Share News

మణిపూర్‌ హింస

ABN , Publish Date - Jun 21 , 2024 | 02:21 AM

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) అధినేత మోహన్‌ భాగవత్‌ చేసిన ఒక హెచ్చరికలాంటి సూచనవల్లనో, ఏకంగా మణిపూర్‌ ముఖ్యమంత్రి భద్రతాబలగంలోని పోలీసువాహనాలమీద మిలిటెంట్లు కాల్పులు జరిపినందువల్లనో...

మణిపూర్‌ హింస

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) అధినేత మోహన్‌ భాగవత్‌ చేసిన ఒక హెచ్చరికలాంటి సూచనవల్లనో, ఏకంగా మణిపూర్‌ ముఖ్యమంత్రి భద్రతాబలగంలోని పోలీసువాహనాలమీద మిలిటెంట్లు కాల్పులు జరిపినందువల్లనో తెలియదుకానీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా మణిపూర్‌మీద ఇప్పుడు పూర్తిశ్రద్ధపెట్టారు. సోమవారం ఢిల్లీలో ఆయన మణిపూర్‌శాంతిభద్రతల పరిస్థితిని లోతుగా సమీక్షిస్తున్నప్పుడు ఆ సమావేశంలో ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ లేరు. ఆర్మీచీఫ్‌, కేంద్ర హోం సెక్రటరీ, ఇంటలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) డైరెక్టర్‌ ఇత్యాది పెద్దలతో కూడిన ఈ సమావేశానికి మణిపూర్‌ డీజీపీ, ఆ రాష్ట్ర భద్రతాసలహాదారు, చీఫ్‌ సెక్రటరీ హాజరైనారు. ఇదేమన్నా రాజకీయ సమవేశమా, ముఖ్యమంత్రిని పిలవడానికి అని బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నప్పటికీ, కాంగ్రెస్‌ మాత్రం ఈ పరిణామాన్ని తనకు నచ్చినరీతిలో విశ్లేషిస్తోంది. బీరేన్‌ లేరంటే అవిశ్వాసతీర్మానం నెగ్గినట్టే అంటూ ఏవో వ్యాఖ్యలు చేసింది.

ఢిల్లీ సమావేశం వివరాలను ఆ తరువాత ముఖ్యమంత్రి సదరు అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారట. మణిపూర్‌ ఎంతోకాలంగా రగులుతున్నా ఎవరికీ కనబడని, వినబడని గవర్నర్‌ సైతం ఇప్పుడు తెరమీదకు వచ్చి ఉన్నతాధికారులతో ఓ సమీక్ష నిర్వహించారు. ఆరునూరైనా హింసను అనుమతించవద్దనీ, కఠినమైన చర్యలతో శాంతిభద్రతలు కాపాడాలని గవర్నర్‌ అనసూయ డీజీపీకి హితవుచెప్పారు. ముఖ్యమంత్రిని పక్కనబెట్టి ఆమె స్వయంగా రంగంలోకి దిగడం ఢిల్లీ ఆదేశాలు లేనిదే జరగకపోవచ్చు. ఇండియా కూటమికి చెందిన ఓ ఇరవైమంది నాయకులు మణిపూర్‌ సందర్శించి, గవర్నర్‌తోనూ, ముఖ్యమంత్రితోనూ భేటీ కావడం కూడా వాతావరణంలో వస్తున్నమార్పుకు నిదర్శనం.


