Share News

కేసీఆర్‌ కర్తవ్యం గెలవడం కాదు, మిగలడం!

ABN , Publish Date - Apr 04 , 2024 | 01:21 AM

బీజేపీ అనుబంధ సంస్థ అని భావించే ఉపాధ్యాయసంఘంలో పనిచేసే ఒక మిత్రుడు ఈ మధ్య తారసపడ్డాడు. ‘కేసీయార్‌ను దించవలసి ఉండె కాబట్టి, మా టీచర్లందరూ మొన్న కాంగ్రెస్‌కు...

కేసీఆర్‌ కర్తవ్యం గెలవడం కాదు, మిగలడం!

బీజేపీ అనుబంధ సంస్థ అని భావించే ఉపాధ్యాయసంఘంలో పనిచేసే ఒక మిత్రుడు ఈ మధ్య తారసపడ్డాడు. ‘కేసీయార్‌ను దించవలసి ఉండె కాబట్టి, మా టీచర్లందరూ మొన్న కాంగ్రెస్‌కు ఓటేసిన్రు, ఆ పని అయిపోయింది, ఇప్పుడు అందరూ మోదీనే’ అన్నాడు. ‘పదీ, పన్నెండు, అంతకు తగ్గవు, చూస్కోండి’ అని నమ్మకంగా చెప్పాడు. ఆ సంఘానికి పెద్ద సంఖ్యలో సభ్యత్వాలేమీ లేవు. ఉపాధ్యాయసంఘాల ‍సభ్యులు ఆ సంఘ రాజకీయ అనుబంధాన్ని బట్టి ఓట్లు వేయరని, టీచర్ల లెక్కలు వేరే ఉంటాయని అందరికీ తెలుసు. సంఘాలతో సంబంధం లేకుండా, మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టీచర్లు అత్యధికసంఖ్యలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేశారు. తమ పనిపరిస్థితులతో, జీతభత్యాలతో నిమిత్తం లేని లోక్‌సభ ఎన్నికలలో వారి ఎంపికలు ఎట్లా ఉంటాయన్నది ప్రశ్న. మా మిత్రుడి ఉపాధ్యాయపరిషత్తు సభ్యులే కాదు, తక్కిన అన్ని సంఘాల సభ్యులూ, చివరకు వామపక్ష ఉపాధ్యాయ సంఘాల సభ్యులు కూడా మోదీ ప్రభావంలో ఉన్నారేమో తెలియదు. లేకపోతే, పదీ, పన్నెండూ లెక్క ఎట్లా కుదురుతుంది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గారన్న దాన్ని తాను కాదనడంలేదని, కానీ, పార్లమెంటు ఎన్నికల విషయానికి వస్తే దేశమంతా మోదీకి అనుకూలంగా ఒకే అభిప్రాయంతో ఉన్నదని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ మధ్య ఒక ఇంగ్లీషు పత్రికతో అన్నారు. జాతీయవాదం ఒక మతంతోను, ఒక నాయకుడితోనూ ముడిపడితే, ఇటువంటి రాజకీయ ప్రభావాలు సహజమే. దేశవ్యాప్త ప్రభావానికి ఎదురుగా మరొక సమస్థాయి జాతీయ ప్రభావాన్ని నిర్మించగలిగే శక్తి ప్రతిపక్ష కూటమికి లేదు. ఇప్పుడు జరుగుతున్న సాధారణ ఎన్నికలలో, ఒక దేశవ్యాప్త రాజకీయ మహాశక్తిని, రాష్ట్రస్థాయి, స్థానిక రాజకీయాల కూటమితో ఎదుర్కొనడానికి ప్రయత్నించడం చూస్తున్నాము. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ప్రదర్శించారు. ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నది జాతీయపార్టీయే అయినా, ఎన్నికలు జాతీయ అంశాల ప్రాతిపదికన జరగలేదు. మరి రాష్ట్ర అంశాల ప్రాతిపదిక మీదనే లోక్‌సభ ఎన్నికల పోరాటం సాగేటట్టు కాంగ్రెస్ చేయగలదా? జాతీయ ప్రభావానికి తెలంగాణలో అడ్డుగోడ వేయగలదా?

