Share News

అనర్హులకు ‘ఉపాధి హామీ’ వద్దు

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:36 AM

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పల్లెలకు పండగ తేవాలన్నా, పంచాయతీలను నిజంగా బలోపేతం చెయ్యాలన్నా, రాష్ట్ర ప్రభుత్వ తక్షణం చేయాల్సింది– జాబ్ కార్డులు పొంది ఉన్న లక్షలమంది అనర్హులను...

అనర్హులకు ‘ఉపాధి హామీ’ వద్దు

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పల్లెలకు పండగ తేవాలన్నా, పంచాయతీలను నిజంగా బలోపేతం చెయ్యాలన్నా, రాష్ట్ర ప్రభుత్వ తక్షణం చేయాల్సింది– జాబ్ కార్డులు పొంది ఉన్న లక్షలమంది అనర్హులను తొలగించటం, దుర్వినియోగమవుతున్న కోట్ల నిధులు అసలైన గ్రామాభివృద్ధికి దోహదపడేలా చర్యలు చేపట్టటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖామాత్యులు పవన్ కళ్యాణ్ గ్రామాలలో సామాజిక, ఆర్థిక మార్పు జరగాలని గ్రామ సభలకూ, ఉపాధి హామీ పథకానికీ ఇస్తున్న ప్రాధాన్యత హర్షణీయం. కాని, వారు నిజాయతీగా చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇవ్వాలంటే, నిజంగా ఉపాధి – ఆర్థిక ఆలంబన అవసరమైన, అర్హత గలిగిన నిరుపేద కుటుంబాల -వ్యక్తులకు మాత్రమే జాబ్ కార్డులకు దక్కే దిశగా అడుగులు వెయ్యాలి.

ప్రతీ గ్రామంలో అర్హత లేని వేలమంది ఈ పథకానికి రిజిస్టర్ అవ్వటంతో, నిజంగా సంవత్సరంలో వంద రోజుల ఉపాధి అవసరమైన పేదవారికి 35–40 రోజులు కూడా పని కల్పించ లేకపోతున్నారు. అంతేకాదు, గ్రామ పంచాయతీ స్థాయిలో, ప్రతీ ఏటా కొన్ని కోట్ల రూపాయల నిధులు ఖర్చవుతున్నప్పటికీ నాణ్యమైన పనులు చేపట్టలేకపోతున్నారు. వేలమంది అనర్హులతో ఉపాధి హామీ పనులను సమన్వయం చేయటం అధికారులకూ పెద్ద తలనొప్పిగా మారింది.


గ్రామీణ ప్రాంతాలలో పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన, అత్యంత నిస్సహాయ ప్రజలకు, నైపుణ్యం లేని శ్రామిక పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ప్రతీ గ్రామీణ పేద కుటుంబానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోనే, ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం వంద రోజుల పని కల్పించి, కనీస వేతనానికి హామీ ఇస్తూ ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2005లో ప్రవేశపెట్టింది. దేశంలో 200 జిల్లాలలో 2006లో మొదట ఈ పథకాన్ని అమలు చేసినా, ఆంధ్రప్రదేశ్‌లో 2008 నుండి మాత్రమే అమలులోకి వచ్చింది.

అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా లబ్ద్ధి పొందటానికి ఎలాంటి వారు దరఖాస్తు చేసుకుని జాబ్ కార్డులను పొందారు అనే విషయాలను పరిశీలిస్తే విస్తు గొలిపే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సాపేక్షంగా అభివృద్ధి చెందిన ఒక గోదావరి జిల్లాలోని ఒక గ్రామ పంచాయతీని కేస్ స్టడీగా తీసుకోగా–2011 జనాభా లెక్కల ప్రకారం 8,925 పూర్తి జనాభాతో, 2,744 కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామంలో, 2008–-2011 సమయంలోనే 4,185 మంది, అంటే సుమారు 46.8శాతం గ్రామ జనాభా, ఉపాధి హామీ పథకానికి రిజిస్టర్ అయ్యారు. ఈ పథకం కేవలం 18ఏళ్ళు పై బడిన, శారీరక శ్రమ చేయగల వయోజనుల కోసమని ప్రకటించినప్పటికీ– 2008 నుంచి 2024 వరకు కూడా పిల్లలు, అలాగే వృద్ధాప్య పింఛన్లు పొందుతున్న వృద్ధులు సైతం ఉపాధికి జాబ్ కార్డ్ పొందారు. వ్యాపారస్తులు, పంచాయతీ సిబ్బంది, లక్షల ఆస్తులున్న గ్రామస్తులే కాదు, ఊరి బయట హైదరాబాద్ వంటి నగరాలలో ఐటీ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఎంతోమంది ఉపాధి హామీ పథకానికి కూలీలుగా రిజిస్టర్ అయ్యారు. వీరు ఎలాంటి పని చేయకుండానే ఇంట్లోనే ఉండి, లేదా కేవలం మస్టర్ వేయించుకోవటానికి కాలక్షేపానికి వచ్చి వెళ్ళేవారితో, లేదా వారి బదులు వారి పిల్లలను కూడా పనికి పంపి, హాజరు వేయించుకుంటూ లబ్ధి పొందుతున్నారు.


