గ్రామీణాభివృద్ధి దార్శనికుడు
ABN , Publish Date - Dec 24 , 2024 | 04:44 AM
కాకాని వెంకటరత్నం 53 సంవత్సరాల క్రితం కీర్తిశేషుడు అయ్యారు. అవిభక్త కృష్ణాజిల్లాలోని గ్రామాలు ఆయనను ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నాయి. అభివృద్ధి అంటే ఏమిటి, అది ఎట్లా మొదలవుతుంది, ఎట్లా దినదినాభివృద్ధి చెందాలొ...
కాకాని వెంకటరత్నం 53 సంవత్సరాల క్రితం కీర్తిశేషుడు అయ్యారు. అవిభక్త కృష్ణాజిల్లాలోని గ్రామాలు ఆయనను ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నాయి. అభివృద్ధి అంటే ఏమిటి, అది ఎట్లా మొదలవుతుంది, ఎట్లా దినదినాభివృద్ధి చెందాలొ తెలియజేసిన నాయకుడు కనుకనే కాకాని స్మృతి పచ్చగా ఉన్నది. 75 సంవత్సరాల క్రితం ఆయన చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలకు స్ఫూర్తి ఆ సునిశ్చిత భావనే అని చాలా మందికి తెలియదు. స్వీయ విద్యాభ్యాసం ప్రాథమిక పాఠశాల వరకే పరిమితమైనా గ్రామాల అభివృద్ధికి పునాది వేసిన దార్శనికుడుగా కాకానిని కీర్తించడం అతిశయోక్తి కాదు. స్థానిక ప్రజల పాత్ర, పర్యవేక్షణ ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యం అనేది ఆయన సిద్ధాంతం. పార్టీలకు అతీతంగా సహకరించుకోగలిగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన ఆచరణాత్మకంగా నిరూపించారు.
విద్య విషయంలోనే కాక అనేక రంగాల్లో అవిభక్త కృష్ణా జిల్లా ఈనాడు ముందుండడానికి కారణం కాకాని వేసిన బాటే. జిల్లా బోర్డుల వ్యవస్థకు కొత్త ఒరవడి తీసుకువచ్చిన ఘనత ఆయనదే. అలా ఇతర జిల్లాల వారికి కూడా కాకాని ఆదర్శపాత్రుడు అయ్యారు. కర్నూలు జిల్లాలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, అనంతపురం జిల్లాలో కల్లూరు సుబ్బారావు, ఖమ్మం జిల్లాలో జలగం వెంగళరావు, గుంటూరు జిల్లాలో జాగర్లమూడి చంద్రమౌళి, విశాఖ జిల్లాలో సాగి సూర్యనారాయణరాజు, పశ్చిమగోదావరిలో మాగంటి బాపినీడు జిల్లా బోర్డు అధ్యక్షులుగా ఎన్నికై సేవలు చేశారు. వీరంతా కాకానితో కలిసి పని చేసిన నాయకులే. కాకాని పాలనా పద్ధతులను మనం ఇంకా కొనసాగిస్తున్నామనడం సత్యదూరం కాదు. ముందు విద్య అందరికీ అన్ని చోట్ల అందుబాటులో ఉండాలి. అనటమే కాకుండా, దానికోసం నిరంతర కృషిచేసిన నాయకుడు కాకాని. గ్రామ గ్రామానికి వెళ్లి పాఠశాల స్థాపన ధ్యేయంగా ఆయన తన అధికారాలను సద్వినియోగం చేశారు. ఉపాధ్యాయుల ప్రాముఖ్యత గుర్తించడమేకాక, వారికి సమున్నతమైన గౌరవం తీసుకొచ్చిన నాయకుడు. విద్యతోపాటు వ్యవసాయం, నీటిపారుదల, రోడ్ల నిర్మాణం, నిర్వహణ మొదలైనవి స్థానికుల కృషితోనే జరిగే విధంగా చూడడం ఆయన పాలనా పద్ధతుల విశిష్టత. వ్యవసాయంతో పాటు పాడి, మహిళా శక్తికి ఏ విధంగా తోడ్పడుతుందో అది గ్రామాభివృద్ధికి ఎంత ముఖ్యమో చెప్పి చూపించినది కూడా కాకానే. కుటుంబ వ్యవస్థలను బలపరిచే ఆలోచనలు ఎన్నో....! ముఖ్యంగా మహిళలు, పిల్లలకు రైతులలాగా తగిన ప్రాధాన్యాన్ని ఇవ్వడం గురించి చర్చించి స్థానికులే తగిన చర్యలు చేపట్టేలా చూశారు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వాల మీద ఆధారపడకుండా జరగాలనేది ఆయన ఆలోచన. అలాగే పిల్లల్లో జాతీయ భావాలు పెంపొందించి, దేశ సమస్యల పట్ల అవగాహన పెంపొందించడానికి పాఠశాలల్లో సోషల్ స్టడీస్ మీద, ఆటపాటల మీద ధ్యాస పెంచే ప్రయత్నం ప్రత్యేకంగా చేశారు. ప్రతి పాఠశాలలోనూ ఆటస్థలం ఉండేందుకు ఆయన కృషి చేశారు. కాకాని రత్నం పేరు మీదగా జిల్లా పరిషత్ పాఠశాల ఆటస్థలాలకు కాకాని పేరు పెట్టడం సముచితంగా ఉంటుంది. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టి ఆమెను గౌరవించుకోవల్సి ఉన్నది. ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం కాకాని రత్నాలు అనే పురస్కారంతో గుర్తింపునిస్తే భావి పౌరులను తీర్చిదిద్దేవారికి ప్రేరణ కల్పించినట్టవుతుంది. వారు కొత్త ఉత్సాహంతో తమ విధులు నిర్వర్తించేందుకు అవకాశం ఉంటుంది. ఇదే పద్ధతిలో ఇతర జిల్లాలలో అభివృద్ధికి విశేషంగా దోహదం చేసిన నాయకులను కూడా గౌరవించుకోవాలి.