‘పది, మేం గెలిచి తీరతాం’ అన్నారు, ఒక కాంగ్రెస్ పెద్ద నాయకుడు. ఆయన మాజీ ఎంపీ, రాహుల్ గాంధీకి దగ్గర కూడా. ‘బీజేపీ అంచనాలు ఆరు నుంచి మొదలై పది దాకా పెరుగుతున్నాయి, మీరు పదెట్లా గెలుస్తారు?’ అని అడిగాను. ‘అసెంబ్లీ లెక్కల ప్రకారం గెలవాలి. బీఆర్‌ఎస్‌ పడిపోతున్న తీరును బట్టి చూస్తే కూడా గెలవాలి’– అని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికలలోని విజయోత్సాహంతో కాంగ్రెస్ వాళ్లు ధీమాగా ఉన్నారు కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులను నిర్దిష్టంగా చర్చిస్తే, మోదీ ప్రభావం ఎంత ఉన్నదో వాళ్లకు కూడా లెక్క తెలియడం లేదు. చిన్నపట్టణాలలో, జిల్లా కేంద్రాలలో యువకులు, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల యువకులు పెద్ద ఎత్తున మోదీకరణ చెందారని అందరూ గుర్తిస్తున్నారు కానీ, అందుకు తమ వద్ద ఉన్న విరుగుడేమిటో వాళ్లు చెప్పడం లేదు, బహుశా వాళ్ల దగ్గర ఏమీ లేదేమో కూడా! డిసెంబర్ విజయం ఇంకా అదేరూపంలో భద్రంగా ఉన్నదని, కొత్తగా జరిగిన చేరికలతో అది మరింత జనబలంగా మారిందని అనుకుంటున్నారు. బాగా ఖర్చు పెట్టగలిగిన ఆసాములను రంగంలోకి దింపితే, ఆ ధనశక్తి కూడా తోడై పది విజయాలు ఖాయమని రాష్ట్ర కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. ఉపన్యాసాలు ఇచ్చి పోవడం తప్ప అధిష్ఠానం చేయగలిగే సాయం ఏమీ లేదు. చిన్నదో పెద్దదో ఒక ‘హవా’ సృష్టించే ఉద్దేశమూ సామర్థ్యమూ కూడా రాహుల్ బృందంలో కనిపించడం లేదు. చూడాలి, తుక్కుగూడ జనజాతరలో ఒక మందపవనమో మలయమారుతమో చెలరేగుతుందేమో?

బీఆర్‌ఎస్‌ పతనం రేవంత్‌కు కూడా ఆశ్చర్యం కలిగిస్తోందట. ‘వాళ్ల పతనవేగాన్ని చూసి ఆయన చాలా డిజప్పాయింట్ అవుతున్నారు’ అన్నారు ఆ కాంగ్రెస్ నాయకుడు. ఎన్నికలలో ఓటమి పొందిన బీఆర్‌ఎస్‌ను ఇప్పట్లో మరి లేవకుండా చేయాలని కాంగ్రెస్ అనుకోవడంలో తప్పులేదు. అందుకు పరిపాలనాపరంగాను, రాజకీయంగానూ ప్రక్రియలను ప్రారంభించినప్పుడు, వాటి పర్యవసానాల వేగం వారి నియంత్రణలో ఉండకపోవచ్చు. కేసీఆర్‌ పడిపోతూ, తనను తాను కాంగ్రెస్‌కు దిగువన, బీజేపీకి ఎగువన నిలబడేట్టు, నిగ్రహించుకోవడం సాధ్యమయ్యేపని కాదు. పైగా, ఏదో ఒకటి చేసి, పాతాళంలోకి జారిపోకుండా నిలదొక్కుకోవాలన్న ప్రయత్నమే లేనప్పుడు, ఆ పతనగతిని ఆపలేము. తాను సమకూర్చుకున్న బలగం అంతా వదిలిపెట్టి వెడుతుంటే, అలనాడు భారతంలో స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజుకు కలిగినంత నిర్వేదం కేసీఆర్‌కు కలగడంలో ఆశ్చర్యం లేదు. కానీ, నువ్విప్పుడు మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోవడం లేదు కదా? రణరంగం మధ్యలో వైరాగ్యం వల్ల ఏమిటి ఉపయోగం? ఇప్పుడు పూనుకుని ప్రజలను పలకరించే పని బాగానే ఉంది కానీ, మిగిలిన కార్యకర్తలకు మనోబలాన్ని ఇచ్చే పనిచేయాలి కదా, ముందు? డబ్బుల్లేవని, సొంతఖర్చు పెట్టుకోవాలని, పోటీచేయడానికి ముందుకువచ్చే అభ్యర్థులను విదిలిస్తే, అది శల్యసారథ్యమే అవుతుంది. ఎంతెంత డబ్బు ఎవరెవరు ఇచ్చారో మొన్ననే కదా ఎలక్షన్ కమిషన్ బయటపెట్టింది?

