ఇరుగు పొరుగు రాష్ట్రాల వాళ్ళం.. మధ్యలో ఇంగ్లీష్ అనువాదాలెందుకు!
ABN , Publish Date - Aug 05 , 2024 | 05:45 AM
ఈ ఏడాది నుంచే మొదలవుతున్న బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్ ఆగస్ట్ 9, 10, 11 తేదీల్లో బెంగళూరులో జరుగుతున్నది. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలు కేంద్రంగా ఈ సాహిత్య...
ఈ ఏడాది నుంచే మొదలవుతున్న బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్ ఆగస్ట్ 9, 10, 11 తేదీల్లో బెంగళూరులో జరుగుతున్నది. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలు కేంద్రంగా ఈ సాహిత్య ఉత్సవం జరుగుతున్నది. ఈ ఉత్సవానికి ‘ఆంధ్రజ్యోతి’ మీడియా స్పాన్సరర్‌గా వ్యవహరిస్తున్నది. ఈ సందర్భంగా ఫెస్టివల్ డైరెక్టర్, కన్నడ రచయిత సతీష్ చప్పరికేతో వివిధ జరిపిన ఇంటర్వ్యూ ఇది.
బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్ ఆలోచన ఎలా కలిగింది? ఇప్పటికే దేశంలో జరుగుతున్న మిగతా ఫెస్టివల్స్ కంటే ఇది ఏ రకంగా భిన్నమైనది?
భారత దేశంలో చాలా లిటరేచర్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. పేరుకి వీటిని భారతీయ భాషా సాహిత్యాలకు సంబంధించిన ఫెస్టివల్స్ అంటున్నారు. కానీ చాలా సందర్భాల్లో వీటి మొగ్గు ఇంగ్లీష్ భాషా సాహిత్యం వైపు, ఆ భాషలో రాసే రచయితల వైపే ఉంటున్నది. దక్షిణాది భాషలకు ఉన్న వేల ఏళ్ళ చరిత్ర, వాటిల్లో ఉన్న సాహిత్య సంపదతో పోల్చి చూసినప్పుడు నిజానికి హిందీ, ఇంగ్లీషు భాషలు చాలా ఇటీవలి భాషలు. అయినప్పటికీ దక్షిణాది భాషలకు ఈ ఫెస్టివల్స్‌లో తగిన ప్రాముఖ్యత లభించటం లేదు. ఇది గమనించాకనే మాకు ఈ ‘బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్’ ఆలోచన వచ్చింది.
అలాగే చాలా లిటరేచర్ ఫెస్టివల్స్ రచయితలకే ఎక్కువ ప్రాముఖ్యత నిస్తున్నాయి. మేము రచయితలతో పాటు ప్రచురణకర్తలకు కూడా ప్రాముఖ్యత ఇస్తున్నాం. మొట్టమొదటిసారి ఇక్కడ ఒక పబ్లిషర్స్ కాంక్లేవ్ కూడా జరుగుతున్నది. దక్షిణ భారత దేశం లోని వందకుపైగా పబ్లిషర్లు ఇందులో పాల్గొంటారు. ఢిల్లీ నుంచి ఇంగ్లీష్ లిటరరీ ఏజెంట్లు కూడా ఇక్కడికి వస్తున్నారు. చికాగో యూనివర్సిటీ ప్రతినిధులు కూడా వస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం దక్షిణాది భాషల వైపు చూపు సారిస్తున్నది. ఇక్కడి సాహిత్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించటానికి అంతర్జాతీయంగా పబ్లిషర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. వారే డబ్బు పెట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో దక్షిణాది భాషల వారందరం ఏకమై మన సాహిత్యం ఎంత సుసంపన్నమైనదో ప్రపంచానికి చూపించగలగాలి. ఇది బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్ ప్రధాన లక్ష్యం.
ఈ ఫెస్టివల్‌ను పట్టాలెక్కించడానికి అవసరపడిన ప్రయత్నం గురించి చెప్పండి?
ఇలాంటి ఆలోచన ఒకటి ఆచరణ దాకా రావటం ఇదే మొదటిసారి. కేంద్ర సాహిత్య అకాడమీ మాజీ సెక్రటరీ, కేరళ సాహిత్య అకాడమీ ప్రస్తుత అధ్యక్షుడు కె. సచ్చిదానందన్‌ని ఇటీవల నేను కలిసి మాట్లాడినప్పుడు– ఆయన ‘‘మీకు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది?’’ అని అడిగారు. రెండేళ్ళ క్రితం అని చెప్పాను. ‘‘ఇరవై ఏళ్ళ క్రితమే నాకు ఈ ఆలోచన వచ్చింది. కానీ దీన్ని ఆచరణ లోకి తీసుకురావటం చాలా కష్టం’’ అన్నారు. నాలుగు సంస్కృతులను, నాలుగు దక్షిణాది భాషలను, ఆయా భాషల రచయితలను ఒక్క వేదిక మీదకి తీసుకు రావటం సులువైన విషయం కాదు. దీనిపై ఇప్పటికే ఎనిమిది నెలల నుంచి పని చేస్తున్నాం. ఇప్పుడు ఈ భాషల నుంచి 500మందికి పైగా రచయితలు వస్తున్నారు. వీరిలో 300 మంది వేదికలపై మాట్లాడతారు. ఉదాహరణకు ఎనభై ఏళ్ళ వయస్సు గల కవి కె. శివారెడ్డి నుంచి ఇటీవల యువ పురస్కారం పొందిన రమేష్ కార్తీక్ నాయక్ దాకా అన్ని వయసుల వారూ ఉత్సాహంగా తరలి వస్తున్నారు.
