నోబెల్ గ్రహీతల రాజకీయోపనిషత్తులు!
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:23 AM
ప్రవచనాల్లేని యుగం లేదు! ఒక్కో యుగంలో ఒక్కో ప్రవచనం ప్రబలంగా ఉంటుంది. స్వామి భక్తినీ ప్రభు భక్తినీ ప్రదర్శించాలన్న ప్రవచనం మధ్యయుగాల్లో రాజ్యమేలింది. ఎంతో సాహిత్యం దీనిపైనే వచ్చింది. ఆధునిక యుగంలో...
ప్రవచనాల్లేని యుగం లేదు! ఒక్కో యుగంలో ఒక్కో ప్రవచనం ప్రబలంగా ఉంటుంది. స్వామి భక్తినీ ప్రభు భక్తినీ ప్రదర్శించాలన్న ప్రవచనం మధ్యయుగాల్లో రాజ్యమేలింది. ఎంతో సాహిత్యం దీనిపైనే వచ్చింది. ఆధునిక యుగంలో బాగా ప్రచారమున్న ప్రవచనం ఏదైనా ఉందంటే అది ఆర్థిక వ్యవస్థకు చెందిందే! ఆర్థిక అంశాలను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్నదే ఆ ప్రవచనం! ఆర్థిక శాస్త్రానికి ఆద్యుడిగా భావించే ఆడంస్మిత్ కాలం నుంచీ అది వినిపిస్తున్నా 1990ల్లో బాగా ఊపందుకుంది. రాజకీయాలకు అతీతంగా ఉండే ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఎప్పుడైనా, ఎక్కడైనా ఉందా? అని ఎంత శోధించినా లభించే జవాబు ఒక్కటే! అట్లాంటిది ఎక్కడా లేదు. వారం క్రితం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన డారా అసిమొగ్లు, జేమ్స్ ఎ. రాబిన్‌సన్, సైమన్ జాన్సన్ రచనలు చూసినా ఇదే అర్థం అవుతుంది. ఆర్థిక వ్యవస్థపై రాజకీయాల మంచిచెడుల ప్రభావాన్ని వివరించటానికి చేసిన కృషికే ఆ ముగ్గురికీ నోబెల్ వచ్చింది.
ఇంతకీ రాజకీయాల్లో మంచేమిటి? చెడేమిటి? ఈ రెంటికీ వివిధ దేశాల మధ్య నెలకొన్న అసమానతలకు సంబంధం ఏమిటి? కొన్ని దేశాలు అద్భుతమైన ప్రగతిని ఎందుకు సాధించాయి? మరికొన్ని అట్టడుగున ఎందుకున్నాయి? కారణాలేమిటి? ఆ దేశాలకున్న వనరుల్లో ఉన్న తేడానా? లేక అత్యుత్తమ ఆర్థిక విధానాలను అర్థం చేసుకుని చేపట్టటంలో నాయకుల వైఫల్యమా? కొన్ని దేశాల్లో వందలేళ్లు పాతుకుపోయిన సంప్రదాయ సంస్కృతి సాహసోపేత అడుగులు వేయకుండా ప్రజల చొరవను నీరుగారుస్తోందా? ఈ మూడు ప్రశ్నలకు జవాబులిస్తూ.. ఆర్థిక ప్రగతికి తోడ్పడే రాజకీయాలను, సంస్థాగత ఏర్పాట్లను వివరిస్తూ 12 ఏళ్ల క్రితం ‘‘వై నేషన్స్ ఫేల్’’ అనే పుస్తకాన్ని డారా అసిమొగ్లు, జేమ్స్ ఎ. రాబిన్‌సన్ రాశారు.
