం వలన పాత పథకాలకు నిధుల కొరత ఏర్పడింది. ఫలితంగా రైతు భరోసా వంటి పథకాల అమలు నిలిచిపోయింది. దీనిపై ప్రజల్లో, ముఖ్యంగా రైతుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ పరిస్థితిని గ్రహించిన రేవంత్‌రెడ్డి రైతు భరోసా ఇవ్వటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పెదవి విరవడానికి పెన్షన్ల పెంపు వంటి హామీలతోపాటు అభివృద్ధి పథకాల అమలు నిలిచిపోవడం కూడా కారణంగా కనిపిస్తోంది. అనేక నీటి పారుదల ప్రాజెక్టులు నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయి. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం లోపించడంతో అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కోసం వెతుక్కోవలసిన పరిస్థితి! కేసీఆర్ పాలనలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు కూడా చెల్లింపులకు నోచుకోలేదు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాల వల్ల రియల్ ఎస్ట్టేట్ రంగం మందగించింది. ఈ కారణాల వల్ల ప్రజల వద్ద నగదు చెలామణీ తగ్గిపోయింది. ఫలితంగా ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లోపించింది.
ఏడాదిలోనే ఎందుకీ మార్పు...
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఆయన వ్యవహార శైలి పట్ల ప్రజల్లో మంచి స్పందనే వచ్చింది. అయితే ప్రభుత్వాధినేతగా నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించడంతో ఆయన విమర్శలను కొని తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకు ‘హైడ్రా’ ఏర్పాటు! చెరువులు, కుంటల పరిరక్షణకు హైడ్రా ఏర్పాటును అందరూ స్వాగతించారు. ఎప్పుడయితే పేదలు, మధ్యతరగతి వాళ్లు నిర్మించుకున్న, కొనుగోలు చేసిన ఇళ్లను కూల్చే ప్రయత్నం జరిగిందో అప్పటి నుంచి హైడ్రాపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఫాం హౌజ్‌లను కూల్చివేసినప్పుడు స్వాగతించిన వాళ్లు సామాన్య ప్రజల ఇళ్ల జోలికి వచ్చేసరికి వ్యతిరేకించారు. అదే సమయంలో మూసీ ప్రక్షాళన తెరమీదకు రావడంతో ప్రజల్లో ప్రభుత్వంపై అపోహలు నెలకొన్నాయి. మూసీ ప్రక్షాళన– హైడ్రా వంటి ఆపరేషన్లను ఒకే పర్యాయం అమలు చేయాలనుకోవడమే ప్రభుత్వం చేసిన తప్పు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆరేడు నియోజకవర్గాలకు సాగునీరు అందించే మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందిగానీ, మొదటగా మూసీకి ఇరువైపులా ఉన్న ఇళ్లను కూల్చివేయబోతున్నట్టుగా వాటిపై ఎరుపు రంగు అక్షరాలతో మార్కింగ్ చేయించడం మరో తప్పిదం. నిజానికి ఈ చర్యకు హైడ్రాతో సంబంధం లేదు. అయినా హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు జరగబోతున్నాయన్న ప్రచారం జరిగింది. దీంతో మూసీ ప్రక్షాళనను ప్రజలు అపార్థం చేసుకున్నారు. నిజానికి ప్రభుత్వం కూడా ముందుగా అక్రమణల తొలగింపు జోలికి వెళ్లకుండా ఉండాల్సింది. పై నుంచి, కింది నుంచి మూసీ ప్రక్షాళన పనులు చేపట్టి ఉంటే ఈ ప్రాజెక్టును ప్రజలు అర్థం చేసుకొని స్వాగతించే వారు. సినిమాల్లో చూపించినట్టుగా ముఖ్యమంత్రిగా క్షణాల్లో అద్భుతాలు సృష్టించలేమన్న వాస్తవాన్ని రేవంత్‌రెడ్డి గ్రహించాలి. లక్ష్యం ఎంత మంచిదైనా దాన్ని చేరుకోవడానికి ఎంచుకొనే మార్గం కూడా ఉన్నతంగా ఉండాలి. ప్రభుత్వం అంటే ప్రతిపక్షాల నుంచి రాజకీయ చికాకులు ఎదురవడం సహజం. మూసీ ప్రక్షాళన, హైడ్రా ప్రాజెక్టు విషయంలో కూడా రాజకీయం మొదలైంది. ముఖ్యమంత్రి దుందుడుకుగా వ్యవహరించడమే అందుకు కారణం. దీంతో ప్రభుత్వాధినేతగా రేవంత్‌రెడ్డి పరిణతితో వ్యవహరించాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.
