Share News

మోదం

ABN , Publish Date - Apr 15 , 2024 | 12:29 AM

నేను కవిత్వం రాస్తున్న కొత్తలో ఎవరిదైన కవిత్వం చదువుతుంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యపోయి ఒక్కో వాక్యం దగ్గరే...

మోదం

నేను కవిత్వం రాస్తున్న కొత్తలో

ఎవరిదైన కవిత్వం చదువుతుంటే

ఒక్కొక్కసారి ఆశ్చర్యపోయి

ఒక్కో వాక్యం దగ్గరే

పిడిగుద్దు గుద్దినవాడిలా నిశ్శబ్దుణ్ణయ్యేవాణ్ణి.

నా జీవితం ఇతనికెలా తెలిసిందని

తెగ ఆలోచించి

ఆ రాసిన కవి వంక అదోలా చూస్తూ నిలబడేది.

మనం అనుభవిస్తున్న వర్తమాన జీవితంలోనో

గతంలో నుండో ఒక సన్నివేశం

మరొక కవి రాసుకొచ్చినా

అదొక ఎడతెగని అనుభూతిలా మన పుస్తకంలో

జ్ఞాపకంగా మిగిలిన నెమలీకలా మిగిలిపోతది.

నేను మోకాళ్లను భూమికి ఆనించి

అడవిలో ఊటసెలిమె దగ్గర నీళ్ళు తాగి

దప్పిక తీర్చుకున్న రహస్య దృశ్యాన్ని

ఎవరో ఓ కవి రాసుకొస్తే

ఆ వాక్యం ముగిసిన చుక్క దగ్గరే ఆగిపోయేవాణ్ణి.

వాన ముసురు పట్టుకుంటే

గోనె కొప్పెర గప్పుకొని మట్టిమిద్దె మీద గవాసి మీద

పగిలిన కుండ పెంకుల్ని మూసి వస్తుంటే

చటుక్కున మెరిసిన మెరుపులో

నా గుండె పగిలిన శబ్దం రాసిన కవి వద్దే

నేను మోకరిల్లుత.

నీళ్ళు దొర్కని ఎండకాలంలో

దిగుడుబాయిల దిగి రెండు బిందెలను భుజం మీద

మోసుకొస్తుంటే బండ మీద నుండి జారి

బావిలో పడి మోకాటిసిప్పలకు గాయమైతే

ఆ సంఘటనను రాసిన కలానికి ప్రణమిల్లుతా.

పల్లె వాకిట పండు వెన్నెల రాలుతున్నప్పుడు

పిలువని పెండ్లికిపోయి ఇసుకకుప్పలమీద

పడుకుంటే ఆ రాత్రి నా కండ్లల్లోకి వచ్చిన

పంచవన్నెల జింకపిల్ల వేటను

అచ్చుగుద్దినట్లు పాటగా వినబడితే ఆ క్షణం

ఆ కలం బట్టిన చేతికింద బానిసగా మారిపోత.

అద్దుమరాత్రి దీపం వెలుగులో

వరిసేనుకు నీళ్ళు పారబెట్టబోయి

పక్కపొలంలో కూడా అటువంటి దీపం వెలుగే కనవడ్తే

లోలోపల మనిషున్నడనే ధైర్యం తెచ్చుకొని

పొలం గెట్ల మీదనే కునికిపాట్లు పడిన గడ్డుకాలాన్ని

ఏ కవైన పట్టుకుంటే

ఆ కవిని ఏడు రంగుల గుర్రం బండి మీద ఊరేగిస్తా.

అవనిశ్రీ

99854 19424

Updated Date - Apr 15 , 2024 | 12:29 AM