Share News

యూపీ వద్దని ఎందుకు పారిపోతున్నావ్, రాహుల్?

ABN , Publish Date - Apr 11 , 2024 | 04:01 AM

‘‘రాజకీయ వాదులు మాట్లాడితే జవాబు చెబుతాం, కన్సల్టెంట్ల మాటలకు చెప్పేదేముంటుంది?’’ అంటోంది కాంగ్రెస్. తాజాగా ప్రశాంత్ కిశోర్ (పీకే) లోక్‌సభ ఎన్నికల ఫలితాల మీద చెప్పిన....

యూపీ వద్దని ఎందుకు పారిపోతున్నావ్, రాహుల్?

‘‘రాజకీయ వాదులు మాట్లాడితే జవాబు చెబుతాం, కన్సల్టెంట్ల మాటలకు చెప్పేదేముంటుంది?’’ అంటోంది కాంగ్రెస్. తాజాగా ప్రశాంత్ కిశోర్ (పీకే) లోక్‌సభ ఎన్నికల ఫలితాల మీద చెప్పిన అంచనాలను, పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి చేసిన వడ్డింపులను కాంగ్రెస్ ప్రతినిధి ఆ విధంగా తేలికగా తీసిపారేశారు. ఎవరు చెప్పారన్న దాన్ని పక్కకు పెట్టి, ఏమి చెప్పారన్నదాన్ని పరిశీలనకు తీసుకుంటే తప్పేమీ లేదు. ‘వినదగు నెవ్వరు చెప్పిన’ అన్న సుభాషితం కాంగ్రెస్ నాయకత్వానికి పరిచయమో లేదో తెలియదు.

రాజకీయాలలో వృత్తి వ్యూహనిపుణుల ఉనికి మీద, ఎవరు ఎక్కువ కిరాయి ఇస్తే, వారి గెలుపు కోసం పనిచేయడం మీద ఎవరికీ గౌరవం ఉండనక్కరలేదు కానీ, ఆ తరహా పనిమంతులు రంగంలో స్థిరపడ్డారని, కొనసాగుతారని గుర్తించాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో, పార్టీ అభ్యర్థిత్వ పోటీల దగ్గర నుంచి వే‌షం, భాష, అన్నిటికీ ఈ తరహా నిపుణులే ఎప్పటినుంచో దర్శకత్వం వహిస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి రాజకీయాలలో తలమునకలై పనిచేసేవారి కంటె ఈ సర్వేయర్లకు, సెఫాలజిస్టులకు, టాక్టీషియన్లకు ఎక్కువ తెలుసునా అన్న ప్రశ్నలో కొంత న్యాయముంది కానీ పూర్తి ఆచరణాత్మకత లేదు.

ప్రశాంత్ కిశోర్ విజయాలు ఎన్ని ఉన్నా, 2014లో మోదీని అధికారానికి తెచ్చిన ప్రచార నిర్వహణ వాటన్నిటిలో కలికితురాయి. నిజానికి, భారతీయ జనతాపార్టీకి వెనుక ఉన్న రకరకాల బలాలను దృష్టిలో పెట్టుకుంటే, బయటినుంచి సలహాదారులు ఇమడడం, విజయవంతంగా పనిచేయడం ఎంతో కష్టం. ఇప్పుడు, కన్సల్టంట్ల మాటలను పట్టించుకోనక్కరలేదంటున్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశాంత్ కిశోర్ సేవలను కొనుగోలు చేసింది. ఇండియా కూటమిలో భాగమైన ఆప్, డిఎంకె, టిఎంసి పార్టీలు కూడా పీకే సేవలు తీసుకున్నాయి. ఆయనతోనే పనిచేసి బయటకు వచ్చిన సునీల్ కనుగోలు అనే మరో వృత్తి వ్యూహనిపుణుడి సేవలను కూడా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలోను, తెలంగాణలోను వినియోగించుకుని, విజయవంతమైన ఫలితాలను సాధించింది. మధ్యప్రదేశ్‌లోను, రాజస్థాన్‌లోను తలపండిన కాంగ్రెస్ నాయకులకు ఈ సునీల్ వ్యూహం మేరకు పనిచేయడం రుచించలేదని, అందువల్ల ఆ రెండు రాష్ట్రాలకు వృత్తినిపుణత అందుబాటులోకి రాలేదని విన్నాము. అక్కడ వచ్చిన ఫలితాలేమో ప్రతికూలంగా ఉన్నాయి. 2017లో పంజాబ్‌లో ఫలితమిచ్చిన ప్రశాంత్ కిశోర్ నైపుణ్యం, ఉత్తరప్రదేశ్‌లోను, ఉత్తరాఖండ్‌లోను పనికిరాలేదు. ఆ తరువాత కొంతకాలం ఆయన సొంత రాజకీయాల అన్వేషణ ప్రారంభించి భంగపడ్డారు. రాష్ట్రాల వారీగా కాంగ్రెస్‌ను గెలిపించడం కంటె, ఆ పార్టీని పునాదుల నుంచి పునర్నిర్మించడమే ఉత్తమం అని ‌భావించి, 2024 ఎన్నికలనాటికి అనుసరించవలసిన ఒక వ్యూహాన్ని పీకే నిర్మించారు. కాంగ్రెస్ పెద్దలు ఆ ప్రెజంటేషన్‌ను ఆసక్తిగా తిలకించారు. కలసి పనిచేద్దామని చెప్పారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కదా, కాంగ్రెస్‌లో నిర్ణయాలు ఒక పట్టాన తెమలవు. కార్పొరేట్ సంస్థలలో మాదిరి వేగంగా తేల్చేయడం కుదరదు. ప్రశాంత్ కిశోర్‌ను ఏదో ఒక ఉన్నతస్థాయి బృందంలో సభ్యుడిని చేసి, సేవలను పొందాలనుకున్నారు. నిజానికి, ఆయన పార్టీలో భాగమై పార్టీకి అంకితమై పనిచేద్దామనుకున్నారు. కాంగ్రెస్ తనకు పెద్ద పదవి ఇచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకుంటుందని ఆశించారు. అది కుదరలేదు. నా సంగతి వదిలేయండి, నేను చెప్పిన సలహాలనన్నా పాటించండి అని పీకే గంభీరంగా చెప్పి వెనక్కి వచ్చేశారు.