2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ ఒక్క గ్రామంలోనే 2,059 కుటుంబాల నుంచి 3,929 మంది గ్రామస్తులు ఉపాధి పనులలో వేతనంగా, సుమారు రూ.243 చొప్పున, కోటి డెబ్బై లక్షల రూపాయలకు పైగా పొందారు. కాని, ఇన్ని కుటుంబాలకు సగటున పని కల్పించింది 34 రోజులు మాత్రమే. 2023-–24లో 100 రోజుల పని కలిపించగలిగింది కేవలం తొమ్మిది కుటుంబాలకు అయితే, 2022–-23లో రెండు కుటుంబాలకు మాత్రమే. 2022–-23లో 396 కొత్త -పాత పనులను గుర్తిస్తే, 99 పనులను మాత్రమే పూర్తిగా చేయగలిగారు. కనీసం ఈ దశాబ్ద కాలంలో, ఇలా ప్రతీ ఏటా లక్షలు, కోట్లు వేతనాలకు ఖర్చు పెడుతూ 99శాతానికి పైగా చేసిన అభివృద్ధి పనులు ముఖ్యంగా ఏంటీ అంటే– గ్రామంలోని పంట బోదెలు, కాలువలు, చెరువుల సమీపంలో పూడికతీత, కలుపును తొలగించే పనులు మాత్రమే. కాని ఇందులో మెటీరియల్ నిమిత్తం ఉన్న నిధులను వినియోగించి రాజకీయ కార్యకర్తలు కాంట్రాక్టర్లుగా గ్రామంలో సిమెంట్ రహదారులు, మురుగునీటి కాలువలు, డంపింగ్ షెడ్, ప్రభుత్వ గృహాల కాలనీని చదును చేయటం వంటి పనులు ఈ పదేళ్ళల్లో చేపట్టారు. గత నాలుగేళ్ళల్లో ప్రతీ ఏటా 50 లక్షల నుంచి కోటి 30 లక్షల రూపాయలకు పైగా ఈ కాంట్రాక్ట్ పనుల నిమిత్తం ఖర్చు అయ్యాయి. ఉపాధి హామీ పథకానికి లబ్ధిదారుల ఎంపిక, క్షేత్రస్థాయి సిబ్బంది ఎంపిక మొదలుకొని గ్రామంలో పనులను గుర్తించి అమలు చేసే వరకు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ గ్రామ పార్టీ కార్యకర్తలు -వ్యక్తిగత లబ్ధి పొందటం కోసం అధికారులపై ఒత్తిడి పెంచి నిబంధనలను అతిక్రమించటంతో ఉపాధి హామీ పథకం నిర్దేశిత లక్ష్యాలను చేరలేకపోతుంది. ఈ పథకంతో పంచాయతీలు-, ప్రజాస్వామ్యం బలోపేతం అవ్వటం కాదు, రాజకీయ కార్యకర్తలు బలోపేతం అయ్యారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ నిధులు, నిర్ణయాధికారం వారి గుప్పెట్లోకి చేరి ప్రజాస్వామ్య వ్యవస్థలను మరింత బలహీనపరచాయి.


