Share News

తూటాలతో మాటలను ముడిపెట్టవచ్చునా?

ABN , Publish Date - Jul 25 , 2024 | 06:02 AM

డొనాల్డ్ ట్రంప్ మీద కాల్పులు జరిగి పదిరోజులు దాటిపోయింది. దుండగుడు చనిపోయాడు. అతను ట్రంప్ పార్టీ సభ్యుడే. దాడికి కారణాలేమిటో ఇంకా తెలియదు. ఈ ఏడాది చివర జరిగే ఎన్నికలకు ముందస్తుగా పార్టీల స్థాయిలో జరిగే...

తూటాలతో మాటలను ముడిపెట్టవచ్చునా?

డొనాల్డ్ ట్రంప్ మీద కాల్పులు జరిగి పదిరోజులు దాటిపోయింది. దుండగుడు చనిపోయాడు. అతను ట్రంప్ పార్టీ సభ్యుడే. దాడికి కారణాలేమిటో ఇంకా తెలియదు. ఈ ఏడాది చివర జరిగే ఎన్నికలకు ముందస్తుగా పార్టీల స్థాయిలో జరిగే ప్రచారకార్యక్రమంలో జరిగిన సంఘటన అది. ఒక మాజీ అధ్యక్షుడు, రానున్న ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థి అయిన నేత మీద దాడి జరగడం చిన్న విషయం కాదు. అమెరికన్ సమాజమే కాదు, యావత్ ప్రపంచమే నివ్వెరపోయిన సంఘటన అది. కానీ, ఇటువంటి దాడి సంఘటనలు భారత్ వంటి వర్ధమాన దేశాలలోనే కాదు, గొప్ప నాగరికత, ప్రజాస్వామిక చైతన్యం కలిగిన దేశంగా చెప్పుకునే అమెరికాలోనూ ఇంత బలంగా రాజకీయ ప్రభావం వేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.


అక్కడి రెండు ప్రధాన పార్టీలలోనూ, ఎక్కువ మితవాదంతో ఉండే రిపబ్లికన్ పార్టీ, 2016 ఎన్నికల్లో ట్రంప్ వంటి తీవ్ర మితవాద నాయకుడి నాయకత్వంలో పోటీపడినప్పుడు, అక్కడి రాజకీయ సంవాదం కూడా ఒక కొత్త క్షీణతకు దిగజారింది. ట్రంప్ పాలనను చవిచూసిన తరువాత, 2020 ఎన్నికల్లో దేశంలోని ఉదారవాద, వామపక్ష, మధ్యేవాద మితవాద శ్రేణులన్నీ ఏకమై, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జోబైడెన్‌ని బలపరచి గెలిపించాయి. ఓడిపోయి, తన ఓటమిని ఒప్పుకోకుండా, రాజధానిలోని కేపిటల్ హిల్‌పై దాడికి తన అభిమానుల్ని ప్రేరేపించి, ట్రంప్ బాగా చెడ్డపేరు తెచ్చుకున్నారు. అతను దిగిపోయినా, దేశంలో తీవ్రమితవాద శక్తులు బలంగానే మిగిలాయి. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ఆధిక్యమూ కొనసాగింది. అప్పుడు ఓడినా, ఇప్పుడు రెండో దఫా గెలవాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నానికి, బైడెన్ జరాభారం ఒక సానుకూలత కల్పించింది. ట్రంప్‌కూ బైడెన్‌కూ వయస్సులో పెద్ద తేడా ఏమీ లేదు. కానీ, వృద్ధాప్య బలహీనతలు ప్రస్ఫుటంగా వ్యక్తమవుతున్న బైడెన్ మొదటి వాగ్యుద్ధంలో నవ్వులపాలయ్యారు. అభ్యర్థిత్వం నుంచి తప్పుకోవలసిందిగా డెమొక్రాటిక్ పెద్దలు పోరుపెట్టారు. సరిగ్గా అప్పుడే ఈ దాడి జరిగింది. ట్రంప్ రేటింగ్ రివ్వున ఎగిసింది. కొవిడ్ మాటున బైడెన్ తప్పుకున్నారు. కమలా హారిస్ అభ్యర్థిత్వ అవకాశాలు పెరిగాయి.


