ఒక
ABN , Publish Date - Apr 08 , 2024 | 12:36 AM
ఒక లేతవేసవి వాకిట నిలబడి అలసటను గాలితీగపై ఆరబెట్టుకుంటే చిగురుమేఘమొకటి చినుకుచుక్కై బుగ్గను పుణుకుతుంది...
ఒక లేతవేసవి వాకిట నిలబడి
అలసటను గాలితీగపై ఆరబెట్టుకుంటే
చిగురుమేఘమొకటి
చినుకుచుక్కై బుగ్గను పుణుకుతుంది
ఒక వెలుగుదీపపు నీడలో చతికిలబడి
చీకటిగుప్పెట విప్పుకుంటే
నిండైన నక్షత్రమొకటి
కాంతిపుంజమై
నెమ్మదిగా కౌగిలించుకుంటుంది
ఒక గలగలల
సెలయేటి పాదాల వద్ద ముడుచుకుని
గుండెదేహాన్ని తడుముకుంటే
మృదువైన అలలచెలొకటి
పిల్లతెమ్మెరై
మనసును గాలిపటంలా ఎగరేస్తుంది
ఒక మెత్తని మెలకువశయ్య
ఒడిలో కూలబడి
కునుకుపిట్టను నిమురుకుంటే
రంగురంగుల కలలస్వర్గమొకటి
కమ్మగా నిదురజోల పాడుతుంది
ఒక సొగసైన పూలమొక్క
కొమ్మలచేతులలో తలపెట్టి
దిగులుమబ్బును మోస్తుంటే
అందమైన పరిమళమొకటి
ఆత్మీయతై గదినంతా తేలికపరుస్తుంది
ఒక శిఖరమంటి ప్రాణనేస్తపు
కనుల ద్వారబంధానికి
నిత్యతోరణమై వేళ్ళాడితే
సమస్తదుఃఖాలనూ చెరిపేసే
నీలిఆకాశమొకటి
బ్రతుకుముడులను విప్పుతూ
సారాంశాన్ని బోధిస్తుంది
జీవితాన్ని పాదాక్రాంతం చేసి
అర్థవంతంగా మలుస్తుంది
పద్మావతి రాంభక్త
99663 07777