Share News

తల్లుల గర్భశోకం, దయలేని లోకం!

ABN , Publish Date - Aug 01 , 2024 | 05:20 AM

హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హానియేను టెహరాన్‌లో ఆయన బస చేసిన చోటనే రాకెట్ దాడితో హత్య చేశారు. ఇది దుర్మార్గమైన యూదు ఉన్మాద హత్య అని హమాస్ చెబుతోంది. ఇంకా ఒప్పుకోలేదు కానీ, ఇది ఇజ్రాయిల్...

తల్లుల గర్భశోకం, దయలేని లోకం!

హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హానియేను టెహరాన్‌లో ఆయన బస చేసిన చోటనే రాకెట్ దాడితో హత్య చేశారు. ఇది దుర్మార్గమైన యూదు ఉన్మాద హత్య అని హమాస్ చెబుతోంది. ఇంకా ఒప్పుకోలేదు కానీ, ఇది ఇజ్రాయిల్ చేసిన హత్యే అని తెలిసిపోతోంది. ప్రపంచంలో చెడును తగ్గించడానికి ఇదే సరైన పద్ధతి అని ఇజ్రాయిల్ మంత్రి ఒకరు ట్వీట్ చేశారు కూడా. పాలస్తీనా పోరాట చరిత్రలో ఇటువంటి హత్యలు పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. కానీ, ఇటువంటి బోరవిరుపు, అంతర్జాతీయ సమాజాన్ని ఖాతరు చేయని తనం మాత్రం పశ్చిమాసియా సంఘర్షణలోనే కాదు, ప్రపంచమంతటా కూడా పెరిగిపోతున్న ధోరణి. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణస్వీకారానికని హానియే ఇరాన్ వెళ్లారు. మన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో పాటు హానియే కూడా ఆ వేడుకలో పాల్గొన్నారు. ప్రమాణకార్యక్రమం తరువాత అర్ధరాత్రి ఈ హత్య జరిగింది. ఒకపక్కన శాంతిచర్చలు జరుగుతుండగా, అమెరికా ఎన్నికల్లో సైతం పాలస్తీనా సమస్య ప్రముఖ అంశంగా పరిణమిస్తుండగా, ఈ హత్య జరిగింది. దీనికి గొలుసుకట్టు పర్యవసానాలు అనేకం ఉంటాయి. ఈ ఏడు గ్లోబల్ రాజకీయాలు మరింత ఉద్రిక్తం అవుతాయి.


చంపుతామని ఇజ్రాయిల్ ముందే చెప్పింది. చిట్టచివరి హమాస్ సభ్యుడిని చంపేవరకు వదిలిపెట్టబోమని చెబుతూనే ఉంది. ఇక అధినేతను వదులుతుందా? ఏ టర్కీలోనో, ఖతార్‌లోనో ఉండగా చంపవచ్చుకదా? ఎందుకు చేయలేదు? పోయిన ఏడాది అక్టోబర్ 7నాడు హమాస్ చేసిన హత్యాకాండ వెనుక ఇరాన్ దన్ను ఉందని ఇజ్రాయిల్‌కూ, లోకానికీ కూడా తెలుసు. ఇరాన్ గడ్డ మీదనే, హమాస్ నేతను చంపి చూపించాలని ఇజ్రాయిల్ అనుకున్నది. ‘గుస్ గుస్ కే మారా’ అని తన గురించి నాయకుడు, నాయకుడి గురించి ప్రజలు గర్వంగా చెప్పుకుంటున్న రోజుల్లో, ఇజ్రాయిల్ చర్య సాహసోపేతమైనదిగా, ‘మగతనానికి’ ఆనవాలుగా కనిపించడంలో ఆశ్చర్యం ఉండదు.

