ప్రియ పద్యం
ABN , Publish Date - Jul 29 , 2024 | 02:22 AM
ఈ శవాగారపు గోడల మీదే పారాడుతున్నరా తండ్రీ జీనా కహా? మర్నా కహా? మహా దిగ్మండలమంతా మరణపు వాసన వయోలిన్ తీగల కల ఆమె జ్ఞాపకమై...
analysis
1.
ఈ శవాగారపు గోడల మీదే పారాడుతున్నరా తండ్రీ
జీనా కహా? మర్నా కహా?
మహా దిగ్మండలమంతా మరణపు వాసన
వయోలిన్ తీగల కల ఆమె జ్ఞాపకమై
వెంటాడుతూనే ఉంటే
భయభయంగా అమ్మ కొంగులోకి ముడుచుకుంటున్న...
2.
కబూతర్ ఖానాల రెక్కతెగిన పావురమై
పెనుగులాడిన నా రక్తపు నమూనా
వెతుక్కుంటూ, వెతుక్కుంటూ వస్తాడా ఒక
అలెక్స్ హేలీ ఏనాటికైనా?
నిద్రలోకి తెరుచుకోవు కండ్లు
డొక్కలోకి ముడుచుకురావు మోకాళ్ళు
రగిలి రగిలీ
దుఃఖ వలపోతల గుండెకాయ ఒక్కటే బెంగటిల్లి
కురిసిన వానలన్నీ కాగితం పడవలై
ఏ గలివర్ గాన్ని ఏ తీరానికి చేర్చినవో
లిల్లీఫుట్ దీవులల్ల మహాకాయున్నయి
వెతికి వెతికి ఇట్లా....
3.
మెట్రోరైలు వంతెన కింద ఈ ఉక్కపోత రాత్రి
చెరువు నీల్లల్ల అల్లి పువ్వు వాసనై ఆమె కల
బీడీ వాసన పద్యమై ఆమె నవ్వు
సినీమాక్స్ లోంచి తెరలు తెరలుగా ఆమె స్వరం
సమస్తాధార భూమండలమంతా ఒక్కసారిగా
నా ఒడిలోకి చేరినట్టు
ఫ్రాయిడోషోలిద్దరూ ఫుట్పాత్ మీద నిదురిస్తున్న పిల్లలై...
ఎవరినీ ప్రేమించలేక నన్ను నేను ద్వేషించనూ లేక
రెండోప్రతిపాదన చేయువాడేవాడునూ కనరాక
త్రోవ నుంచీ తావో (Tao) దాకా తాగి తాగి
నన్ను నేను విశ్లేషించుకొని,
నన్ను నేను విభాగించుకొని
నాతో నేనే విభేదించుకొని....
4.
ఇక ఇప్పుడంతా ఒకే పదం
ఇక ఇప్పుడు జీవితమంటే ఒకే వాక్యం
ఇక మొత్తంగా బతుకంటే...
చీకటీ వెలుగు కలిసిపోయిన light pollution
ద్వైతాద్వైతాల యుద్ధరంగమై నెత్తిన ఎత్తిన బోనపుకుండ
జహన్నుమ్, జన్నత్ లదాకా
పక్కటెముకల మీదుగా చర్మాన్ని చీల్చిన మోహర్రమ్ వేడుక
ఈ నగరమంతా పండీ పండని వగరురుచుల
సీమచింతకాయ....
నరేష్కుమార్ సూఫీ
95736 09460
నరేష్కుమార్ సూఫీ ఈ కాలపు కవి. వాస్తవంలో జీవిస్తూ వాక్యానికి ఎక్కడా సొగసు అంటనీయకుండా నిశ్చలమైన, నిక్కమైన వాక్యాన్ని రాయడం అతని శైలి. మనిషి జీవిత ప్రయాణంలో ఎన్నోసార్లు దుఃఖాన్ని భరిస్తూ జీవితాన్ని వెళ్లదీస్తూ ఉంటాడు, సూఫీ వాళ్ళందరి తరపున తానొక్కడై నిలబడి ఈ ‘్చుఽ్చజూడటజీట’ కవితను బహిరంగంగా చదివి వినిపిస్తున్నాడా అనిపిస్తుంది. అమ్మకొంగులోకి ముడుచు కోవడం, రక్తపు నమూనాలను వెతుక్కుంటూ వెళ్లడం, సమస్త భూమండలం ఒక్కసారిగా ఒడిలోకి చేరినట్టు కలగనడం, ఇదంతా జ్ఞాపకాల నుంచి నడుస్తూ వర్తమానం మీదుగా భవిష్యత్ తలపోతల భావ సంఘర్షణ.
సరిగ్గా చూస్తే తప్ప ఈ కవితా వైశాల్యాన్ని మనం ఊహించలేం. కాల్పనిక క్యారెక్టర్‌ని కాగితం పడవ మీద తీరాలని చేర్చడంలో కవి ఊహాని మెచ్చుకోకుండా ఉండలేం. ఇందులో ఉన్న ఆమె మనకి చెరువులో పూసిన అల్లిపూవు వాసన వేస్తుంది. ఇటువంటి అరుదైన వ్యక్తీకరణ గుండెల్లో భారంతో కూడిన దిగులు అనుభవం ఉంటే తప్పా అది కాగితం మీద కవితలా మారదు.
కవి తనని తనతో విభేదించుకుంటూ తన ప్రేమకి తనకి ఎదురైన ప్రేమరాహిత్యానికి మధ్యలో నలిగిపోయిన గుండెని ప్రపంచానికి చూపిస్తాడు. జీవితంలో దుఖఃమొక్కటే ఉందా ఆశ లేదా అని అడిగే ప్రశ్నకి ఆఖరి లైన్‌ని సమాధానంగా ఇస్తాడు. హైదరాబాద్ జీవితం, పక్కా తెలంగాణ భాషతో కూడిన భావ సాంద్రత ఊపిరి సలప నివ్వదు. జీవితం అంటే చీకటి వెలుగు కలిసిన లైట్ పొల్యూషన్ అనే మాట వెనక ఉన్న జీవన తాత్పర్యం అర్థం ఐతే ఈ కవిత పండినట్టే, ఈ కవి మనకి అందినట్టే.
అనిల్ డ్యాని
97033 36688
(ఈ ‘ప్రియపద్యం’ శీర్షికలో సాహిత్యకారులు
తమకు నచ్చిన ఇటీవలి కవిత ఒకటి ఎన్నుకుని
ఎందుకు నచ్చిందో వివరిస్తారు.)