2024 ఎన్నికల్లో కూడా ఓడిపోతే గనుక, ఇక మీరు కొంతకాలం తప్పుకుని వేరేవారికి నాయకత్వం అప్పగించండి, అని రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సూచన, కాంగ్రెస్ పార్టీకి ఉక్రోషం తెప్పించి ఉంటుంది. పేరుకు ఖర్గేయే కాంగ్రెస్ అధ్యక్షులు, కానీ, వ్యవహారమంతా రాహుల్ గాంధీ చేతిమీదే నడుస్తోంది కదా అని పీకే అన్న మాటలో అసత్యం లేదు. దిద్దుకోవాలంటే ఎవరో ఒకరు ఆ మాట అనాలి కదా? యూపీలో పోటీచేయకుండా పారిపోయి, వైనాడ్‌లో యుద్ధం చేస్తే ఏమి ఉపయోగం? ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ వదిలేసి, మణిపూర్, మేఘాలయ తిరుగుతావేమిటి? గడచిన ఐదేళ్లలో మోదీ తమిళనాడుకు ఎన్నిసార్లు వెళ్లాడో చూశావా? నీకు ఎందుకు పట్టుదల లేదు?.. ఇటువంటి ప్రశ్నలన్నీ రాహుల్‌కు, కాంగ్రెస్‌కు గురిపెట్టి పీకే చికాకు పెట్టారు.

తన మాట వినలేదని, తనకు పెద్దపీట వేయలేదని ప్రశాంత్ కిశోర్‌కు కొంత కోపం కూడా ఉండి ఉండవచ్చు. కానీ, ఆయన చెబుతున్నవి ఆలోచించదగ్గవే. గడచిన రెండు ఎన్నికలలో ఏయే రాష్ట్రాలలో బీజేపీ విజయాలు సాధించలేకపోయిందో, ఆ తరువాత వాటి మీద బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేస్తూ వచ్చింది. దక్షిణ, తూర్పు రాష్ట్రాలలో ఉండిన ప్రతికూల పరిస్థితులను చాలా వరకు బీజేపీ అధిగమించగలుగుతుందని పీకే అంటున్నారు. 2019 ఎన్నికలలో ఉత్తర, మధ్య, పశ్చిమ భారతాలలో పతాక స్థాయి విజయాలను పొందిన బీజేపీ, ఈ సారి వాటిలో తరుగునే తప్ప, మరింత పెరుగుదలను ఆశించలేదు. అక్కడ ఏర్పడే అవకాశం ఉన్న కొరతను భర్తీ చేసుకోవడానికి సాంప్రదాయికంగా, తనకు అనువుగాకుండా ఉన్న దక్షిణ, తూర్పు రాష్ట్రాల మీద బీజేపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అది మంచి ఫలితాలు ఇవ్వబోతోందని ఆ వ్యూహనిపుణుడు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు, కేరళల్లో ఓటుశాతంలోను, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, బెంగాల్‌లలో సీట్లసంఖ్యలోను బీజేపీకి మంచి బలం సమకూరుతుందని, అది ఉత్తరాది నష్టాలకు పరిహారంగా పనికి వస్తుందని ప్రశాంత్‌ కిశోర్ అంటున్నారు. ఏపీలో ఎన్డీయేకు మంచి సానుకూలత ఉన్నదని అన్నారు. ఇంత చేసి కూడా బీజేపీకి 370 స్థానాలు రావడం కష్టమని తేల్చారు. కానీ, ఈ జోస్యాలు నిజమవుతాయని చెప్పలేమని, దక్షిణాదిలో బీజేపీకి కొంత ఓటు శాతం పెరగడమో, నామమాత్రంగా సీట్లు పెరగడమో జరగవచ్చును తప్ప, ఇప్పుడున్న స్థితి నుంచి ఆ పార్టీ పెద్దగా ఎగువకు వెళ్లజాలదని ఇతర పరిశీలనలు చెబుతున్నాయి. కీలకంగా చెబుతున్న ఈ ఏడు దక్షిణ, తూర్పు రాష్ట్రాలలో మొత్తం 192 లోక్‌సభ స్థానాలున్నాయి. వీటిలో 55 స్థానాలను మాత్రమే గత ఎన్నికలలో బీజేపీ గెలుచుకోగలిగింది. అందులో 25 కర్ణాటకలోనే లభించినవి. ఈ సారి కూడా ఆ స్థానాలలో గెలిచి, ఒడిశాలో బలం పెంచుకోగలిగితే, నామమాత్రపు ఎదుగుదల ఉంటుంది. బెంగాల్‌లో గతంలో కంటె ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాన్ని అనేక క్షేత్రస్థాయి పరిశీలనలు అంగీకరించడం లేదు.