దూకుడు మీద ఉన్న రిపబ్లికన్లకు ట్రంప్ మీద జరిగిన దాడి ఒక రాజకీయ అవకాశం ఇచ్చింది. దానితో, బైడెన్ కల్పించిన వాతావరణం వల్లనే దాడి జరిగిందన్న విమర్శ మొదలయింది. ట్రంప్ మీద గురిపెట్టాలి (ఇట్స్ టైమ్ టు పుట్ ట్రంప్ ఇన్ ఎ బుల్స్ ఐ), అని పార్టీ డోనర్లతో బైడెన్ ఫోన్‌లో అన్నారట. ఆ సందేశం తెలిసి, దుండగుడు నిజంగానే తుపాకీ గురిపెట్టాడట. ఫాసిస్టు ట్రంపును తిరిగి అధికారంలోకి రాకుండా ఎట్లాగైనా నివారించాలని డెమొక్రాటిక్ పార్టీ పదే పదే చేస్తున్న ప్రచారం అతన్ని భౌతికంగా నిర్మూలించాలన్న ప్రేరణ కలిగించిందని అనేకమంది రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటూ వామపక్షీయులు, మీడియా కలిసి చేసిన ప్రచారమే ఈ దాడికి కారణమని, బైడెన్ దీనికి బాధ్యుడని ఆరోపించారు. ఆ సాయుధుడిని పంపింది బైడెనే అని అన్నవారూ ఉన్నారు. ట్రంప్ మిత్ర దేశం రష్యా కూడా అదే అభిప్రాయం చెప్పింది. ట్రంప్ మీద దాడి వెనుక ఉన్నదనడం లేదు కానీ, బైడెన్ ప్రభుత్వమే దాడికి కావలసిన భావ వాతావరణాన్ని కల్పించిందని రష్యా వ్యాఖ్యానించింది.

రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శ, భౌతిక దాడులకు కారణమవుతుందా? ఆ పేరుతో విమర్శలకు పాల్పడవద్దని, నిందించవద్దని రాజకీయపక్షాలను కోరవచ్చునా? భౌతికదాడులు ప్రజాస్వామ్యంలో అవాంఛనీయాలని, విభేదాలతో వ్యవహరించడానికి హింస సాధనం కాదని పదే పదే చెప్పనక్కరలేదు. కానీ, ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు ఏవో సంఘటనలు జరుగుతాయి. వాటిని అనుమతించబోమని చెప్పడం, ఆ సంఘటనలకు నేపథ్యకారణాలను సరిదిద్దడం వంటి నివృత్తిచర్యలను చేయవలసి ఉంటుంది తప్ప, తీవ్రమైన రాజకీయ విమర్శలను నిషేధించడం ప్రజాస్వామ్య మౌలికతకే చేటు చేస్తుంది. ట్రంప్‌కు మిత్ర దేశమైన రష్యా స్పందనలకు అనుగుణంగానే, ట్రంప్‌కు, పుతిన్‌కు సన్నిహిత పక్షమైన భారతీయ జనతాపార్టీ కూడా వైఖరి తీసుకోవడం గమనించవలసిన పరిణామం.


ప్రధాని మోదీ మీద ప్రతిపక్షం హింసను ప్రేరేపించే భాషను ఉపయోగిస్తోందని భారతీయ జనతాపార్టీ ఐటీ విభాగం అధినేత అమిత్ మాలవీయ, రాజ్యసభ సభ్యుడు, పార్టీ అధికారప్రతినిధి అయిన సుధాంశు త్రివేది ఆరోపించారు. ట్రంప్ మీద హత్యాయత్నం నేపథ్యంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం ‘హింస’, ‘హత్య’ వంటి మాటను ప్రధానిని ఉద్దేశించి వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు అడిగారు. రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్ష నాయకులు రెచ్చగొట్టే మాటలతో మోదీని విమర్శిస్తున్నారని వారు అన్నారు. ట్రంప్‌ను బైడెన్ వంటి వారు నియంత అన్నట్టుగానే, మోదీని కూడా రాహుల్‌గాంధీ అటువంటి భాషలో నిందిస్తున్నారని అమిత్ మాలవీయ విమర్శించారు. అంతర్జాతీయ వామపక్షీయుల దాడిని తట్టుకుని భారత ప్రజాస్వామ్యం నిలబడిందని, మోదీ మూడోసారి ప్రధాని అయ్యారని మాలవీయ ఒక కొత్త సూత్రీకరణ చేశారు.

