Share News

370పై సభాసమరం

ABN , Publish Date - Nov 08 , 2024 | 04:40 AM

జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గురువారం యుద్ధవాతావరణం కనిపించింది. ఆర్టికల్‌ 370 పునరుద్ధరించాలంటూ ఇంజనీర్‌ రషీద్‌ సోదరుడు, అవామీ ఇత్తెహాద్‌ పార్టీ ఏకైక ఎమ్మెల్యే ఖుర్షీద్‌ షేక్‌ ప్లకార్డు ప్రదర్శించినందుకు బీజేపీ ఎమ్మెల్యేలకు ఆగ్రహం కలిగింది.

370పై సభాసమరం

మ్మూకశ్మీర్ అసెంబ్లీలో గురువారం యుద్ధవాతావరణం కనిపించింది. ఆర్టికల్‌ 370 పునరుద్ధరించాలంటూ ఇంజనీర్‌ రషీద్‌ సోదరుడు, అవామీ ఇత్తెహాద్‌ పార్టీ ఏకైక ఎమ్మెల్యే ఖుర్షీద్‌ షేక్‌ ప్లకార్డు ప్రదర్శించినందుకు బీజేపీ ఎమ్మెల్యేలకు ఆగ్రహం కలిగింది. ఎమ్మెల్యేలు పరస్పరం దాడి చేసుకుంటున్న దృశ్యాలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఐదేళ్ళక్రితం కేంద్రం తొలగించిన 370, ౩2 (ఏ)లను తిరిగి ఇచ్చేయాలంటూ పీడీపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టబోవడం, బీజేపీ అడ్డుపడటం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌–కాంగ్రెస్ జాతివ్యతిరేకశక్తులతో, ఉగ్రవాదులతో చేయికలిపారంటూ ఆ పార్టీ విమర్శలు చేయడం తెలిసిందే. రెండురోజులుగా జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో ప్రత్యేక ప్రతిపత్తి అంశం ఘర్షణకూ, గందరగోళానికీ కారణమవుతోంది. అటు కేంద్రానికి ఆగ్రహం కలగకుండా, ఇటు కశ్మీరీల అనుగ్రహం కోల్పోకుండా ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం సాధ్యమైనంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

మీరు లాక్కున్న హక్కులనూ అధికారాలను తిరిగి ఇవ్వండి అని కనీసం ప్లకార్డు ప్రదర్శించే హక్కు కూడా సభలో ఓ ఎమ్మెల్యేకు ఉండదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆర్టికల్‌ 370 ముగిసిన చరిత్ర అని ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించినందువల్ల కాబోలు, దాని ఊసెత్తడమే దేశద్రోహమన్న స్థాయిలో బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్లకార్డు ప్రదర్శనమీద వారు అభ్యంతరం వ్యక్తంచేయడంతో సరిపెట్టకుండా లాక్కోవడం, చించివేయడం మరింత గందరగోళానికి దారితీసింది. నిజానికి, బుధవారం నాటి తీర్మానం బీజేపీ సభ్యులను అప్పటికే బాగా వేడెక్కించింది. ఆ చర్యను విమర్శించేందుకు, ఖండించేందుకు గురువారం చేసిన ఓ ప్రయత్నానికి మిగతాపార్టీలు అడ్డుతగలడం దానికి మరింత కోపం తెప్పించింది.

