ఒక లచ్చవ్వ అనుభవంలో చరిత్ర స్మృతులు
ABN , Publish Date - Aug 19 , 2024 | 12:30 AM
చరిత్రకూ మానవ అనుభవానికీ ఉన్న సంబంధం సృజనాత్మక సాహిత్యానికి గొప్ప వనరు. అలాంటి సాహిత్యం చరిత్ర రచనకు ఆకరంగా ఉపయోగపడుతుంది...
చరిత్రకూ మానవ అనుభవానికీ ఉన్న సంబంధం సృజనాత్మక సాహిత్యానికి గొప్ప వనరు. అలాంటి సాహిత్యం చరిత్ర రచనకు ఆకరంగా ఉపయోగపడుతుంది. కానీ విస్తృత జీవన చిత్రణకు అవకాశం ఉన్న నవల సామాజిక శాస్త్రాలకంటే భిన్నమైన పాత్ర పోషిస్తుంది. అప్పుడు నవల చరిత్రకు కాల్పనిక రూపంగానే మిగిలి పోదు. చరిత్ర చెప్పలేని విషయాలను చెప్పి సరి పెట్టుకోదు. చరిత్రను దాటి ముందుకు వెళు తుంది. ఇట్లాంటి చర్చకు నిలవగల చాలా లక్షణాలు ఉన్న నవల ‘తల్లులు-బిడ్డలు’. దీన్ని మహముద్ హుస్సేన్ రాశారు. రెండు సార్లు అరెస్టయి, జైలు జీవితం గడిపిన రచయిత సరిగ్గా ఈ నవల విడుదలైన రెండేళ్లకు మళ్ళీ జూలై 8న ఒక అక్రమ కేసులో అరెస్టయ్యాడు.
యాభైఏళ్ల కింద ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కొద్ది మంది యువకులు ఆరంభించిన విప్లవోద్యమం దగ్గర ఈ నవల కూడా మొదలవుతుంది. వాళ్లకు అంతక ముందు ఎలాంటి పోరాట అనుభవం లేదు. కాక పోతే గతంలో జరిగిన అన్ని పోరాటాల కంటే పూర్తి భిన్నమైన ఆలోచనలతో పని ఆరంభించారు. పాత కమ్యూనిస్టు ఉద్యమం ఆర్థిక పోరాటాలకు, స్థానిక సమస్యలకు మాత్రమే పరిమితమై ఉండింది. కానీ ఈ యువకులు సింగరేణి బొగ్గు గనులు ఉన్న చిన్న ప్రాంతంలో ఆరంభించిన నిర్దిష్ట పోరాటానికి దేశవ్యాప్త సార్వజనీన రాజకీయ సాంస్కృతిక లక్ష్యం ఉన్నది.
సింగరేణి అనే నిర్దిష్ట వాస్తవం దగ్గర నిలబడి దేశాన్ని ప్రభావితం చేయగల పోరాటానికి కార్మికవర్గాన్ని సిద్ధం చేయాలనుకున్నారు. దీని కోసం సమాజానికి, ఉద్యమాలకు ఉండగల అన్ని రకాల సంప్రదాయక భావ జాలాలను తిరస్కరించారు. కొత్త అన్వేషణ మొదలు పెట్టారు. ఆ రకంగా వాళ్లు ఒక కొత్త రాజకీయ సాంస్కృతిక చట్రాన్ని ప్రతిపాదించి ముందుకు తీసికెళ్లారు. అనేక సిద్ధాంత, సైనిక ఆటుపోట్ల మధ్య కూడా అది భవిష్యత్ లోకి విస్తరిస్తున్నది.
తల్లులు బిడ్డలు నవల ఇతివృత్తం వ్యక్తుల జీవిత విశేషం కాదు. పాత నుంచి బైటపడే క్రమంలో లక్షలాది మంది గడించిన అనుభవాన్నంతా వస్తువుగా స్వీకరించింది. ఇంత విస్తృత కథనానికి మళ్లీ గజ్జల లచ్చవ్వ అనే ఒక మహిళ అనుభవం ఫోకస్ పాయింట్. ఏది నవల అవుతుందో, ఎట్లా నవల అవుతుందో, నవలలోనే చెప్పవలసింది ఏమిటో తెలిసి రాసిన ఐదు వందల పేజీల నవల ఇది.
