నా గుండె దండోరా!
ABN , Publish Date - Oct 07 , 2024 | 04:46 AM
ఏ కవికైనా మొదటి పుస్తకం అచ్చేయడం మొదటి రాత్రి వంటి గొప్ప అనుభవమే. అదే భయం, అదే సందేహం, అదే ఆశ, అదే... బయటికి కనిపించని(వ్వని) ఆరాటం. నా తొలి పుస్తకం పేరు ‘గుండె దండోరా’. అబ్బే, ‘మాదిగ దండోరా’ అనే సంస్థ అప్పటికి... అంటే...
నా మొదటి పుస్తకం
నా గుండె దండోరా!
ఏ కవికైనా మొదటి పుస్తకం అచ్చేయడం మొదటి రాత్రి వంటి గొప్ప అనుభవమే. అదే భయం, అదే సందేహం, అదే ఆశ, అదే... బయటికి కనిపించని(వ్వని) ఆరాటం. నా తొలి పుస్తకం పేరు ‘గుండె దండోరా’. అబ్బే, ‘మాదిగ దండోరా’ అనే సంస్థ అప్పటికి... అంటే, అనగనగా 1979 జనవరి నాటికి... లేదు. నిజానికి అలాంటి ఆలోచనలు కూడా మంద కృష్ణకు గాని పొనుగోటి కృపాకర్‌కు గాని లేవు. అప్పటికి చాల కాలంగా రాస్తున్నప్పటికీ, నా చుట్టూ పదుగురికి నేను కవినని తెలిసినప్పటికీ, పుస్తకం వేయాలనే ఊహ నాకు రాలేదు. విమోచన పత్రిక కోసం రాయడం, ప్రెస్సు పనులు చూడ్డంతో బిజీబిజీ. కవితా సంపుటి అచ్చేయకపోవడానికి కారణం అది కాదు. ‘నీ కవిత్వం పుస్తకం వెయ్యొచ్చు కదా’ అని కామ్రేడ్ మధుసూదన రాజ్ అడిగే వరకు ఆ ఆలోచన కూడా రాలేదు. ‘పుస్తకం వేయాలంటే డబ్బు కావాలి కదా’ అని నవ్వేశాను. డబ్బు సంగతి నేను చూసుకుంటానులే, నువ్వు పుస్తకం పని చూడు అన్నాడు మధు. ఇంకేం! అప్పటికే తెలిసిన ప్రెస్సు ఎలాగూ ఉంది. నక్షత్ర సప్తకం శాండిల్య గారు ఎడిట్ చేస్తూ ఉండిన ‘వెండితెర’ సినిమా పత్రిక అచ్చయ్యే ప్రెస్సు లోనే విమోచన అచ్చయ్యేది. ‘గుండె దండోరా’ కూడా అక్కడే పుట్టింది. దానికి బొమ్మ వేసిన చిత్రకారుడు కామ్రేడ్ నమ్ము (శేషం నరసింహా చారి). తను కవిగా అందరికి తెలుసు గాని, తనను చిత్రకారుడిగా పరిచయం చేసింది ‘గుండె దండోరా’ యే అనుకుంటా. మీరే చూడండి అట్ట మీద బొమ్మ ఎంత బాగా వేశాడో.
‘ఇది రహదారి కాదు’ అనే హెడింగ్ తో మరో కామ్రేడ్ యాధాటి కాశీపతి దానికి ముందుమాట రాశాడు. అచ్చుపని ఎంత హాయిగా గడిచిపోయిందో, పంపిణీ పని అంతకన్న హాయిగా నాకు తెలీకుండా జరిగిపోయింది. విమోచన ఆఫీసే అప్పుడు మా ఇల్లు. ఆఫీసుకు వచ్చే సహచరులకే వెయ్యి కాపీలు చాలలేదు. నా దగ్గర ఒక్క ప్రతి కూడా లేదని అంగలారుస్తుంటే, ఆ మధ్య ప్రసిద్ధ విమర్శకుడు అశోక్ కుమార్ ఇంటికి వెళ్లినప్పుడు, ఆయన ఎంచక్కా అట్టలు వేసి దాచిన పుస్తకం ఇచ్చాడు. దాన్నే ఏ దేశమేగినా ఎందుకాలిడినా నాతో ఉంచుకుంటున్నా. ఇంతకూ ఆ పుస్తకానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా మూడొందల రూపాయలు. అంత డబ్బు లేకనే మధు ఇచ్చే వరకు అచ్చేయలేకపోయాను. 52 పేజీల 30 కవితల పుస్తకం ఖరీదు రూ.2/–-. కవితలు అన్నాను గాని, అందులో ఐదారు తప్ప అన్నీ ఉద్యమావసరాల కోసం రాసిన... ‘తూర్పు చేని గట్టుకాడ’, ‘కలలు గనే వేళ కాదు’ లాంటి పాటలే. ఆ ఐదారు కూడా విప్లవ రచనలే గాని కవితలని అనుకోను. రాసిన కవితల్లో స్వీయ మనస్కత ఉన్నదని పక్కన పెట్టేశాను. అలా ఉండడం మంచి కవిత్వమని తెలియక వాటిని పుస్తకంలో చేర్చలేదు. బై ది బై – ముఖచిత్రంలో పేరు చూసి అదేంటని అనుకోకండి. అప్పటికి ఇంకా నా పేరు నా పేరే. ఇప్పటి తిక్క పేరు అప్పటికి లేదు.
హెచ్చార్కె