ఆలయం వెలిసింది, ఆ తరువాత ఏమిటి?
ABN , Publish Date - Jan 25 , 2024 | 05:24 AM
న్యాయం గెలుస్తుందన్నది నిజమే కావచ్చు కానీ, గెలిచేదంతా న్యాయం కాదు అన్నాడొక పెద్దమనిషి. ఎట్లా గెలిచినప్పటికీ, న్యాయంగానే గెలిచానని విజేతలు చెప్పుకుంటారు. కథలూ కావ్యాలూ పురాణాలూ రాసుకుంటారు, రాయిస్తారు...
న్యాయం గెలుస్తుందన్నది నిజమే కావచ్చు కానీ, గెలిచేదంతా న్యాయం కాదు అన్నాడొక పెద్దమనిషి. ఎట్లా గెలిచినప్పటికీ, న్యాయంగానే గెలిచానని విజేతలు చెప్పుకుంటారు. కథలూ కావ్యాలూ పురాణాలూ రాసుకుంటారు, రాయిస్తారు. గెలిచినవాళ్లు మంచి జోరు మీద ఉంటారు కాబట్టి, వాళ్లు చెప్పేది నిజమే అని చేతులు కట్టుకుని అందరూ బుద్ధిగా నమ్ముతారు. చరిత్రలన్నీ గెలిచినవాళ్లు రాసినవే అంటారు అందుకే.
విజేతల వేడుకలు రంగ రంగ వైభవంగా, మహా ఆర్భాటంగా ఉంటాయి. గెలుపును ఢంకా బజాయించి చాటడమే తప్ప అందులో మరో శబ్దానికి ఆస్కారం ఉండదు. ఆ మిరుమిట్లు చూస్తున్నప్పుడు తక్కినదేదీ కళ్లకు కనిపించదు. ఆ బలప్రదర్శన దెబ్బకు అన్ని సందేహాలను పరిత్యజించి ఇక అధికార సత్యానికే మనసు విధేయం అయిపోవాలి. యుద్ధకాలంలోనూ, యుద్ధానంతర సత్యస్థాపనలోనూ దృశ్యశ్రవణపఠన మీడియా అవసరం అందుకే.
పైన రాసిన నాలుగు వాక్యాలకీ, సోమవారం నాడు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకీ ఏ సంబంధమూ లేదు. కానీ, ఆ వైభవోజ్జ్వల సన్నివేశం చూస్తున్నప్పుడు, చూసిన తరువాత నయము, భయము, విస్మయము మాత్రమే కాదు, తాత్విక భావావేశాలెన్నో ముంచుకువచ్చాయి. ఒక పవిత్ర ఆధ్యాత్మిక క్రతువు ముఖచిత్రం వెనుక లౌకిక, భౌతిక పరమార్థాలేవో ముసురుకున్న స్ఫురణ భయం పుట్టించింది. అంతటి దిగ్భ్రమలోనూ రాముడి మీద ప్రేమతోనే కొన్ని సంశయాలు కలిగాయి. రాముడు నిజంగానే తన గూటికి తిరిగి చేరాడా? ఆ గూడు ఎవరి గుప్పిట్లో అయినా ఉన్నదా? అందులో ఆయన స్వేచ్ఛగా ఉన్నాడా? ఇటువంటి జాబాలి ప్రశ్నలను అపచారం అనుకోకుండా వశిష్ఠుడు అనుమతిస్తాడా?
దేశంలోని ముఖ్యులందరూ అక్కడ ఉన్నారని కాదు కానీ, ఉన్న ఏడు వేల మంది ప్రత్యేక ఆహ్వానితులు మన సమాజంలోని మీగడతరకల శ్రేణి వారే. రకరకాల రంగాల సెలబ్రిటీలే. విశ్వపీఠాలు స్థాపించి భారత ఆధ్యాత్మికతకు ప్రతినిధులైనవారు, త్రిదండిలు ధరించి మంచిచెడ్డలూ హెచ్చుతగ్గులూ నిర్వచించేవారు, శిష్యకోటిని ఆమడదూరాన నిలబెట్టి ఆశీర్వదించేవారు, సమస్త రాజకీయశ్రేణులను తమ పాదస్పర్శతో ధన్యులను చేసేవారు ముఖ్యక్రతువు వేదికకు వెలుపల కూర్చుండిపోయారు. మహానటులు, నటీమణులు, అభినవ కుబేరులు, క్రీడాకారులు, గాయకులు, కవులు అతికొద్దిమంది విశిష్టులలో తాము ఒకరమైనందుకు గర్విస్తూ ఆసీనులయ్యారు. భారత ప్రధానమంత్రి, హిందూత్వ పరివారానికి ప్రధాన సంఘచాలకుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ గర్భగుడిలో బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ చేసి ఆవిష్కరించారు. ఒకనాడు, మతపెద్దలకు రాజకీయవాదులు శిష్యపరమాణువులుగా ఉండేవారు, ప్రభుత్వ కార్యక్రమాలలో మత తంతులు జరిపించేవారు. రాజకీయాలలో మతప్రమేయం ఏమిటని అభ్యుదయ ప్రాశ్నికులు నిలదీసేవారు. ఇప్పుడు, మతరంగాన్ని రాజకీయవాదులు ఆక్రమించారు. రెండు రంగాలకు మధ్య దూరం చెరిగిపోవడం కాదు, రాజకీయరంగమే మతాధిపత్యస్థానాన్ని తీసుకుంటున్నది. దేవుడికి భక్తుడికి నడుమ ఒకనాడు పూజారి అడ్డం అనుకునేవారు. ఇప్పుడు దేవుడికి పూజారికి మధ్య, దేవుడికి పౌరుడికి నడుమ రాజకీయవాది సర్వశక్తిశాలిగా నిలబడ్డాడు.
