కొత్త విద్యావెలుగులు
ABN , Publish Date - Oct 23 , 2024 | 01:23 AM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కేవలం 70 రోజుల్లోనే కొత్త టీచర్ల నియామక ప్రక్రియ పూర్తిచేసి అటు నిరుద్యోగుల కుటుంబాల్లో ఇటు ప్రభుత్వ బడుల్లో అభ్యసించే విద్యార్థుల...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కేవలం 70 రోజుల్లోనే కొత్త టీచర్ల నియామక ప్రక్రియ పూర్తిచేసి అటు నిరుద్యోగుల కుటుంబాల్లో ఇటు ప్రభుత్వ బడుల్లో అభ్యసించే విద్యార్థుల భవిష్యత్‌కి కొత్త వెలుగులు తీసుకువచ్చింది. 11,062 కొత్త టీచర్లతో కలిపి రాష్ట్రంలో 1.20 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇటీవల టీచర్ల ప్రమోషన్స్ ద్వారా ఏర్పడిన ఖాళీలు, ఉద్యోగ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలు కలిపి మరొక 15 వేల ఖాళీలు ఉన్నాయి. గత ఆగస్టులో అసెంబ్లీలో వెల్లడించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి లేదా మార్చిలో మరొక డీఎస్సీ జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 6 వేల ఖాళీలతో నోటిఫికేషన్ జారీ చేస్తామని ఉపముఖ్యమంత్రి కూడా వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత 10 సంవత్సరాల్లో ఒకే ఒక్క డీఎస్సీ 2017 (టీఆర్టీ) ద్వారా 8,792 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి అందులో 8 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశారు. ఆ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు వందలసార్లు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు.
చివరకు సుప్రీంకోర్టులో డి.ఎడ్, బి.ఎడ్ అభ్యర్థుల సంఘం పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తేనే అప్పటి ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత అభ్యర్థులు 2021 నుండి అనేక ఆందోళనలు చేస్తే అసెంబ్లీ ఎన్నికల ముందు 5,089 అరకొర పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్నికల్లో ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే అభ్యర్థులు ఒత్తిడి చేయగానే లోక్‌సభ ఎన్నికల ముందు పాత నోటిఫికేషన్ రద్దు చేసి 11,062 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలు నిర్వహించి ఫలితాల వెల్లడి నియామక ప్రక్రియ రికార్డ్ సమయంలో పూర్తి చేసి నిరుద్యోగ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారు. మరొక వెయ్యి పోస్టులకు నియమాక ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
రావుల రామ్మోహన్ రెడ్డి