మసకబారిన వెన్నెల బతుకు
ABN , Publish Date - Nov 25 , 2024 | 05:45 AM
గడియారంలోని ముండ్లు ఒక దాని వెంట ఒకటి విరామం లేకుండా ఉరికినట్టు నువ్వు కూడా రోజంతా కంటికి కనిపించని కాలం వెంటే పరుగులు తీస్తుంటావు!...
గడియారంలోని ముండ్లు
ఒక దాని వెంట ఒకటి
విరామం లేకుండా ఉరికినట్టు
నువ్వు కూడా రోజంతా
కంటికి కనిపించని కాలం వెంటే
పరుగులు తీస్తుంటావు!
నువ్వు మంచం మీది నుండి
కాళ్లు నేల మీద దించేది
కాలం వెంట పరుగులు తీసేందుకే
ఎవరో తరుముతున్నట్టు
ఏదో అందుకోవాలన్నట్టు
అప్రకటిత పరుగు పందెంలో
ఎక్కడికో తెలియని
పరుగులు తీస్తుంటావు
రేపటి కోసం
ఇవాళ్టిని కోల్పోతుంటావు
గతాన్ని తలుచుకొని
ఒకింత ఉపశమనం పొందుతుంటావు
కోల్పోయిన వాటినన్నీ
కలల్లోనే ఊహించుకుంటూ
తాత్కాలిక సంతృప్తి చెందుతుంటావు
పరుగెత్తి పరుగెత్తి
అన్ని ఆనందాలు కోల్పోతుంటావు
అవి కోల్పోయావని
నువ్వు తేరుకునే సరికి
నిన్ను పరుగెత్తించిన
గడియారంలోని ముళ్లు
నువ్వు ఓడిపోయావని
పగలబడి నవ్వుతుంటాయి
నగరం మీద మసకబారిన
వెన్నెల బతుకు నీది
గట్టిగా నవ్వలేవు
అలాగని గట్టిగా ఏడ్వనూ లేవు
అంతా ఒక నటనల ప్రపంచంలో
ఉత్తమ నటుడివై
రోజుల్ని ఈదుతుంటావు
సడెన్‌గా నీకో గుండె ఉండాలని
ఏ అర్ధరాత్రో గుర్తుకొస్తుంది
ఛాతీ మీద చెయ్యేసి చూసుకుంటే
అక్కడ గడ్డకట్టిన సిమెంటు లాంటి
రాతి ముద్ద ఒకటి చేతికి తగులుతుంది
అది చూసి పొగిలి పొగిలి ఏడుస్తావు
చిత్రంగా ఒక్క కన్నీటి చుక్కా రాలదు!
లోకం మునిగిపోతున్నట్టు
కంగారుపడి
ఉలిక్కిపడి లేచి
అద్దం ముందుకొస్తావు
నీ రూపమే నీకు కనిపించదు
పైసల చెట్టొకటి పగలబడి నవ్వుతుంటుంది
ఇది చెప్పలేని హింసలకాలం
ఇది నిన్ను నువ్వే అప్పగించుకునే
కోర్కెల గాలం!
పసునూరి రవీందర్
77026 48825