ఇజ్రాయిల్ మొదటి నుంచీ దాదాపుగా ఇంతే, 1948లో, 1967లో కూడా ఆ దేశానిది క్రూరమైన తెంపరి తనమే. ఐక్యరాజ్యసమితిని కానీ, ప్రపంచ దేశాల అభిప్రాయం కానీ లెక్కచేయకపోవడమే దాని నైజం. అప్పుడప్పుడు మాటవరసకు పాలస్తీనాకు న్యాయం గురించి, రెండుదేశాల పరిష్కారం గురించి మాట్లాడుతూ, చేతల్లో మాత్రం ఇజ్రాయిల్‌ను పెంచి పోషించింది అమెరికాయే. సోవియట్ రష్యా విచ్ఛిన్నమయిన తరువాత, ఇజ్రాయిల్ ప్రాధాన్యం, దుందుడుకుతనం మరింత పెరిగాయి. ఓస్లో ఒప్పందం ద్వారా పాలస్తీనా ఉద్యమం రెండడుగులు కిందికి దిగినా, ఇజ్రాయిల్ దాన్ని గౌరవించలేదు. మొత్తంగా దేశమంతటినీ యూదుల సెటిల్‌మెంట్లతో నింపేసి, పాలస్తీనా జీవితాలను అతిచిన్న భూభాగంలో శరణార్థి శిబిరాలకు, లేదా కిక్కిరిసిన జనావాసాలకు పరిమితం చేయడం దాని లక్ష్యంగా ఉంది. ఇజ్రాయిల్ దక్షిణ సరిహద్దులో ఉన్న ఎడారి ప్రాంతంలోకి గాజావాసులను పూర్తిగా తరిమేసి, వారిని అక్కడే ఉంచడం పరిష్కారమన్న జియోనిస్టుల ప్రతిపాదనకు ట్రంప్ ప్రభుత్వం వంతపాడింది కూడా. మరోపక్క, ఆరంభంనుంచి పాలస్తీనా పక్షాన ఉన్నదేశాలు ఒక్కొక్కటిగా జారిపోవడం మొదలుపెట్టాయి. చిట్టచివరగా సౌదీ అరేబియా కూడా ఇజ్రాయిల్‌తో సంబంధాలు పెట్టుకోబోతున్నప్పుడు, దానిని నివారించడానికి హమాస్ గత అక్టోబర్‌లో హంతక దాడులు చేసింది. హమాస్ 1100 మంది ఇజ్రాయిలీలను చంపగా, అందుకు ప్రతిగా ఇజ్రాయిల్ 40 వేల మంది పాలస్తీనియన్లను చంపింది. ఈ లెక్క ఇంకా పెరుగుతోంది.


హానియే హత్య తరువాత ఏం జరుగుతుంది? ఈ ఘాతుకానికి జవాబు తప్పక ఇస్తామని హమాస్ సహజంగానే అంటుంది, అంది. ఇరాన్ కూడా బాధ్యులను కనుగొని చర్యలు తీసుకుంటామని అంది. హమాస్ ఎంతగా ప్రతికూల ప్రచారానికి లోనయిందంటే, ఈ చర్యను నేరుగా ఖండించేందుకు ప్రపంచ నేతల్లో చాలా మందికి నోరు రావడం లేదు. ఒకపక్క చర్చలు జరుగుతుండగా, ఇదేమిటని శాంతిప్రక్రియలో పాలుపంచుకుంటున్న ఖతార్ బాధపడింది. చైనా మాత్రం హత్యను తీవ్రంగా ఖండిస్తూ, తక్షణం కాల్పుల విరమణ జరగాలని కోరింది. తనకు ఎటు వంటి సంబంధం లేదని అమెరికా చేతులు దులుపుకుంది.