సంపన్న దేశాలు ఇప్పుడు 30 దాకా కనపడతాయి. వీటిలో యూరప్, ఉత్తర అమెరికాలో ఉన్నవే ఎక్కువ. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, సింగపూర్, దక్షిణకొరియా, తైవాన్‌లు కూడా ఈ జాబితాకు చెందినవే. ఇక అట్టడుగున ఉన్న 30 దేశాల జాబితాను పరిశీలిస్తే అవన్నీ చాలా మేరకు సబ్–సహారా ఆఫ్రికాలోనే కనపడతాయి. వీటికి అఫ్ఘనిస్థాన్, హైతీ, నేపాల్ లాంటి దేశాలు కూడా కలపొచ్చు. 50 ఏళ్లు వెనక్కి వెళ్లినా జాబితాలో కొన్ని మార్పులే కనపడతాయి. సింగపూర్, దక్షిణ కొరియా లాంటి కొన్ని దేశాలు 50 ఏళ్లలో ధనిక దేశాల జాబితాలో చేరాయి. అలాగే పేద దేశాల జాబితాలో ఆనాడు వేరేవి కొన్ని ఉండేవి. ఇవి మినహా 100–150 ఏళ్లు వెనక్కి వెళ్లినా జాబితాలో స్వల్పమార్పులే కనపడతాయి! 2008 నాటికి పేద దేశాల సగటు తలసరి వార్షిక ఆదాయం 2000 డాలర్లు కాగా ధనిక దేశాల ఆదాయం 20000 డాలర్లు. అమెరికా ఖండంలో యూఎస్‌ఏ, కెనడాలు ఆదాయపరంగా పైభాగాన ఉంటే చిలీ, అర్జెంటీనా, బ్రెజిల్, మెక్సికో, ఉరుగ్వే, వెనెజులా తర్వాతి స్థానంలో నిలిచాయి. మూడో స్థానంలో కొలంబియా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, పెరూ ఉంటే అట్టడుగున బొలివియ, గ్వాటమాల, పరాగ్వైలు నిలిచాయి. ఈ ఖండంలో సైతం 50 నుంచి 150 ఏళ్లు వెనక్కి వెళ్లినా దేశాల మధ్య పరిస్థితిలో పెద్ద మార్పు కనపడదు. సౌదీ అరేబియా, కువైత్ లాంటి చమురు ఆధారిత మధ్య ప్రాచ్య దేశాల్లో తలసరి ఆదాయం ధనిక దేశాలకు కాస్త అటుఇటు గానే ఉంటుంది. కానీ చమురు ధరల్లో తేడా వస్తే వాటి ఆదాయం పడిపోతుంది. మధ్య ప్రాచ్యంలో చమురు నిల్వలు పెద్దగా లేని దేశాలైన ఈజిప్టు, జోర్డాన్, సిరియాల ఆదాయం పెరూ, గ్వాటమాలకు సమానంగానే ఉంటుంది.
పారిశ్రామిక విప్లవం ఆరంభం నాటి నుంచి చూస్తే వివిధ దేశాల మధ్య సంపద, ఆదాయాల్లో తేడాలు కొద్దిమార్పులతో కొనసాగుతున్నట్లే కనపడుతుంది. ఆ విప్లవానికి ముందు దేశాల మధ్య ఇంత తేడాల్లేవు. ఇక్కడ నాలుగు ప్రశ్నలు తలెత్తుతాయి. ఒకటి... పారిశ్రామిక విప్లవం తర్వాత పాశ్చాత్య దేశాలు (అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా) ఎందుకు వెనుకంజ వేయలేదు? రెండు.. అమెరికా ఖండంలో దేశాల మధ్య అసమానతలు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయి. మూడు.. సబ్–సహారా, మధ్యప్రాచ్య దేశాలు పాశ్చాత్య దేశాల వేగాన్ని ఎందుకు అందుకోలేకపోయాయి. నాలుగు.. తూర్పు ఆసియా దేశాలు ఆర్థికంగా ఎందుకు పురోగమించాయి.
