Share News

ముందే కూస్తున్న తొందర కోయిలలు!

ABN , Publish Date - Jun 20 , 2024 | 03:06 AM

బాగా గెలిచినవారికి బాగా ఆనందం ఉంటుంది. బాగా ఓడిపోయినవారికి కుంగుబాటు ఉంటుంది. విపరీతంగా గెలుస్తామనుకుని కొంచెం మాత్రమే గెలిచినవారికి కొంత నీరసం ఉంటుంది. కనాకష్టంగా ఉన్నవారు...

ముందే కూస్తున్న తొందర కోయిలలు!

బాగా గెలిచినవారికి బాగా ఆనందం ఉంటుంది. బాగా ఓడిపోయినవారికి కుంగుబాటు ఉంటుంది. విపరీతంగా గెలుస్తామనుకుని కొంచెం మాత్రమే గెలిచినవారికి కొంత నీరసం ఉంటుంది. కనాకష్టంగా ఉన్నవారు కొన్ని మెట్లు ఎక్కితేనే కొండంత సంబరం కలుగుతుంది. విజయోత్సవాలు, విచారపర్వాలు ముగిసిన తరువాత, క్రమంగా సత్యం బోధపడుతుంది. ఆటవిడుపు తరువాత అసలు పనులు మొదలు. ఘనవిజయం సాధించినవారికి, ఘనాతిఘనమైన బరువు బాధ్యతలు, దివాళా ఖజానాకు తోడు వాగ్దాన భారాలు. అరువు గెలుపుల వారికి వారినీ వీరినీ కలుపుకుని పోవలసిన కొత్త కర్తవ్యాలు. కొత్తబలాల వారికి పొద్దెరుగని వీరంగాలు. దిగదుడుపు పార్టీలకు దింపుడు కళ్లాలు.

ఎగ్జిట్ పోల్స్ రాగానే తారాజువ్వలాగా ఎగిసిపోయి, నిజం ఫలితాల వేళకు నిప్పులు కక్కుకుంటూ నేలరాలిన స్టాక్ మార్కెట్ ఇండెక్స్, కొంచెం ఓవరాక్షన్ చేసినట్టు అనిపించింది. అందులో ఆవిరైపోయి మళ్లీ గడ్డకట్టిపోయిన లక్షల కోట్ల రూపాయల సంగతేమిటో కానీ, జనం ఒకటి అనుకుంటే దళారిమార్కెట్ మరొకటి అనుకున్నది. షేర్ మార్కెటే కాదు, దేశంలోని ప్రజాస్వామిక సూచి కూడా మరీ అతిగా ప్రకంపించింది. మల్లెల వేళ వచ్చిందని, వెన్నెల మాసం వచ్చిందనీ పాటలు పాడడం మొదలుపెట్టింది. ఇల్లు ఇంకా అలకనే లేదు, పండగకు రెడీ అయింది. ఇందుమూలముగా సమస్త జనులు తెలుసుకోవలసినది ఏమిటంటే, ఫలితాలు వచ్చి కూడా పదిహేను రోజులై పోయింది కాబట్టి, ప్రథమోత్సాహం కొంత తగ్గించుకుని, వాస్తవంలోకి మేల్కొనాలి. సూచికలను కొంచెం సవరించుకోవాలి.