గెలిచే నమ్మకం లేనప్పుడు ఖర్చు పెట్టుకోవడం ఎందుకని కేసీఆర్‌ ఆలోచన కావచ్చు. గెలవడానికి కాదు, రెండో స్థానంలో నిలబడడానికే బీఆర్‌ఎస్‌ పోరాడాలి. ముగ్గురు ఆటగాళ్లున్న ఈ క్రీడలో కాంస్యపతకం లేదు. పది గెలిచితీరతామని చెబుతున్న కాంగ్రెస్ నేత కూడా రెండోస్థానంలో బీజేపీయే వస్తుందని బెంగపడుతున్నారు. తెలంగాణ రాజకీయరంగం మీద కాంగ్రెస్, బీజేపీ స్థిరపడితే, బీఆర్‌ఎస్‌ తెరమరుగు కావడమే జరుగుతుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో 8 చోట్ల గెలిచిన బీజేపీ మరో 18 స్థానాలలో మాత్రమే రెండో స్థానంలో ఉండింది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి 103 స్థానాలలో గెలిచి, 99 చోట్ల రెండోస్థానంలో ఉన్నాయి. మొత్తంగా 14 స్థానాలలో మూడోస్థానం లేదా ఆ దిగువన ఉండిపోయిన కాంగ్రెస్, కనీసం తొమ్మిది స్థానాలలో బీఆర్‌ఎస్‌, బీజేపీల తరువాతి స్థానాల్లో ఉండింది. అధికారం దక్కలేదనేది వేరే సంగతి కానీ, బీఆర్‌ఎస్‌ గౌరవనీయమైన స్థాయిలోనే జన బలాన్ని నమోదుచేసుకున్నది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లే తెలంగాణలోని ప్రధాన ప్రత్యర్థి పక్షాలని తాజా అసెంబ్లీ ఎన్నికలు చాటాయి. లోకసభ ఎన్నికలతో ఈ స్థితి నుంచి పూర్తిగా తారుమారు కానున్నదా?

