ఔను... కలికాలమే!
ABN , Publish Date - Apr 07 , 2024 | 12:18 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ‘కలికాలం’ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. రాజకీయాల్లో విలువలు, నైతికత లోపించడం చూస్తే కలికాలం గుర్తుకొస్తోందని అంటున్నారు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ‘కలికాలం’ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. రాజకీయాల్లో విలువలు, నైతికత లోపించడం చూస్తే కలికాలం గుర్తుకొస్తోందని అంటున్నారు. ఆయన ఏ ఉద్దేశంతో ఈ మాటలు అంటున్నారోగానీ... మనం ఇప్పుడు కలికాలంలోనే ఉన్నాం! కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం తర్వాత కలికాలం వస్తుందని పురాణాల్లో చెప్పారు. మనం ఇప్పుడు కలికాలంలోనే జీవిస్తున్నాం. న్యాయం, ధర్మం స్థానంలో అధర్మం, అన్యాయం రాజ్యమేలుతోంటే కలికాలంకాక మరేమిటి? జగన్మోహన్ రెడ్డి వంటి వారు అధికారంలోకి రావడం కలికాలానికి సంకేతంకాక మరేమిటి? ప్రజలు కూడా న్యాయానికి, అన్యాయానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేని స్థితికి చేరుకోవడం, మారీచుల వంటి వారు మహానుభావులుగా గుర్తింపు పొందడం కలికాలం లక్షణమే! రక్తం పంచుకు పుట్టినవాళ్లు తమకు న్యాయం చేయవలసినదిగా ఆర్తనాదాలు చేస్తున్నప్పటికీ చెవికెక్కించుకోకుండా ధర్మోపన్యాసాలు చేయడం సాధారణ వ్యక్తులకు సాధ్యమా? తమ చిన్నాన్నను హత్య చేసింది, చేయించింది ఎవరో ఆ దేవుడికి, కడప జిల్లా ప్రజలకే తెలుసునని జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా చెప్పుకొచ్చారు. కలికాలంలో కలి ప్రభావం కారణంగా దేవుళ్లు నిమిత్తమాత్రులవుతారు, పాలకులే శక్తిమంతులుగా అవతరిస్తారు. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో, చేయించారో దేవుడికంటే పాలకులకే తెలుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డిని హత్య చేయించింది నాటి ముఖ్యమంత్రి చంద్రబాబే అని నిందించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పూర్తిచేసుకుంటున్న తరుణంలో హంతకులెవరో ఆ దేవుడికి ఎరుక అనడం ఏమిటి?
నాన్న, చిన్నాన్న... మరణాలతో రాజకీయం
ఐదేళ్లు వెనక్కు వెళితే, వివేకానంద రెడ్డి హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి మాటలు నిజమేనని గుడ్డిగా నమ్మి... ఆయన సోదరీమణులు బాసటగా నిలిచారు. 2019 ఎన్నికల్లో జగన్‌కు రాజకీయ లబ్ధి కలిగేలా ప్రచారం కూడా చేశారు. సీన్ కట్ చేస్తే ఐదేళ్ల తర్వాత వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిని ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి రక్షిస్తున్నారని ఆయన తోబుట్టువులే చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం రక్తంలో తడిసిందని వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఆరోపిస్తుండగా, తమ చిన్నాన్నను హత్య చేయించిన వారికి అండగా ఉంటూ మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చిన కారణంగానే తాను కడప నుంచి పోటీ చేస్తున్నానని షర్మిల అంటున్నారు. ముసుగులు తొలగిపోయాయి. వివేకా హత్య కేసులో ముద్దాయిగా ఉన్న అవినాశ్ రెడ్డిపై వారిరువురూ నేరుగా బాణాలు ఎక్కుపెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉంటే వివేకా హత్యకు కారణమైన అవినాశ్ రెడ్డికి ఎప్పుడో శిక్ష పడి ఉండేదని షర్మిల తాజాగా చెప్పుకొచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను అక్క చెల్లెమ్మల జీవితాల్లో ఆనందం చూడటం కోసమే పని చేశానని, ఈ ఎన్నికల్లో అవకాశం ఇస్తే మళ్లీ వారికోసం పనిచేస్తానని చెబుతున్నారు. అయితే... ఆ అక్కచెల్లెమ్మల జాబితాలో ఆయన తోబుట్టువులైన షర్మిల, సునీత ఉన్నారా? లేరా? అన్నదే ఇప్పుడు ప్రశ్న! ప్రజలు ఇప్పుడు ఎవరి మాటలు నమ్మాలి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పేది నిజం అనుకోవడానికి దాఖలాలు లేవు. వివేకానంద రెడ్డి హత్య విషయం పక్కన పెడితే... హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి మరణం వెనుక కుట్ర జరిగిందని, అప్పట్లో యూపీఏ ప్రభుత్వ సారథి సోనియాగాంధీ రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సహకారంతో రాజశేఖర రెడ్డిని చంపించారని జగన్మోహన్ రెడ్డి ఊరూవాడా ప్రచారం చేశారు. జనం కూడా కొంతవరకు నమ్మారు. తన రక్తం పంచుకుపుట్టిన జగన్ చెప్పింది నిజమేనని నమ్మిన షర్మిల కూడా అదే విధంగా ప్రచారం చేశారు. మళ్లీ సీన్ కట్ చేస్తే, ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం వెనుక ఫలానా వారు ఉన్నారని ప్రస్తావించనే లేదు. పైపెచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తండ్రి మరణానికి కారకుడు అని నిందించిన రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీని తన ఇంటికి ఆహ్వానించి ఆయన కోరిన విధంగా పరిమళ్ నట్వానీ అనే వ్యక్తికి రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారు. దాంతో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం గురించి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారం బూటకం అని తేలిపోతున్నది కదా? ఆ సంఘటన తర్వాత రాజశేఖర రెడ్డి సోదరుడైన వివేకానంద రెడ్డి తన సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. 2019 ఎన్నికలకు ముందు ఈ హత్య జరగడంతో జగన్మోహన్ రెడ్డి యథావిధిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును నిందితుడిగా ప్రచారం చేశారు. ప్రజలు కూడా కొంత వరకు నమ్మారు. అటు వివేకా కుమార్తె డాక్టర్ సునీత, ఇటు సొంత చెల్లెలు షర్మిల కూడా నిజమేనని నమ్మి ఆ మేరకు ప్రచారం చేశారు. కాలక్రమంలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వివేకాను హత్య చేసిన వారిలో ఒకరైన దస్తగిరి అప్రూవర్‌గా మారి.... ఈ హత్య చేయించింది ఎవరో చెప్పారు.
ఈ వాస్తవాన్ని డాక్టర్ సునీతతోపాటు షర్మిల కూడా జీర్ణించుకోలేకపోయారు. అయినా కొంత కాలం పాటు సోదరుడైన జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మారు. చివరకు హత్యకు కారకుడని విచారణలో తేటతెల్లమవుతున్న అవినాశ్ రెడ్డికి మద్దతుగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే నిలబడటాన్ని గ్రహించి జీర్ణించుకోలేకపోయారు. ఫలితంగానే... కడప లోక్‌సభ బరిలో అన్నా చెల్లెళ్లు బహిరంగంగా తలపడే పరిస్థితి ఉత్పన్నమైంది. తమ చిన్నాన్నను హత్య చేయించిన అవినాశ్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మళ్లీ టికెట్ ఇవ్వడాన్ని ప్రస్తుతం పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల ప్రశ్నించడంతోపాటు... అవినాశ్ రెడ్డిపై కాంగ్రెస్ తరఫున పోటీకి దిగారు. సోదరికి బాసటగా వివేకా కుమార్తె డాక్టర్ సునీత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. వివేకాను దారుణంగా చంపించిన అవినాశ్ రెడ్డిని ఓడించాలని కడప జిల్లా ప్రజలకు ఆ ఇరువురు ఆడపడుచులూ విజ్ఞప్తి చేస్తున్నారు.