నిజానికి రాజకీయ భాషలో విమర్శ, నింద, అభియోగం వంటివి అన్ని సందర్భాలలో ఒకే విధంగా ఉండవు. భూస్థాపితం చేస్తాం, ఓడిస్తాం, నిర్మూలిస్తాం, నామరూపాలు లేకుండా చేస్తాం వంటి ప్రయోగాలు వాస్తవంలో ప్రత్యర్థుల చర్యలను, సంస్థలను, లేదా, వారి విధానాలను ఉద్దేశించి చేస్తారు. వాటిని వాచ్యార్థంలో తీసుకోగూడదు. అటువంటి మాటల్లో కొన్నిటిలో సభ్యత లేదని అనవచ్చును కానీ, అవి నేరపూరితాలని అన్వయించలేము. కేసీఆర్, రేవంత్‌రెడ్డి వంటి వారి రాజకీయ భాషలో ఈ ప్రయోగాలు ఎక్కువగా గమనించవచ్చు. అన్ని ప్రాంతాల్లో, భాషల్లో కూడా ఈ యుద్ధభాష రాజకీయ సంవాదంలో కనిపిస్తుంది. ‍సాధారణంగా అటువంటి ప్రయోగాలు ప్రత్యర్థులను అధికారంలోకి రానివ్వకుండా నిరోధించడం, బలహీనపరచడం, అక్రమాలకు బాధ్యులను చేయడం, చట్టపరంగా శిక్షించడం వంటి అర్థాలనే ఇస్తాయి. ఆలంకారికప్రయోగాలు సానుకూల అర్థాలలోనే కాదు, ప్రతికూల అర్థాలలోనూ ఉంటాయి. తుపాకీ పేల్చడం సాధన చేసేవారు, వలయాల మధ్య ఉండే బిందువును లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆ బిందువునే ‘బుల్స్ ఐ’ అంటారు. లక్ష్యంగా ఒకరిని పెట్టుకోవడం అంటే, తుపాకీ గురి పెట్టమని కాదు.


ఆ మాటకు వస్తే, తీవ్రమితవాద, తీవ్రజాతీయవాద పక్షాలు వాడినంత హింసాత్మక భాష ఇతరులెవరూ వాడరు. ఆ పక్షాలు ఆ మాటలను జనసామాన్యం దగ్గర, వారి ఉద్వేగాలను ప్రేరేపిస్తూ వాడతాయి కాబట్టి, అవి నిజంగా ప్రమాదకరం. ఆ మాటలను నిజంగా ఆచరణలో పెడుతూ దాడులు జరుగుతాయి. అటువంటి దాడిభాష మాట్లాడడంలో ట్రంప్ ఆరితేరినవాడు. 2020 జనవరిలో కేపిటల్ హిల్ మీద దాడి జరగడానికి ముందు, ట్రంప్ తన అనుచరులకు ఇచ్చిన పిలుపు ఏమిటి? ‘‘దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోండి’’ (టేక్ ద కంట్రీ బ్యాక్). ఆ ఎన్నికను తన నుండి అపహరించారని వాదించడమే కాక, దాన్ని తిరిగి పొందడానికి జనాన్ని రాజధానికి నడిపించాడతను.