ఇంతకు ముందు లాగా, రాజకీయం నీరసంగా ఏకపక్షంగా ఉండబోదు కానీ, అట్లాగని మరీ హల్లాబోల్ వాతావరణం ఉండబోవడం లేదు. కనీసం ఇప్పట్లో అంత దృశ్యము కనిపించదు. నాలుగు రోజుల్లో మొదలయ్యే తొలి పార్లమెంటు సమావేశాల్లో కొద్దిగా ఉనికి ప్రకటనలు, ఏలినవారి బలప్రదర్శనలు చూడవచ్చు. మాకు బలం పెరిగింది, మార్పు చూడండి, అని చెప్పాలని ఇండియా కూటమి అనుకుంటుంది. కొనసాగింపే తప్ప మార్పేమీ లేదు అని బలంగా చాటాలని మోదీ ప్రభుత్వం అనుకుంటుంది. ఆ రెండు రకాల ప్రదర్శనలూ ఇప్పటికే ఉనికిలోకి వచ్చాయి. ఎన్డీయేలోని బీజేపీయేతరులు చెదిరిపోతారు, తమలో చేరిపోతారు అని ఇండియా కూటమి, అందులోనూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కలలు కంటోంది. బహుశా, బీజేపీ కూడా, ఇండియా కూటమిలోనుంచి ఒకటి రెండు పార్టీలను రప్పించుకోగలనని ఆశపడుతున్నదేమో తెలియదు. మొత్తానికి అస్థిరతా వాతావరణం ఉంటుందని, అందులో తమ అభివృద్ధికి సానుకూలత కలుగుతుందని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయి.

వాస్తవ స్థితిగతులను ఆశ మసకబారిస్తే కష్టం. నరేంద్రమోదీ మూడో ప్రభుత్వం పూర్తి ఐదేళ్లు కొనసాగడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ముందు ఆ సంభావ్యతను అంగీకరించాలి. మొన్నటి ఎన్నికల్లో దెబ్బతిన్న ప్రతిష్ఠను మరమ్మత్తు చేసుకునో, లేదా, తీవ్ర ఉద్వేగ పరిస్థితులు ఏర్పడితే ఆ అదనులో మధ్యంతర ఎన్నికలకు వెళ్లో ఎన్డీయే ప్రభుత్వం తనను తాను పటిష్ఠపరుచుకునే, కొనసాగించుకునే ఆస్కారం కూడా లేకపోలేదు. హోంమంత్రి మారలేదు. జాతీయ భద్రతా సలహాదారు మారలేదు. న్యాయశాఖ మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి మారలేదు. లోక్‌సభ స్పీకర్ ఎవరవుతారో ఇంకా తెలియదు. తెలుగుదేశం పార్టీ కోరుతూ ఉండవచ్చును కానీ, అది తమకే ఉండాలని బీజేపీ పట్టుబట్టవచ్చు. రా‌ష్ట్ర ప్రయోజనాల కోసం, సొంత పార్టీ ప్రయోజనాల కోసం ప్రాంతీయ పార్టీలు రాజీపడాల్సిరావచ్చు. చంద్రబాబే కాదు, నితిశ్ కుమార్ మాత్రం అర్జెంటుగా బీజేపీతో బెట్టుగా ఉండాలని ఎందుకు అనుకుంటారు?


గతంలో పూర్తి పదవీకాలం పూర్తిచేసుకున్న మైనారిటీ ప్రభుత్వాలతో పోలిస్తే, మోదీ 3.0 ఏమంత బలహీనమైనది కాదు. 1991లో కేవలం 226 సభ్యుల బలంతో పివి నరసింహారావు ప్రభుత్వం ఏర్పడి, పూర్తికాలం కొనసాగింది. 1999లో ఎన్డీయే ప్రభుత్వంలో బీజేపీ బలం 182 మాత్రమే. 2004లో మొదటి యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ బలం 145 మాత్రమే. రెండో యూపీఏలోనూ కాంగ్రెస్ 206తోనే ప్రభుత్వం నడిపింది. ఈ అన్నిటికంటె ఇప్పుడు ఎన్డీయేలో బీజేపీ వాటా పెద్దది. మునుపటి సంకీర్ణ సారథులందరి కంటె మోదీ-, షాలు అఖండులు. ఒక్క పీవీని మినహాయిస్తే, చాణక్యులు కూడా. అనుకోని పరిణామాలను ఎప్పుడూ నిరాకరించలేము కానీ, మోదీ పూర్తికాలం పదవిలో ఉండరని, మధ్యంతరం వస్తుందని ఊహించడానికి కానీ, ఆశించడానికి కానీ ఆధారాలేమిటి?

