లాహిరి
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:21 AM
మరో మజిలీ- ప్రతి ఏడూ ఒక విడిది. అవును విడిపోయేది విడిచేవరకూ - ప్రయాణం ఎప్పటికప్పుడు ‘విడిది’...
మరో మజిలీ-
ప్రతి ఏడూ ఒక విడిది.
అవును విడిపోయేది విడిచేవరకూ -
ప్రయాణం ఎప్పటికప్పుడు ‘విడిది’
కలిపి కుట్టేది ఏదోతెలియదు
బంధాలూ, బంధనాలూ
ఏర్పడుతూనే వుంటాయి
వదిలించుకుని విరాగి కావలసిన వయసునా
ప్రేమానురాగాలు పెనవేసుకుంటూనే వుంటాయి.
జీవన లాలస పట్టుకుని జీరాడుతూనే వుంటుంది.
తండ్రీ కొడుకు నుండి తాతా మనుమడుకు ఎదిగాక
బాధ్యత కావడి బరువు కాకున్నా
ఆపేక్ష సాపేక్షికమై
కొత్త ఆశల ఆనంద శ్వాసలందుకుంటుంది
వద్దనుకుంటే రద్దయ్యే చట్టం కాదు
పెనవేసుకునే బుల్లి చుట్టం.
కనపట్టం తరువాయి
విచ్చుకునే చిట్టిహాసరేఖలు
చుట్టుకునే వంశవృక్షశాఖలు
ఎంత వద్దనుకున్నా ఆరాటం
అటు వశీకరణమవుతూంటుంది.
ఎదుగుదల అక్కడిదే ఇక నవప్రభాతం
ఇక్కడిది కృష్ణపక్ష అవనతం
వెన్నెలకూ అమావాస్యకూ పొత్తు అంటే
గమ్మత్తు కావచ్చు కానీ
అదే జీవితం మత్తు.
నిజమే!-
అమ్మా నాన్న, భార్యాభర్త,
కొడుకు కోడలు, తాతా మనుమడు
ఏమన్నా నాణేనికి ఇరు పార్శ్వాలే
బంధం ‘విలువ’ అదే.
అందుకే
పాడుకుంటాను ఆడుకుంటాను.
తోడు అంటాను -వీడు తంటాను.
ఆఖరిచరణం తర్వాత కూడా పల్లవి వుంటుంది.
పాట సాగుతూనే వుంటుంది
బాట సాగుతూనే వుంటుంది.
మజిలీ మజిలీ లోనూ బిజిలీ వుంటుంది
వెలుగు నిజధారయై
ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది
సమకాలీనం లోనే భవిష్యత్తు రూపుదిద్దుకుని
వర్తమానం గతమయ్యే ‘వర్తమానం’ వుంటుంది.
విడిదిని అలంకరించుకుంటూనే వుండాలి.
ఆఖరి మజిలీ వరకూ
ఆశావిశ్వాసాల ఆనందం జీవనదిలో
లాహిరి సాగుతూనే వుండాలి.
-సుధామ