అత్యున్నత గౌరవం వెనుక అంతరార్థం ఏమిటి?
ABN , Publish Date - Feb 08 , 2024 | 01:53 AM
సాక్షాత్తూ ప్రధానమంత్రే పార్లమెంటులో అసత్యాలూ అర్థసత్యాలూ పావుసత్యాలూ చెప్పకూడదు కదా? బుధవారం నాడు రాజ్యసభలో అరివీరభయంకరంగా మాట్లాడుతూ, తమ ప్రభుత్వం వస్తే కానీ...
సాక్షాత్తూ ప్రధానమంత్రే పార్లమెంటులో అసత్యాలూ అర్థసత్యాలూ పావుసత్యాలూ చెప్పకూడదు కదా? బుధవారం నాడు రాజ్యసభలో అరివీరభయంకరంగా మాట్లాడుతూ, తమ ప్రభుత్వం వస్తే కానీ బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు భారతరత్న గౌరవం దక్కలేదని నరేంద్రమోదీ అన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఎప్పుడూ తమ కుటుంబం వారికే భారతరత్నలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రాధాన్యాల గురించి చర్చించవచ్చు, తప్పులేదు. కానీ, అంబేడ్కర్‌కు అత్యున్నత పౌరగౌరవ ప్రదానాన్ని తమ ఖాతాలో వేసుకోవడమే విచిత్రం. 1990 మార్చి 31 నాడు అంబేడ్కర్‌కు మరణానంతరం భారతరత్న ప్రకటించారు. అప్పడు కేంద్రంలో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వానికి బీజేపీ వెలుపలినుంచి మద్దతు ఇచ్చిన మాట నిజమే కానీ, ప్రభుత్వ నిర్ణయంలో వారి పాత్ర ఉందని ఎట్లా చెప్పగలం? ప్రధానిగా విపిసింగ్ సామాజిక న్యాయం గురించి పట్టింపుగా ఉన్నారు. భారతరత్నతో పాటు, పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో అంబేడ్కర్ చిత్రపటావిష్కరణ కూడా ఆ వెనువెంటనే జరిగింది. ఇందుకు దేశంలో ఆనాడు వస్తూ ఉండిన మార్పులే కారణం. దేశవ్యాప్తంగా దళిత చైతన్యం పెరుగుతున్నది, కాన్షీరామ్ ప్రభావం విస్తరిస్తున్నది. ఈ నేపథ్య కారణాలు కాదని, అప్పటికే రామజన్మభూమిలో తలమునకలై ఉన్న బీజేపీ, అంబేడ్కర్ పేరును ప్రతిపాదించిదని ఎట్లా చెప్పగలం? కాకపోతే, మండల్ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు, అంబేడ్కర్‌కు భారతరత్నను బీజేపీ వ్యతిరేకించలేదు, అంతవరకు ఆ కీర్తిలో వాటా ఇవ్వవచ్చు.
నిజంగా విపిసింగ్ భారతరత్న నిర్ణయాలలో తన ప్రమేయం ఉంటే, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు ఇమ్మని బీజేపీ చెప్పి ఉండేది. అప్పటికే లాల్ కృష్ణ ఆడ్వానీ అభినవ సర్దార్ పటేల్‌గా రూపొందుతూ ఉన్నారు. సర్దార్ పటేల్‌కు భారతరత్న ఆ మరుసటి సంవత్సరం, పి.వి. నరసింహారావు ప్రధానిగా ఉండగా ప్రకటితమైంది. రాజీవ్ గాంధీకి, జనతారాజకీయాల కురువృద్ధుడు మొరార్జీ దేశాయ్‌కు కూడా పీవీ హయాంలోనే భారతరత్నలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ నాయకపరివారానికి లేదా అస్మదీయులకు మాత్రమే అత్యున్నత పురస్కారాలు ఇచ్చాయని మోదీ అన్నమాట కూడా వాస్తవం కాదు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలకు వారు పదవుల్లో ఉండగానే భారతరత్న ఇవ్వడం ఈ రోజు అనుచితంగా అనిపించవచ్చు కానీ, స్వాతంత్ర్యానంతర కాలపు తొలిసంవత్సరాలలో నెహ్రూకు ఉండిన జనాదరణ, బంగ్లాదేశ్ యుద్ధం నేపథ్యంలో ఇందిర ప్రాచుర్యం నేపథ్యంలో ఆ గౌరవాలను చూడాలి. పౌరపురస్కారాల ప్రారంభం తరువాత, మొట్టమొదటి భారతరత్న గౌరవం నోబెల్ పొందిన శాస్త్రవేత్త సి.వి. రామన్‌కు 1954లో దక్కింది. ఆ తరువాత, జాతీయోద్యమకాలానికి చెందిన అనేకమంది ప్రముఖులకు, వివిధరంగాల మేధావులకు భారతరత్నలు ఇచ్చారు. 1970 దశకం నుంచి ప్రమాణాలు పలచబడడం మొదలయింది. భారతరత్నల ప్రకటనే అరుదు అయింది. 1990 దశకం మలుపులో జరిగిన ప్రకటనలు, దేశరాజకీయాలలో వస్తున్న మార్పులకు సూచనలుగా చెప్పుకోవచ్చు.