మార్చి 2024లో ఉపాధి వేతనం రూ.300కు పెంచాక రిజిస్టర్‌ చేసుకునే అనర్హుల సంఖ్య మరింత ఎక్కువ పెరిగింది. అంతేకాదు– ఉపాధి హామీ పథకం ద్వారా ఒక కూరగాయల మార్కెట్, గ్రంథాలయం, ఆసుపత్రి, కంపోస్ట్ షెడ్, గ్రామ వనం వంటి స్థిరమైన ఆస్తులు నిర్మించాలన్నా పంచాయతీకి భూములూ ఉండాలి. గ్రామాలు పార్టీ కార్యకర్తల సామ్రాజ్యాలుగా మారిపోయాక ప్రభుత్వ భూములు, వనరులన్నీ అక్రమార్కుల సొంతం అయ్యాయి. స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు సైతం, అత్యంత కీలకమైన ప్రభుత్వ స్థలాలను అమ్మి లాభం పొందుతున్నారు. ఇది ఒక్క గ్రామ పంచాయతీ కథ కాదు, రాష్ట్రంలో, దేశంలో ఉపాధి హామీ పథకం ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో తెలియచెప్పే.. ప్రతీ గ్రామ కథ.

గ్రామసభల ద్వారా, పంచాయతీ వ్యవస్థ ద్వారా, గ్రామస్థాయిలో ప్రజలే నేరుగా పాల్గొని గ్రామానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలనే దృక్పథంతో గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ఏర్పడగానే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే వైపు తొలి అడుగులు వేసారు. శుభపరిణామం. ఆ అడుగులు విజయం వైపు చేరాలంటే, మొదట ఉపాధి హామీ వంటి సంక్షేమ పథకాలలో రాష్ట్రవ్యాప్తంగా ఎటువంటి అర్హత లేని లక్షలాదిమంది లబ్ధిదారులను పూర్తిగా తొలగించాలి. 18 సంవత్సరాలు దాటిన వయోజనులకు మాత్రమే అర్హత ఇవ్వటమే కాకుండా, జాబ్ కార్డ్ పొందటానికి, ముఖ్యంగా వృద్ధాప్య పింఛనులు పొందుతున్నవారికి ఈ పథకం వర్తించకుండా, వయోపరిమితి కూడా ఉండేలా నిబంధనలను రూపకల్పన చెయ్యాలి. క్షేత్రస్థాయిలో అనర్హులు లబ్ధిపొందుతున్నా, కాలక్షేపం చేసి ఎటువంటి పని చేయనివారైనా, గుర్తించి తొలగించటానికి, సామాన్య ప్రజలు సైతం, వాచ్ డాగ్‌గా ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించటానికి వీలుగా, ఒక వెబ్ పోర్టల్ లేదా వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తేవాలి. పంచాయతీ భూములలో విచ్చలవిడిగా పెరుగుతున్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్ట్ 2022లో ఇచ్చిన ఆదేశాలను వెనువెంటనే అమలుచెయ్యాలి.


రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గ్రామ పంచాయితీనీ వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లోకి తీసుకురావాలి. ఓటర్లు అందర్నీ సభ్యులుగా చేర్చాలి. రోజూవారీ గ్రామాభివృద్ధి పనులు, తీర్మానాలు, కార్యకలాపాలు, పంచాయతీ ఆదాయవ్యయాలు, ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, పంచాయతీల పనితీరు, పూర్తి పారదర్శకతతో, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా, అన్ని నిర్ణయాలను వెంటనే ప్రచురించేలా పబ్లిక్ వెబ్ పేజీ, సామాజిక మాధ్యమాల్లో పేజీలు ఏర్పాటు చేయాలి. అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల మాదిరిగానే ప్రతీ గ్రామపంచాయతీ తమ బోర్డు సమావేశాలను, గ్రామసభలను ప్రత్యక్ష ప్రసారం చేయాలి. పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతుంది, అవినీతిని కట్టడి చేస్తుంది, ప్రజల భాగస్వామ్యన్ని ప్రోత్సహిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలనే ప్రభువులను చేస్తుంది. పల్లెల్లో నిజమైన పండుగ తెస్తుంది.

డా. సౌందర్య మనోహరి వెలమాటి

గ్రామదీప్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు

Updated Date - Oct 23 , 2024 | 01:36 AM