అవును... కడప ప్రజలకు క్లారిటీ...
మరోవైపు అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుకోసం సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని తెలంగాణ హైకోర్టు తాజాగా ప్రశ్నించింది. అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు కోసం దస్తగిరి పెట్టుకున్న పిటిషన్‌పై హైకోర్టు సానుకూల ఆదేశాలు ఇస్తే ఎన్నిక జరిగేలోపే అవినాశ్ రెడ్డి జైలుకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో తనను ఒంటరిని చేసి రాజకీయ ప్రత్యర్థులందరూ తోడేళ్ల గుంపుగా ఒక్కటై దాడి చేస్తున్నారని, తన వాళ్లు కూడా ఒకరిద్దరు వారికి తోడయ్యారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం మొదలెట్టారు. ఈ సందర్భంగానే కలికాలం గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో తమాషా ఏమిటంటే... తల్లి విజయలక్ష్మి అటు జగన్మోహన్ రెడ్డి విజయం కోసం, ఇటు షర్మిల విజయం కోసం ప్రార్థనలు చేశారు. దీంతో ఎవరికి ఆశీస్సులు ఇవ్వాలో తెలియని సంకట స్థితిని జీసస్ క్రీస్తుకు కల్పించారు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగిన సంఘటనలు, చేసిన ప్రచారాలను పరిగణనలోకి తీసుకుంటే కలికాలానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని అనిపిస్తుంది. ధర్మం, న్యాయం కోసం సునీత, షర్మిల పోరాటం చేస్తున్నారని నమ్మాల్సిన పరిస్థితి. అయితే... కడప జిల్లా ప్రజలకు మాత్రం వివేకా హత్య వెనుక ఎవరున్నారన్న దానిపై స్పష్టత ఏర్పడిందని తెలుస్తోంది. ఎన్నికల కురుక్షేత్రంలో అవినాశ్‌ను నేరుగా ఢీకొనాలని షర్మిల నిర్ణయించుకొని బరిలోకి దిగడంతో ప్రజలకు మరింత స్పష్టత వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ అవినాశ్, షర్మిల మధ్యనే అనే భావన ప్రజల్లో ఏర్పడింది. తన తండ్రి వివేకా హత్య కేసులో న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రాకూడదని డాక్టర్ సునీత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు రాజశేఖర రెడ్డి బిడ్డగా న్యాయం, ధర్మం కోసం తనకు అండగా నిలవాలని ఓటర్లను షర్మిల వేడుకుంటున్నారు.
పని చేయని ‘మైండ్‌గేమ్’...
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభమైంది. అయితే కడప జిల్లాలో కూడా బస్సు యాత్రకు స్పందన అంతంత మాత్రంగానే లభించింది. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన బస్సు యాత్రలో పాల్గొనడానికి ఇతర జిల్లాలకు చెందిన వైసీపీ నాయకులు కూడా వెళ్లారు. ఇలా వెళ్లిన కొంతమంది నాయకులు కడప జిల్లా ప్రజల మనోగతాలను గుర్తించి ఇతర పార్టీలలో చేరేందుకు దారులు వెదుక్కుంటున్నారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో బస్సు యాత్ర ముగిసింది. రోత మీడియాతోపాటు కూలి మీడియా ప్రచారం ఎలా ఉన్నప్పటికీ ప్రజల నాడి ఏమిటో ముఖ్యమంత్రి జగన్‌కు అవగతమవుతోంది. దీంతో ఆయన మరో మాయోపాయానికి తెరతీశారు. బీజేపీతో తెలుగుదేశం–జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఈ సరికొత్త ఎత్తుగడను జగన్ అండ్ కో అమలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన కొన్ని సీట్ల విషయంలో కొంత వ్యతిరేకత ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న జగన్ అండ్ కో పొత్తుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందని, కూటమి బలం క్షీణించిందని ప్రచారం చేయడం మొదలుపెట్టింది. దీనికి దన్నుగా కొన్ని సర్వే సంస్థలకు డబ్బులిచ్చి తమ ప్రచారానికి మద్దతుగా సర్వే వివరాలు అంటూ కొన్ని గణాంకాలను జనంలోకి వదలడం మొదలుపెట్టారు. ఈ మర్మం తెలియని జగన్ వ్యతిరేకులు సైతం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ మధ్య బలపడ్డారట కదా? అని ప్రశ్నించడం మొదలైంది. వాస్తవానికి ఇదంతా జగన్ అండ్ కో ఆడుతున్న మైండ్ గేమ్. క్షేత్ర స్థాయిలో జగన్ బలం పెరగడానికి ఈ పక్షం రోజులలో చోటుచేసుకున్న మార్పులు, పరిణామాలు కూడా లేవు. ప్రజలతో మైండ్ గేమ్ ఆడటం జగన్ అండ్ కోకు కొత్త కాదు. వివేకా హత్య, కోడికత్తి కేసుల విషయంలోనూ ఇలాగే చేశారు. క్షేత్రస్థాయిలో జగన్‌కు బలం పెరిగిన విషయం వాస్తవమే అయితే ఇతర పార్టీలకు చెందినవారు వైసీపీలో చేరడానికి పోటీ పడేవారు. వాస్తవంలో అలా జరగడం లేదు. కొన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులకోసం వైసీపీ వెదుక్కోవాల్సిన పరిస్థితి. తెలుగుదేశం, జనసేన పార్టీలలో చేరేందుకు వైసీపీకి చెందినవారే పోటీ పడుతున్నారు. టికెట్ ఇస్తామన్న హామీ ఇస్తే ఇదివరకే వైసీపీలో టిక్కెట్ పొందినవారు కూడా ఈ రెండు పార్టీలలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వాస్తవ పరిస్థితి ఇది కాగా, జగన్ బలం పెరిగిందని కృత్రిమ ప్రచారానికి తెర లేపారు. పింఛన్ల విషయమే తీసుకుందాం! వలంటీర్ల ద్వారా పింఛన్లు వగైరా పంపిణీ చేయడానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకొని పెన్షన్ల పంపిణీలో జాప్యం చేస్తూ అందుకు ప్రతిపక్షాలే కారణమని నమ్మించడానికి జగన్ అండ్ కో ప్రయత్నించింది. అయితే, ఆచరణలో ఇది కూడా వికటించింది. వలంటీర్ వ్యవస్థ అమలులో లేని రాష్ర్టాలలో పెన్షన్లు పంపిణీ కావడం లేదా? అని హైకోర్టు కూడా ప్రశ్నించడంతో ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ కుయుక్తులను అర్థం చేసుకున్నారు. శవ రాజకీయాలకు చెక్ పెట్టారు.
ఎవరు ‘ముసలోడు’?
ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంత ముఖ్యమో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అంతకంటే ముఖ్యం. వయసు రీత్యా ఈ ఎన్నికల్లో విజయం సాధించడం చంద్రబాబుకు చాలా అవసరం. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాలేని పక్షంలో చంద్రబాబు రాజకీయ జీవితం ఫెయిల్యూర్‌తో ముగిసే ప్రమాదం ఉంది. అందుకే ఆయన మండుటెండలను సైతం లెక్క చేయకుండా, ముఖంలో ఎక్కడా అలసట కనపడనీయకుండా రోజుకు మూడు చోట్ల సభలు నిర్వహిస్తున్నారు. యువకుడినైన తనకు ముసలోడితో పోటీ ఏమిటని ఎద్దేవా చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం రోజుకు ఒక మీటింగ్‌తోనే సరిపెడుతున్నారు. అది కూడా సాయంత్రం పూట ఎండ వేడి తగ్గాక బయటకు వస్తున్నారు. దీంతో ఏడు పదులు దాటిన చంద్రబాబుతో ఐదు పదులు దాటిన జగన్మోహన్ రెడ్డి పోటీ పడలేకపోతున్నారన్న అభిప్రాయానికి జనం కూడా వచ్చారు. చంద్రబాబుకు మాత్రమే కాదు, యువకుడినని చెప్పుకొంటున్న జగన్‌కు కూడా ఈ ఎన్నికలు ముఖ్యమే. తెలంగాణలో తొమ్మిదిన్నరేళ్లపాటు రారాజుగా వెలుగొందిన కేసీఆర్ ప్రస్తుత పరిస్థితి చూసిన తర్వాత ఈ ఎన్నికల్లో ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఉండబోదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ ప్రభావంతో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చినా... భారత రాష్ట్ర సమితికి క్షేత్రస్థాయిలో పునాదులు బలహీనంగా ఉన్నాయని ఇప్పుడు తేటతెల్లం అయింది. రాజశేఖర రెడ్డి ప్రభావంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా సంస్థాగతంగా బలహీనంగానే ఉంది. అధికారం లేకపోతే ఆ పార్టీ మనుగడ సాగించడం కష్టతరం. తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు ఉన్నారు. ఈ కారణంగానే నాయకులు లేకపోయినా, ఎన్నికల్లో ఓడిపోయినా ఆ పార్టీ నిలదొక్కుకుంది. దీనికి తోడు చంద్రబాబుకు భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంది. ఫలితంగా పార్టీని కాపాడుకోగలిగారు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వేరు. ముఖ్యమంత్రిగా ఈ ఐదేళ్లలో ఆయన వైఖరి గమనించిన వారికి ఆయనతో బలమైన అనుబంధం ఏర్పడలేదు. దీనికితోడు ఆయన పాలనపై ఒక వర్గం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. సంక్షేమ పథకాలే మళ్లీ తమను అధికారంలోకి తెస్తాయన్న నమ్మకంతోనే ఆ పార్టీలో ఉన్నవారు ఉన్నారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం, అభిమానంతో కాదు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆ పార్టీ చెల్లాచెదురవుతుంది. జగన్ నిరాదరణకు గురైనవారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పంచన చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే వైసీపీలో అధిక సంఖ్యలో ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే వారంతా మళ్లీ కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది. ఈ కారణంగానే జగన్ సోదరి షర్మిల కూడా 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కాంగ్రెస్ నాయకత్వాన్ని చేపట్టడానికి సిద్దపడ్డారు. గత ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి కుటుంబమంతా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండింది. ఇప్పుడు ఆ కుటుంబంలో చీలిక రావడమే కాకుండా వివేకానంద రెడ్డి హంతకులను జగన్ కాపాడుతున్నారని ఇంట్లో వాళ్లే నిందిస్తున్నారు. ఇవన్నీ జగన్‌కు మైనస్ పాయింట్లు. ఈ నేపథ్యంలో మేలో జరిగే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును కూడా నిర్ణయించబోతున్నాయి. గత ఎన్నికల్లో జగన్‌కు ఎంతో కొంత రాజకీయంగా ఉపయోగపడిన వివేకా హత్య రానున్న ఎన్నికల్లో ఆయనకు ఏ మేరకు నష్టం చేయబోతుంది అన్నదే ప్రస్తుతం కీలకం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్న జగన్ మాటలను విశ్వసిస్తారా? తోబుట్టువులైన షర్మిల, సునీతల ఆక్రందనలను ఆలకిస్తారా? అన్నది జూన్ 4వ తేదీన తేలిపోతుంది. ఈ ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలిస్తే వివేకా హత్యకు కారకులైన వారు నిక్షేపంగా ఉంటారు. ఓడిపోతే మాత్రం వారు చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదు. ఈ ఐదేళ్లుగా డాక్టర్ సునీత అలుపెరుగకుండా చేస్తున్న ఒంటరి పోరాటం ఫలిస్తుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే! కలి ప్రభావం ఇంకెంత కాలం ఉంటుందో కూడా తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఎదురు చూడాల్సిందే!
ఆర్కే