‘మాట’ మారాలి...
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి తన భాషను కూడా మార్చుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడిన భాషనే ఇప్పుడు కూడా వాడితే ప్రజలు హర్షించరు. తాను ఇప్పుడు ముఖ్యమంత్రిని అన్న విషయం మరచిపోయి భాష విషయంలో కేటీఆర్‌తో పోటీపడటం, సవాళ్లు విసురుకోవడం తన స్థాయిని తగ్గించుకోవడమే అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముతక భాషను వినీవినీ ప్రజలు విసుగు చెందారు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత బూతులు పోయాయి. నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్నాయి. ఆమోదయోగ్యం కాని భాషను ఇప్పుడు తెలంగాణలో వాడుతున్నారు. ప్రతిపక్షానికి పరిమితమవాల్సి వస్తుందని ఊహించని కేటీఆర్‌వంటి వారిలో అసహనం ఏర్పడటం సహజం. సీనియర్ అధికారులను కూడా కేటీఆర్ వాడూ వీడూ అని సంబోధించడాన్ని ప్రజలు హర్షించడం లేదు. ఇలాంటి పద ప్రయోగాలు అహంభావానికి నిదర్శనంగా నిలుస్తాయి. అలాంటప్పుడు భాష విషయంలోగానీ, సవాళ్ల విషయంలోగానీ కేటీఆర్‌తో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్‌రెడ్డి పోటీపడకూడదు. ముఖ్యమంత్రి తన భాషను సరిదిద్దుకోవాలని, హుందాతనాన్ని ప్రదర్శించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మొత్తమ్మీద నాలుగైదు విషయాలలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తొందరపాటు ప్రదర్శించింది. అదే సమయంలో పాత పథకాల అమలు నిలిచిపోవడం కూడా ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడటానికి కారణమైంది. రేవంత్‌రెడ్డి తన ఏడాది పాలనను సమీక్షించుకొని లోపాలను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయం!
బీఆర్‌ఎస్ పరిస్థితి ఏమిటి...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ల గడువు ఉంది. ప్రభుత్వంపై ప్రజల్లో కొంత మేర అసంతృప్తి ఉందికానీ వ్యతిరేకత మాత్రం ఏర్పడలేదు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని, ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, తమ పాలనకోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని కేసీఆర్ అండ్ కో భావిస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో అంత సీన్ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో భారత రాష్ట్ర సమితి నాయకులపై కోపం ఇంకా తగ్గలేదు. రేవంత్‌రెడ్డి ఏడాది పాలనను బేరీజు వేసుకుంటే ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి లేని మాట వాస్తవమే కానీ, భారత రాష్ట్ర సమితి పట్ల మాత్రం సానుకూలత ఏర్పడలేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. కేసీఆర్ తొలి విడత పాలనలో క్రమశిక్షణ కనిపించేది. ఎమ్మెల్యేలలో భయం ఉండేది. ఫలితంగా వారు అరాచకాలకు పాల్పడటానికి సాహసించేవారు కాదు. ప్రజల్లో ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ ఉండేది. ఉద్యోగులు, నిరుద్యోగులు స్వేచ్ఛ అనుభవించారు. కేసీఆర్ అంటే భయం కారణంగా ఎమ్మెల్యేలు, నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించారు. మలి