కాకాని కఠినుడు అని ప్రతీతి. ఇది కొంతవరకు నిజం, కొన్ని విషయాల్లో కాఠిన్యం ఎక్కువగా ఉండేది. అయితే అంతకన్నా ఎక్కువ జాలిగుండె కాకానిది. ముఖ్యంగా విద్యార్థులు, పేదలు, దళితులు, స్వయంకృషిని నమ్ముకున్న వాళ్ళంటే ఆయనకి ఇంకా అమిత ప్రేమాభిమానాలు ఉండేవి. కాకాని స్నేహ హృదయుడు. చివరివరకు కాకాని వెంకటరత్నం బృందంగా, దశాబ్దాలుగా పేరొందిన మహానుభావులు అంతా నాకు గుర్తుకు వచ్చినప్పుడు రాజకీయాల్లో ఆ విధమైన స్నేహం, ఆ తర్వాత ఇప్పటివరకు కనబడడం లేదు కదా అనే విచారం కలుగుతుంది. కాకాని స్నేహ బృందంలోని వారంతా వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు అయినా కలిసిమెలిసి కులమతాలకి అతీతంగా వ్యవహరించిన తీరు. ఆదర్శప్రాయమైనది. గ్రామాల అభివృద్ధే వారి ధ్యేయం. దాదాపు 20–25 సంవత్సరాల పాటు ఆటుపోట్లను రకరకాల ఒత్తిళ్ళని ఎదుర్కొని మరీ స్నేహితులుగా మెలిగారు. పేట బాపయ్య, రెబాల బుచ్చి రామశ్రేష్టి, అప్పికట్ల జోసెఫ్, కలపాల సూర్యప్రకాశ్‌రావు, అక్కినేని భాస్కరరావు, ఆకుల కాంతారావు, మరిపల్ల చిట్టి, పిన్నమనేని కోటేశ్వరరావు వీరంతా ఒక బృందంగా, జట్టుగా, స్నేహితులుగా రాజకీయాల్లో చివరి వరకు పేరొందినవారే. విద్యని అందుబాటులో తీసుకొచ్చి పిల్లలందరినీ విద్యావంతులని చేయాలనే కాకాని బృందం తపనపడేది. అందుకే ఈ రోజు కృష్ణా జిల్లా విద్యలో రాష్ట్రంలోనే ముందు ఉండటమే కాక, దేశ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించి, అనేక మంది ఉన్నత పదవుల్లో ఉన్నారంటే అదంతా కాకాని దూరదృష్టే. స్థానిక పాఠశాలకు సహకరించడమే కాకుండా సభ్యతతో మెలిగి పిల్లల అజ తీసుకుంటూ తెలుసుకోవడంలోనే అభివృద్ధి మొదలవుతుందని గ్రహించిన నాయకుడు కాకాని. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా ఆయన ఆలోచించి ఆచరించారు.
కాకానిది అతి సామాన్య జీవన విధానం ఆయన ధ్యాసంతా పదిమంది పిల్లలకు, 20 మంది రైతులకు, 30 గ్రామాలకు సహాయపడటమే. ఆ రోజుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ గ్రామానికి వెళ్లినా కాకాని కనీసం నలుగురైదుగురిని పేరు పెట్టి పిలిచేవారు. వారి కుటుంబాల మచి చెడ్డలు అడిగి తెలుసుకునేవారు. ఈ సద్గుణం, సహృద్భావమే కాకాని నాయకత్వానికి మూలాలు. కాకాని వెంకటరత్నం తిరుగులేని నాయకుడిగా, మొండిజీవిగా, ప్రజారాజకీయవాదిగా వెలుగొందడానికి కారణం. ఈనాటి రాజకీయ నాయకులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటే దేశ స్థితిగతులు సత్వరమే మరింత మెరుగుపడతాయనడంలో సందేహం లేదు. ప్రతి డిసెంబర్ 25న గత 20 సంవత్సరాలుగా కాకాని వెంకటరత్నం విశిష్టతను గురించి రాస్తూనే ఉన్నా ఇంకా ఇంకా ఎన్నో విషయాలు రాయవలసే ఉంది.
డాక్టర్ నాగులపల్లి భాస్కరరావు
(డిసెంబర్ 25: కాకాని వెంకటరత్నం వర్ధంతి)