Share News

స్థానికతే మా బడి పిల్లల కవిత్వ వస్తువు

ABN , Publish Date - Dec 09 , 2024 | 01:09 AM

అజిలాపూర్‌ బడిలో మీరు చదువు చెప్పే పిల్లల చేత కవిత్వం రాయించి, ఆ కవితల్ని ‘దేవ గన్నేరు’ పేరుతో పుస్తకంగా వేశారు. బడి పిల్లల్ని కవిత్వ వ్యక్తీకరణ వైపు...

స్థానికతే మా బడి పిల్లల కవిత్వ వస్తువు

మూడు ప్రశ్నలు

స్థానికతే మా బడి పిల్లల కవిత్వ వస్తువు

అజిలాపూర్‌ బడిలో మీరు చదువు చెప్పే పిల్లల చేత కవిత్వం రాయించి, ఆ కవితల్ని ‘దేవ గన్నేరు’ పేరుతో పుస్తకంగా వేశారు. బడి పిల్లల్ని కవిత్వ వ్యక్తీకరణ వైపు మళ్ళించటం సులువైందా, కష్టమైందా?

బడిపిల్లలతో, అందులోను ప్రైమరీ స్కూల్ పిల్లలతో కవిత్వం రాయించడం కొంచెం కష్టమైనదే. నేను అజిలాపూర్ బడి లోనే పన్నెండేళ్ళు పని చేయడం వలన ఇది సాధ్యమైంది. మొదట తప్పులు లేకుండా తెలుగు రాయడం, బాలగేయాలు నేర్పించడం, ఏడవ తరగతికి వచ్చేవరకు వంద పద్యాలు నేర్పించడం చేశాను. దీని ద్వారా ఊర్లో కూడా ‘బడిలో బాగా చదువు చెబుతున్నారు, మా పిల్లలను ప్రభుత్వ బడికే పంపాలీ’ అన్న చైతన్యం వచ్చింది. పిల్లల చేత కవితలు రాయించాలని అనుకున్నపుడు ‘కవిసంగమం’ ఫేస్‌బుక్‌ గ్రూప్‌లో విమర్శ కుడు జి. లక్ష్మీనరసయ్య సార్ చెప్పిన కవిత్వ నిర్మాణ విషయా లను పిల్లలకు చెప్పేవాడిని. ఒక మాములు విషయాన్ని ఎట్లా కవిత్వం చేయాలో అనేక ఉదాహరణలతో సందర్భం వచ్చినపుడల్లా చెప్తుండేవాడిని.


‘‘పంట చూస్తే/ పచ్చగానే ఉంది.

ఆ పంట వేసిన రైతు చేతులే/ ఎందుకో ఏడుస్తు న్నాయి.’’ – అని కాలె యశ్వంత్ లాంటి పిల్లలు ప్రాసను దాటి కవితలు రాసిన కవిత్వాన్ని ఎక్కువగా వినిపించే వాడిని. ఏదైనా ఒక అంశం ఇచ్చి, వాళ్ళు ఏమనుకుంటు న్నారో రాయమని చెప్పి, వాళ్ళ ముందటనే సరిచేసి, ‘ఇలా కూడా ఊహ చేయొచ్చు’ అనే దానిని బలంగా చెప్పగలిగినాను. ఇది ఒక రోజులో అయ్యే పని కాదు. దీని వెనుక ఆరేడేండ్ల శ్రమ ఉంది. ప్రధానోపాధ్యా యులు డేవిడ్ రాజు, అలివేలు, పూలమ్మ, శ్రీనివాసులు, కట్ట జంగయ్య... ఇంకా ఇక్కడ పని చేసిన టీచర్లందరి సహకారం లేనిది ఈ పుస్తకం లేదు.


5-Vivi.jpg

పిల్లలు తమ కవిత్వంలో ఎలాంటి ఇతివృత్తాల వైపు ఎక్కువ మొగ్గు చూపటం గమనించారు?

అమ్మ, నాయిన, రైతు, వాన, గురువులు, పల్లె – ఇదే మా దేవగన్నేరుల ప్రపంచం. అమ్మ ప్రేమ దగ్గరనే ఆగిపోలేదు. ఆడపిల్లలను కడుపులనే చిదిమేస్తున్న సమాజాన్ని చూసి దుఃఖపడ్డారు. ప్రశ్నగా నిలబడ్డారు. రైతు గొప్పతనాన్ని వర్ణించడమే కాదు, అన్నం మెతుకు మీద రైతు బొమ్మను కలగంటున్నారు. అజిలాపురంలో తాటిచెట్ల మధ్య నుంచి సూర్యుడు ఉదయిస్తాడు. గౌడన్నలు మోకుముస్తాదు విడిచినంకనే పొద్దు గూట్లో పడుతుంది. ఇక్కడి స్థానికతే మా బడి పిల్లలకు కవిత్వ వస్తువు.

ఈ మొత్తం పనిలో మీకు గుర్తుండిపోయే అంశాలు...

అజిలాపూర్ బడిలో ఏ విద్యార్థిని కదిపినా కవితలు అలవోకగా చెబుతూంటారు. మూడవ తరగతిలో ఉన్నప్పుడే కేశమోని అక్షిత, మహమ్మద్ సోను కవితలు రాయడం నా లోపల ధైర్యం నింపింది. బడిని చూడడానికి వచ్చిన అతిథుల, పిల్లల తల్లి తండ్రుల కళ్ళలో మెరుపును చూసిన ప్రతి క్షణం గుర్తుండిపోయేదే. కవి యాకూబ్, ఎస్.సి.ఈ.ఆర్.టి సంచాలకులు గాజర్ల రమేశ్ గార్లు మా బడి పిల్లల కవితలు విని మెచ్చుకోవడం ఎప్పటికీ మరిచిపోలేని క్షణాలు.


ఈ ‘దేవగన్నేరు’ మా నాగర్ కర్నూల్ జిల్లాలోనే ప్రాథమిక పాఠశాల నుంచి వస్తున్న మొదటి కవిత్వ సంకలనం కావడం చాలా ఆనందం. ఊరి వాళ్ళంతా కలిసి దాదాపు యాభై వేల ఖర్చుతో ఊరి పండుగగా ‘దేవగన్నేరు’ ఆవిష్కణ సభ గొప్పగా జరిపారు.

తగుళ్ళ గోపాల్‌

95050 56316

Updated Date - Dec 09 , 2024 | 01:09 AM