తన ప్రచార ర్యాలీలలో నిరసన తెలిపే ప్రతిపక్ష కార్యకర్తలను ‘‘ఈడ్చిపారేయండి’’ అనడం ట్రంప్‌కు అలవాటు. ‘‘ఎవరన్నా విసరడానికి చేతిలో టమాటా పెట్టుకుని కనిపించారా వదలకండి, తొక్కిపారేయండి’’, అది మరో సందేశం! 2016 ప్రచారంలో ట్రంప్ తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ‘జైలుకు పంపండి ఆమెని’’ (లాక్ హర్ అప్) అని అరిచేవారు. ఇక మెక్సికన్లకు, ముస్లిములకు వ్యతిరేకంగా సభల్లో ఆయన చేసిన బెదిరింపులు, నినాదాలు, వ్యంగ్య వ్యాఖ్యలు అనేకం. అధికారంలోకి వచ్చాక కూడా అతని పద్ధతేమీ మారలేదు. సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినప్పుడు వాటిని ఖండించడానికి ఆయనకు మనసొప్పేది కాదు. జార్జి ఫ్లాయిడ్ మరణం తరువాత, హింసా కాండ, లూటీలు జరుగుతున్నప్పుడు, నిరసనకారులు బందిపోట్లని, ‘లూటింగ్ మొదలైతే షూటింగ్ మొదలవుతుంది’ అనీ చేసిన వ్యాఖ్యలకు ఎంతో నిరసన వ్యక్తమైంది. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ వంటి నేతలు మైనారిటీల మీదా, వలసదారుల మీదా చేసే విద్వేషపూరిత వ్యాఖ్యలు సమాజాన్ని హింసాత్మకంగా మార్చాయి. భారతదేశంలో కూడా 2024 ఎన్నికల ప్రచారంలో సాక్షాత్తూ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు ఎంతటి విస్ఫోటన శీలంగా ఉన్నాయో తెలిసిందే.


తమ తీవ్ర విధానాల కారణంగా, వ్యక్తిగతంగా దూకుడు స్వభావం వల్లా ఎంతో అతిశయంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు కనిపించే నాయకులు, ఎంతో కొంత బాధితులైనప్పుడు, ఆ సందర్భంలో ఎంతో బేలగా కనిపిస్తారు. నిన్నటివరకు తమ అవక్రపరాక్రమంతో ప్రయోజనం పొందినవారు, ఇప్పటి బలహీనత నుంచి కూడా లాభం పొందాలని చూస్తారు. ట్రంప్‌ను చూడండి, ఆ క్షణంలో దేవుని దయ వల్ల నేను తప్పుకుని ఉండకపోతే, మీ ముందు ఇట్లా నిలబడేవాణ్ణి కాదు అని కనీసం నాలుగైదు సార్లన్నా సమావేశాల్లో అని ఉంటారు. ఓట్లు తగ్గిన ప్రాభవం తగ్గిన మోదీని చూడండి, తనను రెండున్నర గంటలు మాట్లాడనివ్వలేదని, తనతో పాటు పార్లమెంటు సభ్యుల హక్కులన్నీ హననం అయ్యాయని ఆవేదన ప్రకటిస్తున్నారు. నేను గెలిచాను, మూడోసారి ప్రధాని అయ్యాను, అయినా ఎందుకు ఈ వాస్తవాన్ని గుర్తించరు? అని పదే పదే బాధపడుతున్నారు.

మాటలతో, నికరమైన ప్రజాస్వామిక ఆచరణలతో రాజకీయ విభేదాలను, ప్రత్యామ్నాయాలను సాధన చేసే అవకాశం ఉన్నప్పుడు, ఎంతటి తీవ్ర విమర్శ కూడా అవాంఛనీయ రూపం తీసుకోదు. విసుగుచెందినవారో, నిస్పృహచెందినవారో, తీవ్రబాధితులో చేసే చర్యలకు కారణాలను తమ చర్యలలో, వైఫల్యాలలో కాక, రాజకీయ ప్రతిపక్షంలో వెదకడం సమంజసం కాదు.

కె. శ్రీనివాస్

Updated Date - Jul 25 , 2024 | 06:02 AM