ప్రతి విషయంలోనూ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు బీజేపీకి అభ్యంతరాలు పెడుతూ ఉంటారనుకుంటే, ఉండాలనుకుంటే అది పొరపాటు. విధానాల పరంగా చూస్తే, బీజేపీ ఆర్థిక సంస్కరణల అజెండాతో తెలుగుదేశానికి కానీ, జేడీయూకి కానీ ఎటువంటి పేచీ ఉండదు. కాకపోతే, మునుపటిలాగా, వచ్చే పెట్టుబడి అవకాశాలను అన్నిటినీ గుజరాత్‌కు తరలించుకుపోతుంటే అడ్డుపడతారు. ఆ విషయంలో బీజేపీ కొంత వెనక్కి తగ్గవచ్చు. కశ్మీర్‌లోనో అబూజ్‌మడ్‌లోనో జరిగే భద్రతాదళాల చర్యల విషయంలో ఎన్డీయే భాగస్వామ్యపక్షాలకు ఏ సమస్యా ఉండదు. ఆర్ఎస్ఎస్ చెప్పింది కాబట్టి, మణిపూర్‌లో సర్దుబాట్లు చేయడానికి బీజేపీయే ముందుకు వస్తుంది. సంఘర్షణలకు, సమస్యలకు రాజకీయ పరిష్కారాలు అన్వేషించాలని ఇండియా కూటమి కూడా ఇప్పుడు అడిగే స్థితిలో లేదు, ఇక ఎన్డీయే భాగస్వాములు ఎందుకు అడుగుతారు? అరుంధతీరాయ్ వంటి వారిని కేసులతో వేధిస్తుంటే మంచిది కాదని మిత్రపక్షాలు హితవు చెబుతాయేమో తప్ప, శాంతిభద్రతల రంగంలో అమిత్‌ షా మార్గమే నిరాఘాటంగా కొనసాగుతుంది. కొత్త నేరచట్టాల అమలు విషయంలో ఇండియా కూటమి పక్షాలు వాయిదా కోరినా, నీట్ విషయంలో వీధుల్లో ఉద్యమాలు చేసినా, ఎన్డీయే భాగస్వాములు తటస్థంగా ఉండవచ్చు. తాము ఏదో ఒక వైఖరి తీసుకోవలసిన అగత్యం మాత్రం మునుముందు తరచు కలుగవచ్చు.


ఒకటి మాత్రం నిజం. తమకు ప్రతిపక్ష కూటమిలో ఉన్న ఆహ్వానాన్ని తెలుగుదేశం కానీ, జేడీయూ కానీ తృణీకరించవు. వారితో కలవరు కానీ, కలిసే అవకాశం వల్ల కలిగే పలుకుబడిని ఎంజాయ్ చేస్తాయి. ప్రతిపక్ష కూటమికి కూడా తాము ఆమోదయోగ్యం కావడం, ఈ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ప్రత్యేక సదుపాయం. దాని మీదనే కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీయే భాగస్వాముల, ముఖ్యంగా టీడీపీ, జెడీయూల పరపతి ఆధారపడి ఉంటుంది. అంతమాత్రాన, లోక్‌సభలో కానీ, బయట కానీ, ప్రతిపక్ష కూటమితో ఈ పార్టీలు కలసి పనిచేయడం కానీ, గొంతు కలపడం కానీ ఇప్పట్లో ఉండదు. ఒకవేళ అటువంటిదేమన్నా చేయవలసి వచ్చినా, అది ఆ పార్టీలు తమ రాష్ట్రాలకు కేంద్రం నుంచి రాబట్టుకోవలసిన నిధుల కోసం, నిర్ణయాలకోసం ప్రయోగించే ఒత్తిడిగా మాత్రమే ఉంటుంది. ఈ విషయాన్ని అత్యాశావాదులు గుర్తించాలి.

