శూన్యం
ABN , Publish Date - Aug 19 , 2024 | 12:25 AM
అలాగే ఆకాశం నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది హద్దులు లేక బరివాతల నింగి నేల రాలదు కాకపోతే కొంత ధూళి కణాలు కలిగి...
అలాగే
ఆకాశం నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది
హద్దులు లేక బరివాతల
నింగి నేల రాలదు
కాకపోతే కొంత ధూళి కణాలు కలిగి
మరింత అంతరిక్షనౌకల పొగచూరి
ఎదురుచూస్తూ
పిడుగుల్ని జడివానల్ని కురిపించ
II
భూమి ఉంటుంది
సరిహద్దుల గిరిగీతల బందీగా
యుద్ధ గాయాలను అట్లాస్లా మోస్తూ
మనిషి విధ్వంసానికి పగుళ్ళు బారి
భూకంప ప్రకోపాన్ని ప్రకటించ
III
ఆనకట్టల కట్టడికి కాసింత కలవరపడినా
నదుల గతులు మారవు
ఒకింత కల్మషాలను పెరిగిన కాలుష్యాలను
ముక్కు మూసుకుని బుద్ధుడిలా వహిస్తూ
జలప్రళయ తాండవమాడ
ఉంటాయి
IV
అలాగే.. దేహం జీర్ణమయి
గతించి నువ్వూ ఉంటావు
కొందరి మదిలోనో మస్తిష్కాల్లోనో
ఇంకా రూపు మారి
ప్రకృతి మరో పేరుతో
పంచభూతాల్లో మనిషిపై ప్రతీకారేచ్ఛతో
(కేరళ విలయం చూసి)
పిన్నంశెట్టి కిషన్
97002 30310