అనైతిక ఫిరాయింపు, అందమైన దబాయింపు!
ABN , Publish Date - Jul 18 , 2024 | 01:28 AM
అరవయ్యేళ్ల కిందట, మూడో సాధారణ ఎన్నికల తరువాత, కాంగ్రెస్ పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు ఒక తీర్మానం ఆమోదించింది. అప్పటికింకా నెహ్రూ బతికే ఉన్నారు. ఆ తీర్మానం ప్రకారం, ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలోకి చేరదలిస్తే...
అరవయ్యేళ్ల కిందట, మూడో సాధారణ ఎన్నికల తరువాత, కాంగ్రెస్ పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు ఒక తీర్మానం ఆమోదించింది. అప్పటికింకా నెహ్రూ బతికే ఉన్నారు. ఆ తీర్మానం ప్రకారం, ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలోకి చేరదలిస్తే, అతను లేదా ఆమె ముందుగా చట్టసభల సభ్యత్వాలకు రాజీనామా చేసి, తిరిగి కాంగ్రెస్ టికెట్ మీద పోటీచేయడానికి సిద్ధపడాలి. ఆ నిర్ణయం అయితే చేశారు కానీ, రాష్ట్రాల కాంగ్రెస్ పెద్దలు ఎవరూ అందుకు ఒప్పుకోలేదు. ఈ తీర్మానం ప్రకారం ఫిరాయింపుదారులు ఒక్కరు కూడా చట్టసభలకు రాజీనామా చేసి తిరిగి పోటీచేయలేదు. ఏదో ఒక మినహాయింపు ఇస్తూ, నిరంతరంగా ఇతర సభ్యులను కాంగ్రెస్ చేర్చుకుంటూనే ఉండింది. దాని మార్గంలోనే ఇతర పార్టీలూ నడుస్తూ వచ్చాయి. కాలక్రమంలో దేశంలో స్థిరపడిన, బలపడిన రాజకీయ సంస్కృతికి శాసనాలతో, విలువలతో నిమిత్తం లేకుండా పోయింది. మన పదజాలంలో ఆపరేషన్ ఆకర్ష్‌లు, జంప్ జిలానీలూ భాగమైపోయాయి.
నిజానికి తొలిరోజుల్లో కాంగ్రెస్‌కు తిరుగులేని ఆధిక్యం ఉండేది. మొదటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 364 స్థానాలు (మొత్తం సీట్లు 489) వస్తే, రెండో స్థానంలో 41 సంఖ్యతో ఇండిపెండెంట్లు ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీ 26 సీట్లతో మూడోస్థానంలో ఉంది. ఇక, ఫిరాయింపుల అవసరం ఇతరులకు ఉంటుంది కానీ, కాంగ్రెస్‌కు ఎందుకు? అయినా, చేరుతూనే ఉండేవారు, చేర్చుకుంటూనే పోయారు. 1967లో జరిగిన నాలుగో ఎన్నికలు కాంగ్రెస్‌కు పెద్దకుదుపు. ప్రతిపక్షాలకు పెద్ద ఊపు. అనేక రాష్ట్రాలలో మిశ్రమ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ఫిరాయింపులు ఇక ఉద్యమంగా మారిపోయాయి. ఇప్పుడు ట్రాఫిక్ రెండువైపులా మొదలయింది. 1967 ఎన్నికలలో రాష్ట్రశాసనసభలకు 3,550 మంది సభ్యులు ఎన్నిక కాగా, వీరిలో 550 మంది తామున్న పార్టీల నుంచి ఫిరాయించారు. కొందరు అనేకమార్లు ఫిరాయించారు కూడా. ఈ కాలంలో కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాలలో ఫిరాయింపుల వల్ల ఇబ్బంది పడినమాట నిజమే కానీ, తిరిగి అదే మార్గం ద్వారా తేరుకున్నది కూడా. ఆ కాలంలోనే ఫిరాయింపులను నియంత్రించడానికి ఏమిచేయాలన్న ఆలోచనలు కూడా మొదలయ్యాయి. మొత్తం మీద ఫిరాయింపుల ద్వారా అత్యధిక లబ్ధిపొందిన సంస్థ కాంగ్రెస్ పార్టీయే అని చెప్పాలి. కానీ, కాంగ్రెస్ పార్టీ తాను అత్యధిక స్థానాలు గెలిచి బలశాలిగా ఉన్న కాలంలోనే, 1985లో ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చింది. పార్టీ మార్పునకు అనర్హత వేటును, చీలికలకు విలీనాలకు నిర్ణీత శాతాల నియమాన్ని ఆ చట్టమే అమలులోకి తెచ్చింది.