రానున్న రోజుల్లో ఇండియా కూటమికి కలసిరాగలిగిన ఒక పరిణామం, ఈ ఏడాది జరిగే నాలుగు అసెంబ్లీల ఎన్నికలు, ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికలు. ఈ ఎన్నికలలో మంచి ఫలితాలను చూపించగలిగితే, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. బీజేపీలోనూ, ఎన్డీయే కూటమిలోనూ అంతర్గతంగా భిన్నస్వరాలు వినిపిస్తాయి. కానీ, ఇప్పుడే తాము గెలిచామని తబ్బిబ్బైపోతున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, అసెంబ్లీ ఎన్నికలను తేలికగా తీసుకుంటే, పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది.

ఇండియా కూటమికి ఉన్న మరో సానుకూల అంశం ఏమిటంటే, భాగస్వామ్యపక్షాల్లో ఏ ఒక్కటీ ఎన్డీయే కూటమిలోకి మళ్లే అవకాశం బాగా తక్కువ. ఉద్ధవ్ ఠాక్రే అటువైపు చూడరా, అవసరమైతే ‍స్టాలిన్ కూడా రాజీపడడా, శాంతి కోసం మమత చేయి కలపదా అని సాంకేతికంగా వాదిస్తే చెప్పలేము కానీ, కూటమిలోని ప్రతిపార్టీ బీజేపీ వల్ల ఏదో రకంగా బాధిత పక్షమే కాబట్టి, అట్లా జరగడం కష్టం. పైగా, ఈ పక్షాలు అన్నీ తమ తమ రాష్ట్రాలలో బీజేపీ నుంచి సవాళ్లను ఎదుర్కొంటున్నవే. కలవడం అంటే, తమ ప్రాంతాలలో బీజేపీ ప్రాబల్యాన్ని ఆహ్వానించడమే. ఎన్డీయే కూటమి సంగతి వేరు. రెండు ప్రధాన బీజేపీయేతర భాగస్వాములు ఇండియా కూటమికి కూడా ఆమోదయోగ్యమైనవారు. షిండే సేన ఉనికి మహారాష్ట్ర ఎన్నికల తరువాత కానీ చెప్పలేము.


కాబట్టి, ప్రభుత్వం అదే. రాజకీయ వాదనలూ అవే, చేయదలచిన అభివృద్ధీ అదే, చూపబోయే కాఠిన్యమూ అదే. ఏవో గొప్పమార్పులు వస్తాయని ఊహిస్తే ఆశాభంగాలు ఎదురవుతాయి. జాతీయ ప్రతిపక్షాలు ఈ సంగతి గ్రహించి, 2024 ఎన్నికలకు ముందు తమ జనాదరణ పెంచుకోవడానికి ఎటువంటి కార్యక్రమాలను చేశాయో వాటిని మరింత ఉధృతంగా కొనసాగించాలి. రాజకీయ లాభాలు ఎవరికీ ఊరికే రావు. కాంగ్రెస్‌తో సహా, ఆ కూటమి పక్షాలన్నీ చేయవలసినంత పరిశ్రమ చేయలేదు కాబట్టే, అధికారానికి అల్లంత దూరానే ఆపివేశారు. వేసిన నాలుగు అడుగులకు ఉత్సాహపడితే తప్పేమీ లేదు కానీ, మరిన్ని అడుగులు వేయడానికి ఆయాసపడితేనే కష్టం.

కేంద్రంలో ప్రభుత్వం నడక ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా ఉంటుంది. సందేహం లేదు. గతంలో వలె కాక ఇప్పుడు అనేకపాత్రాభినయం చూడవచ్చు. ప్రజలు మౌన ప్రేక్షకులుగా మిగలకుండా, తమకు నచ్చిన పాత్రధారులను ఉత్సాహపరచవచ్చు. కానీ, రేపోమాపో క్లైమాక్స్ వస్తుందని మాత్రం ఆశించవద్దు.

కె. శ్రీనివాస్

Updated Date - Jun 20 , 2024 | 03:06 AM