Share News

ప్రైవేట్‌ రంగంలోనూ ఆదివాసీలకు రిజర్వేషన్లు

ABN , Publish Date - Dec 19 , 2024 | 02:16 AM

ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ ఆర్థిక విధానాలు నేడు మానవాళిని కబళిస్తున్న నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా తయారైంది. దేశాల మధ్య సరిహద్దులు...

ప్రైవేట్‌ రంగంలోనూ ఆదివాసీలకు రిజర్వేషన్లు

ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ ఆర్థిక విధానాలు నేడు మానవాళిని కబళిస్తున్న నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా తయారైంది. దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్నది. ఒకపక్క ప్రైవేటు రంగం పుంజుకుంటున్న కొద్దీ ప్రభుత్వరంగ సంస్థలు మూతపడుతున్నాయి. నేడు దేశంలో ఉపాధి అవకాశాలు అత్యధికంగా ప్రైవేటు రంగం నుంచే లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అనివార్యంగా మారాయి. సమాజంలో అన్ని రంగాల్లోనూ వెనుకబడి నాగరిక ప్రపంచానికి దూరంగా ఉంటున్న ఆదిమ తెగలకూ నేడు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత నేటి పాలకవర్గాలపై ఉన్నది.


ఆదివాసులకి భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రత్యేక గుర్తింపూ, రాజ్యాంగ రక్షణలూ నేడు వెలవెలబోతున్నాయి. పాలకవర్గాలు వాటిని సక్రమంగా అమలు చేయడం లేదు. ఆదిమ తెగల విద్యార్థులు నేటి నాగరిక ప్రపంచంలో ఉన్న విద్యాపరమైన, ఉద్యోగపరమైన పోటీని తట్టుకోలేకపోతున్నారు. ప్రైవేట్‌ రంగంలో ఉన్న అవకాశాలను అగ్రవర్ణాలు దోచుకుంటున్నాయి. ఆదివాసులు అధికసంఖ్యలో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కాబట్టి నేటి ఆదివాసులకు తప్పనిసరిగా ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని చాలామంది మేధావులు, రాజకీయ, విద్యారంగ ప్రముఖులు- వాదిస్తున్నారు. కానీ ప్రైవేట్‌ రంగంలో రిజన్వేషన్లు అమలు చేయకూడదనీ, అందరికీ సమాన ప్రాతినిధ్యం ఉండాలనీ బోధించేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ప్రతిభ దెబ్బతింటుందన్నది వాళ్ళ అభిప్రాయం. కానీ ఇది బూర్జువా వర్గ ధోరణి. ఇదే తరహా వాదనతో ఐదేళ్ళ క్రితం పార్లమెంట్‌లో దుమారం చెలరేగింది. కాని దానికి దీటుగా ప్రజాస్వామిక, ప్రగతిశీల, విప్లవ మేధావులు అందరూ కలిసి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలు రెండింటిలోనూ రిజర్వేషన్లు ఉండాలి అని పెద్ద చర్చ జరిపారు.


ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు అంతకంతకూ పడిపోతున్న నేపథ్యంలో ‘రిజర్వేషన్ల’ భావనకు ఒక అర్థమంటూ మిగలాలంటే నేడు ప్రైవేట్‌ రంగంలోనూ రిజర్వేషన్లను అమలు చేయాల్సిందే. ప్రతి ప్రైవేట్ కంపెనీ ప్రతి ఏటా ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేయాలి. అక్కడ ఉన్న ఉద్యోగావకాశాలను ఎస్సీ, ఎస్టీ, బీసీల వారీగా వర్గీకరించి రిజర్వేషన్లు కల్పించాలి. ఆదివాసులకూ తప్పనిసరిగా రిజర్వేషన్లు ఉండాలి. ప్రతి ప్రైవేట్ కంపెనీలోనూ రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగస్థులు ఉండే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్ల బిల్లునూ పార్లమెంట్‌లోను, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలోనూ ఆమోదించాలి. ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్ల కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను కేంద్రంలో, రాష్ట్రాలలో ఏర్పాటు చేయాలి. ప్రైవేట్‌ రంగంలో విద్యా సంస్థల్లోనూ రిజర్వేషన్లు ఉండాలి. ఈ దిశగా ఆదివాసీ విద్యావంతులు, ఆదివాసీ ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పోరాటం చేయాలి. ఈ పోరాటానికి ప్రగతిశీల, విప్లవ మేధావులు అండగా నిలవాలి.

వూకె రామకృష్ణ, ఆదివాసీ జర్నలిస్ట్ అసోసియేషన్

Updated Date - Dec 19 , 2024 | 02:16 AM