1963లో పార్టీ స్థాయిలో చేసిన నిర్ణయం, ఆ పార్టీలో అమలు కానట్టే, 1985లో రాజ్యాంగస్థాయిలో చేసిన శాసనం కూడా దేశంలో అమలు కావడంలేదనే చెప్పాలి. చట్టానికి దొరకకుండా పనిజరుపుకోవడం ప్రస్తుత వ్యవస్థలో ఒక ఆమోదనీయమైన నైపుణ్యం. బాహాటంగా ఒక పార్టీ సభ్యుడు మరో పార్టీ వేదిక మీద సంచరిస్తాడు. నాయకుడి దగ్గర కండువా కప్పుకుంటాడు. అధికారికంగా రాజీనామా చేయరు. విప్‌లు ఉల్లంఘించరు. పార్టీని తిడుతూనే ఉంటారు. లేదా, రాజీనామా చేస్తారు కానీ, స్పీకర్ ఎంతకూ ఆమోదించరు. నిర్ణయానికి నిరవధిక సమయం తీసుకోగలగడం చట్టసభాపతికి ఉండే విశేషాధికారాలలో ఒకటి. ప్రజాస్వామ్యాన్ని పరిహసించదలచుకుంటే, ఫిరాయింపు ఎమ్మెల్యే మంత్రి అయి, పూర్తికాలం కొనసాగగలడు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ మాట్లాడడం, ఫిరాయింపు నిరోధక చట్టం తెచ్చిన తన తండ్రి అడుగుజాడలో నడవడం వల్ల కావచ్చు. ఇప్పుడు జాతీయస్థాయిలో కాంగ్రెస్‌లోకి ఇతరపార్టీల వారు వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రాలలో ఆ నైతికతను అమలుజరపే నిబద్ధతా లేదు.
పార్టీ నుంచి వెళ్లిపోవడం, చీలిపోవడం వంటివి ప్రజాస్వామ్యప్రక్రియలు. తీవ్రమైన విభేదాలతో పార్టీని వదలడం వేరు, ఫిరాయింపు వేరు. ఎమర్జెన్సీ సడలింపు సమయంలో జగ్జీవన్‌రామ్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. రాజీవ్ ప్రధానిగా ఉన్నప్పుడు వి.పి.సింగ్ కాంగ్రెస్‌కు రాజీనామాచేశారు. ప్రజలు అటువంటి వాటిని గమనిస్తూ ఉంటారు. ఒక రాజకీయ సంవాదం ఎట్లా రూపుదిద్దుకుంటున్నది, వైఖరుల్లో అభిప్రాయాల్లో తేడాలు ఎట్లా సమీకృతమవుతున్నాయి, తెలిసిపోతూ ఉంటుంది. తగినంత విధాన ఘర్షణ లేకుండా చీలికలను ప్రజలు ఆమోదించరు. 1984లో ఎన్‌టి రామారావు మీద నాదెండ్ల భాస్కరరావు చేసిన రాజకీయ ప్రయత్నానికి జనం ఆమోదం లేకపోవడం అందువల్లనే. కాంగ్రెస్ ప్రోద్బలంతో కేవలం అధికారం కోసం మాత్రమే భాస్కరరావు అట్లా వ్యవహరించారని ప్రజలు నమ్మారు. విధేయత మార్చిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు, వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు. ఏకనాథ్ షిండే విషయంలో కూడా మహారాష్ట్ర ప్రజల నుంచి సమ్మతి లేదని ఇటీవలి పరిణామాలు సూచిస్తున్నాయి. చీలికలను, కూడికలను సాంకేతికంగా పకడ్బందీగా జరిపించినా, నైతికంగా అవి ఎటువంటివో సమాజం అంతా కాకపోయినా, కనీసం పౌరసమాజమైనా ఒక కంట కనిపెడుతూ ఉంటుంది.
