Share News

నాగధార

ABN , Publish Date - May 27 , 2024 | 12:38 AM

ఇక్కడొక నల్లమబ్బు కురిసి వెలసిపోయింది ఆకలి పొలంలో అవమానపు సాగులో విరగ పండే అప్పుల పంటను జూసి వలస కత్తిని బొడ్లో దోపుకుంది నాగధార!...

నాగధార

ఇక్కడొక నల్లమబ్బు కురిసి వెలసిపోయింది

ఆకలి పొలంలో అవమానపు సాగులో

విరగ పండే అప్పుల పంటను జూసి

వలస కత్తిని బొడ్లో దోపుకుంది నాగధార!

గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లాడి ఎదుట

నీటి రెక్కల పిట్టలా ఎగిరింది నాగధార!

కన్నీళ్లు తుడిచీ గాయాలు కడిగి

చెమటనెత్తురు కలిసిన నీళ్ళతో

పొట్టమాడిపోయిన పొలాలను కన్నెత్తైనా చూడకుండా

తూరుపు సముద్రంలోకి బిరబిరా సాగిపోయింది నాగధార!

నాగావళి యిసుక రేణువుల చప్పుళ్లతో

వంశధార నీటి బిందువుల లయతో

పాకుడురాయి మీద నత్తగుల్లలా

తన నేలచుట్టూ ఒక నాచురంగు ప్రపంచాన్ని

నిర్మించుకుంది నాగధార!

ఒక్కోచోట ఒక చిన్న నీటిపాయలా

మరోచోట నిలకడైన కడలిలా

ఇంకో చోట నిండారా పొంగే నదిలా

ఎక్కడెక్కడ ఏ రూపు చూపినా

పారే నీళ్లలో ప్రతిబింబాలన్నీ నాగధార కన్నీటి చారలే!

వెదురు పొదలు.. రెల్లు పూలు..

మబ్బులు.. మనుషులు..

పంట పొలాలు.. పచ్చని చెట్లు..

పక్షులు.. పతంగుల్లాంటి వాటి రెక్కలు

ఇదివరకెపుడూ ఈ నీలి ఆకాశం చుట్టూ

పూయని కొత్తకొత్త నీటి హరివిల్లులు..

ఇప్పటికింకా నిర్మాణం కాని వంతెనలు..

ఎన్నున్నా ఎన్నికల వేళ హామీ కర్చీఫ్‌ వేసేవారికోసం

ఎప్పటికీ ఒక ఖాళీ కుర్చీ నాగధార!

మా పూర్వీకుల్ని నాగేటి చాలులో

నిలబెట్టిన యీ నీళ్ళ నీడల వెంట..

ఊరి ఊసులతోటి వాలకాలు కట్టించిన

గౌరమ్మ నందెన్న కుందిర్ల జాడల వెంట..

చల్లగాలికి నిండారా తడిసి

పొదుగు బరువైన ఆవు

పుట్ట కన్నంలో పాలు కురిసినట్టు

ఈ నేల నరాల్లోకి దిగుడువాగై ప్రవహిస్తుంది నాగధార!

తరచి చూస్తే నాకిప్పుడు అర్థమైంది -

నాగధార అణువణువూ

చెమట బొమ్మల కొలువు

జంటనదుల తోడుగా వెలసిన జీవన చిత్రాలన్నీ

విరిగిన నాగళ్ళు నడుం వాల్చిన చేనుగట్ల పైనుండి

వయసు మీరిన గావంచాలు కూలబడిన గడపల మీదికి

ఒలికే వెచ్చటి కన్నీటిచెమ్మ నాగధార!

రాతిగుట్టలమధ్య రాజహంసలా సాగుతోందని అనుకుంటాంగానీ

మట్టి మిత్రుల మీద రవ్వంత జాలి చూపని రాతి

గుండెల్ని గుణ గుణ తిట్టుకుంటూ

తోవంతా గొణుగుతుంది నాగధార

అలల తూలికల్లోనే నిదురిస్తున్నా

వలస దారుల రద్దు కలగంటూనే ఉంది

నాగధార!

కంచరాన భుజంగరావు

94415 89602

Updated Date - May 27 , 2024 | 12:38 AM