రైతాంగ సమస్యలకు పరిష్కారాలు కనుగొందాం
ABN , Publish Date - Dec 20 , 2024 | 01:18 AM
1964లో రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల, పశువైద్య కళాశాల; బాపట్లలోని వ్యవసాయ కళాశాల; తిరుపతిలోని వ్యవసాయ, పశువైద్య కళాశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం...
1964లో రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల, పశువైద్య కళాశాల; బాపట్లలోని వ్యవసాయ కళాశాల; తిరుపతిలోని వ్యవసాయ, పశువైద్య కళాశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. 1990 దశకంలో ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు. ఆ తరువాత కాలంలో ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా గృహ విజ్ఞాన, ఉద్యాన కళాశాలలు ఏర్పడ్డాయి. మరికొంత కాలం తరువాత మరికొన్ని వ్యవసాయ, పశువైద్య కళాశాలలు వచ్చి చేరాయి. ఆ తరువాత కాలంలో పెరుగుతున్న అవసరాలు, ఆకాంక్షల మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలుగా, వేటికవిగా మూడుగా విభజించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఈ మూడు ఆరు అయ్యాయి.
విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు దేశ పరిపాలన రంగం మొదలుకుని బ్యాంకింగ్, వ్యవసాయం అనుబంధ రంగాల్లో విద్య, పరిశోధన, విస్తరణ రంగాల్లో తమదైన ముద్ర వేశారు. పలు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు మొదలుకుని అన్ని సివిల్ సర్వీస్ విభాగాల్లో తామేంటో నిరూపించుకున్నారు. ఇక బ్యాంకింగ్ రంగంలో నాబార్డ్ చైర్మన్ నుంచి ఎస్‌బిఐ చైర్మన్ వరకు అత్యున్నత పదవుల్లో చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయంగా శాస్త్ర, పరిశోధన రంగాల్లో ఆకాశమే హద్దుగా ఎదిగారు. వ్యవసాయ, పశుసంవర్థక శాఖలో ఇక్కడి విద్యార్థుల ప్రతిభకు తిరుగే లేదు. ఇంకా ఎంతో మంది విద్యార్థులు వారి జీవన గమనంలో రాజకీయాల్లో ప్రవేశించి శాసనసభ, శాసనమండలి, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులయ్యారు. మంత్రి పదవులు నిర్వహించారు.
అంతులేని సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, విస్తరణవాదం కారణంగా ప్రపంచ భూసారం తగ్గి కనీస పోషకాలు లేని పంటలతో ప్రపంచ దేశాల ప్రజలు రోగనిరోధక శక్తిని కోల్పోతున్నారు. గత మూడు దశాబ్దాలలో ఐదు లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యల పాలయ్యారు. సమాజంలో అనేక జీవన రంగాలలో అసహజ మరణాల పాలవుతున్నారు. వారిలో విద్యార్థులు, నిరుద్యోగులు కూడా గణనీయంగా ఉన్నారు. ఈ సమాజం మన అందరం జీవించడానికి, అసహజ మరణాల పాలు కాకుండా ఉండడానికి ఏమిచేయాలో మనందరం కలిసి ఆలోచించాలి. ఒక్క వాయు కాలుష్యం కారణంగా ఏటా 16 లక్షల మంది చనిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ విషాదాల నివారణకు నడుం బిగించాల్సింది మనమే.
చదువు లక్ష్యం ప్రజలకు సేవ చేయడంగా ఉండాలి. సమాజానికి బాధ్యత వహించడం, మెరుగైన సమాజం నిర్మాణానికి కృషి చేయడం లక్ష్యం కావాలి. క్షీణిస్తున్న పర్యావరణం, మారుతున్న వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకుని మన రాష్ట్ర, దేశ రైతాంగానికి ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు సేవలు అందించాలి.
పూర్వ విద్యార్థులు
(నేడు, రేపు వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవ సభలు)