అప్పటి భౌతిక పరిస్థితులు, వాటిలో మానవ జోక్యం, దానికి ఉన్న అవకాశాలు చరిత్రకు సంబంధించినవి. అట్లా ఈ నవల చరిత్ర నుంచి వచ్చిందే. కానీ ఆ సమూహం పొందిన అనుభవం ఈ నవలా ఇతివృత్తం. క్రమంగా ఆ అనుభవం వందల వేల కుటుంబాల, లక్షలాది కార్మికుల, రైతు కూలీల, అంటరాని కులాల, మధ్య తరగతి జనాల, స్త్రీల, పురుషుల జీవితంగా మారింది. వాళ్లందరూ భాగమై ఉన్న మానవ సంబంధాల సంఘర్షణగా మారింది. దాన్ని చెప్పడానికి హుస్సేన్ ఈ నవల రాశారు.
సంప్రదాయక నవలా నిర్మాణం వైపు నుంచి చూసినప్పుడు ‘తల్లులు బిడ్డలు’ మీద విమర్శలు ఉండవచ్చు. కానీ జీవితాన్నే సంప్రదాయకంగా చూడకూడదనే చైతన్యం నుంచి, ఆచరణ నుంచి పోగుపడిన అనుభవం దీని ఇతివృత్తం. కాబట్టి రచయిత ఏ ప్రామాణిక పద్ధతులనూ పాటించలేదు. దీన్ని ఆయన చారిత్రాత్మక స్మృతులు అంటూనే నవలా నిర్మాణంలో రావాల్సిన విప్లవాత్మక మార్పులను చర్చనీయాంశం చేసే శిల్పాన్ని ఎంచుకున్నారు. నవలతో సహా సాహిత్య ప్రక్రియలన్నీ మానవ సంస్కృతికి సంబంధించినవి. జీవన సంస్కృతి మారే క్రమంలో కళా రూపాల ప్రమాణాలు కూడా మారవలసి ఉంటుంది.
ఈ దృష్టితో చూసినప్పుడు హుస్సేన్ తీసుకొచ్చిన శిల్పపరమైన మార్పులు పాఠకులకు సన్నిహితమైనవి. ఈ నవలలో మనకు రచయిత కూడా కనిపిస్తారు. కానీ కథ రచయిత చెప్పరు. ప్రజలందరి గాఢమైన అనుభవాన్ని కథలోకి మళ్లించి ఆబ్జెక్టివ్‌గా, గ్రాఫికల్‌గా చెబుతూపోతారు. ఒక ఆలోచన నుంచి మరో కొత్త ఆలోచన రావడానికి, ఒక పని నుంచి అంతకంటే ఉన్నతమైన పనిలోకి సాగడానికి మనుషులు అనుభవించే ప్రయాస అంతా రాశారు. అనేక సమూహాల అనుభవంగా, ఒక కాలపు అనుభవంగా చెబుతారు. తీవ్రమైన భావోద్వేగాలు, అసాధారణమైన సాహసాలు, విపరీతమైన సందిగ్ధతలు, నిలువ నీటిలో ఒక చిన్న కదలిక తేవడానికి లెక్కలేనన్ని ప్రయత్నాలు, అత్యంత సృజనాత్మకమైన ఊహలు ధరించే వాస్తవ రూపాలు.. నవలగా మారాయి. ఈ క్రమంలో ఇందులోకి వచ్చిన దుఃఖం, తెగువ ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నడుస్తున్న చరిత్రతోపాటు ప్రజల అనుభవం ఎన్నెన్ని రూపాల్లో విస్తరించేదీ చిత్రించడమే ఈ నవల ప్రత్యేకత.
పాణి
98661 29458