డిక్లరేషన్‌పై అనవసర రాద్ధాంతం!
ABN , Publish Date - Oct 05 , 2024 | 05:13 AM
హిందువుల మనోభావాలతో ఆడుకుంటూ డిక్లరేషన్‌పై మాజీ సీఎం జగన్‌రెడ్డి అనవసర రాద్ధాంతం చేసారు. ఆలయాలకు సంప్రదాయాలు, నిబంధనలు ఉంటాయి. అన్యమతస్తులు ఎవరైనా ఆలయంలోకి వెళ్లాలంటే ఆ నియమాలు పాటించి తీరాల్సిందే.
హిందువుల మనోభావాలతో ఆడుకుంటూ డిక్లరేషన్‌పై మాజీ సీఎం జగన్‌రెడ్డి అనవసర రాద్ధాంతం చేసారు. ఆలయాలకు సంప్రదాయాలు, నిబంధనలు ఉంటాయి. అన్యమతస్తులు ఎవరైనా ఆలయంలోకి వెళ్లాలంటే ఆ నియమాలు పాటించి తీరాల్సిందే. ఈ నియమాలు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాలకు, హిందుమతానికే పరిమితం కాదు. దేశంలో అన్ని ఆలయాలలో నియమాలు పాటించాలి. పూరి జగన్నాథ్ ఆలయం, కేరళ గురువాయూర్ ఆలయం, వారణాసి కాశీ విశ్వనాథుని ఆలయం, భువనేశ్వర్‌లోని లింగరాజ్ ఆలయం, కేరళ అనంత పద్మనాభస్వామి ఆలయం, తమిళనాడు కామాక్షి అమ్మ ఆలయం, రాజస్థాన్ దిల్వారా ఆలయం... ఇలా ఎన్నో చోట్ల ఆలయాల్లోకి హిందువులకి మాత్రమే అనుమతి ఉంది.
ఆఖరికి పొరుగు దేశం నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయంలోకి హిందువులకి మాత్రమే అనుమతి ఉంది. వేరే మతస్థులు హిందూ ఆలయాల్లోకి వెళ్లి, తెలిసో తెలియకో తమ మత పద్ధతుల ప్రకారం ప్రార్థన చేస్తే లోపల గొడవలు అయ్యే అవకాశముంటుంది. అందువల్ల ఆ గుడి ప్రార్థనా పద్ధతులు, నియమాల సమాచారం తెలుసుకుని, వాటికి అనుగుణంగా ఉంటానని డిక్లరేషన్ ఇవ్వాలి.
శ్రీవారిని దర్శించుకునేందుకు ముందుగా డిక్లరేషన్ ఫారంపై సంతకం చేసే సంప్రదాయం బ్రిటిష్ కాలం నుంచే అమల్లో ఉంది. ఇతర మతాలకు చెందిన వ్యక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తే కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలని 1990 ఏప్రిల్ 11న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ చట్టం 30/1987ని అనుసరించి జీఓను విడుదల చేసింది. చేతిలో అధికారం ఉందని అన్యమతస్తుడైన జగన్‌రెడ్డి ఆలయంలోకి డిక్లరేషన్ లేకుండానే ప్రవేశించారు. గతంలో పని చేసిన టీటీడీ చైర్మన్ జగన్ సేవలో తరించారు కాబట్టి డిక్లరేషన్‌ను పక్కనబెట్టారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొంటానని, తర్వాత రద్దు చేసుకోవడం ద్వారా జగన్ తన వికృత నైజాన్ని మరోసారి చాటుకొన్నారు. హిందూ ఆచారాలకు, సంప్రదాయాలకు తాను వ్యతిరేకినని బయటపెట్టుకొన్నాడు. దళితులు కూడా హిందువులేనని, వారికి తిరుమల శ్రీవారిని దర్శించుకొనే హక్కు వుందని జగన్‌రెడ్డి తెలుసుకోవాలి. డిక్లరేషన్‌పై సంతకం చెయ్యడం ఇష్టం లేకనే కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. సీఎంగా పనిచేసిన జగన్‌రెడ్డికి టీటీడీ విధించిన నిబంధనలు మతానికో, కులానికో కాదని తెలియదా? తిరుమల శ్రీవారి ఆలయంలో డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సి వస్తుందని, ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే జగన్‌రెడ్డి తిరుమల దర్శనాన్ని రద్దుచేసుకొని, పైగా తనను అడ్డుకొన్నారని సాకులు చెప్పారు.
దేశవ్యాప్తంగా ఇతర మతస్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నప్పుడు డిక్లరేషన్ ఇస్తారు. అంతమాత్రాన వారు తమ సొంత మతాన్ని వదులుకున్నట్లు కాదు, తమ ఆచారాలను వదిలేసినట్లూ కాదు. గతంలో అనేక మంది ప్రముఖులు ఎలాంటి భేషజాలకు పోకుండా డిక్లరేషన్‌పై సంతకం చేశాకే దర్శనానికి వెళ్లారు.
వెంకటేశ్వరస్వామి దర్శనానికి తాను వెళ్లకుండా ఆంక్షల పేరిట అడ్డుకుందంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేసి, పర్యటనను రద్దు చేసుకొన్న జగన్‌రెడ్డి బెంగళూరు వెళ్లిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేయాలంటూ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఆయన కార్యక్రమం అమలు తీరునూ సమీక్షించ లేదు. సాకులు చెబుతూ దైవదర్శనాన్ని రద్దు చేసుకుని అనవసర రాద్ధాంతం చెయ్యడమేమిటని ప్రజలు విస్తుపోతున్నారు.
– నీరుకొండ ప్రసాద్