పాపులర్ నవల పునర్జన్మ?
ABN , Publish Date - Sep 02 , 2024 | 02:58 AM
వివిధలో ‘మూడు ప్రశ్నలు’ అనే శీర్షికలో రైటర్, పబ్లిషర్ మల్లికార్జున్ ఇంటర్వ్యూ చదివాక (19 ఆగస్ట్ 2024), వారు తమ అజు పబ్లికేషన్స్ తరఫున వేసిన ఒక పుస్తకాన్ని ముప్పై మూడు వేల కాపీలు అమ్మారని...
వివిధలో ‘మూడు ప్రశ్నలు’ అనే శీర్షికలో రైటర్, పబ్లిషర్ మల్లికార్జున్ ఇంటర్వ్యూ చదివాక (19 ఆగస్ట్ 2024), వారు తమ అజు పబ్లికేషన్స్ తరఫున వేసిన ఒక పుస్తకాన్ని ముప్పై మూడు వేల కాపీలు అమ్మారని తెలిసాక, కుతూహలంతో ఆ పుస్తకాన్ని కొని చదివాను. ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ కవితాత్మక శైలిలో ఒక నాటకీయమైన కథని కళ్ళ ముందు జరుగుతున్నట్టు చెప్పే నవల. ఈనాటి కాలం లోంచి ఒకనాటి ప్రేమల్ని చూపిస్తుంది. అలా తరాల్ని దాటి చెప్పటం కూడా ఈ నవల అప్పీల్‌ని పెంచింది కావొచ్చు. ఈ నవల చదివితే ఒకప్పటి మాదిరెడ్డి సులోచన, కొమ్మనాపల్లి గణపతిరావు వంటి రచయితల శైలి గుర్తుకు వచ్చింది. వీరిని అప్పట్లో పాపులర్ రచయితలు అని పిలిచేవారు.
పాపులర్ రచయితలు తెలుగులో కొన్ని దశాబ్దాల పాటు రాజ్యమేలారు. ప్రధానంగా పంతొమ్మిది వందల డెబ్బై, ఎనభై, తొంభై దశకాల్లో ఒక వెలుగు వెలిగారు. కానీ తొంభైల తర్వాత, ఇక్కడ కేబుల్ టీవీ రావటం తోపాటే, వీరి నవలల పాపులారిటీ తగ్గిపోయింది (ఆ పాఠకులు టీవీ సీరియల్స్ వైపు మళ్ళటం చేత, ఆ రచయితలు కూడా చాలామంది టీవీ సీరియల్స్ రాయటం వైపే వెళ్ళిపోయారు). ఆ తర్వాత ముప్పై ఏళ్ళ పాటు తెలుగులో పాపులర్ సాహిత్యం అన్నది దాదాపు లేదు. ఇప్పుడు ఒక నవల ఇంత ప్రాచుర్యం పొంది ఇన్ని కాపీలు అమ్ముడుపోవడాన్ని బట్టి తెలుగులో పాపులర్ సాహిత్యం మళ్ళీ రంగ ప్రవేశం చేస్తున్నదా అన్న ఆలోచన కలిగింది. ఎందుకంటే ముప్పై వేల కాపీలంటే చిన్న విషయం కాదు. యండమూరి, మల్లాది వంటి పాపులర్ రచయితల ప్రభ దేదీప్యమానంగా వెలిగిన దశలో కూడా ఒక నవల ఇంత తక్కువ సమయంలో ఇన్ని కాపీలు అమ్ముడుపోవటం అరుదైన విషయమే.
పాపులర్ సాహిత్యం బాగా చేయగలిగేదీ, సీరియస్ సాహిత్యం చేయలేనిదీ ఒకటుంది. అది కొత్త పాఠకుల్ని సాహిత్యం వైపు రప్పించడం. ఇప్పుడు యాభైల అరవైల వయసులో ఉన్న చాలామంది పాఠకులని ‘‘మీకు సాహిత్య అభిరుచి ఎలా కలిగిందీ, మీరు చదివిన మొదటి పుస్తకాలు ఏమిటీ’’ అని అడిగితే వారిలో ఎక్కువమంది ఆనాటి పాపులర్ సాహిత్యం వైపే వేలెత్తి చూపిస్తారు. ఆనాటి పాపులర్ రచయితలే చాలామంది పాఠకుల్ని ‘‘చదవడం’’ వైపు ఆకర్షితుల్ని చేశార న్నది చాలావరకు నిజం. అలా చదవటం మొదలు పెట్టిన పాఠకుల్లో కొంతమంది అక్కడితో ఆగి పోకుండా సీరియస్ సాహిత్యం వైపు వెళ్ళారు. అయితే సీరియస్ సాహిత్యానికీ- పాపులర్ సాహిత్యానికీ మన సాహిత్య వాతావరణంలో కొన్ని చిత్రమైన పేచీలు ఉన్నాయి.
