Share News

ప్రేమ ముద్ర

ABN , Publish Date - Jun 03 , 2024 | 05:51 AM

కుదురు లేని నిద్ర లోలోన పిగిలిపోతూ ప్రాణం నాన్న నొప్పి లేకుండా కన్ను మూశాడు అమ్మను మరణం నిరాకరిస్తోంది కొద్దికొద్దిగా చస్తూ కంటిచెమ్మను పొదుపుగా ఒలికిస్తోంది...

ప్రేమ ముద్ర

కుదురు లేని నిద్ర

లోలోన పిగిలిపోతూ ప్రాణం

నాన్న నొప్పి లేకుండా కన్ను మూశాడు

అమ్మను మరణం నిరాకరిస్తోంది

కొద్దికొద్దిగా చస్తూ

కంటిచెమ్మను పొదుపుగా ఒలికిస్తోంది

వచ్చే దారిలో చూస్తున్నాను

కూలుతోన్న తరువులో అమ్మను

ఎంత నీడనిచ్చింది

ఎన్ని పళ్ళనిచ్చింది

చెప్పలేనంత కలపనిచ్చింది

మోడు చెట్టుపై

పిట్టలు వాలడం లేదు

మాలాగే

ఎంత దృఢత్వం అమ్మది

పుల్లలా మిగిలిన తనను చూస్తోంటే

మా రంగులు వెలిసిన బొమ్మలు

దర్శిస్తున్నాము

కొద్దిసేపు పిల్లలు చుట్టుముట్టినపుడు

వాన పలకరిస్తే

ఎండిన చెరువులో నీటివాసనలా

తన ముఖంలో చిటికెడు శాంతి

అరిగిపోయిన గరిటలా

అన్నం పెట్టిన చేయి బూడిద రంగులో

ఆ గుప్పిటలోనే

నా చిటికెనవ్రేలు

జీవిత స్పర్శను ప్రేమగా చూసింది

ఇప్పుడు ‘ప్రేమ’

ఉనికిని ఆర్పేసుకుంటున్న

మునిమాపులా

దీర్ఘ సెలవును కోరుకుంటోంది

మృత్యువు సంతకం చేసేలోపు

మళ్ళీ తన చుట్టూ

బాల్యం బొమ్మలు గీయాలి

అమ్మ చివరి దస్తూరిని

పెరట్లో మొక్కగా దాయాలి

బతికున్నంతవరకు

పిల్లల్లో అమ్మను బతికించుకోవాలి

తెలుగు వెంకటేష్‌

99853 25362

Updated Date - Jun 03 , 2024 | 05:51 AM