రాహుల్... ఒకసారి వెనుతిరిగి చూడండి!
ABN , Publish Date - Nov 13 , 2024 | 03:23 AM
ఆర్టికల్ మొదట్లోనే రాహుల్‌గాంధీ గారు ‘‘చరిత్ర నాకు తెలియదు’’ అని ఒప్పుకున్నందుకు సంతోషం (ఆంధ్రజ్యోతి – 06.11.2024). నిజమే, రాహుల్‌గాంధీ గారికీ, వారి కుటుంబానికీ భారతదేశ నిజమైన....
ఆర్టికల్ మొదట్లోనే రాహుల్‌గాంధీ గారు ‘‘చరిత్ర నాకు తెలియదు’’ అని ఒప్పుకున్నందుకు సంతోషం (ఆంధ్రజ్యోతి – 06.11.2024). నిజమే, రాహుల్‌గాంధీ గారికీ, వారి కుటుంబానికీ భారతదేశ నిజమైన, సంస్కృతి సంప్రదాయాలతో కూడిన చరిత్ర తెలియదు.
ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్‌ను అణిచివేసిందంటూ బ్రిటిష్ పెత్తనాన్ని కేవలం వాణిజ్య దోపిడీగా మాత్రమే చూపేటువంటి ప్రయత్నం చేశారు. కానీ భారతదేశాన్ని ఆర్థికంగానే కాదు, సామాజికంగా సాంస్కృతికంగా తీవ్రంగా ధ్వంసం చేసిన చరిత్ర ఈస్ట్ ఇండియా కంపెనీది. భారతదేశ సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలను బ్రిటిష్ పాలన చిన్నాభిన్నం చేసిందని రాహుల్‌గాంధీ అంటున్నారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం పరిపాలించింది మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ కాంగ్రెస్ పార్టీ– అలాగే మీ నాన్న, మీ నానమ్మ, మీ ముత్తాత ఇట్లా మీ కుటుంబంవాళ్లే! మరి వీరందరి పరిపాలనలో బ్రిటిష్ వారికి ధారాదత్తం కాబడిన సంస్కృతీ సాంప్రదాయాలని, భారతీయ ఆత్మను పునరుద్ధరించడంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫలమైందని కూడా మీరు ఒప్పుకున్నట్టే!
కాంగ్రెస్ పార్టీకి రుచించని ‘వందేమాతరం’, ‘భరతమాత’ వంటి పదాలను రాహుల్‌గాంధీ తన రాతలలో చూపించడం శుభ పరిణామం, దాన్ని స్వాగతిస్తున్నాను. ఎందుకంటే మీ పార్టీ ద్వారా గెలిపించబడిన ఉపరాష్ట్రపతి వందేమాతరం గీతాన్ని ఆలపించడానికి మనసు ఒప్పక జాతీయ పతాకానికి నమస్కారం చేయడానికి మనసు రాక నిల్చుంటే భరతజాతి యావత్తు సిగ్గుతో తలవంచుకొని బాధపడినటువంటి ఘటన మీకు గుర్తు చేయాల్సినటువంటి సందర్భం ఇది. అలాగే దేశంలో గుత్తాధిపత్యాలు, కుబేరులు కేవలం 2014 తర్వాత మాత్రమే ఉద్భవించినటువంటి బ్రహ్మ పదార్థాలుగా రాహుల్ గాంధీ అభివర్ణించడం శోచనీయం. భారతదేశంలో రాజకీయంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా మొట్టమొదటి గుత్తాధిపత్యం ఎవరు చెలాయించారన్నది ఆయన ఆత్మావలోకనం చేసుకోవాలి. ‘లైసెన్స్ రాజ్యం’ పేరుతో భారతదేశాన్ని అధోగతి పాలు చేస్తూ దేశీయ పారిశ్రామికవేత్తలు అభివృద్ధి చెందకుండా అభాసుపాలు చేసిన చరిత్ర మీ ప్రభుత్వానిది కాదా?