ఈ ప్రశ్నలకు సామాజిక శాస్త్రవేత్తల వివరణలు పరిశీలిస్తే అందులో ముఖ్యమైనవి మూడే కనపడతాయి. లోతుగా చూస్తే అవేవి సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వవు. భౌగోళిక పరిస్థితులకు పెద్దపీట వేస్తూ అందించిన వివరణను మొదటిదిగా చెప్పుకోవచ్చు. దక్షిణాసియా, ఆఫ్రికా, మధ్య అమెరికాలోని పేద దేశాలన్నీ ఉష్ణమండల ప్రాంతంలోనూ ధనిక దేశాలన్నీ సమశీతోష్ణ ప్రాంతాలలోనూ ఉన్నాయనీ అసమానతలకు ఈ భౌగోళిక తేడాలనే కారణాలుగా చెప్పే వాదన 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ రాజకీయ శాస్త్రవేత్త మాంటెస్క్యూతో మొదలైంది. ఉష్ణమండలాల ప్రజలు స్తబ్దులు.. సోమరులు.. కొత్త విషయాలపై కుతూహలం ఉండదు... నియంతల పాలన కింద కొనసాగుతారు... ఇలా చాలానే ఆ ప్రాంత ప్రజల స్వాభావిక లక్షణాలుగా చెప్పారు. సోమరితనం నుంచి దారిద్య్రం, కుతూహల లోపంతో విజ్ఞానాల్లో వెనుకబడటం... ఫలితంగా సంపద సృష్టిలో అట్టడుగున ఉండటం... ఉష్ణమండల దేశాలకు సహజం అన్నట్లుగా సూత్రీకరించారు. మాంటెస్క్యూనే కాదు జెఫ్రీసాక్స్ లాంటి కొందరు సమకాలీన ఆర్థికవేత్తలదీ ఇదే ధోరణి. వాతావరణం ఆలోచనలు, పనితీరును ప్రభావితం చేస్తుందని చెప్పటమే కాదు.. ప్రజల ఆరోగ్యం, వ్యవసాయ ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందనీ వాదించారు. ఈ వివరణ సమర్థనీయం కాదని చెప్పటానికి ఇటీవల పరిణామాలనే పేర్కొనొచ్చు. ఇప్పటి దక్షిణ–ఉత్తర కొరియాలను, ఒకనాటి తూర్పు–పశ్చిమ జర్మనీలను పరిశీలిస్తే అభివృద్ధిలో తేడాలకు భౌగోళిక అంశాలు కారణాలు కాదని తేలికగానే తెలుస్తుంది. ఆ దేశాల్లోని వేర్వేరు రాజకీయ వ్యవస్థలు అభివృద్ధి స్థాయిని విపరీతంగా ప్రభావితం చేశాయి. అలాగే ఉత్తర–దక్షిణ అమెరికా, యూరపు–ఆఫ్రికాల మధ్య తేడాలను భౌగోళిక అంశాల ప్రాతిపదికనే వివరించలేం. చరిత్రలోకి చూస్తే ఉష్ణమండల దేశాలు ఎల్లకాలం పేద దేశాలుగా లేవు. ఉత్తర అమెరికా కంటే ఒకనాడు (500 ఏళ్ల క్రితం) మెక్సికో, మధ్య అమెరికా, పెరు, బొలివియా దేశాలే ఆర్థికంగా పైస్థాయిలో ఉండేవి. ఆజ్‌టెక్, ఇన్కా నాగరికతలు అక్కడే విలసిల్లాయి. చైనా, భారత్‌లు గొప్ప ప్రాచీన నాగరికతలకు నిలయాలు. ఉష్ణమండలాలు వ్యాధులకు నిలయాలనీ, ఇక్కడి నేలలు పోషకాలను నిలుపుకోలేవన్న వాదనలు కూడా పరిశీలనలకు నిలబడవు. ప్రభుత్వాలు చేపట్టే ప్రజారోగ్య పరిరక్షణ చర్యలతో చాలా దేశాల్లో అనేక వ్యాధులు అదుపులోకి వచ్చాయి. ఆ చర్యలు చేపట్టక ముందు బ్రిటన్ కూడా ఒకప్పుడు చాలా అనారోగ్యకరంగా ఉండేది.
సంస్కృతికీ సంపద సృష్టికీ సంబంధం ఉందనే వాదన జర్మన్ సామాజిక శాస్త్రవేత్త మాక్స్ వెబర్ చాలా ప్రాచుర్యంలోకి తెచ్చారు. క్యాథలిక్ చర్చి వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ 16వ శతాబ్దంలో మొదలైన మత ఉద్యమం (ప్రాటిస్‌టంట్ రెఫమేషన్) నైతికవర్తనకు దారితీసిందనీ అది చివరికి పశ్చిమ యూరపులో పారిశ్రామిక సమాజం పురోగమించటానికి కారణమైందనీ వెబర్ సూత్రీకరించారు. ‘కష్టం చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు.. సంపాదనతో పాటు పొదుపు కూడా చేయాలి... సమయపాలనతో కచ్చితంగా పనిచేయాలి’... ఈ మూడు బోధనలు ప్రాటిస్‌టంట్ నైతికతలో ప్రధానమైనవిగా చెబుతారు. పెట్టుబడిదారులు ప్రధానపాత్ర వహించే ఆర్థిక వ్యవస్థకు ఇవి ప్రాణప్రదమైనవి. అయినా ప్రాటిస్‌టంట్ మతం ఉన్నచోటల్లా ఈ బోధనలు అభివృద్ధికి దారీతీశాయని చెప్పలేం. ఈ మతమే ప్రధానంగా ఉన్న తూర్పు, పశ్చిమ జర్మనీల మధ్య ఒకనాటి ఆర్థికపరమైన తేడాలే ఇందుకు నిదర్శనం. అభివృద్ధిలో ఆ రెండిటి మధ్య చాలా అంతరం ఉండేది. రెండు దేశాల్లో విభిన్నంగా ఉన్న రాజకీయ సంస్థలు, విధానాలు, ఎన్నికలు– పాలనా పద్ధతులు, పౌరహక్కులు, న్యాయవ్యవస్థ లాంటివి ఆర్థికాభివృద్ధిపై ఎంతో ప్రభావాన్ని చూపించాయి. చైనా సంస్కృతి, కన్ఫ్యూషన్ విలువలను ఒకనాడు ఆర్థిక ప్రగతికి అడ్డంకిగా భావించేవారు. కానీ ఆ ప్రభావం ఉన్న దేశాలు కూడా ఆర్థిక ప్రగతిలో ముందుకు వెళుతున్నాయి. ఫ్రాన్స్ క్యాథలిక్ దేశమైనా ప్రగతికి అది అడ్డంకి కాలేదు.
