Share News

పద్యం రాస్తా...

ABN , Publish Date - Apr 15 , 2024 | 12:35 AM

దిశమొలతో చిత్తుకాగితాలేరుతున్న ఒక చీమిడిముక్కు పిల్లవాడు ఈ దేశమై కనిపిస్తుంటే నేనొక పద్యం రాస్తా...

పద్యం రాస్తా...

దిశమొలతో చిత్తుకాగితాలేరుతున్న

ఒక చీమిడిముక్కు పిల్లవాడు

ఈ దేశమై కనిపిస్తుంటే

నేనొక పద్యం రాస్తా

మేఘం చిట్లి నగరం

నడుము మీద కూలితే

విరిగి పోయిన

పిట్ట గూళ్ళ ఇండ్లలో

కన్నీటి వరదలో ఈదుతున్న మానవ పక్షుల

జీవన సంధ్యను చూస్తూ

నేను పద్యం రాస్తా

మాధ్యమాల మాయతెరలమీద

కనిపిస్తున్న ప్రగతి

ఈ దేశపు జండా అంటూ

పరిహాసం స్వాభావికం చేస్తున్నపుడు

నేనొక పద్యం రాయకుండా ఎలా ఉంటాను?

ఆకాశంలో సగం చేసే

శోకాలాపాలే జీవన సంగీతం

అయినపుడు,

ఉత్పత్తి శక్తులు పాదాల నుండి

పుట్టిన సూత్రీకరణలు

చాపకింద నీరై

తెలియకుండా

కాటు వేస్తూనే ఉంటే

పద్యంగా శోకించని కవి ఎవ్వడు?

రాజ్యానికి మతాన్ని కవచం

చేసుకునే మహాయోగం

నిస్సిగ్గు వెలుగులతో

రొమ్ము చూపిస్తుంటే

పద్య గర్జనతో, కలం

లక్ష్యాన్ని చాటి చెబుతా

నిశ్శబ్ద రాత్రిలో

నల్లటి కొండ కొనలో

చేతిలో కాగడాతో

నడుస్తూ అదిగో ఒకడు...

రెక్కలు మొలచిన

రేపటి ఆశకు వాడొక సంకేతం

భూమిని చీల్చుకొని మొలిచే

ఆకుపచ్చని రైతు ప్రాణం

సూర్యుణ్ణి తలమీద మోస్తూ

ఎదుగుతున్న కలను

ఆవాహన చేసుకొంటూ

కనిపించని తాళ్ళతో

కట్టేసే శాసనపు గొలుసులను

పడగవిప్పిన పద్యమై

సవాల్‌ చేస్తూనే ఉంటా

మరణం అంచు మీద

జీవన శాసనం

రాస్తూనే ఉంటా.

కాంచనపల్లి గోవర్ధన్‌ రాజు

96760 96614

Updated Date - Apr 15 , 2024 | 12:35 AM