మరి కాంగ్రెస్, హిందీ బెల్ట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? గుజరాత్‌కు చెందిన నరేంద్రమోదీ 2014లోనే వారణాసిలో కూడా పోటీచేసినప్పుడు, తన సొంతరాష్ట్రంలో పోటీచేయడానికి రాహుల్ గాంధీకి కలుగుతున్న సంకోచం ఏమిటి? దక్షిణాది రాష్ట్రాలు అనువుగా ఉన్నాయని చెప్పి అక్కడే తలదాచుకుంటే, దేశనేత ఎట్లా అవుతారు? అసెంబ్లీ ఎన్నికలను గెలవడానికి సర్వశక్తులు ధారపోసిన కర్ణాటక కాంగ్రెస్, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో ఎందుకు చతికిలపడుతున్నట్టు కనిపిస్తోంది? అగ్రనాయకత్వం మాత్రం ఎందుకు కర్ణాటకను పట్టించుకోకుండా వదిలేస్తున్నది? కర్ణాటకలో గత ఎన్నికల్లో 28కి 27 సాధించిన బీజేపీ కూటమి, ఈసారి కూడా ఆ దరిదాపుల్లోనే గెలుపు సాధిస్తుందని అనుకుంటున్నారు. ముఖాముఖీ పోటీ ఉన్న చోట, గట్టి ప్రయత్నం చేస్తే, తన బలం పెరగడం, బీజేపీ బలం తగ్గడం అన్న రెండు ప్రయోజనాలు సిద్ధిస్తాయి. తెలంగాణలో బీజేపీ మొదటి లేదా రెండో స్థానంలో ఉంటుందని పీకే చెప్పిన మాటను ఇతర విశ్లేషకులు నిరాకరిస్తున్నారు. ఒకవేళ రెండో స్థానంలో వచ్చినా, అది కొన్ని జిల్లాలకే పరిమితం అని, తెలంగాణ అంతటికీ విస్తరించగల బలం ఆ పార్టీకి లేదని చెబుతున్నారు. ఇప్పటి వరకు అయితే, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వాతావరణం ప్రాంతీయ అంశాల చుట్టూనే తిరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో ప్రచారంలోకి దిగినప్పుడు కానీ, స్పష్టత రాదు.

ఎంతటి బలశాలి అయిన పార్టీ అయినా సరే, అజేయమైనది కాదని, ఒడుపుతెలిసి పోరాడితే గెలవవచ్చునని ప్రశాంత్ కిశోర్ అంటారు. వృత్తినిపుణుడిగా ఆ అంశాన్ని నమ్మడం, ప్రచారం చేయడం ఆయనకు అవసరం. కానీ, కష్టపడితే ఫలితం ఉంటుందని, చరిత్రలోని అనేక కఠినమైన సందర్భాలను సమాజాలు అధిగమించగలిగాయని తెలుసుకోవడానికి లోకజ్ఞానం చాలు. కాంగ్రెస్ పార్టీలో పరాజిత మనస్తత్వానిది పైచేయిగా ఉంటోందా? 370 బీజేపీ అందుకోలేనప్పుడు, దాన్ని మరికొంత దిగువకు లాగగలిగే కనీసవ్యూహమేదో ప్రతిపక్షాలకు ఉండాలి కదా?

రాహుల్ గాంధీ నిజంగానే అనాసక్తయోగంలో ఉంటేగనుక, దాని భారం ప్రజలెందుకు మోయాలి? ధరలు, నిరుద్యోగం, ఆర్థిక అంతరాలు, ఆశ్రిత కుబేరులు, నిరంకుశత్వం, దమనకాండ, వనరుల అపహరణ, మనుగడల ఆక్రమణ ఇన్ని బండరాళ్లను ఏ జనరంజకత్వంలోనో, మతంమత్తులోనో భరించడానికి సిద్ధంగా లేమని ప్రజలు స్పష్టంగా ఇస్తున్న సంకేతాలను గుర్తించని ప్రతిపక్షం ఎందుకు?

కె. శ్రీనివాస్

Updated Date - Apr 11 , 2024 | 04:01 AM