పేద దేశాల విధానకర్తలు, ఆర్థికవేత్తలు అవగాహనలేమితో సరైన విధానాలను అనుసరించకపోవటం వల్లే అభివృద్ధిలో వైఫల్యం చెందుతున్నారన్న సూత్రీకరణ కూడా విశ్లేషణకు నిలబడదు. వెనుకబడిన ఏ దేశాన్ని తీసుకున్నా అక్కడ అవగాహనా లోపం కంటే అప్పటికే ఆర్థికంగా ఆధిపత్యం ఉన్న వర్గాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉద్దేశపూర్వకంగానే సరైన విధానాలు చేపట్టలేదనేది స్పష్టమవుతుంది. లాటిన్ అమెరికా దేశాల్లో ఇది స్పష్టంగా కనపడుతుంది. భారత్‌లో భూసంస్కరణల విషయంలోనూ దీన్నే చూడొచ్చు.
రాజకీయ విధానాలు, సంస్థలు కల్పించే అవకాశాలు, అడ్డంకులను పక్కనపెట్టి ఆర్థిక అసమానతలను అర్థం చేసుకోలేం. రాజకీయ విధానాల్లోనే విషయమంతా ఉంది. సమన్యాయ పాలనలో లోపాలు, ఆశ్రిత పక్షపాతాలు, మార్కెట్‌లో గుత్తాధిపత్యాలు, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణలో వైఫల్యాలు, న్యాయవ్యవస్థ స్వతంత్రతకు పగ్గాలు, విద్యావ్యాప్తికి అవరోధాలు, కొత్త ఆవిష్కరణలు చేసే వారికి కొరవడే ప్రోత్సాహకాలు, వ్యక్తుల చొరవకు అడ్డంకులు.. వీటన్నిటినీ అసిమొగ్లు బృందం అభివృద్ధికి నిరోధకాలుగా పేర్కొంది. వీటి కోణం నుంచి చూస్తే భారత్ ప్రయాణం అస్తవ్యస్తంగానే కనపడుతుంది. ఎన్నికల్లో వేలకోట్లు వెదజల్లే రాజకీయ సంస్కృతి, అడుగడుగునా పైరవీలు, అన్నిస్థాయిల్లో లంచాలు, పాలక పార్టీలకు అధికారులకు తోకల్లా మారటం, ప్రజా జీవితంలో నైతికతకు ప్రాధాన్యం ఇవ్వని మత సంస్కృతి, సంకుచిత తత్వాన్ని ప్రోత్సహించే కులభావాలు.. ప్రబలంగా ఉన్నంత వరకూ అసలైన అభివృద్ధికి మనం చాలా దూరంలో ఉండిపోతాం. దేశాల మధ్యా, దేశాల లోపలా అసమానతలకు మూలం రాజకీయ విధానాలు, వ్యవస్థల్లో ఉందన్న విశ్లేషణ.. నిజమైన ప్రజాస్వామ్య పాలన కోసం ఉద్యమించే వారికి కొంతైనా తోడ్పడతాయి! అంతమేరకు నోబెల్ గ్రహీతల సూత్రీకరణలు విలువైనవే!
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్)