అవేమిటో చెప్పుకునే ముందు– అసలు పాపులర్ సాహిత్య ప్రభ వెలిగిపోతున్న ఆ రోజుల్లో వచ్చిన సీరియస్ సాహిత్యం ఏమిటీ అన్నది ఒకసారి చూడాలి. ఆ రోజుల్లో సీరియస్ సాహిత్యం అంటే కమ్యూనిస్ట్ భావజాలంతో ఏదో రకంగా ముడిపడి ఉన్నదే. ఈ కమ్యూనిస్ట్ భావజాలం గల రచయితలు పాపులర్ సాహిత్యాన్ని ఈసడించుకున్నారు. ఆనాడు వార పత్రికల ద్వారా ఎక్కువ ప్రచారం పొందిన పాపులర్ సాహిత్యాన్ని బూతు సాహిత్యం అన్నంతగా విమర్శించారు. 1953లో శ్రీశ్రీ ‘‘వార పత్రికలంటే పెట్టుబడికీ కట్టుకథకీ పుట్టిన విషపుత్రికలు’’ అన్నారు. ఇది చాలావరకు నిజమే కూడా. హీరోయిన్ల జాకెట్ కొలతల్ని ఊహించమని పాఠకులకి క్విజ్‌లు పెట్టిన దశ ఒకటి పత్రికల్లో నడిచిందనీ, ఇప్పటి యూట్యూబ్ థంబ్‌నైల్స్‌కి మించిన దిగజారుడుతనం ఆనాటి కొన్ని వార పత్రికల్లో కనిపించేదనీ మరిచిపోలేం. అయితే అది ఎంత నిజమో, పాపులర్ సాహిత్యం పట్ల లెఫ్ట్ భావజాల రచయితల స్పందనలో కొంచెం అతి ఉన్నదన్నదీ అంతే నిజం.
ఉదాహరణకి, అమెరికాలో స్టీఫెన్ కింగ్ ఏదో హారర్ నవల రాశాడని టోనీ మారిసన్ విరుచుకుపడలేదు. సిడ్నీ షెల్డన్ నవలల పాపులారిటీ చూసి ఏ సాల్మన్ రష్దీనో పబ్లిక్‌గా ఉడుక్కోలేదు. కానీ ఇక్కడ యండమూరి ‘తులసీదళం’ నవలకి వస్తున్న పాపులారిటీ చూసి రంగనాయకమ్మ స్థాయి రచయితలు కూడా విరుచుకుపడ్డారు. ‘తులసీదళం కాదు, గంజాయి దమ్ము’ అనీ, క్షుద్ర సాహిత్యమనీ చాలామంది కఠిన విమర్శలు ఎక్కు పెట్టారు. విమర్శ లేకపోతే అలాంటి సాహిత్యం పెరిగిపోతుం దన్నది వాళ్ళ వాదన. వేరే దేశాల్లో పాపులర్ సాహిత్యాన్నీ ఆయా సాహిత్య వాతావరణాలు అంగీకరించాయి. మొత్తం సాహిత్య వాతావరణంలో పాపులర్ సాహిత్యానికీ స్థానం ఉన్నదని ఒప్పుకున్నాయి. తెలుగులో మటుకు దాన్ని కుష్టురోగిని దూరం పెట్టినట్టు దూరం పెట్టడానికి ప్రయత్నించారు. మొత్తానికి తొంభైల తర్వాత పాపులర్ సాహిత్యానికి రకరకాల కారణాలతో సహజ మరణం ప్రాప్తించింది.
ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ సాయం తోనో, మీమ్ పేజీస్ సాయం తోనో ఎలాగైతేనేం ఒక నవల ముప్పై వేల కాపీలు దాటి అమ్ముడుపోయిందన్న విషయం చూస్తే తెలుగులో పాపులర్ నవల మరోసారి పునర్జన్మ ఎత్తనున్నదా అన్న ఆలోచన కలుగుతున్నది. మరి ఇప్పుడు లెఫ్ట్ భావజాలం అంత తీవ్రంగా లేదు. ఈ వాతావరణంలో పాపులర్ సాహిత్యం మళ్ళీ రంగప్రవేశం చేస్తే, మన ప్రస్తుత సాహిత్య వాతావరణం దానికి ఎలా స్పందిస్తుందీ అన్నది ఆసక్తికరమైన విషయం. దాన్నీ సాహిత్యంలో ఒక భాగంగా ఆహ్వానిస్తుందా, లేక ఇదివరకట్లాగే వెలేయటానికి ప్రయత్నిస్తుందా? అలాగే ఒకప్పటి పాపులర్ సాహిత్యం లాగే ఇప్పటి పాపులర్ సాహిత్యమూ పాఠకుల బలహీనతల మీద ఆధారపడే మనుగడ కొనసాగిస్తుందా? లేక వేరే కొత్త దారేదైనా కనుక్కుంటుందా? లేక రెండూ కలిసి ఉంటూనే విడివిడిగా ఎలాగోలా కొనసాగుతాయా? అసలు అవి ఒక గీత గీసి విడదీయగలిగేంత వేర్వేరు విషయాలేనా? ఇవన్నీ ఆసక్తికర మైన ప్రశ్నలు. వీటి జవాబులెలా ఉన్నా తెలుగు అక్షరం వైపు కొత్త పాఠకులు రావటం మంచి విషయమే అంటే ఎవరికీ పేచీ ఉండకపోవచ్చు.
కావేరి గోపాల్