ఈ భాషలకు సంబంధించిన సాహిత్య ప్రతినిధుల్ని ఎంచుకునే ప్రక్రియ ఎలా జరిగింది?
ఈ ఎంపిక ప్రక్రియ ఎవరో ఒక వ్యక్తి ద్వారా జరగలేదు. మాకు ఒక క్యూరేషన్ కమిటీ ఉంది. ఈ కమిటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల ప్రతినిధులు ఉన్నారు. ఈ కమిటీ నాలుగుసార్లు సమావేశమైంది. అక్కడ జరిగిన చర్చల ఫలితంగా ఎంపిక ప్రక్రియ కొనసాగింది. అయినప్పటికీ ఇప్పుడు జరిగిన ప్రక్రియే అంతిమం అని మేం అనుకోవటం లేదు. ఈ ఫెస్టివల్ ప్రతి ఏడాదీ ఆగస్ట్ నెలలో రెండో శుక్రవారం, శనివారం, ఆదివారాల్లో జరుగుతుంది. ఈ విడత ఇందులో భాగం పొందలేని వారు భవిష్యత్తులో జరిగే ఫెస్టివల్ ఎడిషన్లలో భాగం పొందుతారు. వారందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చి, ఒకరితో ఒకరు సంభాషించుకొనేలా చేయటమే మా లక్ష్యం.
ఈ నాలుగు దక్షిణాది భాషల రచయితలనూ ఒక వేదికపై తేవటం ద్వారా మీరు ఎలాంటి ఫలితాలను ఆశిస్తున్నారు?
తెలుగులో సాహిత్యాభినివేశం ఉన్న పాఠకుడిని గానీ, రచయితని గానీ కన్నడలో మంచి పేరున్న ఐదారుమంది రచయితల పేర్లు చెప్పమంటే చెప్పగలిగే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇరుగు పొరుగు రాష్ట్రాలై ఉండి కూడా మనం ఒకరి సాహిత్యాన్ని మరొకరు ఇంగ్లీషు అనువాదాల ద్వారా చదవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఒక తెలుగు నవల ఇంగ్లీషు ద్వారా కన్నడ లోకి వచ్చినా మూలంలోని సారం చాలామటకు పోగొట్టుకునే వస్తుంది. మా ఉద్దేశమేమిటంటే– ఈ దక్షిణాది భాషల రచయితల మధ్య పరస్పర సంబంధాలు ఏర్పడితే అప్పుడు ఇంగ్లీషు అవసరం లేకుండానే ఈ భాషల రచనలు ఒక భాష లోంచి మరొక భాషలోకి నేరుగా అనువాదం పొందటానికి ఒక దారి ఏర్పడుతుంది. సహోదర భాషలైన దక్షిణాది భాషల సాహిత్యం ఏకం కావాలన్నదే మా లక్ష్యం. ఇది జరిగితే ఇక ఆ తర్వాతి దశలో ఈ భాషల నుంచి ఇంగ్లీషు అనువాదాలు జరిగి ఇక్కడి సాహిత్యం అంతర్జాతీయ స్థాయికి చేరుతుంది.
ఈ ఫెస్టివల్‌ను బెంగళూరులోనే నిర్వహించడానికి కారణం?
అందుకు తగ్గ సాంస్కృతిక వాతావరణం బెంగళూరులో ఉండటం ఒక కారణం. మరొక కారణం కూడా ఉన్నది. బెంగళూరు నగరంలో 15శాతం మంది తెలుగు భాష మాట్లాడేవారు ఉన్నారు, 15 శాతం మంది తమిళం మాట్లాడేవారు ఉన్నారు, 8 శాతం మంది మలయాళం మాట్లాడతారు, 35 శాతం కన్నడ మాట్లాడతారు. ఇది పూర్తి స్థాయి కాస్మోపాలిటన్ నగరం.
భవిష్యత్తులో ఈ ఫెస్టివల్ రూపురేఖల్లో ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా?
వచ్చే ఏడాది మరాఠీ భాషను కూడా దీనికి జత చేయబోతున్నాం. తర్వాత క్రమంగా ఉర్దూ, కొంకణి, తుళు, కొడవ భాషలు కూడా వచ్చే సంవత్సరాల్లో ఇందులో భాగమయ్యేట్టు చూస్తాం. అంతా సక్రమంగా జరిగితే భవిష్యత్తులో ఉత్తర భారతీయ భాషల కోసం కూడా లక్నో లాంటి ప్రదేశంలో బుక్ బ్రహ్మ ఫెస్టివల్ నిర్వహించాలన్న ఆలోచనలు ఉన్నాయి.