Share News

ప్రజాసేవ, కళాసేవ రెండు కనులుగా...

ABN , Publish Date - Nov 06 , 2024 | 01:48 AM

తెలుగు రాజకీయ నేతలలో అరుదైన జీవనవిధానంతో నిస్వార్థ ప్రజాసేవకు మారుపేరుగా నిలిచారు ఎస్‌.ఆర్‌.ఎ.ఎస్‌. అప్పలనాయుడు. బడుగుల ఇంట పుట్టి ఎందరికో అడుగు జాడగా ఎదిగిన ఆదర్శమూర్తి...

ప్రజాసేవ, కళాసేవ రెండు కనులుగా...

తెలుగు రాజకీయ నేతలలో అరుదైన జీవనవిధానంతో నిస్వార్థ ప్రజాసేవకు మారుపేరుగా నిలిచారు ఎస్‌.ఆర్‌.ఎ.ఎస్‌. అప్పలనాయుడు. బడుగుల ఇంట పుట్టి ఎందరికో అడుగు జాడగా ఎదిగిన ఆదర్శమూర్తి ఆయన. ఉమ్మడి విశాఖ జిల్లా పెందుర్తిలో జన్మించారు. తాతల నుండీ వారసత్వంగా వచ్చిన గ్రామ మునసబు వృత్తి కొన్నాళ్ళు నిర్వహించారు. తర్వాత పెందుర్తి గ్రామ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం మొదలైంది. మరి వెనుదిరిగి చూడలేదు. 1967లో ఆనాటి పరవాడ శాసనసభ్యునిగా ఎన్నికై, ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టారు. అది మొదలు ఆజన్మాంతం కాసు బ్రహ్మానందరెడ్డి అంతేవాసిగా, కుటుంబ సభ్యునిగా మమేకమైన విధేయుడు, విశ్వాసపాత్రుడు. మూడేళ్ళు రాష్ట్ర మంత్రిగా, పదమూడేళ్ళు లోక్‌సభ సభ్యునిగా, ఏడాది కాలం పాటు ఆనాటి ‘వుడా’ చైర్మన్‌గా వ్యవహరించారు. ఎన్ని పదవులు చేపట్టినా, అవినీతి మరక అంటని విశుద్ధవర్తనుడు.


రాజకీయంగా ఎంత కార్యశూరుడో... నాటకం ఆయనకు ఆరోప్రాణం. యవ్వనంలోనే పెందుర్తిలో ‘యువజన కళా సమితి’ పేరుతో, ఒక కళా, నాటక సంస్థను స్థాపించారు. ఆయన మూడోసారి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత, 1980 సెప్టెంబరులో, పెందుర్తి టూరింగ్‌ టాకీస్‌లో ‘యువజన కళా సమితి’ రజతోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ‘యువజన కళా సమితి’ నటులతో కలసి ‘అన్నాచెల్లెలు’, ‘పల్లెపడుచు’, ‘పూలరంగడు’ వంటి సాంఘిక నాటకాల్లో నటించారు. పార్లమెంటు సభ్యునిగా వుంటూ, ఢిల్లీలోను, పెందుర్తిలోను, ‘మహామంత్రి తిమ్మరుసు’, ‘యోగి వేమన’, ‘అల్లూరి సీతారామరాజు’ వంటి చారిత్రక నాటకాలలో నటించారు. 1985లో ఆయన షష్టిపూర్తి ఉత్సవాలు వారం రోజుల పాటు కళా, క్రీడా కార్యక్రమాలతో జరిగాయి. 1993లో పెందుర్తిలో కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. 1996లో ఆయన మరణించిన తర్వాత 2005లో విశాఖ జిల్లా గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలోను, 2015లో పెందుర్తి శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలోనూ 80, 90వ జయంతి ఉత్సవాలు జరిగాయి. నేటి నుంచి మొదలుకొని వచ్చే ఏడాది నవంబరు 6 వరకు శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించటానికి ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులతో శత జయంతి ఉత్సవ నిర్వహణ కమిటి కార్యక్రమాలు రూపొందిస్తోంది.

బి.వి. అప్పారావు

Updated Date - Nov 06 , 2024 | 01:48 AM