ఉషోదయాలకు ఊపిరి పోద్దాం!
ABN , Publish Date - Nov 14 , 2024 | 12:34 AM
యుద్ధాకాశపు కన్నీటి మేఘాల రణధ్వనుల మధ్య లక్షల బాలల ఆకలికడుపుల గేయాలు అనునాదం చెందుతున్నాయి...
యుద్ధాకాశపు కన్నీటి మేఘాల
రణధ్వనుల మధ్య లక్షల
బాలల ఆకలికడుపుల గేయాలు
అనునాదం చెందుతున్నాయి
భయపు వరదలో బాల్యపు
పరిమళం బక్కచిక్కి
తుపాకుల మోతలమధ్య
రాకెట్ల వర్షంలో తడుస్తున్నాయి
బతకడానికి బతిమాలుతూ
చంపడాన్ని తీవ్రంగా నిరసిస్తూ
శాంతికాంతి జ్వాలల వెలుగుకై
పసిపిల్లల దండు ఆర్తనాదాలతో
పలకబలపపు చరితల ఆనందపు
రహదారులను వెతుకుతున్నాయి
ఈ ఆధునికత అలజడులలో
ఒత్తిడి మాయలో బడుల్లో..
పేదరికపు సమరంలో బస్టాండుల్లో..
బాలకార్మికుల అర్ధనగ్న బతుకు సిత్రాలు
నేటి స్వతంత్ర భారతంలో
ఇంకా దర్శనమిస్తూనే వున్నాయి
యుద్ధం లేని బాల్యపు
ఉషోదయాలకు
ఊపిరి పోయాలి.
ఒత్తిడి లేని జీవితచదువులకు
జ్ఞాన ద్వారాలు తెరవాలి.
పసిపిల్లల నిండు పున్నమి
వెన్నెల వెలుగులలో ప్రపంచమంతా
రేపటితరపు కలల రాతలు
అందమైన బాల్యపు జలపాతపు
సవ్వడుల సంగీతాన్ని వినిపించాలి.
కలాల కవనపు గీతాలు
విశ్వశాంతి సౌధాల
నిలయాలై వికసించాలి.
ఫిజిక్స్ అరుణ్ కుమార్