ఒకసారి ప్రజాప్రతినిధిని ఎన్నిక చేసుకున్న తరువాత, పదవీకాలం మధ్యలో అతను లేదా ఆమె తీసుకునే వైఖరులను క్రియాశీలంగా వ్యతిరేకించడం రానురాను తగ్గిపోతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తేవడానికి ప్రజలు గట్టిగా ప్రయత్నించారు. పార్టీ మారిన సందర్భాలలో అటువంటి నిరసనలను అరుదుగా చూస్తుంటాము. ఒక లెజిస్లేటర్‌ను ఎన్నుకోవడం అంటే, సర్వ హక్కులతో ప్రజాభిప్రాయాన్ని కట్టబెట్టినట్టేనా? ఆ ప్రతినిధి, ఆ సమ్మతిని బదలాయింపు చేయవచ్చునా? బస్సు టిక్కెట్టు, రైలు టిక్కెట్టు, సినిమా టిక్కెట్టు వంటివే ‘నాన్ ట్రాన్్స్‌ఫరబుల్’ అయితే, ఓటు ద్వారా సంక్రమించిన ప్రాతినిధ్యం బదలాయించదగ్గదా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అనుకూల వాతావరణాన్ని అధిగమించి ప్రజల ఆమోదాన్ని పొందినవారు. అంటే ఓటర్లు, కాంగ్రెస్‌ను కాదని, బీఆర్ఎస్‌ను ఎంచుకున్నారు. మరి, ఇప్పుడు ఆ శాసనసభ్యులు, తమ ప్రజల ఆకాంక్షకు భిన్నంగా ఎట్లా వెళుతున్నారు? ఈ ప్రశ్న వీరికి మాత్రమే పరిమితం కాదు, వైఎస్ హయాంలో అవలీలగా అటువైపు వెళ్లిన టీఆర్ఎస్ శాసనసభ్యులకు, కేసీఆర్ ఒకటో హయాంలో, రెండో హయాంలో వెళ్లిన టీడీపీ, కాంగ్రెస్ శాసనసభ్యులకు కూడా వర్తిస్తుంది.
రాజీనామా చేసి రావచ్చుననే సూత్రం, అరవయ్యేళ్ల కిందట అద్భుతమైన ప్రతిపాదన అయిఉండవచ్చును కానీ, ఎన్నికలు, అధికారం లక్షలకోట్ల పరిశ్రమలుగా మారిన సందర్భంలో అదేమంత నైతికతను సూచించదు. ఆ ఒక్క నియమాన్ని చాటుతూ, బీజేపీ తాను గొప్పనీతిగా ఉన్నట్టు చెప్పుకుంటోంది. కర్ణాటకలో 2019 సంక్షోభంలో బీజేపీ అటువంటి ప్రయోగం చేసింది. ప్రజలను ఆకట్టుకునే ఉద్వేగ రాజకీయాలు నిర్వహిస్తూ, తగినంత ఆర్థిక బలం కలిగిన పార్టీ, కొందరు ఫిరాయింపుదార్లను గెలిపించుకోగలగడం పెద్ద విశేషం కాదు, అది గొప్ప నైతికమైపోదు. అలాగే, రాజీనామాలు లేని ఫిరాయింపులకు కూడా ఆ పార్టీలో కొంత చరిత్ర లేకపోలేదు.