ఎందువలన అనగా, రాముడు ఇప్పుడు కేవలం ఆధ్యాత్మిక, దివ్య చిహ్నం మాత్రమే కాదు. జాతీయతావాద ప్రతీక. ఐక్యతకు గుర్తు. రామనామం మహారాజ్యశక్తికి వాహిక. నరేంద్రమోదీ తలపెట్టిన నూతన భారత నిర్మాణానికి అవసరమైన సామాజిక అంతశ్చేతన రాముడు. దేవుడిని రాజకీయవాది స్వాధీనం చేసుకోవడమే కాదు, దేవుడికి రాజకీయ పరమార్థం, కర్తవ్యం కూడా సంక్రమింపజేశారు. దేవుడే రాజకీయవాది అంటే అపచారం అవుతుందేమో కానీ, దేవుడి రాజకీయకర్తవ్యాలను దైవప్రతినిధిగా పాలకుడు నిర్వర్తిస్తారు. విష్ణువు కాని వాడు రాజు కాజాలడు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మరీ రాజుకు, దైవానికి నడుమ అద్వైతం ప్రతిపాదించలేము కానీ, అభేదాన్ని అన్వయించగలిగే ప్రతిపత్తిని ఇవ్వగలము. కలియుగంలో దైవం అర్చావతారంలో శిలగా మాత్రమే ఉంటాడు కాబట్టి, మాట్లాడలేడు. ఆ మౌనాన్ని రాజకీయవాది అవకాశంగా తీసుకుని, తన మాటలనే దేవుడి నోట పెడతాడేమో అనిపిస్తుంది.
కొంతకాలంగా నిరీక్షిస్తున్న ఉత్సవం కాబట్టి, అక్కడ ఉండిన, దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ టీవీలలో వీక్షించిన భక్తులు ఒక పారవశ్యానికి లోను కావడం సహజం. వారి మనసులో అయోధ్య ఆలయానికి సంబంధించిన నేపథ్యవివాదాలేవీ లేకపోవచ్చు, కొత్త తరానికి ఆ వివరాలే తెలియకపోయి ఉండవచ్చు. వారందరికీ ఆలయనిర్మాణం, ప్రాణప్రతిష్ఠ ఒక ప్రక్రియ తరువాత సమకూరిన విజయంగా, సహజ న్యాయం అందడంగా కనిపించి ఉండవచ్చు. లేదా, గతంలో సమస్యలు ఉన్నప్పటికీ, నిర్మాణం, ప్రతిష్ఠ జరిగాక ఇక వాటికి ప్రాధాన్యం లేదన్న భావన ఉండవచ్చు. ఆ సందర్భంలో సందేశాలు ఇచ్చిన నాయకులు, సామాజిక నేతలు అందరూ, చరిత్రలో జరిగిన ఒక అన్యాయానికి దిద్దుబాటుగా ఆలయనిర్మాణాన్ని చెప్పారు. సుప్రీంకోర్టే తమ విశ్వాసాన్ని ధ్రువపరచిందని మాట్లాడారు. నిజానికి వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు తీసుకున్న ప్రాతిపదికలు వేరు. కానీ, అక్కడి సంరంభంలో విజేత వాదం చరిత్రగా స్థిరపడింది. ఇంతకాలం ఒక నమ్మకంగా ఉన్న అంశాన్ని మీడియా కూడా ఈ సందర్భంలో ఒక సత్యంగా కథనీకరించింది. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఈ మధ్య రాసిన ఒక వ్యాసంలోని ఈ వాక్యాలు ఆసక్తికరమైవి. ‘‘సత్య న్యాయాల ఉమ్మడి విజయం చేదు జ్ఞాపకాలను చెరిపివేస్తుంది. కొత్త కథలను సృష్టిస్తుంది. సమాజంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది.’’ ఒకనాటి చేదుజ్ఞాపకాలను చెరిపివేసే ప్రయత్నం కూడా కొత్తగా కొన్ని చేదుజ్ఞాపకాలను సృష్టించిందని మరచిపోగలమా? అత్యంత క్రూరమైన గత వర్తమానాలను విస్మృతిలోకి విసిరేయగలిగేంత మానవీయమైన, మృదువైన, గౌరవప్రదమైన భవిష్యత్తును మనం నిర్మించుకోగలమా?