మొదటి ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఆశ్చర్యకరంగా ఒక్క మితవాద రాజకీయవాదికీ భారతరత్నలు ఇవ్వలేదు. వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలో సంగీతకళాకారులు పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, భీమ్ సేన్ జోషి, అస్సాం ప్రజానాయకుడు గోపినాథ్ బోర్డోలోయి, నోబెల్ గ్రహీత అమర్త్య సేన్, సంపూర్ణ విప్లవ వాది జయప్రకాశ్ నారాయణ్.. వీరూ భారతరత్నలు. మొదటి, రెండో ఎన్‌డీఏ ప్రభుత్వాల మధ్య, వాజపేయికి, నరేంద్రమోదీకి మధ్య ఉన్న తేడాను భారతరత్నల ప్రదానంలో కూడా చూడవచ్చు. రావడం రావడమే వాజపేయి, మదన్ మోహన్ మాలవీయకు భారతరత్నలు ఇచ్చారు. మాలవీయ జాతీయోద్యమకాలపు మత, మితవాది. నానాజీ దేశ్‌ముఖ్‌కు ఇవ్వడం ద్వారా జనసంఘ్ కోవలోని ప్రభుత్వమే అధికారంలో ఉన్నదని, ఇది నెహ్రూ, గాంధీయేతర పరంపర అని బీజేపీ ప్రభుత్వం చాటి చెప్పింది. ఇతరులకు కూడా మోదీ హయాంలో రత్నాలు దొరకలేదని కాదు. ప్రణబ్ ముఖర్జీ, తాజాగా కర్పూరీ ఠాకూర్ బీజేపీ మార్గీయులు కారు కానీ, వారికి గౌరవం ఇచ్చిన సందర్భాలకు రాజకీయ సందర్భం ఉన్నది.
ఇక లాల్ కృష్ణ ఆడ్వానీ. ఆయన భారతరత్నకు అర్హుడా కాదా? ఆయనకు ఎందుకు ఇచ్చినట్టు? వంటి చర్చలేవో మీడియాలో జరుగుతున్నాయి. సర్వసాధారణ అర్హతల గురించిన చర్చల వల్ల ఉపయోగం లేదు. బీజేపీ ప్రమాణాల ప్రకారమే అయినా, ఆడ్వానీని గౌరవించాలని మోదీ ప్రభుత్వం ఎందుకు అనుకున్నది అన్న ప్రశ్న రావడం అకారణం కాదు. రామమందిర ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆడ్వానీ ఎందుకు వెళ్లలేదు అన్న కుతూహలం దేశమంతా ఉన్నది. ఆయనను రావద్దన్నారని, లేదు, ఆయనే రాలేనన్నారని అనుకున్నారు. ఆయన వస్తున్నారని విశ్వహిందూపరిషత్ నేతలు చెప్పినట్టు మళ్లీ వార్తలు వచ్చాయి. రామాలయ ఉద్యమంలో ముఖ్యపాత్ర వహించిన ఆడ్వానీ, మురళీమనోహర్ జోషి ఇద్దరూ అయోధ్య కార్యక్రమంలో కనిపించలేదు. రామాలయ సాధన మోదీ విజయంగా మాత్రమే ప్రదర్శించుకోవడానికి అలనాటి నేతలను ఎడం పెట్టారని కొందరు అర్థం చేసుకున్నారు. నిజానికి, నరేంద్రమోదీకి, రామాలయ అవతరణకూ అంత పెద్ద సంబంధం ఏమీ లేదు. ప్రభుత్వం నిర్మించింది కాదు కాబట్టి, ప్రధానిగా కూడా ఆయనకు ప్రత్యక్ష ప్రమేయం ఏమీ లేదు. కానీ, మోదీ లేకపోతే రామాలయం సాధ్యమయ్యేది కాదన్న అభిప్రాయాన్ని ప్రజలందరిలోనూ కలిగించడానికి గట్టి ప్రచారమే జరిగింది. ఆ ప్రచారానికి అడ్డంకి అవుతుందని ఆడ్వానీని శ్రమతీసుకోవద్దని ‘మర్యాదగా’ చెప్పి ఉంటారు. తప్పేమీ లేదు. రాముడికే రాజకీయాల బెడద తప్పలేదు. మానవమాత్రులెంత?