మణిపూర్‌లో హింస ఇటీవల మళ్ళీ తీవ్రస్థాయికి చేరడం, మీతీ, కుకీజో తెగల మధ్య ఘర్షణలు తిరిగి రేగడం, అవి కొత్త ప్రాంతాలకు విస్తరించడం కేంద్రప్రభుత్వానికి సరికొత్త పరీక్ష. అసోంకు ఆనుకొని ఉన్న జిరిబమ్ జిల్లా మణిపూర్‌కు ఆర్థికశక్తిని సమకూర్చే మంచి వ్యాపారకేంద్రం. ఏడాదికాలంగా తాకని హింస ఇప్పుడు ఆ జిల్లాకు విస్తరించడంతో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. రెండుతెగలకూ చెందిన వందకు పైగా ఇళ్ళు తగలబడిపోయి, వందలాదిమంది అసోంకు పారిపోయారు. తెగిపడిన తల ఒకటి దొరకడంతో ఈ అగ్గిరాజుకుంది. పోలీసువాహనాలు, చెక్‌పోస్టులు, అటవీకార్యాలయాలు కూడా ధ్వంసమైనాయి. ముఖ్యమంత్రి అక్కడకు వెళ్ళడానికి సిద్ధమవుతూంటే, అడ్వాన్స్‌ సెక్యూరిటీ టీమ్‌ మీద మిలిటెంట్లు దాడిచేశారు. బుధ, గురువారాల్లో కూడా ఇక్కడ హింసాత్మక ఘటనలు జరిగాయి.


మణిపూర్‌లో శాంతిభద్రతలను సమీక్షించిన తరువాత హోంమంత్రి అమిత్‌ షా ఎవరూ ఊహించని మాటన్నారు. మీతీ, కుకీజో తెగలమధ్య వైషమ్యాలను తుంచి, సయోధ్యను పెంచేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. పరిస్థితిని చేజారనివ్వబోమని, నియంత్రణకు కట్టుబడి ఉన్నామన్నారు. తెగలమధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఒక నిర్దిష్టమైన ప్రయత్నం జరగడం కచ్చితంగా అవసరం. ఇప్పటికైనా అటువంటి ఆలోచన కలిగినందుకు సంతోషించాల్సిందే. కేంద్రహోంమంత్రి శాంతిభద్రతలను సమీక్షించడం, గవర్నర్‌ ఢిల్లీ వెళ్ళి రావడం, సిఎంతో చర్చలు జరపడం, ఇతర పార్టీల నాయకుల రాకను అడ్డుకోకుండా రాష్ట్రంలో పర్యటించనివ్వడం వంటివి సైతం ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతాయి. ఈ నేపథ్యంలో, ఆయా తెగల ప్రతినిధులతో ఢిల్లీ పెద్దలు నేరుగా కూచొని మాట్లాడితే కచ్చితంగా మరింత ప్రయోజనం ఉంటుంది. హిందువులు ఆధికంగా ఉన్న తన మీతీజాతి పక్షాన బీరేన్‌సింగ్‌ నిలబడి, క్రైస్తవులైన కుకీజోలను ఊచకోతకోయిస్తున్నాడన్నది ఆరోపణ.

మీతీలకు ఆదివాసీ హోదా కట్టబెట్టాలన్న బీరేన్‌ కుట్రతో ఈ అగ్గిరాజుకున్న విషయం తెలిసిందే. ఆ హోదాతో వారు తమ ఉద్యోగాలు, భూములను హస్తగతం చేసుకుంటారన్నది ఆదివాసుల భయం. వందలమంది మరణించినా, వేలమంది వలసపోయినా, హత్యలు, అత్యాచారాలు, గృహదహనాలు యథేచ్ఛగా సాగినా కేంద్రప్రభుత్వం బీరేన్‌ను అక్కడనుంచి కదల్చలేదు. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం మణిపూర్‌కు ఎనలేని నష్టాన్ని, ద్రోహాన్ని చేయడంతో పాటు, అంతర్జాతీయంగా భారతదేశం పరువు తీసింది. జాతుల మధ్య సయోధ్య ఏర్పడితే తప్ప, శాంతిభద్రతలు సాధ్యపడవని గుర్తించిన కేంద్రం, ఇప్పటికైనా బీరేన్‌సింగ్‌ను తప్పించి సానుకూల వాతావరణాన్ని ఏర్పరుచుకోవాలి.

Updated Date - Jun 21 , 2024 | 02:21 AM