విడత పాలన ఇందుకు పూర్తి భిన్నంగా ఉండింది. అధికార పార్టీ నాయకుల అరాచకాలు తారస్థాయికి చేరాయి. మంత్రులు, ఎమ్మెల్యేలను కేసీఆర్ జనం మీదకు వదిలేశారు. దీంతో వారంతా ప్రజాకంటకులుగా మారిపోయారు. ఉద్యోగ వర్గాలపై కూడా నిర్బంధాలు ఉండేవి. ప్రజల హక్కులకు భంగం వాటిల్లింది. ఎమ్మెల్యేల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఇటు ప్రజలకు, అటు ఉద్యోగులకు కల్పించారు. తొలి విడత పాలనలో కేసీఆర్ అంటే పార్టీ నాయకులకు భయం ఉండగా, మలి విడత పాలనలో కేసీఆర్ అండ్ కో అంటే ప్రజలు భయపడే పరిస్థితి. ఈ కారణంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై పూర్తి స్థాయి సంతృప్తి లేనప్పటికీ భారత రాష్ట్ర సమితి పట్ల ఇంకా సానుకూలత ఏర్పడటం లేదు. ఏడాది క్రితం పరిస్థితులను అప్పుడే ఎలా మరచిపోతామని ఆయా వర్గాలవారు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా చేయకపోయినా స్వేచ్ఛను అనుభవిస్తున్నామని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ తొందరపడుతోందన్న అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. ‘నిన్నటిదాకా మీరే అధికారంలో ఉన్నారుగా? అప్పుడే ఏం కొంపలు మునిగాయని ఆందోళనలు చేస్తున్నారు?’ అని భారత రాష్ట్ర సమితి నాయకులను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల వ్యవధి ఉంది. బీఆర్‌ఎస్ నాయకులకు ఆరాటం ఉంటే ఉండవచ్చునుగానీ ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు మార్చేయాలన్న ఆరాటం ప్రజలకు ఉండదు కదా! ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డికి ఏడాది అనుభవం వచ్చింది. ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌కు కూడా ఏడాది అనుభవం వచ్చింది. ఇప్పుడు ఉభయ పక్షాలూ ఈ ఏడాదిలో తప్పొప్పులను సమీక్షించుకోవడం అవసరం. ప్రభుత్వాధినేతగా తన పాత్రకు ఈ ఏడాది కాలంలో ఏ మేరకు న్యాయం చేయగలిగాను? అని రేవంత్‌రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలి. లోపాలు ఉంటే వాటిని గుర్తించి సరిచేసుకోవాలి. ప్రస్తుతానికి ప్రజల్లో రేవంత్‌రెడ్డిపై వ్యక్తిగతంగా క్రేజ్ తగ్గలేదు. ముఖ్యమంత్రిగా ఆయన ఎంత వరకు సక్సెస్ అవుతారా అని ప్రజలు బేరీజు వేసుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించి అందుకు అనుగుణంగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటే ఇటు పార్టీ పైనా, అటు ప్రభుత్వంపైనా ఆయనకు పట్టు పెరుగుతుంది. ఏ ప్రభుత్వానికైనా ప్రతిపక్షం నుంచి ముప్పు రాదు. ప్రజల నుంచే ముప్పు ఉంటుంది. తమ అంచనాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయని ప్రభుత్వాలను విసిరికొట్టే శక్తి ప్రజలకు మాత్రమే ఉంది. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడినందునే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. కాకపోతే కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం ఎలా అని ప్రజలు సందిగ్ధంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి తనను తాను ప్రత్యామ్నాయంగా ఆవిష్కరించుకున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌తో భారతీయ జనతా పార్టీ ఇక తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టిసారించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో రేవంత్‌రెడ్డికి బీజేపీ నుంచి కూడా సవాళ్లు ఎదురవుతాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరింత ఆచితూచి అడుగులు వేయాలి. తన ప్రభుత్వంపై ప్రస్తుతానికి సణుగుడుకే పరిమితమైన ప్రజల్లో వ్యతిరేకత నెలకొనకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దృష్టి కేంద్రీకరించాలి. లేని పక్షంలో ఇంటా బయటా ఆయనకు సమస్యలు తప్పవు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. తమ పార్టీ పట్ల ప్రజల్లో ఏడాది గడచినా సానుకూలత ఏర్పడకపోవడానికి కారణాలను అన్వేషించుకోవాలి. స్థానిక నాయకులను చూస్తేనే ప్రజలకు గతం గుర్తుకొస్తున్నందున కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే విషయాన్ని కూడా కేసీఆర్ ఆలోచించాలి. తొమ్మిదిన్నరేళ్లు అధికారం చెలాయించిన కేటీఆర్ వంటి వారు గతాన్ని మరచి అధికారులపై విరుచుకుపడటం వల్ల ప్రయోజనం ఉండదు. అధికారులను హెచ్చరించడం వేరు – దూషించడం, పరుష పదజాలం వాడటం వేరు అని కేటీఆర్ వంటి వారు గుర్తించాలి.
అలవోకగా జగన్ అబద్ధాలు...
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల విషయానికి వద్దాం! అదానీ కంపెనీతో సోలార్ పవర్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిస్సిగ్గుగా బుకాయింపునకు తెగబడుతున్నారు. తక్కువ ధరకు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా లక్ష కోట్లకు పైగా సంపద సృష్టించానని, అందుకు తనను సన్మానించాల్సింది పోయి రాళ్లు వేస్తారా అని అమాయకత్వం ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఈ మాటలు విన్నాక, ప్రజలు వెర్రివాళ్లని ఆయన కచ్చితంగా భావిస్తున్నారని అర్థమవుతుంది. ట్రాన్స్‌మిషన్ నష్టం వగైరా అదనపు భారాలను పక్కన పెట్టినా ఒక యూనిట్ రెండు రూపాయలా 49 పైసలకు 25 ఏళ్లపాటు కొనుగోలు చేసేలా జగన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంతా చేసి విద్యుత్ సరఫరా ఇంకా ప్రారంభం కూడా కాలేదు! కానీ, బహిరంగ మార్కెట్‌లో సౌర విద్యుత్ ధర ఇప్పటికే రెండు రూపాయలకు పడిపోయింది. మునుముందు మరింత తగ్గవచ్చు. జగన్ బాబూ ఇప్పుడు చెప్పు! లక్ష కోట్ల రూపాయల సంపదను సృష్టించావా? ప్రజల నెత్తిన 25 ఏళ్ల పాటు లక్షల కోట్ల భారాన్ని వేశావా? వచ్చే పదేళ్లలో సౌర విద్యుత్ రేటు యూనిట్ రూపాయిన్నరకు పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌రెడ్డి సంపద సృష్టించారా? ప్రజల జేబులు గుల్ల చేశారా? అబద్ధాలకు చొక్కా ప్యాంట్ తగిలిస్తే జగన్‌రెడ్డి కనిపిస్తారు. ఈ స్థాయిలో అలవోకగా అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన జగన్‌కు డాక్టరేట్ ఇవ్వాల్సిందే. అమెరికా ఏజెన్సీలు తన పేరు ఎక్కడా ప్రస్తావించలేదని జగన్ మరో పచ్చి అబద్ధం చెప్పారు. ఎస్‌ఈసీ తన ఫిర్యాదులో ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి’ జగన్మోహన్‌రెడ్డికి లంచం ఇచ్చారని పేర్కొనడం వాస్తవం కాదా? జగన్‌రెడ్డి ధన దాహం ఏ పాటిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అమాయకత్వం నటించినా నమ్మేవాళ్లు ఎవరూ లేరు. ప్రతిఫలం లేకుండా అతను ఏ పనీ చేయడన్న విషయం అందరికీ తెలిసిందే. కాకినాడ, గంగవరం పోర్టులు చేతులు మారడం వెనుక ఏమి జరిగిందో అందరికీ ఎరుకే. అదానీకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పలుకుబడిని అడ్డుపెట్టుకొని విద్యుత్ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పించుకోవచ్చునని జగన్‌రెడ్డి భావిస్తుండవచ్చు. చేసిన పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయమై తనపై అవాస్తవాలు ప్రచురించిన ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక 48 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించడం వింతగా ఉంది. వంద కోట్లు ఏమి ఖర్మ – లంచంగా తీసుకున్న 1750 కోట్ల రూపాయలు సరిపోలేదనుకుంటే అంతే మొత్తానికి పరువు నష్టం దావా వేసుకోవచ్చు. నిజానికి జగన్‌రెడ్డి మాపై పరువు నష్టం దావా వేయడం కాదు– ఆంధ్రప్రదేశ్ ప్రజలే ముందుకొచ్చి ఈ దిక్కుమాలిన విద్యుత్ ఒప్పందం కుదుర్చుకొని తమపై మోయలేని భారం వేసినందుకు జగన్‌రెడ్డిపై దావా వేయడంతోపాటు క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు చొరవ తీసుకోవాలి. అదానీ–జగన్ డీల్ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతున్నదో తెలియదు. ఈ ఒప్పందాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయాలన్న పాపులర్ డిమాండ్ ఉంది. అయితే ఒప్పందంలో చేర్చిన నిబంధనల ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే అదానీ కంపెనీకి మూడు వేల కోట్ల రూపాయలను నష్టపరిహారం కింద చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. జగన్‌రెడ్డి తన స్వార్థం కోసం ప్రజలనే కాదు– ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా ఇరికించారు. ఒకవేళ ఒప్పందం రద్దయితే నష్టపరిహారంగా లభించే మూడు వేల కోట్ల రూపాయలలో లంచంగా ఇచ్చిన సొమ్ము పోయినా అదానీ కంపెనీకి 1250 కోట్ల రూపాయలు మిగులుతాయి. అంటే ఈ ఒప్పందం అమలు అయినా కాకపోయినా అటు జగన్, ఇటు అదానీ కోల్పోయేది ఏమీ లేదు. ప్రజలు మాత్రం అదనపు భారాన్ని మోయాల్సిందే. ప్రభుత్వాలు లంచాలకు ఆశపడి స్వార్థం కోసం తీసుకునే నిర్ణయాల వల్ల తాము మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడితే ప్రజలకు ఉన్న వెసులుబాటు ఏమిటి? తమకు నష్టం కలిగించిన పాలకులను న్యాయస్థానాలకు లాగే వెసులుబాటు ప్రజలకు ఉంటుందా లేదా? అన్నది న్యాయ నిపుణులు చెప్పాలి. ఇటువంటి వెసులుబాటు ప్రస్తుతం లేని పక్షంలో ఆ దిశగా చట్టాలను సవరించాల్సిన అవసరం ఉంది. అలా జరిగినప్పుడు మాత్రమే పాలకుల్లో జవాబుదారీతనం వస్తుంది. లేనిపక్షంలో ఏమరుపాటుతో అధికారం కట్టబెట్టిన పాపానికి సదరు పాలకులు చేసే పాపాలకు ప్రజలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.
కేంద్రం, రాష్ట్రం చేతిలో జగన్ భవిష్యత్తు...