నిరాడంబరత, నిజాయితీ, సిద్ధాంతనిబద్ధత కలిగిన కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వడంలో ఓబీసీల మీద దృష్టి పెట్టిన వ్యూహం తప్ప మరేమీ లేకపోవచ్చు. కానీ, ఆడ్వానీకి ఇవ్వడంలో అసలు అర్థమేమిటి? అయోధ్యకు రాకుండా ఉండి, సహకరించినందుకు భారతరత్న ఇచ్చి ఉంటారని కొందరు అనుకుంటున్నారు. కాదు, మూడు దశాబ్దాల కిందట రథయాత్ర నిర్వహించినందుకు ఇచ్చి ఉంటారని కొందరంటున్నారు. సగౌరవంగా సాగనంపడంలో మోదీ బృందం ప్రసిద్ధమయినది. క్రియాశీల రాజకీయాలలో ఇంకా కొనసాగాలన్న ఉత్సాహం, అందుకు తగ్గ శక్తీ ఉన్న వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతిని చేసినప్పుడు ఆయన అభిమానులు నిరుత్సాహపడ్డారు. తాజాగా ఆయనకు పద్మవిభూషణ గౌరవం దక్కడం, అందుకు పరిహారమేమో అని అనిపిస్తే అది సకారణమే. ఎంతటి వెంకయ్య, ఈ మాత్రపు గౌరవానికి సంతోషించి ఊరుకోవలసి వస్తున్నదే అన్న విచారం కలిగితే కూడా తప్పేమీ లేదు. మరి ప్రధాని కావలసిన ఆడ్వానీ, బీజేపీని అధికారపీఠాలకు చేరువ చేసిన సాధకుడు, వృద్ధ సింహంగా, గౌరవరత్నంగా మిగులుతున్నందుకు బాధపడేవారు బీజేపీ శ్రేణులలో కూడా తగినంతమంది ఉన్నారు. 2019లో తిరిగి టికెట్ ఇవ్వనప్పుడే ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయింది. రాజకీయాలు నిర్దాక్షిణ్యమైనవని అందుకే అంటారు. ఒకే భావజాలం వారి మధ్య, గురుశిష్య బాంధవ్యం ఉన్నవారి మధ్య కూడా అధికారక్రీడ అనేక చమత్కారాలు చేస్తుంది.
బీజేపీ వ్యూహకర్తల మనసులో మరేదైనా ప్రయోజనం ఉన్నదా? అయోధ్య వ్యాజ్యాన్ని తేల్చివేస్తూ సుప్రీంకోర్టు, సివిల్ పరిష్కారంగా భూమిని హిందువుల పక్షానికి అప్పగించింది. అదే సమయంలో, 1992 డిసెంబర్ నాటి బాబ్రీమసీదు కూల్చివేతను దారుణచర్య అని తప్పు పట్టింది. ఆ చర్యకు బాధ్యులైనవారిపై ఇంకా నేరవిచారణ జరుగుతున్నది. రామజన్మభూమి వ్యవహారంలో ఆ ఒక్క అభియోగాన్ని కూడా పూర్వపక్షం చేయడానికి, కూల్చివేత కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తికి భారతరత్న ఇచ్చి, తమ సర్వంసహా ఆధిపత్యాన్ని బీజేపీ ప్రకటించిందా? అది ఉద్దేశ్యం అయినా కాకపోయినా, ఆ ప్రయోజనం అయితే ఈ ప్రకటన ద్వారా సిద్ధించింది. రాజ్యాంగాలూ న్యాయస్థానాల కంటె అతీతమైన అధికారం దేశంలో ఉనికిలో ఉన్నదని స్పష్టమైంది.
ఈ దేశ సమాజంలో, ప్రజాజీవితంలో రత్నాలు ఎన్నో! గుర్తింపు మాత్రం కొందరికే దొరకవచ్చు! కానీ, తమ జీవితాచరణ ద్వారా జనజీవితాన్ని, చైతన్యాన్ని మెరుగుపరచడానికి, మొత్తంగా సమాజగమనాన్ని ముందుకు నడపడానికి తోడ్పడినవారే నిజమైన భారతరత్నాలు. సమష్టి, సహకార జీవితాన్ని, శాంతి సామరస్యాలను, ఉదాత్తమైన విలువలను స్ఫురింపజేసేవారు స్ఫూర్తిదాతలు. అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, వ్యక్తిత్వంలో, చిత్తశుద్ధిలో అందరికీ ఆమోదయోగ్యులుగా ఉండేవారు జాతి ఇచ్చే ఉన్నత గౌరవానికి అర్హులు. గౌరవప్రతిష్ఠల కొలువుకూటంలో బారులు తీరిన భారతరత్నాలను చూసినప్పుడు, కొందరు మాత్రమే వినమ్ర వందనాలకు అర్హులుగా కనిపించడం విచారం కలిగిస్తుంది. ప్రపంచానికి మన ప్రతినిధులుగా ప్రదర్శించే మహామానవులు కదా, భారతరత్నలు! వారు మన జాతి ఔన్నత్యానికి గుర్తులుగా ఉండాలి!
కె. శ్రీనివాస్