హమాస్, హిజ్బొల్లా వంటి సంస్థల వెనుక ఇరాన్ ఉంటే, ఇజ్రాయిల్ చర్యల వెనుక అమెరికా ఉండాలి కదా? బైడెన్ ప్రభుత్వం ఎంతటి అవకాశవాద వైఖరితో వ్యవహరించి, ఇజ్రాయిల్‌కు మద్దతుగా నిలిచినా, రెండు దేశాల పరిష్కారం మీద, గాజాలో కాల్పుల విరమణ మీద సూత్రప్రాయంగా ఆమోదంతో ఉన్నది. ఒక సందర్భంలో 2000 పౌండ్ల బాంబులను పంపడానికి నిరాకరించింది కూడా. మునుపెన్నడూ లేని విధంగా అమెరికాలో పాలస్తీనాకు మద్దతు పెరిగింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. మరి తన పెద్దన్న దేశానికి ఇబ్బందికరమైన పని ఇజ్రాయిల్ ఎందుకు చేస్తుంది? ఇజ్రాయిల్ ప్రస్తుత తీవ్రవాదానికి అమెరికా అండలో కాక, మరెక్కడైనా మూలాలు ఉన్నాయేమో చూడాలి. బహుశా, ప్రపంచ వ్యవస్థలో ఇప్పుడు ఏకధ్రువత కూడా చెదిరిపోవడం వల్ల పెద్ద దేశాలతో పాటు, కొంత బలమూ బలగమూ ఉన్న అనేక చిన్నా చితకా రౌడీ దేశాలు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నాయనిపిస్తుంది. కాకపోతే, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ అమెరికన్ కాంగ్రెస్‌లో మాట్లాడిన తీరు ఏమిటి? ఒక పక్కన బైడెన్ అతనితో శాంతి చర్చల ప్రక్రియ గురించి మాట్లాడుతుంటే, గాజా మీద బాంబుదాడులు పెంచడమేమిటి? ఇద్దరూ కూడబలుక్కుని చేశారనుకోవడానికి కూడా లేదు. తాను నష్టపోతూ అందుకు అమెరికా ఎందుకు సిద్ధపడుతుంది?


ఏ విలువలూ విధానాలూ లేకుండా పోయిన అంతర్జాతీయ రాజకీయాలలో, పాలస్తీనా సమస్య ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి కొనసాగుతున్న పురాతన అంశం. భారతదేశం సంగతే చూద్దాము. ఇప్పటికీ అధికారికంగా పాలస్తీనాకు రెండు దేశాల పరిష్కారాన్ని భారత్ కోరుకుంటుంది. సార్వభౌమాధికారాన్ని, ప్రతిపత్తిని గుర్తిస్తుంది. కానీ, మరోవైపు 1960లలో రహస్యంగా మొదలుపెట్టి, 1970ల మీదుగా, 1990లలో ఇజ్రాయిల్‌తో అధికారిక సంబంధాలను ఏర్పాటు చేసుకున్నది. బీజేపీ హయాంలోనైతే పట్టపగ్గాలు లేని దౌత్యం మొదలయింది. కానీ, పాలస్తీనాకు మద్దతుగా నిలబడి, ఇజ్రాయిల్ మీద కత్తులు దూస్తున్న ఇరాన్ కూడా భారత్‌కు చాలా గట్టి నేస్తం. మొన్నటి దాకా ఇరాన్ మీద యుద్ధానికి కాలుదువ్విన అమెరికాను అదుపు చేయడంలో రష్యా ముందుంది. ఈ రష్యా భారత్‌కు సోవియట్ కాలం నుంచి కొనసాగుతున్న పాత భల్లూకపు నేస్తం. అమెరికా పక్కన నిలిచీ, దౌత్యాన్ని పెంచీ ఇజ్రాయిల్‌కు అండగా ఉన్నట్టు కనిపిస్తున్న భారత్, మరో కోణంలో, రష్యా పక్కన నిలిచి ఇరాన్‌కు, హమాస్‌కూ కూడా మద్దతు తెలుపుతున్నట్టే. ఈ విదేశాంగ వైఖరుల్లో ఏ విలువలూ లేవు. రేపు ట్రంప్ గెలిస్తే, అతను అనుసరించే తీవ్ర ఇజ్రాయిల్ అనుకూల విధానాలతో బహుశా, రష్యాకు కూడా పెద్ద అభ్యంతరం ఉండదు. ఉక్రెయిన్ మీద అదనంగా నాలుగు బాంబులు వేస్తానని రష్యా అంటే, ట్రంప్‌ కూడా కాదనడు. ఈ ఇద్దరితో సఖ్యంగా ఉంటూ, పాలస్తీనా విముక్తిని కోరుకుంటూ, ఇజ్రాయిల్ దాడులకు కళ్లు మూసుకుంటూ, ఇండియా లౌక్యంగా మెసలగలదు!