గోడదాటే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం చేతకాక, చేర్చుకునే పార్టీ మీద విమర్శలు ఎక్కుపెడితే ఉపయోగం లేదు. బీఆర్ఎస్ నాయకులను చూస్తే జాలి వేస్తుంది. మొదటి పదవీకాలంలో సరే, రెండో విజయం తరువాత, 88 మంది శాసనసభ్యుల బలం ఉన్న తరువాత, ఎందుకు ఫిరాయింపులను ప్రోత్సహించినట్టు? 2014 ఎన్నికల్లో మాత్రం, గెలుచుకున్న 63 మంది బలగం చాలు కదా? తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని రక్షించుకోవడం, పడిపోకుండా కాపాడుకోవడం వంటి ఉదాత్త ఆశయాలతో అప్పుడు బలాన్ని అరువు తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సంఖ్య కూడా దాదాపు అదే కదా? వారికి మాత్రం తమ ఘనమైన ప్రభుత్వాన్ని కాపాడుకునే కర్తవ్యం ఉండదా? ఒకరిద్దరయితే తప్పట, గుంపు విలీనం ఒప్పట. ఫిరాయింపుల చుట్టూ ఇన్ని సమర్థనలను నిర్మించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సంవాదం మధ్యలో ప్రజాస్వామ్య విలువలు, కట్టుబాటు అన్న మాటలు పీలగానూ, బేలగాను ధ్వనించే పరిస్థితి ఏర్పడింది. అవినీతికర ప్రక్రియ కొనసాగుతుంటే, ఇదేదో ప్రపంచకప్పు క్రీడ అయినట్టు, మీడియా అంతా గోడకు ఇవతల, అవతల కెమెరాలు బిగించుకుని కాచుక్కూచోవడం, ఫిరాయింపు వీరుడు ఏ క్షణం వస్తాడో అన్నట్టు, అర్థరాత్రుళ్లు ముఖ్యనాయకుల ఇళ్ల ముందు పడిగాపులు పడవలసిరావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మూడింట రెండువంతుల లెక్క ఎంతకాలంలో పూర్తవుతుందో విశ్లేషణలు చేయడం మరో పవిత్రబాధ్యత!
జాతీయోద్యమం నాటి కాంగ్రెస్‌కు స్వాతంత్ర్య సాధన తప్ప మరో సిద్ధాంతం లేదు. ఆ నాటి కాంగ్రెస్ శ్రేణులలో సిద్ధాంత రాద్ధాంతాలది ద్వితీయస్థానమే. ఉద్యమ ‘త్యాగాలకు’ వెంటనే ప్రతిఫలాలు పొందాలనే ఆత్రుతే ఎక్కువ. అందుకే, మొదటి తరం రాజకీయసంస్థల ఫిరాయింపులలో పెద్దగా సైద్ధాంతిక ఫిరాయింపులు లేవు. తరువాత తరువాత కాలంలో కాంగ్రెస్‌లోని శ్రేణుల మధ్య విధాన సమీకరణలు సమకూరుతూ, స్పష్టపడుతూ వచ్చాయి. ప్రయోజనాల రీత్యా, ఆ శిబిరాలు కొనసాగినప్పటికీ, అటూ ఇటూ దూకడానికి వ్యక్తులుగా పట్టింపులు లేనివారే ఎక్కువ. తెలంగాణ రాజకీయ ఉద్యమం కూడా సిద్ధాంతాలను నిరాకరించి, భౌగోళికరాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్లింది. రాష్ట్ర అవతరణ తరువాత, పార్టీని నిలిపి ఉంచే సూత్రంగా కేసీఆర్ నాయకత్వాన్నే భావించారు. ఇటువంటి సరళమైన ప్రాతిపదికలకు పెద్ద కట్టుబాట్లు అవసరం లేదు. ఉద్యమకాలంలో కూడా కేసీఆర్ పక్కన నిలిచిన వృత్తి రాజకీయ నేతలలో చాలా మందికి పెద్ద నీతినియామాలేమీ లేవు. తరువాతా లేవు. ఆ లక్షణం వల్లనే, ఇతర పార్టీలలోని అనైతికులకు రహదారి ఏర్పడింది. అదే దారి ఇప్పుడు కాంగ్రెస్ దిశగా నడుస్తోంది. వ్యక్తులు ప్రైవేటు జీవితాల్లో గీత దాటితేనో, చట్రాలలోపల ఒదగకపోతేనో, తప్పో ఒప్పో స్వేచ్ఛను సాధనచేస్తేనో విరుచుకుపడి, వేధించి, సకలమాధ్యమాల్లో ఆత్మగౌరవాలను లించింగ్ చేసే మన సమాజం, ప్రజలు తమకు ఇచ్చిన సమ్మతిపై ఈ గోడదాటు నేతలు వ్యాపారమూ అత్యాచారమూ చేస్తుంటే ఎందుకు సహిస్తున్నది?
కె. శ్రీనివాస్