2018 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ 7.1 శాతం ఓట్లను, ఒక ఎమ్మెల్యేను గెలుచుకోగలిగింది. 2019 పార్లమెంటు ఎన్నికలలో తన ఓటింగ్ శాతాన్ని అదనంగా 12 శాతం, అంటే 19.45 శాతం ఓట్లకు పెంచుకోగలిగింది. బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ 2023కు వచ్చేసరికి దాదాపుగా రెట్టింపు (13.9) అయింది. అదే లెక్కను వర్తింపజేస్తే, 2024 పార్లమెంటు ఎన్నికలలో ఆ పార్టీ ఓటింగ్ శాతం కూడా రెట్టింపై 24 శాతానికి చేరాలి. అదనపు హంగులు కూడా చేరినందున, ఇంకా పెరిగినా పెరగవచ్చు. కాంగ్రెస్ కోల్పోయే ఓట్లు బీజేపీ ఖాతాలోకి వెడతాయి. కాంగ్రెస్ గెలిచే చోట్ల బీజేపీయే రన్నర్ అప్‌గా ఉంటుంది. మరి బీఆర్‌ఎస్‌ ఎక్కడ? బీఆర్‌ఎస్‌ జోరు బాగా ఉన్న 2018–2019 కాలంలోనే, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల మధ్య ఆ పార్టీ ఓట్లు సుమారు ఆరుశాతం తగ్గి, బీజేపీ ఎదుగుదలకు దోహదం చేశాయి. 2023లో బీఆర్‌ఎస్‌ సాధించిన 37.5 శాతం ఓట్లలో ఎన్ని బీజేపీకి వెళతాయి? బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌కు తరలివెళ్లే ఓట్లు అతి తక్కువ ఉంటాయని, ఆ రెండు పార్టీల మధ్య నడుస్తున్న యుద్ధాన్ని చూస్తే అర్థమవుతుంది. పుట్టి మునిగిపోతున్న పార్టీకి మొన్న పడ్డ ఓట్లలో అత్యధికం బీజేపీకి పడితే, ఆ వలస ఓటింగ్ శాతాన్ని, ఫలితాలను కూడా గణనీయంగా ప్రభావితం చేయవచ్చు. కేంద్రప్రభుత్వపు కోరలు కలిగిన బలమైన ప్రతిపక్షం అధికార పార్టీని ఎంతో కాలం ఉండనివ్వదు. బీఆర్‌ఎస్‌ అవశేషాన్ని అసలే మిగలనివ్వదు.

కాసేపు బీజేపీని, మరి కాసేపు కాంగ్రెస్‌ను బలపడేట్టు చేసి కేసీఆర్‌ ఆడిన ఆట, చివరకు ఆయనకే ముప్పుతెచ్చింది. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి ఉమ్మడిగా బీఆర్‌ఎస్‌ మీద జరుపుతున్న రాజకీయయుద్ధం కాంగ్రెస్‌కే ప్రమాదం తెస్తుంది. కాంగ్రెస్ కోరుకున్నట్టే, బీఆర్‌ఎస్‌ కూడా వ్యవహరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం మీదనే కత్తులు నూరడం వల్ల తన చాప కిందికి నీరు తానే తెచ్చుకుంటున్నది. కాంగ్రెస్ మీద తాను పెంచే వ్యతిరేకత ఫలితాలు కూడా బీజేపీకే వెడతాయని బీఆర్‌ఎస్‌ గుర్తించాలి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కలిసి రాష్ట్ర అజెండానే పార్లమెంటు ఎన్నికలకు విస్తరించాలనుకోవడం బాగానే ఉన్నది కానీ, ప్రచారపర్వం ఉధృతమై జాతీయఅంశాలు వేదికమీదకు వచ్చేసరికి, బీఆర్‌ఎస్‌ నిరాయుధంగా మిగలవలసివస్తుంది. గెలుపు ఓటములను పక్కనబెట్టి, ఉనికి పోరాటం చేయడమొక్కటే బీఆర్‌ఎస్‌ చేయగలిగింది. రంగంలో మిగలడానికి చేసే జీవన్మరణ యుద్ధంలో, ఆ పార్టీకి కావలసింది ఒక గట్టి రాజకీయ ఆయుధం. ఇప్పుడే నిద్రనుంచి మేల్కొన్నట్టు, రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడడం వల్ల హేళనలు ఎదుర్కొనడమే తప్ప, ప్రయోజనం ఉండదు. సాధికారంగా, నైతికబలంతో మాట్లాడగలిగే అంశాలను వారు అన్వేషించాలి. ఓడిపోయే ఎన్నికల కోసం ఖర్చు దండగని అనుకోకుండా, భవిష్యత్తు యుద్ధాల కోసం వర్తమానంలో ఆత్మరక్షణ చేసుకోవాలి. బంగారు లక్ష్యం అచ్చి రానప్పుడు, రజతపతకంతో అయినా పోటీలో నిలవాలి.

కె. శ్రీనివాస్

Updated Date - Apr 04 , 2024 | 01:21 AM