Share News

సమయం

ABN , Publish Date - Aug 12 , 2024 | 01:14 AM

ఆ వెన్నెల రాత్రి ఆకాశంలో చుక్కల్లా మా పొలంలో వడ్ల రాశి చెట్లు ఆలకించే సమయం అప్పడు మేము ఇలా పాటయ్యామ్...

సమయం

ఆ వెన్నెల రాత్రి ఆకాశంలో చుక్కల్లా

మా పొలంలో వడ్ల రాశి

చెట్లు ఆలకించే సమయం

అప్పడు

మేము ఇలా పాటయ్యామ్

కురిసిన వానకు, నిండిన చెరువు

చేపల దాహం తీరాక

మిగిలిన నీళ్లే పంటకు ఉగ్గుపాలు

మెల్లగా వెన్నెల అందుకున్న చంద్రుడు

మా గుండెల్లా వెలుగుతున్నాడు

అటు ఇటు చెక్కర్లు కొట్టే పేరు తెలియని పక్షి

పొడుపు కథలా అరుస్తోంది

ఎక్కడో

జనక జనక జజ్జనక సవారీ దెబ్బ

మోగుతున్న తప్పెటకు

పాదం కింద సెగ

అప్పుడే మేం ఆటయ్యామ్

ఏ దుఃఖం

కల్లం వైపు రాలేదు

ఏ కష్టమూ లోపల కదలడం లేదు

ఏ సూచీకలు అంచనా కట్టలేని సంతోషం

మనిషి ఇట్టే ఉండాలి, మనసు ఇట్టే ఉండాలి

మాయలేదు, మరణం లేదు

ముసురుకునే చీకటి లేదు

అప్పుడు మేం

మనుషులవుతున్నాం

గోపాల్ సుంకర

94926 38547

Updated Date - Aug 12 , 2024 | 01:14 AM