మీరు చెప్పిన ‘మార్కెట్ శక్తులు’, లేదూ ‘బడా వ్యాపారులు’, వారితో అధికార సంబంధాలు మీ ప్రభుత్వ పాలనలోనే మొదలయ్యాయి. మీ ముత్తాత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు టాటా సంస్థల వ్యవస్థాపకులు ఈ దేశంలో వ్యాపారం చేయడానికి మీ ముత్తాతను సంప్రదిస్తే వారి నుంచి వచ్చిన సమాధానం ఏమిటో టాటా వ్యవస్థాపకులు అనేక సందర్భాల్లో దేశ ప్రజలకు చెప్పిన ఉదంతం మీకు తెలియకుండా ఉండదు. ఇక దేశంలో అత్యధిక కాలం ప్రభుత్వాన్ని నడిపిన మీ కుటుంబం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అధికారాన్ని మొత్తం మీ చెప్పు చేతుల్లో పెట్టుకొన్నది. బడా వ్యాపార సంస్థల అధినేతలతో లంచ్ పార్టీలు, డిన్నర్ పార్టీలలో ఎవరు ఎలాంటి లబ్ధి పొందారో చరిత్ర మనకు అనేక సాక్ష్యాలను ఇచ్చింది. దయచేసి వెనక్కి తిరిగి చూస్తే అవి మీకు కనపడతాయి.
అలాగే– రాహుల్‌గాంధీ చెప్పినట్టుగా సమాజంలో అట్టడుగున ఉన్న చిట్టచివరి బడుగు జీవిని ఉద్ధరించడమే మన ధ్యేయం కావాలన్నది గాంధీజీ లక్ష్యం కాదు. అది భారతీయ జనతా పార్టీ స్ఫూర్తి ప్రదాత, సిద్ధాంతకర్త స్వర్గీయ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతా సిద్ధాంతం. సమాజంలో చిట్టచివర ఉన్న వ్యక్తికి ప్రభుత్వం తొలి ఫలాలు అందించాలనేది బీజేపీ ప్రథమ ఆశయం.
ఇక మీరు ఆదివాసీల తరఫున నిలబడడం, మణిపూర్ ప్రజల బాధలు వినడం, రైతుల బాధలు వినడం... ఇవన్నీ మీ పార్టీకీ, మీకూ సరిపడని మాటలు! ఎందుకంటే మణిపూర్ ఘటన మీ ముత్తాత మొదలుపెట్టిన రావణ కాష్టానికి పరాకాష్ఠే! అత్యధిక కాలం అధికారంలో ఉన్న మీరు, మీ కుటుంబం, మీ పార్టీ గిరిజనులకు కానీ ఆదివాసీలకు కానీ, రైతులకు కానీ చేసిందేమీ లేదు.
గత పదేళ్ళ పైచిలుకు కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులకు, వ్యాపారస్తులకు భారతదేశం ఒక స్వర్గధామంగా మారింది. నరేంద్ర మోదీ సారథ్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో ఎటువంటి దళారుల ప్రమేయం లేకుండా ఏకగవాక్ష విధానంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్నది. భారతదేశంలో తొలిసారిగా ఏ బడా వ్యాపారవేత్తలకు తొత్తులుగా మారకుండా నాయకుల పాలన సాగుతున్నది. ఒకపక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు ముద్ర లోన్ ఇచ్చి ప్రోత్సహిస్తూ మరోవైపు కొత్తగా వ్యాపార రంగంలో వచ్చేవాళ్లకు బ్యాంకింగ్ రంగంలో సరళమైన విధానంలో ప్రోత్సాహకాలు ఇస్తూ నరేంద్ర మోదీ పాలన భారతదేశాన్ని ఇవాళ ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తి నిలబెట్టగలిగింది! మీ పేరు చివరన ‘గాంధీ’ అన్న తోక ఉన్నందుకు తప్ప మరెందుకూ ఈ దేశ ప్రజలు మిమ్మల్నీ, మీ కుటుంబాన్నీ గౌరవించడం లేదు అనే విషయాన్ని ఇప్పటికైనా మీరు గ్రహిస్తే మంచిది.
ఎం. రఘునందన్ రావు
మెదక్ పార్లమెంట్ సభ్యులు