నేషనల్‌ కాన్ఫరెన్స్‌–కాంగ్రెస్‌–ఆమ్‌ ఆద్మీపార్టీ సంయుక్తంగా బుధవారం ప్రవేశపెట్టిన తీర్మానం ప్రత్యేకప్రతిపత్తిని పునరుద్ధరించాలని కోరిందే తప్ప ఆర్టికల్‌ 370 ప్రస్తావన చేయలేదు. వీసమెత్తు ప్రయోజనం లేని ఈ తీర్మానం ద్వారా కశ్మీరీ ప్రజల ప్రయోజనాలను, ఆకాంక్షలనూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రభుత్వం బలిపెట్టిందనీ, ఢిల్లీకి దాసోహపడిందనీ లోయలోని మిగతా పార్టీలు ఘాటుగా విమర్శించాయి. కానీ, తీర్మానంలో 370 అన్నపదాన్ని వాడకపోవడం ద్వారా అటు కేంద్రంతో ఘర్షణపడినట్టుగా కనిపించకుండా ఒమర్‌ ప్రభుత్వం జాగ్రత్తపడింది, తెలివిగా వ్యవహరించింది.


మరోపక్క ప్రత్యేకప్రతిపత్తిని అభ్యర్థించడం ద్వారా ఎన్నికల ప్రచారంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీకి అనుగుణంగా అడుగులు వేసినట్టూ అయింది. పైగా, రాష్ట్రహోదా గురించి పాటుపడతామని మాత్రమే ప్రజలకు హామీ ఇచ్చిన కాంగ్రెస్‌, ఆప్‌లను ఈ తీర్మానంలో తనతో కలుపుకోగలిగింది.

ఆర్టికల్‌ 370 ఊసెత్తనప్పుడు ఆ తీర్మానాన్ని బలపరచడంలో తప్పేముందని ఆ పార్టీలు అనగలిగాయి. ప్రత్యేకప్రతిపత్తి, ఇతర రాజ్యాంగబద్ధమైన హామీలు కల్పించే విషయంలో కొత్తగా ఎన్నికైన జమ్మూకశ్మీర్‌ ప్రజాప్రతినిధులతో కేంద్రం చర్చలు ఆరంభించాలని ఆ తీర్మానం కోరింది. అలనాటి 370 రద్దు నిర్ణయాన్ని తప్పుబట్టకుండా, ఇప్పుడు ఆ సంఖ్యను ప్రస్తావించకుండా తీర్మానం చేయడం వల్ల ఏ ప్రయోజనమూ లేదని పీడీపీ వాదించడం, నచ్చినవిధంగా ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఆ తరువాత కొందరు ప్రయత్నించడం తెలిసినవే. ఒక అర్ధరాత్రి, సమస్త సేనలనూ మోహరించి, రాష్ట్రానికి దశాబ్దాలుగా ఉన్న హక్కులన్నీ రద్దుచేసి, దానిని స్వాధీనం చేసుకొని రెండుగా విడగొట్టిన కేంద్రప్రభుత్వం, ఆ తరువాత ఐదేళ్ళుగా ఎవరితోనూ ఒక్కముక్కకూడా మాట్లాడని కేంద్రాన్ని ఇప్పుడు చర్చలకు ఉపక్రమించమని ఒమర్‌ ప్రభుత్వం సవినయంగా ప్రార్థిస్తోందని పీడీపీ విమర్శిస్తోంది.

అయితే, ఒమర్‌ అబ్దుల్లా ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎంతో సున్నితంగా నడిపిందని, అనవసర రాద్ధాంతం కాక, ఆచరణాత్మకంగా వ్యవహరించిందని మెచ్చుకుంటున్నవారు లేకపోలేదు. ఆర్టికల్‌ 370 ప్రస్తావన చేయకపోవడం ద్వారా కేంద్రాన్ని కూడా ఒమర్‌ మంచి చేసుకున్నారని వారి అభిప్రాయం. 2019 ఆగస్టు 5 అనంతర వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా ఈ పరిణామం ఉన్నదని బీజేపీ నాయకుడు అమిత్‌ మాలవీయ సామాజిక మాధ్యమాల్లో ఒక వ్యాఖ్య చేశారు. కానీ, ప్రత్యేకప్రతిపత్తి ఊసెత్తితే సహించబోమన్నది స్థానిక బీజేపీ నాయకులు హెచ్చరిక.

Updated Date - Nov 08 , 2024 | 04:40 AM