బాహాటంగా రష్యాతోను, చాటుగా చైనాతోను గట్టి స్నేహాలున్న ఇండియాను తొందరపడి దూరం చేసుకోవాలని అమెరికా అనుకోదు. కానీ, ఉక్రెయిన్ మీద రష్యా దాడి విషయంలో భారత్ వైఖరి అమెరికాకు సంతృప్తికరంగా లేదు. ఆ అసంతృప్తిని అతిగా ప్రకటించకుండా, ‘‘తలచుకుంటే మోదీ యుద్ధాన్ని ఆపగలరు’’ అన్న ప్రశంసాత్మక అభిప్రాయాన్ని ప్రచారంలో పెట్టారు. ఎక్కడ మోదీ దానికి ప్రభావితమవుతారో అనుకున్న పుతిన్, మోదీ మాస్కోలో ఉన్నప్పుడే, ఉక్రెయిన్‌లో పిల్లల ఆస్పత్రి మీద బాంబు వేశాడు. దానితో జెలెన్స్కీ మోదీకి నైతికమైన సవాల్ విసిరాడు. మోదీ చాలా ఇబ్బంది పడ్డారు. ఎంతో కొంత అప్రదిష్ట వచ్చిందని గ్రహించో, లేదా, అమెరికాను ఊరడించడానికో మోదీ ఇప్పుడు ఉక్రెయిన్‌కు ఒక ప్రత్యేక యాత్ర చేయబోతున్నారు. మరి అప్పుడు పుతిన్ మరో దాడిచేస్తే? అలా చేయబోమని, అనధికార హామీ ఏదో లభించి ఉండవచ్చు. లేకపోతే, కష్టమే.

ఇక్కడ మళ్లీ అనేక అనుబంధ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఉక్రెయిన్‌లో పిల్లల మరణాలు మానవీయమైన స్పందనల అవసరాన్ని చాటిచెప్పినప్పుడు, గాజా పట్టీలోని వేలాది మంది పిల్లల చావులు ఎందుకు ఎవరినీ కదలించలేకపోతున్నాయి? దుఃఖాలకు లెక్కలుండకూడదు నిజమే కానీ, అధికారికంగా 1139 మందిని చంపిన అక్టోబర్ 7 నాటి హమాస్ దాడిలో పిల్లలు 33 మంది, మరి ఆ తరువాత ఇజ్రాయిల్ చేసిన ఆకాశ, భూతల దాడుల్లో గాజాలో మరణించిన పిల్లల సంఖ్య 13,800 మంది. ఏ పక్షానికి చెందిన ఏ ఒక్క చిన్నారీ ఈ సంఘర్షణల్లో చనిపోకూడదనే అందరం కోరుకుంటాం. కానీ, పదులకు స్పందించిన గుండెలు, వేల మరణాలకు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి?


ఘర్షణలో ఉన్న పక్షాలకు, చంపడానికి, చావడానికీ వాటి సమర్థనలు, కారణాలు వాటికి ఉంటాయి. కానీ, జీవితపోరాటంలోనే మునిగిపోయిన నిరాయుధులు దాడులకు ఎందుకు లక్ష్యం కావాలి? ఏ పక్షం వైపు న్యాయం ఉన్నదో చెప్పలేకపోవచ్చు, కానీ, అమాయకుల మరణాల గురించి ప్రపంచం ఎందుకు మాట్లాడదు? పశ్చిమాసియా, ఉక్రెయిన్ మాత్రమే కాదు, ప్రపంచమంతా ఒక కొత్త అమానవీయ పతనస్థాయికి చేరుకున్నట్టు కనిపిస్తున్నది. రాజకీయ వ్యూహాలు అతి కర్కశంగా అనైతికంగా మారుతున్నాయి. మన దేశంలోనూ అంతే. మణిపూర్ హాహాకారాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎంతకీ కదిలించలేదు. దేశరాజకీయాల ప్రాతిపదికన మణిపూర్‌పై స్పందన కూడా చీలిపోయింది. బాధితులనే అన్యాయంగా నిందించే మనుషులు పెరిగిపోయారు. కానీ లెమ్మని, జరగనిమ్మని, జరగవలసిందేనని అనుకుంటున్నారు. అట్లాగే, ఛత్తీస్‌గఢ్. అక్కడి మరణాల గురించి మాట్లాడడానికి నక్సలైట్ల మీదనో, ప్రభుత్వ విధానాల మీదనో ఏదో ఒక వైఖరి అవసరమా? అమాయక ఆదివాసుల మరణాలు సమాజాన్ని కుదిపివేయకూడదా?

కె. శ్రీనివాస్

Updated Date - Aug 01 , 2024 | 05:21 AM