పాత వాద వివాదాలను తిరిగి ముందుకు తేవడానికి పరాజిత పక్షం కూడా ఈసారి ఆసక్తి చూపలేదు. మొత్తంగా వివాద పర్యవసానమే వారిని కుంగదీసింది, జరిగేదాన్ని వారు మౌనంగా చూస్తూ ఉండిపోయారు. ప్రతిపక్షం లేకపోవడంతో రామాలయ నిర్మాణ సంరంభంలో సానుకూల అంశాలే వినిపించాయి తప్ప, ఏ ప్రజాశ్రేణినీ కొత్తగా, ప్రత్యేకంగా నొప్పించే విషయాల ప్రస్తావనలకు పెద్దగా ఆస్కారం లేకపోయింది. జాతీయ ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి చెప్పిన అభ్యంతరం కూడా రాజకీయవివాదాన్ని తీవ్రం చేయడానికి అనుకూలమైంది కాకపోయింది. రామాలయాన్ని వ్యతిరేకించడం కాక, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగే తీరును కాంగ్రెస్ తప్పు పట్టింది. బీజేపీ ఆధ్వర్యంలో జరిగే రాజకీయ కార్యక్రమం అని విమర్శించింది.
రామజన్మభూమి ఉద్యమం సాంస్కృతిక, జాతీయతావాద ఉద్యమం అని దాన్ని నిర్వహించిన సంస్థలు చెప్పాయి. ఆ సంస్థలలో భారతీయ జనతాపార్టీ కూడా ఉన్నది. ఆలయ ఆకాంక్ష నెరవేరే సమయానికి ఆ పార్టీయే అధికారంలో ఉన్నది. కానీ, తక్కిన సంస్థలు తాము మొత్తం హిందువులకు సామాజిక, సాంస్కృతిక ప్రాతినిధ్యం వహిస్తామని చెప్పుకుంటాయి. కార్యక్రమాన్ని మతపెద్దలు, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించి, అన్ని రాజకీయ పార్టీలనూ సమానగౌరవంతో ఆహ్వానించి ఉండవలసింది. ప్రభుత్వ కార్యక్రమం అనిపించేంతగా, ప్రభుత్వ వ్యవస్థలు ఇందులో కల్పించుకోకుండా ఉండవలసింది. నరేంద్రమోదీ ప్రధానిగా ఉండడం వల్లనే ఆలయ నిర్మాణం సాధ్యమైంది అన్నది భావన మాత్రమే కానీ, పూర్తి సత్యం కాదు. అంతిమ తీర్పు ఇచ్చినది అత్యున్నత న్యాయస్థానం. నిర్మించింది ట్రస్టు. వెచ్చించింది ప్రభుత్వ ధనం కాదు. మరి ఇందులో మోదీ ఘనత ఏమున్నది? బీజేపీ కృషి ఉంటే, అది ఆడ్వానీ, జోషి వంటి వారి ద్వారా జరిగింది. మోదీ వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచుకోవడానికి, ఈ ఏడాది ఎన్నికలలో ఈ అంశాన్ని ఉపయోగించుకుంటారని రామభక్తులు, మోదీ అభిమానులు కూడా అంగీకరిస్తారు. లేకపోతే, ఆలయం పూర్తి కావడానికి ఇంకా ఏడాదికి పైగా పట్టే అవకాశం ఉండగా, ఇప్పుడే ఈ ప్రాణ ప్రతిష్ఠ ఎందుకు? ఆడ్వానీ లేకుండా ప్రధాని మాత్రమే గర్భగుడిలో ఎందుకు?
ఉత్సవం జరిగిపోయింది. ఒక సుదీర్ఘ పోరాటం, నిరీక్షణ, ఆకాంక్ష అనుకున్నవన్నీ నెరవేరాయి. తరువాత ఏమిటి? జాతినిర్మాణం అన్నారు భాగవత్. మోదీ కూడా అదే అన్నారు. అభివృద్ధికి కావలసిన ఐక్యత ఈ విజయం నుంచి వచ్చిందన్నారిద్దరూ. భారతదేశ సమాజానికి, రాజకీయవ్యవస్థకు వారు ఇవ్వదలచుకున్న రూపానికి రాముడు ఒక సాధనమవుతున్నాడా? రాముడి రూపంలో నవ భారతదేశానికి ఒక చిహ్నం దొరికిందా? దేశ ప్రజలు ఎదుర్కొంటున్న దైనందిన సమస్యలను పరిష్కరించే రామరాజ్యం వస్తుందా? చారిత్రక న్యాయం, ఆధ్యాత్మిక పారవశ్యం సరే, అధిక ధరలు, నిరుద్యోగం, హక్కుల హననం, తిరోగామి అజ్ఞానం ఇవన్నీ సమసిపోతాయా? రైతాంగం బతికి బట్టకడుతుందా? అన్నమో రామచంద్రా అనే ఆర్తనాదాలు వినిపించకుండా పోతాయా? భారతదేశంలో మూలమూలన ప్రజల జ్ఞాపకాలలో, కథల్లో, పాటల్లో ఉన్న రాముడిని కొత్తగా నిర్వచించే ఈ ప్రయత్నం, భారతీయులకు కొత్త అవకాశాలను అందిస్తుందా?
కె. శ్రీనివాస్