అదానీ–జగన్ డీల్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియదు. ఈ అంశంపై చర్చ జరగకుండానే పార్లమెంటు ఉభయ సభలూ వాయిదా పడుతున్నాయి. దీంతో కేంద్ర వైఖరి ఏమిటో తెలియని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రాన్ని ధిక్కరించి చర్యలు తీసుకొనే స్థితిలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లేదు. అందుకే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా జగన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం లేదు. మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని చెబుతున్నారు. నిజానికి ఇందులో పరిశీలించాల్సింది ఏమీ లేదు. రాజకీయంగా ఎదురవుతున్న పరిస్థితుల గురించి చెప్పుకోలేరు కనుక పరిశీలిస్తున్నామని ప్రభుత్వంలో ఉన్నవారు చెప్పుకొంటున్నారు. గజం మిథ్య పలాయనం మిథ్యగా ఈ వ్యవహారం ముగిసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండదు. అదానీని మినహాయించి జగన్‌రెడ్డికి మాత్రం ఈ కుంభకోణాన్ని పరిమితం చేయడంలోని సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం దృష్టి పెడుతుందేమో తెలియదు. ప్రభుత్వ నిర్ణయాలను న్యాయస్థానాల్లో ప్రశ్నించే హక్కు పౌరులకు ఉంటుంది. ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందం కూడా ప్రభుత్వ నిర్ణయమే. రాష్ట్రంలోని ప్రతి పౌరుడిపై దీని ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా ప్రభుత్వ నిర్ణయ బాధితులుగా ఎవరైనా కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందో లేదో న్యాయ నిపుణులు చెప్పాలి. ఈ వ్యవహారంలో జగన్‌రెడ్డి ఘీంకరింపులు, హూంకరింపులు ఎలా ఉన్నా ప్రజా క్షేత్రంలో ఆయన దోషిగా నిలబడక తప్పదు. లంచం తీసుకోకుండా ఆయన ఈ ఒప్పందం కుదుర్చుకున్నారంటే ఒక్కరు కూడా నమ్మరు. ఆయన మద్దతుదారులకు కూడా ఈ విషయంలో క్లారిటీ ఉంటుంది. అదానీతో డీల్స్ కుదుర్చుకుంటే తాను సేఫ్‌గా ఉంటానని జగన్‌రెడ్డికి తెలుసు. అందుకే రాష్ట్రంలోని వనరులన్నీ అదానీకి దోచి పెట్టడానికి జగన్‌రెడ్డి తెగబడ్డారు. ఉభయకుశలోపరి అంటే ఇదే! వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు కుప్పకూలుతుంది అంటారు. తండ్రి అధికారంలో ఉన్నప్పటి నుంచి అక్రమ సంపాదనకు అలవాటు పడిన జగన్‌రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయంతో వలలో చిక్కారు. గతంలో ‘నేను అధికారంలో ఉన్నానా? లంచాలు తీసుకోవడానికి!’ అని బుకాయించేవారు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఇది జరిగింది కనుక అదే బుకాయింపు కుదరదు. అయితే ఇంకో నాలుగు రోజులు పోతే ప్రజలు కూడా అలవాటు ప్రకారం ఈ కుంభకోణాన్ని మరచిపోవచ్చు. జగన్ ధీమా కూడా అదే. తన రాజకీయ ప్రత్యర్థి ఇంత కాలానికి తన చేతికి చిక్కినందున ఈ మహదావకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వదులుకుంటారా? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. కేంద్ర పెద్దలను నొప్పించకుండా ఒప్పించగలిగితే తన రాజకీయ ప్రత్యర్థిని దెబ్బకొట్టే అవకాశం చంద్రబాబుకు లభిస్తుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడానికి అదానీ సిద్ధపడితే మాత్రం జగన్‌రెడ్డి సేఫ్ అవుతారు. ఈ కుంభకోణం కోల్డ్ స్టోరేజీకి చేరుతుందా? లేక జగన్ మెడకు చుట్టుకుంటుందా? అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే!
ఆర్కే
యూట్యూబ్‌లో
‘కొత్త పలుకు’ కోసం
QR Code
scan
చేయండి